Previous Page Next Page 
కాంక్రీట్ జంగిల్ పేజి 29


    వాళ్ళ దగ్గరకు నడిచాడతను.

    "ఎక్కడికి వెళుతున్నావ్ చక్రవర్తీ?"

    ఇద్దరిలో ఒకడు అడుగుతూనే వున్నాడు.

    పిడికిళ్ళు బిగించి గాల్లోకి ఎగిరిన చక్రవర్తి రెండు పాదాలు ఒకే సమయంలో చెరొకరిని పిడుగుపాటులా తాకాయి. దెబ్బవెంటనేబిళ్ళబీటుగా పడిపోయారిద్దరూ. పడినవాళ్ళు తిరిగి లేచి అరవకముందే వాళ్ళముందు మోకాళ్ళపై కూర్చున్నాడు చక్రవర్తి.

    చెరొక షాట్ వాళ్ళ మెడలపై అరచేత్తో చరచడంతో స్పృహతప్పి పడిపోయారిద్దరూ.

    వాళ్ళకు స్పృహ వచ్చిన వెంటనే తను చేసిన అఘాయిత్యం వెలుగులోకి వస్తుంది.

    అప్పుడు రాణా ఎలా రియాక్ట్ అవుతాడో!

    అదంతా ఇప్పుడు ఆలోచించే స్థితిలో లేడతను.

    పోర్టికోలోవున్న జీప్ లో బయలుదేరాడు.

    శ్రీప్రియ అతనికిచ్చిన అరగంటలో ఆఖరి నిమిషంలో సరిగ్గా ఆమె కారు ఆగివున్న చోటకు చేరుకున్నాడు చక్రవర్తి.

    "వాట్ హాపెండ్ ప్రియా" ఆందోళనగా జీప్ లోనుంచి దిగి ఆమెను సమీపిస్తూ అన్నాడు చక్రవర్తి.

    "విషయం తరువాత చెప్తాను. ముందు కారు ఎక్కండి" అని బ్యాక్ డోర్ తెరుస్తూ చెప్పింది శ్రీప్రియ.

    మౌనంగా కారు ఎక్కాడు చక్రవర్తి.

    ముందు సీట్లో కూర్చుని పోనీయమని కళ్ళతోనే సైగ చేసింది జగపతికి.

    కారు ముందుకు కదిలింది.

    లోపల లైటు వేయకపోవడం వలన చీకటిగా వుంది.

    కానీ....

    ఆ జాగ్రత్తకూడా శ్రీప్రియ కావాలనే ముందుగానే తీసుకున్నదన్న విషయం ఆ సమయంలో కారులోవున్న మిగిలిన ఇద్దరికీ తెలియదు.

    తెలిసి వుంటే పరిస్థితి మరోలా వుండేది.

    జగపతికి, చక్రవర్తికి ఇద్దరికీ పరిచయం వుంది. ఆ పరిచయం శ్రీప్రియకు తెలుసు.

    కారు వేగంగా ప్రయాణిస్తూనే వున్నది.

    సరిగ్గా, పది నిమిషాల ప్రయాణం తర్వాత....

    షడన్ బ్రేక్ తో కారుని ఆపాడు జగపతి.

    రోడ్డు ప్రక్కనే పల్లంలో  పోలీస్ జీప్ ఆగి వుంది.

    పదిమంది సాయుధులైన పోలీస్ లు మాత్రం ఉన్నట్టుండి చాటు నుంచి వచ్చి రోడ్ కు అడ్డంగా నిలుచున్నారు.

    వాళ్ళను చూడగానే జగపతి గుండె నీరు కారిపోయింది.

    ఎందుకంటే కారు డిక్కీలో వసుమతి శవం వున్నదాయె!

    చక్రవర్తికి తమ కారును ఎందుకు అటకాయిస్తున్నారో అర్ధం కాకుండా వుంది.

    శ్రీప్రియ మాత్రం ఎలాంటి బెదురు లేకుండా కూర్చుని వున్నది.

    పోలీసులు కారును చుట్టుముట్టారు.

    జగపతీ, శ్రీప్రియలు చెరొకవైపు నుంచి క్రిందకు దిగారు.

    పోలీస్ ఇన్ స్పెక్టర్ కంటికి కారు బాక్ సీట్ లో దర్జాగా కూర్చుని వున్న చక్రవర్తి కనిపించాడు.

