Previous Page Next Page 
గ్రాఫాలజీ పేజి 29

                                 

          

 

  కాగితంలో మేటర్ వ్రాసే పద్దతిని ఆరురకాలుగా విడగొట్టవచ్చు.

    1. మొదట ఎక్కువ ఖాళీ స్థలం వదిలి చివర్లు నింపటం.

    2.మొదట తక్కువ ఖాళీ స్థలం వదిలి ప్రారంభించటం.

    3. చివర్లో ఇంకా ఎక్కువ ఖాళీ స్థలం వుండగానే పేజీ త్రిప్పేయటం.

    4.పేజీ చివరి వరకూ వ్రాయటం.

    5.ఎడమవైపు,కుడివైపు, పైనా,క్రిందాఎక్కడా ఖాళీ స్థలం లేకుండా కాగితాన్నంతా వ్రాతతో నింపటం.

    6. నాలుగువైపులా ఎక్కువ ఖాళీ  స్థలం వదలటం.

    వ్రాసేటప్పుడు పైన ఎక్కువ ఖాళీ స్థలం ప్రారంభిస్తే ఆ వ్యక్తికి చొరవ తక్కువగా వుంటుంది. ఏదైనా ఒక నిర్ణయాన్ని అవతలి వ్యక్తి తీసుకుంటే  బావుణ్ము అని సదా భావిస్తాడు.  సాధారమంగా ఈ వ్యక్తి మర్యాదకి విలువిచ్చేవాడు, ఇతరుల అభిప్రాయాన్ని గౌరవించేవాడు అయి వుంటాడు.

      పై విధంగా కాకుండా పేజీ పైనుంచి వాక్యాన్ని ప్రారంభించే వాళ్లు ఎక్కువ పొదుపరులు అయి వుంటారు. వీరికి సాంకేతిక విషయాలపట్ల ఎక్కువ ఆసక్తి వుండదు. అలాగే ఏ విషయాన్నయినా లోతుగా వెళ్ళి శోధించాలి అనే తపన తక్కువగా వుంటుంది.

    కాగితంలో ఇంకా ఎక్కువ ఖాళీ ఉండగానే పేజీ తిప్పేసి, తరువాత పేజీలో వ్రాసేవాళ్లు ఎక్కువ ఎమోషనల్ గాను, అవసరమైనదానికన్నా ఎక్కువ బాధ్యతాయుతంగాను ప్రవర్తిస్తారు. వీరికి సెక్స్ పరమైన అభద్రతా భావం కూడా చోటు చేసుకొని ఉంటుంది.

    కాగితం చివరి వరకూ  వ్రాసి అప్పుడు కానీ పేజీ తిప్పని వాళ్లు ఎక్కువ మెటీరియలిస్ట్ లు అయివుంటారు. వీరు మానసికమైన విషయాలకన్నా శారీరకమైన విషయాలకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు.

    పేజీకి నాలుగువైపులా అస్సలు మార్జిను వదలకుండా పేజీనంతా వ్రాతతో నింపేవారు తమ అభిప్రాయాలని చెప్పటానికి మొహమాటపడని వాళ్ళని అతి భయంకరంగా ఎదుర్కోవటమే కాకుండా అవసరమైతే వాళ్లతో సంబంధాలను తెగతెంపులు చేసుకోవటానికి కూడా సిద్దపడతారు.

     నాలుగువైపులా ఎక్కువ ఖాళీస్థలం వదిలేవారు ఒకరకమైన అభద్రతా భావంతో బాధఫడుతూ వుంటారు. వీరు ఎక్కువగా ఒంటరితనాన్ని కోరుకుంటారు. కానీ ఒంటరి తనమంటే ఇష్టపడరు. పరస్పర విరుద్ద భావాలతో సతమతమవుతూ వుంటారు. వీరు సమాజంలో తమయొక్క ఇంట్రావర్షన్ ని, తమ యొక్క రిజర్వ్ డ్ నెస్ గా భావించి సంతృప్తి చెందుతూ వుంటారు.

        మొదటి భాగం సమాప్తం.

