"మీరు నచ్చాడా నచ్చాడా అని ఒకటే అడుగుతూంటే ఆడపిల్ల ఇంతమంది ముందు ఏం చెబుతుంది? సిగ్గుపడి పారిపోయివుంటుంది" కూతురు అలా లేచిపోయినందుకు వాళ్ళేమైనా అనుకొంటున్నారేమోనని సర్దిచెప్పింది శారదమ్మ.
పంచాంగం చూస్తున్న పశుపతి. "వచ్చేనెల్లో బేషైన ముహూర్తం వుంది బావగారూ. ఇంకా నెల వుంటుంది కాబట్టి తొందరలేకుండా పెళ్ళి పనులు చేసుకోవచ్చు. ఏమంటారు? ఈ లగ్నమే ఖాయం చేద్దామంటారా?"
"అబ్బా ఏంటండీ ఆ తొందర? ఆడపిల్లవాళ్ళు, తూగవలసినవాళ్ళు వాళ్ళని కొంచెం ఆలోచించుకోనీయండి" ఈశ్వరమ్మ విసుక్కుంది. ఆ విసుగులో కట్నం కానుకల గురించి ఏం అడగలేదే అన్న కోపం కూడా వుంది.
"తూగడానికి నేనేం బరువు పెడుతున్నానని? కట్నాలడిగానా? కానుకలడిగానా? పెళ్ళిమాత్రం మర్యాదలకి లోపం జరగకుండా చేస్తే చాలు" అన్నాడాయన.
వెంటనే ఏమి చెప్పలేకపోతున్నాడు వేదప్రకాశం. భ్రమర లేచిపోయిన తీరు ఆయనలో సంకోచాన్ని రేకెత్తించింది. తీరా లగ్నం ఖాయపర్చుకొన్నాక భ్రమర కాదంటే?
నేను ఇంట్లో అన్నీ ఆలోచించి రెండుమూడు రోజుల్లో అక్కడికే వస్తాను ఇరువురికీ అనుకూలమైన లగ్నం నిర్ణయం చేసి పెళ్ళి పెట్టుకొందాం!" అని చెప్పాడు వేదప్రకాశం.
తండ్రికేమోగాని రాఘవేంద్రకి గొప్ప నిరుత్సాహమనిపించింది. ఈ పున్నమి చందమామ తమింటికి రావడానికి ఏమాత్రం జాప్యం జరిగినా భరించేట్టు లేడతడు.
"మీకు నచ్చాడా. నాన్నగారూ?" భ్రమర నేలచూపులు చూస్తూ ఎదురు ప్రశ్నించింది.
"తల్లిలాగా కొంచెం పళ్ళెత్తున్నాయిగాని బాగానే వున్నాడు కదమ్మా?"
"మన ఊళ్ళో చెట్లమీదా, గుళ్ళమీదా తిరిగే కోతులకి కూడా మంచిరంగే వుందమ్మా! వాటిని మనం ఎర్రకోతులంటాం" కోపంగా అంది భ్రమర.
"బాగుందే నీ వరస. ఏదో ఒక వంకలేని మనిషి వుంటాడా ఈ ప్రపంచంలో . పురాణాల్లో వర్ణించినట్టు నలకుబేరుడో, మన్మధుడో రావాలంటే ఎక్కడ దొరుకుతాడు? పిల్లడు చదువుకొన్నాడు. చక్కగా లెక్చరర్ చేస్తున్నాడు. ఆ తండ్రి ఎంత మంచి మనిషి. మగపిల్లాడి వాళ్ళం అన్న భేషజం ఏమీ లేకుండా ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. కట్నాలు కానుకలు ఏమీ అక్కర్లేదు. అంటున్నాడంటే ఎంతటి సంస్కారపరులనుకోవాలి. వాళ్ళింట్లో అందరూ మంచివాళ్లలాగే కనిపిస్తున్నారు. పిల్లలిచ్చేచోట కన్నవాళ్ళు చూడాల్సింది ఆస్తీ అంతస్తుకంటే ముఖ్యంగా చూడాల్సింది మంచితనం. నాకైతే ఈ సంబంధం బాగా నచ్చింది" అంది తల్లి.
సంగీత ఆటపట్టిస్తున్నట్టుగా "అవునే, మీ మాంగారు నీకు ముప్పై తులాల బంగారు పెడతారట. బెనారస్ పట్టుచీరలే కట్టిస్తారట. అంతమంచి మాంగారు నీకెక్కడ దొరుకుతాడు చెప్పు" అంది.
"నయం! పువ్వుల మీద నడిపిస్తాను. పట్టుపరుపులమీద పడుకోబెడతాను అనలేదు" చిరాకుగా అంది భ్రమర.
"నేను ఇవేమీ చూడ్డంలేదు. త్వరగా అమ్మాయి పెళ్ళి అయిపోవాలని మాత్రమే చూస్తున్నాను" అన్నాడు వేదప్రకాశం.
"అమ్మా భ్రమరాంబికా, పరిస్థితుల్ని అర్ధంచేసుకొనే విజ్ఞత నీకేర్పడిందనే అనుకొంటున్నాను. అన్నివిధాలా బాగున్న సంబంధం. కేవలం మూతి ఎత్తు అన్న కారణంగా కాదంటే మళ్ళీ ఎంత తిరగాలో. ముఖ్యంగా అమ్మ కోరుతున్నట్టుగా మంచి ఉద్యోగంలో వున్నాడు."