"నేను చెబుతున్నది అతిశయోక్తి కాదు మాస్టారు. చాలామంది వాడికిలా గట్టి పెట్టండి అంటారుతప్ప అసలు గడ్డికున్న ప్రశస్తిని గురించి ఆలోచించరు.
గడ్డితిన్న పశువు పాలు ఇస్తుందని అందరికీ తెలిసిన విషయం. అయితే గడ్డిరసంతో కెన్సర్ లాంటి జబ్బుని నయం చేయవచ్చునంటుంది ఆయుర్వేదం."
"బాబాయ్ కి మంచి షాకిచ్చారు సర్" ఇందాక మందునిషా తగ్గడం గురించి అడిగిన విలేఖరి అన్నాడు.
"పత్రికా విలేఖరి ఎప్పుడూ చేతిలో పేడ్ పట్టుకుని తిరిగే మా బాబాయ్ బుర్రలో వున్నది పేడ కావడంతో ఇందాకా అలా మాట్లాడాడు."
"ఇప్పుడు మీ స్టేట్ మెంట్ ని నేను కాంట్రాక్ట్ చేయాల్సివస్తోంది మాస్తారూ" రుత్వి అన్నాడు యధాలాపంగా. "మీ బాబాయ్ గడ్డి గురించి తక్కువ చేసి మాట్లాడితే మీరు పేడగురించి అండర్ ఎస్టిమేట్ చేశారు"
తొట్రుపడ్డాడు పేడ గురించి మాట్లాడిన విలేఖరి.
"మన పూర్వీకులు ఇంటి ముందు కళ్లాపి చల్లడం మొదలుకొని స్త్రీలు ముఖానికి పసుపు రాసుకోకుండా చాలావాటిని సాంప్రదాయంగా మార్చింది. ముఖ్యంగా ఆరోగ్య సూత్రాల ప్రాతిపదికమీదనే అని మనసులో చాలామందికి తెలీదు. మనం నీచంగా భావించే పేడకి బాక్టీరియాని నాశనం చేసే శక్తి వుంది. కాబట్టే పశువులు బురదలో హైజీనిక్ గా లేని తడిలో పొర్లినా స్కిన్ డిసీజస్ కు గురికావు"
మరేదో కొత్త విషయం వింటున్నట్లు అవాక్కయి చూస్తున్నారంతా.
"ఇప్పటికి పేడని పిడకలుగా చేసి ఆ పిడకల్ని వంట చెరకుగా వాడడమేకాక ఆభస్మాన్ని పళ్లు తోముకోవడానికి ఉపయోగించడం చాలా పల్లెల్లో ఆచరించేదే. అసలు పేడ ఎంత ప్రశస్తిగలదీ అంటే పేడలో నీళ్లు కలిపి వడకట్టి ఆ నీళ్లని తాగించి పాముకాటుకి గురైన వ్యక్తిని కాపాడవచ్చు అంటుంది ఆయుర్వేదం.
ఇది మరింత విభ్రమానికి గురిచేయడంలో "పేడనీళ్లు త్రాగించడమా?" అన్నాడు ఇబ్బందిగా.
నిశ్శబ్దంగా చూశాడు రుత్వి.
సరిగ్గా ఇరవై సెకండ్ల తరువాత అదే విలేఖరని అడిగాడు "మీరు చాలాసార్లు విబూధిని నాలుకతో రుచి చూసి వుంటారుగా."
"అఫ్ కోర్స్!" అదేమంత కొత్త విషయం కాదన్నట్టుగా చూశాడా వ్యక్తి. "చాలాసార్లు"
"విభూతి ఎలా తయారవుతోందో తెలుసా?"రుత్వి ప్రశ్నకి తెల్లమొహం వేసిన
విలేఖర్ని చూస్తూ "షాక్ తినకండి - పేడతోనే" అన్నాడు.
కేవలం అక్కడ వున్న విలేఖర్లు మాత్రమే కాదు, ఓ మూల కూర్చుని ఆసక్తిగా పరికిస్తున్న విజూష కూడా అప్రతిభురాలై రుత్విని చూస్తూ వుండిపోయింది.
నిన్నగాక మొన్న టీవి క్విజ్ ప్రోగ్రాంలో తను చూసిన యువకుడు. ఆధునిక ప్రపంచానికి చెందిన ఎన్నో ప్రశ్నలకి సునాయాసంగా జవాబు చెప్పిన వ్యక్తి సనాతన ప్రపంచాన్ని క్షుణ్నంగా చదివినట్లు మాట్లాడుతుంటే....
