Previous Page Next Page 
సంకెళ్ళు మరియు పిల్లదొంగ పేజి 30


    అబ్బాయంటే శంకరం అన్నమాట. మొదట్లో స్టేజీమీదకు రాగానే మొదటి వరుసలో తండ్రిని చూచి కొంచెం కంగారుపడ్డాడు. కంగారులో రెండుమూడు మాటలు తప్పు చెప్పాడు. మేస్టారు ప్రక్కనుంచి సంజ్ఞలు చేశారు. శంకరం తేరుకొని తండ్రివంక చూడకుండా నటించసాగాడు. బాగానే వచ్చింది. నాటకం చూస్తున్న కుర్రాళ్ళు "ఆహా! శంకరం బలేగా యాక్టు చేస్తున్నాడ్రోయ్" అనుకోని సంతోషపడ్డారు. పెద్దవాళ్ళు "ఈ కుర్రాడు చురుగ్గానే నటిస్తున్నాడే" అనుకున్నారు. సుందరం బావ అక్కయ్య భుజంమీద చేయివేసి "చూశావా" అన్నట్టుగా చూశాడు. అక్కయ్య చిరునవ్వు నవ్వింది. శంకరం నాన్నగారు ఏమీ చెయ్యలేదు.
    
    ఆ తరువాత సీను వెంటనే ప్రారంభం కాలేదు. నేపథ్యంలో కొన్నిమాటలు వినపడ్డాయి. ఆ మాట్లాడింది తెలుగు మాస్టారే. "ఆ రోజునుంచి అబ్బాయికి నిర్భంధన బాగా బలపడింది. ఏ పని చెయ్యబోయినా అడ్డే. ప్రతిదానికీ అస్వతంత్రం. అందుచేత అబ్బాయిలో స్వతంత్రభావాలు రేకెత్తినై. ఎందుకు తను వీళ్ళకు లోబడివుండాలి? తోటి స్నేహితుల్లా తనెందుకు ఖర్చు చెయ్యకూడదు? తనుకూడా ఒక మనిషి కాదా? తనకీ సరదాలుండవా?"
    
    "అబ్బాయి అందరిలాగే జల్సాగా తనూ వుండదలిచాడు. కాని డబ్బు లేదుగా! డబ్బులు వుండాలంటే ఏం చెయ్యాలి? అబ్బాయి ఏంచేశాడు? చూడండి."
    
    ఇక మూడవ రంగం ప్రారంభమయింది. అబ్బాయి మెల్లగా యింట్లోకి ప్రవేశించాడు. యింట్లో ఎవరూ కనబడరు. అది వంటిల్లు అన్నమాట. తిరగమోత దినుసులు వుండే పెట్టె ఒకమూల వుంటుంది. అబ్బాయి వెళ్ళి దాన్ని నెమ్మదిగా జేబులోకి తోసేస్తాడు. తరువాత దొంగచూపులు చూచుకుంటూ బయటికి వెళ్ళిపోతాడు. ఒక నిముషం గడిచాక రెండోవైపునుంచి అమ్మ వస్తుంది. కొంచెంసేపు అటుగిన్నెలు యిటూ, యిటు గిన్నెలు అటూ సర్దుతుంది. తరువాత ఏదో గుర్తువచ్చినట్లు ముఖంపెట్టి వెళ్ళి తిరగమోత పెట్టె తీస్తుంది. అందులో అర్ధరూపాయి కనబడదు. "ఏమయింది చెప్మా" అన్నట్లుగా ముఖం పెడుతుంది. ఏదీ అంతుతోచదు. చివరికి "ఏమోలే!" అనుకున్నట్లుగా అయి మళ్ళీ పనిలో నిమగ్నమైపోతుంది. తెర పడిపోతూంది. ఈ సీనంతా సైలెంటు గానే గడిచింది. చాలామంది ప్రేక్షకుల హృదయాల్ని కూడా యీ దృశ్యమే ఆకర్షించింది. మేస్టారి దర్శకత్వం కూడా అమోఘంగా ఫలించింది.
    
    తరువాత మళ్ళీ నేపథ్యంలో మేస్టారు చెప్పారు. "ఆరోజునుంచి అబ్బాయికి దొంగతనాలు బాగా అలవడిపోయినై. ఇంట్లో డబ్బులు రెక్కలు వచ్చి ఎగిరి పోసాగినై. అబ్బాయి యిప్పుడు మామూలు అబ్బాయి కాడు పూర్తిగా మారిపోయాడు. స్నేహితుల్తో జల్సాలు సాగించాడు. బడికి పోవటం పూర్తిగా మానేశాడు. ఇంట్లో డబ్బులు ఎలా పోతున్నాయో తల్లితండ్రులకి అర్ధమయ్యేది కాదు. అబ్బాయిని కొంచెమైనా అనుమానించాలేదు. అదిగో చూడండి. అబ్బాయి ఏం చేస్తున్నాడో!
    
