"బాబుగారు! అమ్మగార్ని వెళ్ళగొట్టకండి బాబుగారూ. మీ కాళ్ళు పట్టుకుంటాను బాబూ!" అంటూ నిజంగానే కాళ్ళమీద పడబోయాడు.
"గోపయ్యా!" అని అరిచారు శేఖర్. "అసహ్యంగా ప్రవర్తించకు. నా స్ధితిలో నువ్వుంటే ఒక హంతకుడిగా మారివుండేవాడివి. ఒకటికాదు, రెండు హత్యలు.
"మీరిప్పుడు అమ్మగార్ని హత్యచేస్తున్నారు బాబుగారూ! నామాట వినండి. తర్వాత మెల్లగా ఆలోచించుకుందాం. నలుగురిలో అల్లరి పడిపోతాం బాబూ."
"గోపయ్యా! నువ్వు నోరుముయ్యి. మాలతీ! నీ వస్తువులు ఏమేమి వున్నాయో తీసుకుని వెంటనే వెళ్ళిపో."
గోపయ్య ధైర్యంగా అడ్డుతగిలాడు.
"మిమ్మల్ని మరీమరీ వేడుకుంటున్నాను. అమ్మగార్ని వెళ్ళగొట్టకండి బాబుగారూ! తప్పులు చేసినవాళ్ళంతా పాపాత్ములు కారు బాబుగారూ! దేవతలు కూడా తప్పుచేస్తారు బాబూగారూ!"
శేఖర్ ఆగ్రహం అవధులు దాటినట్లు "గోపయ్యా! నోరుముయ్" అని గర్జించాడు. ఆమెవంక తిరిగి తీక్షణంగా "ఇంకా కదలవేం?....ఊఁ వెళ్ళు."
ఆమె హతాశురాలైపోయింది. అతని మనసింక మారదని అర్ధం చేసుకుంది. నిండు హృదయంతో అతనికి నమస్కారం చేసి అక్కడినుంచి కదిలింది.
గోపయ్య "అమ్మగారూ! అమ్మగారూ!" అని బావురుమని ఏడ్చేశాడు.
"నీ వస్తువులన్నీ కూడా ఇక్కడినుంచి తీసుకుపో."
"నా వస్తువులా? నాదంటూ ఏమున్నాయి శేఖర్?" ఆమె గుమ్మందాకా వెళ్ళింది.
"ఆగు!"
మాలతి ఆగింది. శేఖర్ ఏదో నిశ్చయించుకున్నట్లు గబగబ ఆమెదగ్గరకు వెళ్ళి భుజాలు పట్టుకుని ఇటువైపు విసురుగా తిప్పాడు.
మాలతి కళ్ళప్పగించి అతన్ని ఆశ్చర్యంగా చూస్తోంది. ఒక్కక్షణం ఆమెకళ్ళలోకి దృఢంగా చూసి గబుక్కున రెండు చేతులతో మెళ్ళోని మంగళ సూత్రాన్ని లాగి తెంపివేసాడు. ఘల్లున నేలమీదకు దొర్లిపోయాయి.
"ఇహ పో."
మాలతి ఏ హావభావాలు ప్రదర్శించలేదు. మళ్ళీ ఒకసారి అతనికి నమస్కరించి ఆ ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయింది.
"వెళ్ళిపోయింది. ఈ ఇంటి పీడ విరగడైపోయింది. జీవితంలో ఎప్పుడూ ఏ మనిషినీ నమ్మకూడదు. అంతా రాక్షసులు. ఒకరినొకరు పీడించుకునే పిశాచాలు."
తన గదిలో తలుపులు వేసుకుని శేఖర్ ఉన్మత్తునిలా అటూఇటూ తిరుగుతున్నాడు.
"ఈ ఇంట్లో దాని స్మృతికూడా మిగలటానికి వీల్లేదు. తనదంటూ ఈ ఇంట్లో ఏమీ ఉండకూడదు. నాశనం చేస్తాను. దాని జ్ఞాపకాన్ని కలిగించే ప్రతి వస్తువూ నాశనం చేస్తాను."
