Previous Page Next Page 
కళ్ళు పేజి 30


    "అవునండి."

 

    మిమ్మల్ని కొన్ని ప్రశ్నలడుగుతాను."

 

    "అడగండి. ఆగండాగండి. మీరు కాఫీ తీసుకుంటారా? టీ తీసుకుంటారా? లేదా కూల్ డ్రింక్స్..."

 

    "ఇప్పుడేమీ అఖ్కర్లేదు."

 

    "ఐనా బాయ్ కూడా ఇంట్లో లేడులెండి. ఫ్రిజ్ లో కూల్ డ్రింక్ ఒకటుంటే రాత్రే తాగేశాను, అడగండి."

 

    "మీరీ ఊళ్ళో ఎన్నాళ్ళబట్టి వుంటున్నారు?"

 

    "అయిదారు నెలల నుంచీ."

 

    "అంతకుముందు ఎక్కడ ఉండేవాళ్ళు?"

 

    "బొంబాయిలో."

 

    "అక్కడ ఏం చేసేవాళ్ళు?"

 

    "మాకు మొదట్నుంచీ తెలిసిన సింధీస్ ఫ్యామిలీ ఒకటుంది. వాళ్ళు డైమండ్స్ బిజినెస్ చేస్తారు. వాళ్ళ కంపెనీలో వర్కింగ్ పార్టనర్ గా వుండేవాడ్ని.

 

    "వాళ్ళ ఎడ్రెస్ మీ దగ్గర వుందా?"

 

    "ఉంది" అని డ్రాయర్ తెరిచి సొరుగులోంచి విజిటింగ్ కార్డు ఒకటి తీసి ఇచ్చాడు.

 

    "మీరక్కడ ఎంక్వయిరీ చేస్తే నా గురించి చెబుతారు."

 

    "ఇక్కడికి దేనికొచ్చారు?"

 

    "రెండు ఆలోచనలతో వచ్చాను. ఒకటి సొంతంగా బిజినెస్ చేద్దామనీ, రెండు సినిమాల్లో చేరదామనీ."

 

    "సినిమాల్లో చేరదామనా?"

 

    "అవును. నా పర్సనాలిటీ బావుంటుందని అందరూ అంటారు. మీరు చెప్పండి. బావుంటుందంటారా?"

 

    "నేనడిగిన ప్రశ్న అదికాదు."

 

    "సరే అయితే, నా పర్సనాలిటీ బావుంటుంది కాబట్టి సినిమాల్లో చేరమని ఫ్రెండ్స్ సలహాయిస్తే ట్రై చేద్దామని ఇక్కడికి వచ్చాను. బొంబాయిలో కూడా ఫిలిం ఇండస్ట్రీ వుంది కదా, అక్కడే ట్రై చెయ్యలేకపోయారా అని మీరు అడగొచ్చు. ఆ పాయింటు కరక్టే..."

 

    "నేనడగలేదు."

 

    "అడక్కపోయినా ఆ పాయింటు కరక్టే. కాని అక్కడ మనల్ని తలదన్నే పర్సనాలిటీస్ ఉన్నాయి. అయినా నా మాతృభాష తెలుగు. ఈ రెండు పాయింట్ల దృష్ట్యా ఇక్కడికొచ్చాను. కొంతమంది ప్రొడ్యూసర్స్ నీ, డైరెక్టర్స్ నీ కలుసుకున్నాను. వాళ్ళు కూడా నా పర్సనాలిటీని మెచ్చుకున్నారు గానీ- కొంతమంది హీరోగా బావుంటావనీ, కొంతమంది విలన్ గా షైన్ అవుతావనీ అంటున్నారు. ఏం చెయ్యాలో తెలీక డైలమాలో పడి హీరో వేషం వస్తే హీరో, విలన్ వేషం వస్తే విలన్-ఏదో ఒకటి చేసేద్దామన్న నిర్ణయాని కొచ్చాను. మీరు చెప్పండి. నన్ను హీరోగా వేసెయ్యమంటారా? విలన్ గా వేసెయ్యమంటారా?"

 

    "నేనడిగిన ప్రశ్న అదికాదు."

 

    "మీరసలు ఏ ప్రశ్నా అడగలేదు."

 

    "నేనీ విషయాలన్నీ వినటానికి మీ దగ్గరకు రాలేదు."

 

    "సారీ. అయితే ఇప్పుడు అడగండి."

 

    "మీకు హేమసుధగారు తెలుసా?"

 

    "ఏ హేమసుధగారు?"

 

    "సినిమానటి."

 

    "ఓహో! ప్రఖ్యాత సినీతార హేమసుధగారా? తెలీదు!"

 

    "ఆవిడ్ని ఎప్పుడయినా చూశారా?"

 

    "చూడలేదు."

 

    "ఆమె ఇంటికి ఎప్పుడయినా వెళ్ళారా?"

 

    "వెళ్ళలేదు."

 

    రంజిత అతని కళ్ళలోకి సూటిగా చూసింది. "బాగా ఆలోచించి చెప్పండి. హేమసుధగారింటికి మీరెప్పుడూ వెళ్ళలేదూ?"

 

    అతను కళ్ళు మూసుకుని మౌనంగా వుండిపోయాడు.

 

    "ఏమిటి? జవాబు చెప్పరేం?"

 

    "మీరు ఆలోచించమన్నారుగా ఆలోచిస్తున్నాను."

 

    "జరిగిందానికి ఎంతసేపు ఆలోచిస్తున్నానండి. వెళ్ళలేదు."

 

    "అక్కడ నన్ను చూడలేదా?"

 

    "అసలు వెళ్ళందే ఎలా చూస్తానండి?"

 

    "మీరు దారుణంగా అబద్ధం చెబుతున్నారు. మీరు ఆ ఇంట్లోంచి వస్తూండగా నేను చూశాను. మీరు కూడా నన్ను చూశారు."

 

    "చూడలేదు. అందమైన అమ్మాయిల్ని ఒకసారి చూస్తే నేను మరిచిపోను."

 

    "సరే" అంటూ ఆమె లేచి నిలబడింది. ఇంతలో ఆమె దృష్టి అల్మైరాలో ఉన్న ఒక వస్తువుమీద పడింది.

 

    "ఏమిటిది? సిరంజి కదూ" అంటూ దగ్గరకెళ్ళింది. అల్మైరాకున్న అద్దంలోంచి లోపల చిన్న ప్లాస్టిక్ ట్రేలో ఉన్న ఫైవ్ సి.సి సిరంజి కన్పించింది.

 

    "మీరు డాక్టరు కాదనుకుంటాను."

 

    "కాను."

 

    "అయితే ఈ సిరంజ్ ఇక్కడ వుండాల్సిన అవసరమేమొచ్చింది?"

 

    "బలంగా ఉండటానికి అప్పుడప్పుడు" బి.కాంప్లెక్స్ ఇంజక్షన్లు చేసుకుంటూ ఉంటాను. ఇంత ఒడ్డూ పొడుగూ వున్నాడు. వీడికింకా బలమేమిటో అని నవ్వకండి. విలన్ వేషాలేస్తే ఫైటింగులకూ వాటికి, హీరో గట్టిగా దెబ్బలు కొడితే ఓర్చుకోవటానికి ఇంకా బలం అవసరం కదండీ. అందుకని. మీరు చేసుకోవటమెందుకు? డాక్టర్ల దగ్గరకు వెళ్ళవచ్చు కదా అని మీరు అడగొచ్చు. డాక్టర్ల దగ్గరకెడితే గంటలకు గంటలు వెయిట్ చెయ్యాలండి. బోర్."

 Previous Page Next Page