Previous Page Next Page 
కోమలి పిలుపు పేజి 30

    "అసలేం జరిగింది కోమలీ" అన్నాను.
   
    "చెప్పుకోవడానికేం లేదు. నన్ను భర్త విడిచిపెట్టాడు అందుకు కారణం విలాస్."
   
    "నీకు విడాకులిచ్చేశాడా!"
   
    "లేదు."
   
    "అయితే నీకు నేను సాయపడలేను.
   
    "సాయమంటే?"
   
    "నిన్నూ, నీ భర్తనూ తిరిగి కలుపుతాను."
   
    "విలాస్ వంటి అప్రాచ్యుడి మాటలు నమ్మి నన్ను వదిలేసిన ఆ త్రాష్టుడి మళ్ళీచేరాలని నేననుకోవడంలేదు" అన్నది కోమలి.
   
    "అయితే ఏం చేస్తావ్!" అన్నాను.
   
    "నన్ను పరీక్షగా చూశావా?"
   
    "అంటే..."
   
    "ఒక వివాహితగా నీవు నన్ను ఆదరించావు. అందుకే నా భర్తకు సంబందించిన గుర్తులన్నీ వదులుకుని నీ దగ్గరకు వచ్చాను. ఒకప్పుడూ నిన్నిలాగే కోరాను. ఇప్పుడూ కోరుతున్నాను. నేను నీకు భార్యను కావాలనుకోవడం లేదు. నా బాధ్యతలు అప్పగించడంలేదు. ఇతరత్రా మనిద్దరికీ ఏ విధమయిన సంబంధమూ వుండదు. ప్రకృతి, పురుషుడులా మనం కాసేపు ప్రపంచాన్ని మరిచిపోదాం. ఈ సమయాన్ని సద్వినియోగం చేద్దాం" అన్నది కోమలి.
   
    కోమలి నన్ను మళ్ళీ పిలుస్తోంది.
   
    ఇప్పుడామె ఇదివరకటిమీద ఎక్కువగా ఆకర్షిస్తోంది. కానీ నేనేం చేయాలి!
   
    ఇంట్లో భార్య లేదు. కోమలి నన్ను కోరి వచ్చింది.
   
    ఆమెను కాదనాలా?
   
    "రామం, నామీద ప్రేమతో కాకపోయినా జాలితో నయినా నన్నాదరించు. నా పిలుపును కాదనకు..." అన్నది కోమలి.
   
    "ఇందుకేనా ఇక్కడ నన్ను ఎదురు చూడమన్నావ్!"
   
    కోమలి ఉలిక్కిపడి "అవును. నేను నిన్నిక్కడ ఎదురు చూడమన్నాను కదూ" అన్నది.
   
    నేను మాట్లాడలేదు__
   
    "రామం! నిన్ను చూస్తే అన్నీ మర్చిపోతాన్నేను. నన్ను మన్నించు_నేను నిన్నిక్కడ ఎదురు చూడమన్న కారణం వేరే ఉన్నది."
   
    "ఏమిటది...!"
   
    "డాక్టర్ విలాస్ నీ భార్యను కలుసుకోవాలనుకో... అదెంత సులభమో నీకు తెలియ చెప్పాలని."
   
    "అంటే...!"
   
    "ఈ రోజు నీ భార్యకు తెలియకుండా నీవు నన్నెంత సులభంగా కలుసుకున్నావో అంత సులభంగానూ అతను నీ భార్యను కలుసుకోవచ్చు! అతడా పధకంలో ఉన్నాడు" అన్నది కోమలి.
   
    మతిపోయినట్లయింది-
   
    అవును.
   
    ఎంత సులభమది?
   
    అంటే ఇప్పటికే ఒకవేళ...
   
    నా ముఖంలోని కంగారును గుర్తించింది కోమలి.
   
    "కంగారుపడకు. ఇంకా అతడు తన వేట ఆరంభించలేదు....కానీ అతడికున్న సులువులు చేబుతున్నాను" అన్నదామె.
   
    "ఈ డ్రాయింగ్ రూం తలుపు తెరుచుకోని విధంగా సీలు చేయించేస్తాను" అన్నాను ఆవేశంగా.
   
    "మనసున్న వాడికి లక్షాతొంభయి మార్గాలు. వివేకాన్నుపయోగించాలి కానీ దారులు మూసి లాభంలేదు" అన్నది కోమలి.
   
    "అయితే ఏం చేయమంటావ్?"
   
    "అతడు అట్నించి నరుక్కురావాలనే సిద్దాంతంలో ఉంటాడు అంతే ఏం చేసినా నీతో ప్రారంభిస్తాడు. నిన్ను తనదారికి రప్పించుకుంటాడు. ఆపైన తన విషయం చూసుకుంటాడు. ఏం చేస్తున్నాడో ఎప్పటికప్పుడు నాకు చెబుతూండు మనం రోజూ ఏదో టైములో ఫోన్ లో మాట్లాడుకుంటూందాం. నేను నీకు గైడెన్స్ ఇస్తుంటాను."
   
    "కోమలీ! ఏమిటిదంతా? నా కేదోభయంగా ఉన్నది" అన్నాను.
   
    "భయపడి చేసేదేమీ లేదు. ధైర్యంతో దేన్నయినా ఎదుర్కోవాలి"
   
    నేను ఆలోచిస్తున్నాను.
   
    "నీ కోసం ఇంతకష్టపడి ఆలోచిస్తున్నాను. నా గురించి నువ్వు ఒక్కక్షణం ఆలోచించడం లేదు" అన్నది కోమలి.
   
    "ఏమాలోచించాలి?"
   
    "నా పిలుపు గురించి"
   
    "నీ పిలుపులో న్యాయం లేదు"
   
    "నా పిలుపులో నీకు న్యాయం కనబడే క్షణం కోసం ఎదురుచూస్తుంటాను ప్రస్తుతానికి సెలవు. అవతల విలాస్ భార్య తిట్టుకుంటూంటుంది"
   
    "ఆమె నిన్నిలా పంపడానికి ఒప్పుకొనడం నాకాశ్చర్యంగా ఉన్నది."
   
    "ఆమె భర్తను ప్రేమిస్తున్నదని నీవనుకుంటున్నావా? అతడిని అదుపు చేయడం కోసమే నాకు సాయపడుతున్నది."
   
    నేను ఆలోచిస్తున్నాను. కొద్దిసేపటిక్రితం ఆమెనాతో మాట్లాడింది. ఆ కొద్ది క్షణాల్లోనూ ఆమె ఉత్తమ ఇల్లాలన్న భావం నాకు కలిగింది.
   
    డాక్టర్ విలాస్ కు బుద్దిచెప్పి ఆమెకు సంతోషం కలిగించాలి అని నాకు అనిపించింది.
   
    మరి కోమలి సంగతి?

 Previous Page Next Page