1.A. ఒక మనిషి చేతివ్రాత అంతా ఎలా వుందో, అతని సంతకం కూడా అలాగే వుంటే ఆ మనిషి జీవితం పట్ల చాలా బాధ్యతాయుతంగా వుంటాడు. ఆ మనిషి విశ్లేషాత్మక శక్తి అవతల వ్యక్తులపట్ల సానుభూతి, తనని తాను అవతల వారికి కరక్ట్ ప్రదర్శించుకోవాలన్న ఆసక్తి వుంటాయి.అతను మోసం చెయ్యటానికి ఇష్టపడడు. తనేమిటో తనకు బాగా తెలిసిన ఎనలైజేషన్ అతనిలో వుంటుందని చెప్పొచ్చు.
ఇటువంటి వ్యక్తి కాస్త ఇన్ ఫీరియారిటీ కాంప్లెక్స్ తో కూడా బాధపడే అవకాశం లేకపోలేదు.
1.B. సంతకం పూర్తి చేసి, గీతగీసి, క్రింద రెండు చుక్కలు పెడితే ఆ వ్యక్తి తను చేసే పనిపట్ల నమ్మకం గలవాడై వుంటాడు. పెర్ ఫెక్షనిజం పట్ల చాలా ఆశక్తి గలవాడై వుంటాడు.
తనవాళ్లను, తవ కుటుంబ సభ్యులను సంతోషపెట్టడంలో అమితానందం పొందుతాడు.
ఇటువంటి వ్యక్తులు రాజకీయాల్లో గానీ, వ్యాపారాల్లో గానీ, పబ్లిక్ ఫిగర్ అవటంలో గానీ పెద్ద ఆసక్తి చూపరు. ఒకవేళ చూపినా ఆయా రంగాలలో పైకి వచ్చే అవకాశం చాలా తక్కువ.
జీవితంలో ఎక్కువ మార్పులని కానీ, రిస్క్ గానీ ఆశించరు.
వీళ్లు తీసుకున్నంత గట్టి నిర్ణయాలని వేరెవ్వరూ తీసుకోలేదని చెప్పొచ్చు. ఒక యోధుడు ఈటె విసరబోయే ముందు లక్ష్యాన్ని ఎన్నుకొని, తలవెనక్కువంచి విసిరినట్లుగా, వీరుకూడా లక్ష్యాన్ని ఎన్నుకొని ఈటె విసరడం ప్రారంభిస్తారు.
కానీ, చిక్కేమిటంటే, కార్యదీక్షతో పని ప్రారంభించబోయే ముందు వీరు ఎన్నుకున్న లక్ష్యం కాస్త పక్కకి జరిగినా కూడా, ఆ హడావుడిలో గుర్తించలేరు.
వీరు సాధారణంగా భోళా మనుషులు.
ఆత్మాభిమానం కోసం పెద్దల నుంచి రావలసిన ఆస్తిపాస్తులను విసిరికొట్టే అలవాటు వీళ్లల్లో వుంటుంది.
2.A.కొంతమంది సంతకం పెట్టబోయే ముందు ఒక గీతతో ప్రారంభిస్తారు. ఆ గీత నిలువుగా వుండొచ్చు లేక పై నుంచి దిగుతూ వుండవచ్చు. అలాగాక పై ఉదాహరణలో చెప్పినట్లుగా క్రిందనుంచి పైకైనా సాగవచ్చు. ఇటువంటిటైపు సంతకాన్ని గుర్తించాలంటే, ఆ గీతతో సంతకం మొదలవుతుందా లేదా అనేది పరిగణలోకి తీసుకోవాలి. ఇలా గీతలతో సంతకాలని ప్రారంభించే వ్యక్తులు తమ ఆశయాలు పక్కవాళ్లకి ఇబ్బంది కలిగిస్తున్నా పట్టువీడని వ్యక్తులైవుంటారు. వీరి మంకుతనం, మొండి పట్టుదల వెనుక వున్న అమాయకత్వం అర్దం చేసుకునేవాళ్లకి మాత్రమే అర్దమౌతుంది.
