Previous Page Next Page 
అష్టదళం 2 పేజి 29


    "తులసి తీర్దం మీ చేత్తోనూ పోయండి" మంగ చేతినుండి తీర్దపుగిన్నె అందుకుని శ్రీచక్ర చేతికిచ్చింది కౌస్తుభ. శ్రీచకర ఆయన తల తొడమీద పెట్టుకుని ఉద్దరిణితో మూడుసార్లు పోసాడు తులసి తీర్దాన్ని రెండుసార్లు గుటకవేసినా మూడోసారి బయటికి వచ్చేసాయి.

    చిన్నగా వెక్కిళ్లు.

     దీపం ఆరిపోయింది.

    "సూరి నారాయణ... నారాయణ."

    నారాయణ నామస్మరణ వింటూ జీవుడు పైలోకాలకి పయనమయ్యాడు.

     భూపాల్ గారు అంతిమ ఘడియల్లో వున్నారని తమ గ్రామస్థుడు వచ్చి చెబితే పరుగుపరుగున వచ్చాడు స్వామి. అతడి మనసునిండా ఒకటే చింత.  చివరి క్షణాలలోనైనా తన కొడుకు వస్తాడని తనకు తలకొరివి పెడతాడని ఆయన ఆశ ఆశగానే మిగిలిపోయిందని, ఆయనకి అబద్దం చెప్పి మోసగించి తప్పు చేశానా అని పశ్చాత్తాపపడసాగాడు.
 
    స్వామి వచ్చేసరికి సరిగ్గా అప్పుడే భూపాల్ గారి నోట్లో తులసితీర్దం పోస్తున్నాడు శ్రీచక్ర.

     "ఏమ్మా? నువ్వెప్పుడొచ్చావు?" కౌస్తుభను  స్వామి చూసి ఆశ్చర్యపోయాడు.

    "ఇంతకుముందేనండీ. శ్రీచక్రను తీసుకునివచ్చాడు. సర్ ప్రైజ్ చేద్దామని తీసుకువస్తే  విధి నన్నిక్కడ సర్ ప్రైజ్ చేసింది."

    "ఈయనేనా?" స్వామి సంభ్రమంతో చూసాడు.

    "అవును! గుర్తుపట్టండి ఈయనెవరో!" శ్రీచక్రకి పరీక్ష పెట్టింది.
   
    స్వామి ముఖంలోకి తదేకంగా కొద్దినిమిషాలు చూసిన శ్రీచకర "స్వామి.... సుబ్రహ్మణ్యస్వామి" అన్నాడు. ఆ పిలవడంలో ఆత్మబంధువును పలకరిస్తున్నట్లుగా ఆప్యాయత.

    "ఇంకా ఇక్కడ రుణానుబంధం మిగిలి వుంది. అందుకే ఈ ఆఖరి ఘడియలో ఆయన చెంత వున్నాడు. మంచిమనిషికి మరణమే సాక్షి అంటారు. ఆయన కొడుకు చేతిలో పోవడానికి  నోచుకున్నాడు. ఆయన మంచితనమే ఆయనకీ అదృష్టాన్ని  అందించింది."

    శ్రీచక్ర భూపాల్ గారికి కొడుకు వరుసవాడుగా ప్రకటించి తలకొరివి అతడే పెడతాడని చెప్పాడు స్వామి.

    'ఎలా వరుసైన కొడుకు?' అంటూ ఎవరూ తర్కించలేదు. అనాధ ప్రేతం కాకుండా ఆయనకి తలకొరివి పెట్టడానికి ఒక బంధువు దొరికాడని తృప్తిపడ్డారంతా.

     భూపాల్ గారి శవయాత్రకు ముందు శ్రీచక్రే నడిచాడు. అతడే చితికినిప్పుపెట్టాడు.

     దినవారాలు కూడా శ్రీచక్ర చేతే చేయించాలన్న స్వామి ప్రతిపాదనను భూపాల్ గారికి కావలసినవారంతా  అంగీకరించారు. ఈమధ్య భూపాల్ గారి స్థితి చాలా మెరుగుపడింది. ఖర్చులు తగ్గి ఆదాయం  పెరగడంవల్ల బాంక్ లో డబ్బు బాగానే జమ అయింది. ఆయన కర్మకాండ భారీగా నిర్వహించాలన్నమంగ ప్రతిపాదనను అందరూ ఆమోదించారు.

     కర్మమొదలు పెట్టిన రోజునుండి వూరిజనాలకంతా భోజనాలు ఏర్పాటయి పదమూడో రోజువరకు సాగాయి. వూళ్లో ఆ నాలుగురోజులు పొయ్యిలు రాజెయ్యలేదు. మూడు పూటలా ఇక్కడే తిన్నారు. తాగారు. భారీగా బ్రాహ్మలకి సంభావనలేగాక బీదలకు వస్త్రదానం కూడా చేశారు.

