సంతకాలు:
ప్రతీ దేశానికి ఒక జాతీయగీతం, ఒక జెండా వున్నట్లుగానే ప్రతీ మనిషికి ఒక సంతకం వుంటుంది.
సంతకాన్ని 'వ్యక్తిత్వం యొక్కసీల్' అనొచ్చు.
'ఒక మనిషి తన గురించి తను ఏమనుకుంటున్నాడో అతని సంతకం కరెక్ట్ గా చెప్తుంది' అంటారు గ్రాఫాలజిస్టులు. తను ప్రపంచాన్ని ఏ విధంగా చూడాలనుకుంటున్నాడో, తనని ప్రపంచం ఏ విధంగా చూడాలనుకుంటుందో - ఒక మనషి సంతకంలో ప్రస్పుటమౌతాయని గ్రాఫాలజిస్టులు నమ్ముతారు.
సంతకాన్ని 'ఈగో సింబల్' గా గుర్తించవచ్చు.
ఒక ప్రొఫెషనల్ గ్రాఫాలజిస్టు ఒక మనిషి చేతివ్రాతకన్నా, అతని సంతకాన్ని చూసే మనస్తత్వాన్ని కరెక్ట్ గా చెప్పగలను అంటాడు. కానీ, ఎప్పుడూ ఒక సంతకాన్నే కాకుండా, మొత్తం వ్రాతనంతా పరిశీలించి చివర సంతకాన్ని దానికి అన్వయించి ఆ మనిషిని విశ్లేషించటం మంచిపని.
సంతకం సైజు, అక్షరాల వంకర, చివర పెట్టే రెండు చుక్కలు, సంతకం ప్రారంభించబోయేముందు గీసే పెద్ద గీత, మధ్యలో వదిలేసే అక్షరాలు, సంతకం చుట్టూగీసే సర్కిల్, సంతకంలో ఆ వ్యక్తి ఉపయోగించే పెద్ద అక్షరం ఇవన్నీ గ్రాఫాలజిస్టుకి తోడ్పడతాయి. పైకి ఇవన్నీ మామూలు విషయాలుగా కనబడ్డా, లోతుగా పరిశీలిస్తే ఇందులో చాలా అర్దాలున్నా యనిపిస్తుంది. కొంతమంది సంతకం పెట్టేటప్పుడు మొదటి అక్షరం మీద బాగా ఆధారపడితే , ఇంకొదరు చివర అక్షరాన్ని బాగా వ్రాసి సంతకం పూర్తి చేస్తారు.
ఈ రకరకాల సంతకాల మీద ఏ విధంగా వాళ్ల మనస్తత్వం ఆధారపడి వుంటుందో మనం ఇప్పుడు చర్చిద్దాం.
ఒక మనిషి యొక్క మూడ్ ని, కోపాన్ని, విసుగుని, నిర్లక్ష్యాన్ని, వీటన్నింటినీ కూడా మనం సంతకంలో గమనించవచ్చు. అదేవిధంగా వయసు పెరిగేకొద్దీ జీవితంలో అతడి ఒడిదుడుకులను కూడా అతని సంతకం ప్రతిబింభిస్తుంది. దీనికి ప్రధానమైన ఉదాహరణగా ఈ క్రింది రిచర్డ్ నిక్సన్ సంతకాన్ని పరిశీలించండి.
ప్రారంభంలో తన రెండు పదాల మొదటి అక్షరాలని చాలా క్లియర్ గా స్పష్టంగా వ్రాయటం జరిగింది. కానీ కాలక్రమేణా అతని శారీరక, మానసిక స్థాయి ఏ విధంగా క్రుంగిపోతూ వస్తున్నదో తర్వాత్తర్వాత సంతకాలు తెలుపుతాయి.
మొదట్లో క్లియర్ గా అర్దమయ్యేలా వున్న అతని సంతకం, అతని యొక్క'జీవితంలో పైకి రావాలి' అనే కోర్కెను తెలుపుతుంది. కుడివైపు వంగిన అతని అక్షరాలు జీవితం పట్ల అతనికున్న ధృఢమైన దృక్పథాన్ని తెలుపుతున్నాయి. కానీ ఆ తర్వాత పెట్టిన సంతకంలో అక్షరాలు కుడివైపు కాకుండా నిలువుగా మారటాన్ని గమనించవచ్చు. ఇది అతడు నేర్చుకున్న లౌక్యాన్ని, ప్రాక్టికాలిటీని తెలుపుతాయి. అలాగే అతని మూడో సంతకంలో కనపడిన నిర్లక్ష్య భావం సమయంపట్ల అతనికుండే వత్తిడిని తెలుపుతుంది. నాలుగో సంతకం దగ్గరకొచ్చేసరికి కేవలం గొలుసులాగ సాగిన గీతలు మాత్రమే వున్నాయి. ఇది అతడి యొక్క అభద్రతా భావాన్ని, అవసరానికి మోసం చేసే గుణాన్ని,ఓటమిని సూచిస్తున్నాయి. అదే విధంగా సంతకంలో మొట్టమొదట వున్న కలం ఒత్తిడి తర్వాత లేకపోవటాన్ని కూడా మనం గమనిస్తాం. ఇది అతడియొక్క శరీర ధృఢత్వాన్ని కోల్పోవటం కూడా సూచిస్తుంది. అంటే శారీరకంగా అనేకాదు. తక్కువ సంవత్సరాలలో అతనిలో వచ్చిన మార్పుని సూచిస్తుంది.
కొంతమంది చిన్న అక్షరంతో ప్రారంభించి మధ్యలో ఒక చిన్న అక్షరాన్ని వ్రాసి సంతకాన్ని పూర్తి చేస్తారు. మరికొందరు సంతకం చేసిన తర్వాత అడ్డంగా ఒక గీతగీసి కొట్టేసినట్లుగా వ్రాస్తారు. ఈ రకరకాల స్వభావాలన్నీ మనం ఈ క్రింద పరిశీలిద్దాం.