    నాల్గవ రంగం: వీధి దృశ్యం. అబ్బాయి యింకా ముగ్గురు స్నేహితులు కలిసి గోలీకాయలాడుతుంటారు. వాళ్ళలో శర్మాయికూడా వున్నాడు. అంతా నవ్వుతూ కేరింతలు కొడుతూ ఆడుతుంటారు. వాళ్ళు ఆడేది డబ్బుపెట్టి మధ్య మధ్య మాటలు "ఆ సినిమా చూశావా?" అని ఒకడడగటం "ఓ బలేవుంది. అందులో బలే దూకేస్తుంటాడులే హీరో, మేడమీదనుంచి" అని యింకొకడు బదులు చెప్పటం ఆట మంచి హుషారుగా సాగిపోతుంది. అందులో ఒక స్నేహితుడుగా వేసిన పాత్రదారికి కొంచెం చెముడు మేస్టారు వాడికి అతికష్టంమీద తర్ఫీదు ఇచ్చారు. "వాడితో మాట్లాడేప్పుడు కొంచెం గట్టిగా మాట్లాడండిరా" అని చెప్పారు మిగతావాళ్ళకి. అయినా అదేం లాభించలేదు. "సాయంత్రం సర్కసుకి పోదాం వస్తావురా" అని అబ్బాయి అడుగుతుంటే, "సినిమాకయితే రాను. సర్కసుకైతే మాత్రం వస్తానురా" అనటం సాగించాడు. ప్రేక్షకులు గొల్లుమన్నారు. ఇప్పుడు అబ్బాయి వేషంలో వున్న శంకరం చిన్నయుక్తి చేశాడు. "ఒకమాట అడిగితే యింకోమాట చెప్తావేమిట్రా చెమిటివెధవా?" అన్నాడు గట్టిగానే. దాంతో ప్రేక్షకులంతా అసలాపాత్రే చెవిటివేషం అని నమ్మేశారు. దాంతో అనుకోకుండా కొంత హాస్యం కూడా వచ్చింది. తరవాత నవ్వులు నవ్వులవుతాయి. ఆటల్లో పేచీ వస్తుంది. రెండు జట్లుగా విడిపోయి కలబడి కొట్టుకుంటారు. అబ్బాయి బట్టలు చిరిగిపోతాయి. కోప్మతో కసితీరా అందర్నీ తిట్టి ఇంటికి పోదామని బయల్దేరాడు. తెర వాలుతుంది.
    
    అయిదో రంగం: అబ్బాయి ఇల్లు. అమ్మా, నాన్న కూచుని వుంటారు. "ఏమిటి అబ్బాయిమీద యీ రిపోర్టులు? అబ్బాయి వెళ్ళి వాళ్ళ కొడుకుల్ని బడి మానిపించి పాడుచేస్తున్నాడని యిద్దరు ముగ్గురు చెప్పారు నాకు" అంటాడు తండ్రి. "అబ్బాయి మంచితనం చూడలేక వాళ్ళలాగే చెప్తారు. అవి నమ్ముతామేమిటి మనం?" అంటుంది తల్లి. "నిజమే, నిజమే" అంటాడు తండ్రి. ఒక నిముషం గడిచాక "అన్నం వడ్డించు" అంటాడు. సరేనని తల్లి వెళుతుంది. తండ్రి ఒక నిముషం ఆగి చొక్కా విప్పి వంకెకు తగిలించి లోపలికి వెళ్తాడు.
    
    ఆయన అటుపోగానే దొంగచూపులు చూసుకుంటూ అబ్బాయి ప్రవేశిస్తాడు. తండ్రి జేబులో వున్న పర్సు అతనికంట పడుతుంది. చప్పుడు చెయ్యకుండా వెళ్ళి తీస్తాడు. పర్సు తెరవబోతుంటే చెయ్యిజారి క్రిందపడుతుంది లోపలనుంచి తండ్రి "ఎవరిదీ?" అని అరుస్తాడు. అబ్బాయి పలకడు. భయంతో పర్సు మూసేసి జేబులో పెట్టెయ్యబోతూంటాడు. కాని అంతలో తండ్రి రానే వస్తాడు. అబ్బాయి దొంగతనం బయటపడుతుంది. "నువ్వేనా దొంగవీ?" అంటాడు ఆశ్చర్యంతో అబ్బాయి మాట్లాడడు. తలవంచుకుంటాడు. తండ్రి కోపం ఆగక తిడతాడు. లోపలనుంచి తల్లి వస్తుంది. కొడుకుని వంచి వీపుమీద నాలుగు గుద్దులు వేస్తుంది. "నువ్వు నా యింట్లో వుండొద్దు. ఫో" అంటూ తండ్రి అబ్బాయిరెక్కపుచ్చుకుని బయటికి యీడుస్తూ వుంటాడు. తల్లి అడ్డుపడబోతుంది. కాని తండ్రి లెక్కచెయ్యకుండా అబ్బాయికి నాలుగు తగల్చిచ్చి బయటికి తోసేస్తాడు. (ఒక చిన్న విషయం. యిక్కడ తండ్రి పాత్రధారి కన్నా శంకరమే బలవంతుడు కావడంవల్ల అతడ్ని త్రోయబోయి తండ్రి పాత్రధారే క్రిందపడతాడు) ఆ తర్వాత లేచి "నన్నే తోస్తావురా, (ఇది అప్పటికప్పుడు కల్పించిన మాట) మళ్ళీ గుమ్మం తొక్కావంటే కాళ్ళు విరగ్గొడతాను" అంటాడు. అబ్బాయి కిక్కురుమనకుండా బయటికి వెళ్ళిపోతాడు. "అయ్యో, అయ్యో... వాడేమయిపోతాడండీ!" అంటుంది తల్లి "ఏమైనా అవనీ" అంటాడు తండ్రి కుర్చీలో కూచుంటూ. "హు దొంగవెధవ! ఎటువంటివాడినిగా చేద్దామనుకుంటే ఎటువంటివాడుగా మారిపోయాడు!" అంటూ నిట్టూరుస్తాడు. తెర పడిపోతుంది.

 Previous Page Next Page