     భూపాల్ గారు చేసిన ఆర్దిసాయంతో చదువుకున్న పేదవిద్యార్దులు ఇప్పుడు చాలామంది ఉన్నతోద్యోగాలలో వున్నారు. వాళ్ళంతా ఆయన కర్మకాండ మొదలయ్యేనాటికి వచ్చారు. వాళ్లలో ఒక పోలీసాఫీసరు కూడా వున్నాడు. ప్రస్తుతం అతడు ఎస్. పి గా చేస్తున్నాడు. అతడి పేరు రవి కుమార్.

     పాతికేళ్ల క్రితం జయసూర్య కనిపించకుండా పోయిన రోజుల్లో అతడు సబ్ ఇన్స్ పెక్టర్ గా జాబులో చేరాడు.

     స్వామివెంట సలేశ్వరం వెళ్ళి తపస్సుకోసం నల్లమలలో కొన్నాళ్లు గడిపిన జయసూర్య అటునుండి అటే హిమాలయాల్లోకి వెళ్లిపోయాడంటే అతడు నమ్మలేదు.

    భూపాల్ గారి చేత కంప్లెయింట్ వ్రాయించి తీసుకుని ఎంక్వయిరీ మొదలుపెట్టాడు.

     స్వామిని ఎంత తరచి అడిగినా ఒక్కటే మాట -

    "జయసూర్య జీవితంపట్ల విరక్తి చెంది హిమాలయాల్లోకి వెళ్ళి పోయాడని."

    జీవితంపట్ల విరక్తి చెందేంత సమస్యలేమీ అతడికి లేవు. అతడి మనస్తత్వాన్ని బట్టి జీవితంపట్ల విరక్తి పెంచుకునే మనిషికాదు. మరిఏం జరిగి వుంటుంది?

    అతడు తపస్సు చేశాడని చెబుతున్న చోటికి వెళ్లాడు.

     భైరవకొండ సమీపంలో ఆంజనేయస్వామి గుళ్లో అతడు ధ్యానానికి కూర్చునేవాడని, అతడితో ఒక బాపనయ్యను కూడా చూశామని అడవిలో కొందరు చెంచులు చెప్పారు.

     చెందుగూడెం పెద్ద కూడా జయసూర్య ఆ ప్రాంతానికి రావడం రెండోసారి అని చెప్పాడు.

     భైరవుని కొండలో నిధి వుందని,  ఆ నిధినికైవసం చేసుకోవడానికి జయసూ్య ఏదో తంతులో భాగంగా  అక్కడ పూజలు నిర్వహించాడేమోనని,  నిధి బలి తీసుకున్నా తీసుకుని  వుంటుందని అనుమానం వ్యక్తపరిచాడు గూడెం పెద్ద.
 
     ఇన్వెష్టిగేషన్ చేస్తుంటే భైరవునిగుట్ట సమీపంలో మునిరాజు ముఠా టెంట్ వేసిన  సంగతికూడా బయటపడింది.
   
    వాళ్లని అడిగితే అడవిలోకి, షికారుకోసం వెళ్లామని, సరదాగా నాలుగురోజులు  గడిపి వచ్చామని,  జయసూర్యని పూజలు చేస్తుంటే చూశాంగానీ అతడేమైందీ తమకి తెలియదని చెప్పారు. ఆ ముఠా సభ్యులు ఆరుమంది ఒకే మాట చెప్పారు.

     అక్కడిదాకా వచ్చిన ఇన్వెస్టిగేశన్ ఇక ముందుకు  కదలలేదు. ఏం జరిగిందీ మిస్టరీగానే వుండిపోయింది.

     జయసూర్య ఆచూకీ ఎలాగయినా కనుక్కుంటానని  భూపాల్ గారికి మాట ఇచ్చిన రవి చివరికి  తన నిస్సహాయత వ్యక్తం చేయక తప్పలేదు.

    జయసూర్య హిమాలయాల్లోకి వెళ్లాడన్న మాట ఇప్పటికీ నమ్మడం లేదతడు. బహుశా జయసూర్య చనిపోయి వుంటాడన్న ఊహ అతనికి వచ్చినా భూపాల్ గారి ముందుమాత్రం వ్యక్తం చేయలేదు. ఎందుకంటే ఆ తండ్రి గుండె ఆ మాట వింటే బద్దలైపోతుందని తెలుసు కనుక.

     జయసూర్య ఏమైందీ స్వామికి తెలుసునని అతడి ప్రగాఢ విశ్వాసం. కానీ అతడి నుండి ఆ నిజం ఎలా రాబట్టాలో తెలియక ఫైల్ మూసేసాడు.

     ఇప్పుడు ఇన్నేళ్ల తరువాత భూపాల్ గారు చనిపోయి, ఆయన కొడుకు స్థానంలో ఉండి కర్మకాండ నిర్వహిస్తున్న శ్రీచక్రను, అతడిచేత కర్మ చేయిస్తున్న స్వామినీ చూస్తుంటే, ఆ జ్ఞాపకాలన్నీ తిరగదోడినట్లు అయ్యాయి.

