"యస్. లెట్స్ థేంక్ గాడ్ ఫరిట్...అది నీకు చాలా అవసరమనుకుంటాను..."
ఎంత అవసరమో చెప్పలేదు. ఒక ప్రయోగం పూర్తికావటానికి ఈ పాముకాట్ల మూలంగా ప్రాణాలు కోల్పోతున్న వేలమందిని కాపాడటానికి అతి ముఖ్యమైన ఆఖరి అస్త్రమని చెప్పకుండా "అవును" అంది తల పంకిస్తూ...
"సో...మనం రహస్యంగా మార్పిడి చేసుకుందాం..."
సరే అనలేకపోయింది వెంటనే... క్షణంలో వెయ్యోవంతు తన దగ్గరున్నది అక్రమంగా రవాణా చేయబడిన మాదకద్రవ్యం అని గుర్తుకొచ్చింది.
ఇదీ విషాహారంలాంటిదే...
మార్కెట్ లో అడుగుపెట్టిన మరుక్షణం లక్షలమంది ప్రాణాల్ని హరిస్తుంది. వెంటనే కాకపోవచ్చు క్రమంగా...
ఒక నిజాయితీగల సిటిజెన్ లా ఆలోచిస్తున్నావనుకుంటాను" తోడేలు నవ్వులా వినిపించింది. "చూడు డాక్టర్ శృతీ...బహుశా పోలీసులకి తెలియజేసి యిటు నీ పార్శిల్ ని వెనక్కి రప్పించుకుంటూ నా పార్శిల్ ని వాళ్ళకి చిక్కేట్టు చేద్దామనుకుంటున్నావేమో కదూ...నిన్నటిదాకా నేను సాగించిన నరమేధం ఏమిటో తెలిసిన ఆడపిల్లగా నా గురించి పెద్ద విషయం అక్కర్లేదనుకుంటాను...సో...మర్యాదగా అలాంటి ఆలోచనల్ని పక్కకినెట్టెయ్."
"అది కాదు..."
"కాకూడదనే నేనూ హెచ్చరిస్తున్నది. డబ్బుకోసం నేను అనుకున్నది సాధించడం కోసం మనుషుల ప్రాణాలతో సునాయాసంగా ఆడుకునే అలవాటు గలవాడ్ని...చెప్పు...కోట్ల విలువచేసే హెరాయిన్ని పోలీసులకి సొంతంచేస్తావా లేక అది మర్యాదగా నాకు అందించి కొందరు నిర్భాగ్యుల ప్రాణాలను కాపాడగలిగిన మంచి కార్యక్రమానికి పూనుకుంటావా."
"అంటే..."
"మరేం లేదు...ఆ పార్శిల్ సవ్యంగా నా దగ్గరకు రాకపోతే ఎప్పటిలా సర్పాలతో సిటీని నంజుకుంటాను. అంతకుమించి..." ఓ క్షణం ఆగేడు. "నిన్ను పెంచి పెద్దచేశాడే అదే నీకు మామయ్యలాంటి డాక్టర్ సంఘమిత్ర ప్రాణాలుతీసి పార్శిల్ గా పంపిస్తాను."
పక్కలో బాంబుపడ్డట్టు అదిరిపడింది. "అంటే...డాక్టర్ సంఘమిత్ర..."
"ప్రయోగం ఫలించిన రాత్రే నాచేత బంధింపబడ్డాడు. ఆశ్చర్యపోతున్నావా...నేను సర్వాంతర్యామిని... అంతా విస్తరించగలను... ఎంతైనా చేయగలను. ఇప్పుడు చెప్పు సంఘమిత్రని చంపుకుంటావా లేక పార్శిల్ వెనక్కి అందిస్తావా?"
"వద్దు" ఆమె కళ్ళనుంచి జలజలా నీళ్ళు రాలుతున్నాయి. "ఆయన్నేం చేయకు...ఇప్పుడు నాకు కావాల్సింది పోలీసుల అడ్మిరేషన్ కాదు...ఆయనా ఆ పార్శిల్ రెండూనూ..."