అతను మరింత రాక్షసుడిలా మారాడు. గోడనున్న ఫొటోలన్నీ బ్రద్దలు కొట్టాడు. ఆమెకోసం కొన్న బహుమతులన్నీ గది నలుమూలలా విసిరిపారేశాడు. ఆమె ఫోటో ఆల్బములూ, చీరెలూ బీరువాలోంచి వెలికితీసి గుట్టగాపోసి, అగ్గిపుల్ల వెలిగించి, నిప్పంటించి క్రూరంగా తిలకిస్తూ నిలబడ్డాడు.
మంటలు హఠాత్తుగా పైకిలేచాయి. ప్రక్కకి ప్రాకాయి. పందిరిమంచం, పరుపు, దుప్పటి అన్నీ అంటుకున్నాయి.
"అవును, ఇవి ఇంకా భయంకరమైన జ్ఞాపకాలు. కాపురం చేసినన్నాళ్ళూ నన్ను కాల్చుకుతిన్నాయి. తగలబడనీ......"
ఆ మంటల మధ్య దెయ్యంలా నిలబడ్డాడు.
"ఇప్పుడు బావుంది. హాయిగా వుంది. ఆనందంగా వుంది."
బయటనుంచి గోపయ్య తలుపులు బాదుతున్నాడు. గాబరాగా అరుస్తున్నాడు. "బాబుగారూ! తలుపు తియ్యండి, ఏం చేస్తున్నారు లోపల?"
"తియ్యను, తియ్యను నా ఇష్టం."
గుండెల్లో నొప్పిగా వుంది. అంత వెలుగులోనూ కళ్ళు చీకట్లు క్రమ్ముతున్నాయి.
గోపయ్య పిలిచి పిలిచి వేసారి దేంతోనో తలుపులు బ్రద్దలు కొడుతున్నాడు.
మంచం పెట్టె విరిగిందో, ఏమిటో తలమీద ఏదో బలంగా పడింది. ఏదీ తెలియలేదు. బాధతో అమ్మా! అని అరచి ప్రక్కకి వాలిపోతున్నాడు.
గోపయ్య తలుపులు పగులకొట్టి లోపలకువచ్చి అతన్ని బలంగా పట్టుకున్నాడు. తన శక్తినంతా వినియోగించి, వగరుస్తూ ఇవతలకు లాక్కువచ్చాడు.
"గోపయ్యా!" అని పిలిచాడు, తెలివి వచ్చాక.
"బాబుగారూ....!"
"నేనిక్కడ వున్నాను?"
"మన ఇంట్లోనే బాబూగారూ! తలకి దెబ్బ తగిలింది. డాక్టరుగారు వచ్చి కట్టుకట్టి వెళ్ళారు."
"గోపయ్యా!" శేఖర్ వెర్రికేక వేశాడు.
"ఏమిటీ బాబుగారూ?"
"నా కళ్లపైన కట్టు లేదుకదూ?"
"లేదు బాబుగారూ!"
"నా కళ్ళు తెరిచేవున్నాయి కదూ?"
"అవును బాబుగారూ!"
"గోపయ్యా! అంతా చీకటి. నాకేం కనబడటంలేదు. నా కళ్ళు పనిచెయ్యటం లేదు గోపయ్యా!"
14
భానుమతి మంచి నిద్రలోవుంది. అలాంటి మంచినిద్ర ఆమెకు తరచూ పడుతూనే వుంటుంది. అలాంటి మంచినిద్రలో వుంటే ఆమెకు కలలురావు. వేళ ఎంతయినా ఏమీ తెలీదు. నిద్ర ఆమెకు గొప్ప అనుభూతి.
"భానూ!" ఆ నిద్రలో ఆమెను ఎవరో పిలిచినట్లయింది. తెలిసింది కానీ లేవలేకపోతోంది.
"భానూ!"
కళ్ళు విప్పింది. బాగా ప్రోద్దెక్కిపోయింది. అయితేనేం? ఒక్కోసమయంలో కసిగా వుంటుంది. మనిషి టైము విలువ ఎందుకు తెలుసుకోవాలి?
"భానూ!" తలుపవతల నుంచి అత్యంత ఆత్మీయురాలి గొంతు.