ఇతరులు తమని సున్నితంగా ట్రీట్ చెయ్యాలని కోరుకుంటారు. అయితే, వీరు ఇతరుల నుంచి ఏమి ఆశిస్తారో, దానికి పూర్తిగా భిన్నంగా ప్రవర్తిస్తారు.
తమకున్న వస్తువులనుగానీ, ప్రేమనుగానీ, ఇతరులకు ఇవ్వటంలో ఎంతో ఆసక్తిని ప్రదర్శించే వీరు ఇతరుల నుంచి అటువంటి ప్రతిస్పందన రాకపోతే మాత్రం చాలా బాధపడతారు.
అన్యాయాన్ని ఎదిరించటానికి మానసికంగా చాలా సిద్దపడివున్న వీరు, శారీరక బాధలని మాత్రం తట్టుకోలేకుండా అవసరమైనదానికన్నా ఎక్కువ లాలిత్యంతో వుంటారు.
ఇటువంటి సంతకం స్త్రీలదైతే వీరు పిల్లలనీ, భర్తనీ అవసరమైన దానికన్నా ఎక్కువగా ప్రేమించి వాళ్లకోసం ఎటువంటి త్యాగానికైనా సిద్దపడతారు. అయితే వాళ్లు మాత్రం తమ వ్యక్తిత్వానికి అడ్డు గోడలైతే ఎటువంటి పరిస్థితుల్లోనూ సహించలేరు.
2. B. మొదటి రెండు మూడు అక్షరాలని స్పష్టంగా వ్రాసి, చివరి అక్షరాలి వదిలివేయటం, కొంతమంది నిర్లక్ష్యాన్ని సూచిస్తుంది. ఉదాహరణకి పైన ఇచ్చిన సంతకంలో 'లక్ష్మి' అన్న మొదటి రెండక్షరాలనీ స్థిరంగా వ్రాసి, తర్వాత అక్షరాలని కలిపేసి ఒక చిన్న గీతతో సంతకాన్ని పూర్తి చెయ్యటాన్ని గమనిస్తాం. నిజానికి ఆ మొదటి చివరి గీతలకన్నా తన అక్షరాల్ని పూర్తి చెయ్యటంలో ఆమె ఎక్కువ శ్రద్ద చూపించి వుండవచ్చు. ఇదే మనస్తత్వం ఆమె వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రస్పుటింప చేస్తుంది. అవసరమైనదానికన్నా , అనవసరమైన విషయాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం ఈ సంతకంలో గమనించవచ్చు. మొదటి గీత, చివరగీత పెట్టి, చివరి మూడక్షరాలని ఆమె పూర్తి చెయ్యకపోవటం ఆమెయొక్క అస్థిర మనస్తత్వాన్ని సూచిస్తుంది. సంతకంలో పూర్తి అక్షరాలని వ్రాయని వారికి ఈ విశ్లేషణ వర్తిస్తుంది.(అయితే, ఇదే విధానంలో, మొదట గానీ, చివరగానీ, 'అసలు' గీతలు గీయకుండా, అక్షరాల్ని వదిలేసేవారు, జీవితంపట్ల పూర్తి అధికారం వున్న వారై వుంటారు)
సంతకం పెట్టి చుట్టూ ఒక వృత్తం ద్వారా దాన్ని పూర్తి చేసినవారు సాదారణంగా ఇంట్రావర్ట్ లై, రిజర్వ్ డు మనస్తత్వం కలిగినవారై వుంటారు. పై ఉదాహరణలో జయ అనే ఆమె తన రెండో అక్షరాన్ని వ్రాయకపోవటం గమనించండి. ఇలా సంతకంలో మొదట అక్షరాలు వ్రాయకుండా చివరి అక్షరాలకి ప్రాముఖ్యత ఇచ్చేవారు తనకన్నా స్నేహితుల్ని ఎక్కువ ఇష్టపడేవారై వుంటారు. అవతలి వారికి తమ మీద ప్రేముందో లేదో తెలుసుకోవటానికి చిన్న పిల్లల్లాగ వారినుంచి ఏదో ఒకటి ఆశిస్తుంటారు.