"గూడ్...యూ ఆర్ క్లెవర్ గాళ్...సో...ఇప్పుడు విను... మనం పార్శిల్ ని ఈ రాత్రికే మార్పిడి చేసుకుంటున్నాం...బోనస్ గా సంఘమిత్రని నీ దగ్గరకు పంపుతాం...ఎక్కడో తెలుసా...సిటీకి దూరంగా హయత్ నగర్ ఇరవై మూడో మైలురాయి దగ్గర సరిగ్గా రాత్రి పన్నెండు గంటలకి. మరో ముఖ్యవిషయం...నువ్వు ఒక్కదానివే రావాలి...ఎలాంటి కంపెనీ వుండకూడదు... ఏమాత్రం తెలివి ప్రదర్శించినా నీ సంఘమిత్ర ప్రాణాలు..."
"లేదు...నీ ఆదేశాన్ని ఖచ్చితంగా ఫాలో అవుతాను."
"గూడ్...మా వాళ్ళు నీకోసం వెయిట్ చేస్తుంటారు...సరిగ్గా రాత్రి పన్నెండు గంటలకి...ఓ.కే!" ఫోన్ క్రెడిల్ చేసిన చప్పుడు...
అప్పటికే శరీరంలో శక్తి ఉడిగినట్టు రిసీవర్ని హుక్ పై వుంచి బడలికగా సోఫాలో కూర్చుండిపోయింది.
"ఏమైంది? మాట్లాడిందెవరు?" అంతసేపూ నిర్వీణ్ణుడై నిలబడ్డ జయేంద్ర ఒక్క ఉదుటున ఆమెను చేరుకున్నాడు.
శృతి జవాబు చెప్పలేదు...అసలు చెప్పకూడదనుకుంటూంది.
"చెప్పు శృతీ" ఇప్పుడామె భుజాలు పట్టుకుని కుదుపుతున్నాడు. మొన్నటిదాకా బ్రతుకు మండుటెండలో నిద్రకీ జాగృతికీ మధ్య నిస్తేజంగా కదిలిన అతడు ఆమె సాన్నిహిత్యంతోనే మంచులో తడిసిందీ మనిషైందీను!
ఆహుతై పోతున్న అడవిలాంటి జీవనయానంలో హఠాత్తుగా తోడై కలువల కళ్ళతో వెల్లువలై ఉబికే అశ్రువుల్ని చూడలేకపోతున్నాడు. "నిన్నే..."
సంకెళ్ళలా చుట్టుకున్న నిస్త్రాణని విదిలించుకుని అతడికంతా చెప్పాలని వుంది.
కాని ఏదీ చెబితే విని వూరుకునే మనిషి కాదే...
అతడి తొందరపాటు ఒకవేళ సరిదిద్దుకోలేని శాశ్వతమైన పొరపాటుగా మారితే తనకు నీడనిచ్చిన ఓ మనిషి కడతేరిపోతాడు. అదికూడా కాదు...డాక్టర్ సంఘమిత్రపై తనకున్న కృతజ్ఞతకన్నా ఈ సంఘానికి ఆయన అవసరం చాలా వుంది.
"శృతీ..." ఎలాంటి స్థితిలో అయినా స్థిమితంగా వుండగలిగే జయేంద్ర సహనం క్రమంగా నశించిపోతూంది.
"ప్లీజ్" అప్పటికే ఏదో నిర్ణయించుకున్నట్టు తల తిప్పుకుంది. "నన్ను ఫోర్స్ చేయకు."
అంతసేపూ ఆమె భుజాలపై చేతులుంచిన జయేంద్ర సరిగ్గా ఆ క్షణంలో తేరుకున్నాడో తప్పుచేశాననుకున్నాడో గభాలున చేతుల్ని వెనక్కి తీసుకున్నాడు "అయామ్ సారీ"
శృతి పైకి లేచింది.
కిటికీ దగ్గర నిలబడి చాలాసేపటిదాకా చలిని కప్పుకున్న చీకటి చూస్తూ నిలబడ్డ శృతి తన నిర్ణయంలో ఎలాంటి పరిణామాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందీ అని ఆలోచించలేదు...
ఒంటరిగానే వెళ్ళాలని నిర్ణయించుకుంది.
సరిగ్గా అదే సమయంలో...