    "ఏయ్ మిస్టర్ నీకు ప్రత్యేకంగా చెప్పాలా....ముందు క్రిందకు దిగు...." తన పోలీసుదర్పాన్ని చూపిస్తూ అదిలించాడు.

    తప్పదన్నట్టు చక్రవర్తి కూడా కిందకు దిగాడు.

    "ముగ్గురూ ఎక్కడకు వెళుతున్నారు" అడిగాడు  ఇన్ స్పెక్టర్.

    "విజయవాడ" అదురుతున్న కంఠంతో చెప్పాడు జగపతి.

    శ్రీప్రియ అప్పుడు నోరు విప్పింది.

    "లేదు సార్....వీళ్ళిద్దరూ కలిసి నన్ను కిడ్నాప్ చేసి తీసుకువెడుతున్నారు, వీళ్ళిద్దరూ కలిసి జగపతి భార్యను చంపుతుండగా నేను చూశాను. అందుకని నన్ను ఏదో చేయడానికి తీసుకువెళుతున్నారు. అసలు ఈ హత్య గురించి మీకు ఫోన్ చేసి చెప్పింది కూడా నేనే ఇన్స్ పెక్టర్. నేను చెప్పినట్టుగానే ఈ కారు డిక్కీలో శవం వుంది. కావాలంటే చూడండి."

    చక్రవర్తికి తను ఏం వింటున్నాడో అర్ధంకాకుండాపోయింది.

    తనను ఎంతగానో ప్రేమించిన శ్రీప్రియ....మరెంతగానో ఆరాధించే శ్రీప్రియ....తను హత్యచేశానని చేయని హత్యకు తనను హంతకుడిగా చెబుతుందేమిటి?"

    ప్రమాదంలో ఇరుక్కున్నానని వచ్చి రక్షించమని ఫోన్ చేసి....చివరకు తననే ప్రమాదంలో ఇరికిస్తున్నది శ్రీప్రియేనా అని ఆశ్చర్యంతో నోటమాటరాక చిత్తరువులా నిలిచివున్నాడు చక్రవర్తి.

    తనచేత తన భార్యను చంపించి....ఇప్పుడు ఆ హత్య చేసింది తనేనని పోలీసులకు పట్టిస్తున్న శ్రీప్రియ అసలు ఎందుకలా ప్రవర్తిస్తుందో ఊహించలేక గజగజ వణికిపోతున్నాడు జగపతి.

    ఆ ఇద్దరి మౌనాన్ని మరోలా అర్ధంచేసుకున్నాడు ఆ ఇన్స్ పెక్టర్.

    పోలీసులు కారు చెక్ చేసి, డిక్కీలో శవంవున్న సంగతి తమ ఇన్స్ పెక్టరుతో చెప్పారు.

    అంతే....

    జగపతి, చక్రవర్తి అరెస్టయ్యారు.

    కోర్టులో వాళ్ళిద్దరూ కలిసి హత్య చేస్తుండగా తను చూసినట్టు సాక్ష్యం చెప్పింది శ్రీప్రియ. ఆమె సాక్ష్యం పోలీసు ఇన్స్ పెక్టర్ శవాన్ని హేండోవర్ చేసుకున్నప్పటి సాక్ష్యం....జగపతి ఇంట్లో వసుమతి హత్య చేయబడిందని చెప్పిన గదిలో దొరికిన కీచెయిన్ సాక్ష్యంతో చక్రవర్తి సాయంతో జగపతి హత్యచేసినట్టు నిర్ధారణకు వచ్చింది.

    నిజానికి చక్రవర్తిని కీ చెయిన్ ను శంకర్ దాదాతో అతను పోట్లాటకు దిగిన సమయంలో చేజిక్కించుకున్నది శ్రీప్రియ.

    అప్పటినుంచి ఆ కీ చెయిన్ ను జాగ్రత్తగా దాచివుంచి....జగపతి భార్య శవాన్ని డిక్కీలోకి చేరవేసే సమయంలో ఆమె గదిలో ఆ కీ చెయిన్ ను పడేసింది శ్రీప్రియ.

    శ్రీప్రియ సాక్ష్యంతోపాటు ఆ కీచెయిన్ కూడా చక్రవర్తిని దోషిగా నిలబెట్టడానికి ఉపయోగించింది.
 

 Previous Page Next Page