     కర్మకాండ ముగిసిన పన్నెండోరోజు అందరూ సుష్టుగా భోజనాలు చేసి విశ్రాంతి తీసుకుంటుంటే, ఎస్. పి. రవికుమార్ తన పని మొదలుపెట్టాడు.

     "నేను  గుర్తున్నానా స్వామీజీ?"

    ఒక నిముషం ఎగాదిగా చూసాడు స్వామి అతడిని. జయసూర్య గురించి తనను ఎన్నోసార్లు ప్రశ్నించిన పోలీసాఫీసరు రవికుమార్. అప్పటికీ ఇప్పటికీ కొంచెం వళ్లు వచ్చిందేగానీ, ముఖంలో మార్పేమీలేదు.
   
    "గుర్తున్నారు!"

    "ఇప్పుడయినా నిజం చెబుతారా జయసూర్య ఏమయ్యాడో...........? మంచుకొండల్లో ఈ మధ్యే గెడ్డం పెంచుకుని కనిపించాడని  కథ చెబుతారా?" వ్యంగ్యంగా అడిగాడు.

     "ఈ రోజు అసలు కధో చెబుతాను ఎస్. పి. సాబ్! భూపాల్ గారు బ్రతికివున్నంతవరకూ నా గుండెల్లో గరళంలా దాచిన నిజాన్ని ఈరోజు బయటపెడతాను. ఎందుకంటే ఇప్పుడిక దాచే అవసరం లేదు కాబట్టి... అలా బయటికి వెళ్లి మాట్లాడుకుందాం. శ్రీచక్రా! నువ్వు కూడా మాతో వస్తే మంచిది!"

    "అతడెందుకు మనతో? అసలింతకీ అతడెవరు?"

    "అతడే అసలైనవాడు కాబ్టటి!"

    పాతికేళ్ల క్రితం అసలు పుట్టనయినా పుట్టి వుండని అతడు అసలైనవాడు ఎలా అవుతాడో అర్దం కాలేదు రవికుమార్ కు.

     కొద్ది నిముషాల తరువాత రేవు మెట్లమీద కూర్చుని చెప్పడం మొదలు పెట్టాడు స్వామి.

    మునిరాజు ముఠా చేతిలో జయసూర్య అంతమైన వైనమంతా చెప్పాడు స్వామి.    
 
    "ఆ మూఠాలో ఒకడు భైరవుని కొండ దగ్గరే చచ్చాడు. కొండను పేల్చివేయాలని వాళ్లు పెట్టిన డైనమెట్లు పేలి మిగతావాళ్లు ఇప్పుడు నగరాన్ని చేరి పెద్దమనుషుల్లా చెలామణి అవుతున్నారు. గ్రామంలోనే వుండిపోయిన  మునిరాజు చూడటానికి సామాన్యంగా కనిపించినా, ఆ ముఠాకి మూలపురుషుడు వాడే. గుళ్లు దోచికా, విగ్రహాలను ఎత్తుకుపోయినా, ఆలోచన వాడి మెదడులోంచే పుట్టుకువస్తుంది. వాడినొక్కడిని పట్టుకుంటే డొంకంతా కదులుతుంది."

    "వలవేసి వాళ్లను పట్టుకోవడం నాకో లెక్కకాదు. కానీ మీరు చెప్పిందంతా నిజమని చెప్పడానికి సాక్ష్యమేమిటి?" పోలీసు బుద్ది పోనిచ్చుకోనట్లు గా అన్నాడు రవికుమార్.

     "భైరవుని కొండక్రింద జయసూర్య శవాన్ని పూడ్చిపెట్టిన ప్రదేశాన్ని నేను చూపుతాను. త్రవ్విచూస్తే మీకే తెలుస్తుంది. ... నేను చెప్పేది నిజమో కాదో!"

    "జయసూర్యతోపాటు వుండి పూజలవీ నిర్వహించాల్సింది నువ్వే నువ్వే ఆ భైరవుని కొండల్లోని గుప్తనిధిని బలియిచ్చి పూడ్చిపెట్టావేమో లేకపోతే ఇంత కరెక్ట్ గా అతడిని పూడ్చిపెట్టిన  ప్రదేశాన్ని చూపెడతానని ఎలా అంటావు?"

    "శివ శివా" చెవులు మూసుకున్నాడు స్వామి.

     "బ్రాహ్మణ్ణి.... గుడిలో అర్చకత్వం చేసుకుని బ్రతికేవాడ్ని. ఇహం కంటే పరం మీద ప్రీతి వున్నవాడ్ని. నాకెందుకయ్యా గుప్తనిధులు? నిధులమీద ఆశే వుంటే లోహాన్ని స్వర్ణంగా మార్చగల విద్య నా దగ్గరుంది. బంగారం ముద్దలు ముద్దలుగా చేసుకోనా?"   

 Previous Page Next Page