ఒక పసికందుపై తన ప్రతాపం చూపించి ప్రాణాలుతీసిన బ్లాక్ మాంబా అక్కడొక తల్లి ఆక్రందనతో ముందుకురికిన జనం మధ్య నుంచి తప్పించుకుంది.
చీకటిలో వినిపించే స్మారక సంగీతంలా బుసకొడుతూ సమీపంలోని ఓ స్కూలు బిల్డింగ్ ఆవరణలోకి ప్రవేశించింది.
అంతటా నిశ్శబ్దం...
ప్రహరీ ముందున్న పూలచెట్లు మృత్యువు ఒడిలో పెరిగే స్మృతుల్లా స్తబ్దంగా వున్నాయి.
మసక వెలుతురులో కదిలే 'మాంబా' ఒంటిపై మచ్చలు రాలిపడే ఉల్కల్లా కాంతుల్ని చిమ్ముతున్నాయి.
మొక్కల్ని దెయ్యాలతలల్లా నెరుతూసాగిన మాంబా బిల్డింగ్ ఆనుకునివున్న రావిచెట్టు పైకి ప్రాకింది. బడలికగా ఓ కొమ్మని చుట్టుకున్న ఆ విషసర్పం తల ఇప్పుడు ఓ క్లాస్ రూమ్ గది కిటికీకి చేరువుగా వుంది.
సుమారు వెయ్యిమంది విద్యార్ధులదాకా చదివే ఆ పబ్లిక్ స్కూల్లోనే 'నానీ' చదువుతున్నది. అంతకుమించి ఆ క్లాస్ రూమ్ కిటికీవారనే నానీ కూర్చునేది కూడా!
* * * *
రాత్రి పదకొండు గంటలవేళ...
చీకటి సర్పం పురుడు పోసుకుంటున్నట్టు గాలి బుసలా చొచ్చుకొస్తూంది...మృత్యువుతో ముఖాముఖీ సమరానికి సిద్ధపడుతున్నట్టు నగరం నిస్త్రాణగా నిట్టూర్పులు విడుస్తూంది.
సరిగ్గా ఆ సమయంలో ఇంటికి వచ్చిన డిసిపి ప్రసన్న సరాసరి లల్లీ నిద్రపోతున్న గదిలోకి నడిచాడు. "నిద్రపోతూందా?" యూనిఫాం మార్చుకుంటూ అడిగాడు.
"ఇంతసేపటిదాకా మెలకువగా ఉంటుందని ఎలా అనుకున్నారు" సబిత గొంతులో కొద్దిపాటి నిష్టూరం ధ్వనించింది. "అయినా కాస్త వేళకి ఇంటికి రావాలని మీకు అనిపించదేం?"
ఇలాంటి వాక్యాల్ని సబిత పూర్వం ఉపయోగించేది కాదు. ఈ మధ్య జరిగిన సంఘటనలు ఆమెను మానసికంగా కలవరపెట్టి ధైర్యాన్ని సడలించాయి.
"మీ డ్యూటీ విషయంలో నేను జోక్యం చేసుకోవడంలేదు. కనీసం ఒక డ్యూటీలా అయినా మమ్మల్ని పట్టించుకోమంటున్నాను."
"సబితా" ఆమె చెంపల్ని అరచేతులతో స్పృశిస్తూ లాలనగా కళ్ళలోకి చూసాడు. "మిమ్మల్ని ఏనాడూ నేను నిర్లక్ష్యం చేయలేదు" ఎందుకో అతడి గొంతు వణికింది ఆ వాక్యం అంటుంటే.
ఏ భీతావహనమైన క్షణాలు ఆమె గుండెల్ని మండించాయో ఆమె కళ్ళనుంచి జలజలా నీళ్ళు రాలాయి. "అవును...మీరు నిర్లక్ష్యం చేయలేదు..." తల పంకించింది అక్కసుగా.
అవి సూటిగా తగలాల్సిన చోటనే తగిలాయి. నిన్నగాక మొన్న కూతుర్ని స్వహస్తాలతో ప్రత్యర్ధి మృత్యు కూపంలోకి పంపడం అతడు చెప్పలేదు.
కాని పేపర్లలో చదివి తెలుసుకుంది.