మనసు నిట్టూర్పుల ఏకాంతంపై రోదసిలోనుంచి రాలిన చందమామను స్వేద బిందువులాగా ఏ గాలి అలలూ చొరవని గుండె గుహాంతర్భాగపు సైకతాలపై కాలం కలమై రాస్తున్న కొత్త కచేరీలా ... సశేష స్వప్నాల జాగరణలతో మౌనప్రవాసం నుంచి మెత్తగా లాగి కొత్త కాన్వాసుపై తనను బొమ్మగా మార్చిన చిత్రకారునిలా .....మునిలా ఖనిలా గనిలా ధ్వనిలా బుసకొట్టే ఫణిలా చెక్కిలిపై ఆమనిలా...
"హల్లో!"
ఎవరిదో గొంతు వినిపించడంతో వాస్తవంలోకి వచ్చింది విజూష.
సమీపంలో నిలబడి వుంది సశ్య.
ముందు కలేమో అనుకుంది.
కాదు అంతా నిజమే అని గుర్తుచేస్తూ విలేఖర్లని సాగనంపి లోపలకు నడుస్తున్న రుత్వి.
అంటే.....
పత్రికా విలేఖర్ల సమావేశ పూర్తయ్యేదాకా తనను తాను అంతగా మరచిపోయింది.
"పలకరించింది నిన్నే"
ఇప్పుడు సశ్య గొంతు మరింత కాఠిన్యంగా వినిపించింది.
"ఎందుకిలా వచ్చావ్?"
అంతే రోషంగా జవాబిచ్చింది విజూష "అడగడానికి నువ్వెవరు?"
"రుత్వికి కాబోయే..."
"సశ్యా!"
రుత్వి గొంతు అసహనంగా వినిపించింది.
విజూషని తను నిలదీస్తుంటే మధ్య రుత్వి అంతగా ఎందుకు రియాక్టవుతున్నదీ అర్దంకాని సశ్య "ఏం......... నేను అన్నది తప్పుకాదే" తనను తాను సమర్దించుకుంటూ చెప్పింది.
"నేను నీకు కాబోయే భార్యను కానా?"
అంత సీరియస్ లోనూ నవ్వకుండా వుండలేకపోయాడు రుత్వి.
సశ్య అందమైనది మాత్రమేగాదు. ఏ మగాడైనా కోరుకునే అపురూపమైన లక్షణాలుగల యువతి.
ఒక్క అహంకారం తప్ప సశ్యలో హితంకాని మరో దుర్గుణమూ లేదు.
అదికాదు... తామిద్దరి పరిచయం వయసు నెలలు మాత్రమే అయినా తన దగ్గర పోస్ట వేర్ నేర్చుకుని సశ్య అతడికి చాలా దగ్గర కావడమే కాదు...
అమెరికాలాంటి దేశంలో పెరగడంతో నిర్మహమాటంగా అతడి మీద వున్న ఇష్టాన్ని ప్రకటించింది.
అలా ఆమె వెంటాడే ప్రోసెస్ లోనే చివరగా అన్నాడు తను క్విజ్ కాంపీటీషన్ లో ఓడిపోతే ఆమెను పెళ్లి చేసుకుని అమెరికా వచ్చేస్తానని......
అయితే రుత్వి అలా ఆకతాయిగానే అన్నాడని ఆమెకు తెలీదు.
సున్నితమైన భావాలుగల ఓ ముగ్ద మనుసుని సుతిమెత్తగా మళ్ళించాలేతప్ప మూర్ఖంగా గాయపరచడం అవివేకమన్నది రుత్వి ఆలోచన.
"భార్యవి కావాలి అంటే..... సశ్య ప్రశ్నకి జవాబులా అన్నాడు రుత్వి.
"మనం పందెం ప్రకారం నేను పోటీలో ఓడాలి."
"కానీ అసలు మీరు పోటీనుంచే ఉపసంహరించుకుంటున్నట్టు స్టేట్ మెంటిచ్చారుగా" అంది.
అలా అన్నది సశ్యకాదు విజూష.
అసలు ఆ విషయం అడగాలన్న నెపంపై తను వచ్చినట్లు అప్పటికి గుర్తొచ్చింది విజూషకి.