     
                              రెండవభాగం

    ఈభాగంలో ముఖ్యంగా - ఒక వ్యక్తి తన చేతివ్రాతలో ఉపయోగించే ఇంకురంగు, అతను అడ్రస్ విధానం, ఖాళీగా వున్నప్పుడు గీసేగీతలు, అన్నిటికన్నా ముఖ్యంగా - అతడు పెట్టే సంతకం - వీటి గురించి విశ్లేషిద్దాం.

    ఒక మనిషి యొక్క మనస్తత్వాన్ని , అతడు ఖాళీగా వున్నప్పుడు చేసే పనుల బట్టి కరెక్ట్ గా విశ్లేషించవచ్చు. ఉదాహరణకి కొంతమంది ఖాళీ సమాయల్లో చేతిలోవున్న పెన్నుతో రకరకాల బొమ్మలని గీస్తూ వుంటారు. మరికొందరు కాగితం లేకపోతే, టేబిల్ మీద కూడా బొమ్మలూ, పేర్లు చెక్కుతూ వుండటం మనం చూస్తూంటాం.  ఇలాంటివి క్లాస్ రూమ్స్ లో ఎక్కువగా  చూడొచ్చు. టేబిల్స్ మీద, బాత్రూమ్ గోడల మీద బొమ్మలు వెయ్యటం కూడా సర్వ సామాన్యమైన విషయం.  కొంతమంది వయసులో ఎంత ఎదిగినా, కూడా ఇలాంటి  పనులు చెయ్యడాన్ని బట్టి అతడు మానసికంగా ఎంత ఎదిగాడో గమనించవచ్చు. ఈ వివరణలోకి వెళ్లేముందు మనం ఒక్కసారి 'బాట్రీసియామార్నే' గురించి తెలుసుకుందాం.

    బాట్రీసియామార్సే ఒక జర్నలిస్ట్. కానీ, ఆమె జర్నలిస్ట్ గా కన్నా, గ్రాఫాలజిస్ట్ గానే ఎక్కువ పేరు పొందింది. ఆమెమీద జనం ఎంత నమ్మకం వుంచారంటే, వివాహం కోసం భాగస్వామిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు, లేక ఉద్యోగాలకోసం అభ్యర్దులని సెలెక్ట్ చేసుకునేటప్పుడు వారివారి చేతి వ్రాతలను ఈమెకు పంపి అభిప్రాయాన్ని కోరటం - ఈమె గొప్పతనాన్ని, గ్రాఫాలజీలో వుండే ప్రవేశాన్ని సూచిస్తుంది.

     'మార్నే' అమెరికాలోని ఒక స్కూల్లో గ్రాఫాలజీ బోధిస్తోంటో, ఈ శాస్త్రం గొప్పతనాన్ని వారు ఎంతగా గుర్తించారో తెలుసుకోవచ్చు. న్యాయవాదులు, పోలీసులు కూడా చేతివ్రాతలని పరిశీలించే విషయాల్లో ఈమె సహాయాన్ని కోరటం గ్రాఫాలజీ ప్రాముఖ్యతని తెలుపుతుంది.

     మనం ఈ ఛాప్టర్ లో తర్వాతి అధ్యాయాలలో సంతకాల గురించీ, విరామ సమయాల్లో మనుషులు గీసే గీతలు గురించి చర్చించబోతున్నాం.

     ముఖ్యంగా పాఠకులు గమనించవలసిందేంటంటే, ప్రతీ సంతకాన్నీ విశ్లేషించటం సాధ్యంకాదు. అందువల్ల తన సంతకాలలో ఏ యే విభాగాలు, తర్వాతి చాప్టర్ లో ఇచ్చిన ఉదాహరణల్లో దేనికి దగ్గరగా  సరిపోతాయో, వాటినిబట్టి తన గుణగణాలని పరిశీలించుకోవాలి. ఉదాహరణకి ఒక వృత్తం తన సంతకం చుట్టూ గీసేవారిని గురించి తెలిపితే, అది అర్దవృత్తమైనా పూర్తి వృత్తమైనా, తాము ఆ విభాగానికి చెందినవారేనని భావించాలి.

    ఇప్పడు మనం పైన చెప్పిన విషయాలని వివరంగా పరిశీలిద్దాం.  

 Previous Page Next Page