Previous Page Next Page 
చీకటి కడుపున కాంతి పేజి 30

 

    తీవ్ర సంక్షిభంలో తల్లడిల్లి పోయింది వారిజ మనసు - తన పట్ల రామచంద్రకు గల ప్రేమకు పొంగిపోవాలా? చేల్లిలి జీవితం ఇలా భగ్నమావుతున్నందుకు కుంగిపోవాలా?
    "నేను ప్రేమమూర్తినా? మీ యిల్లాలు పశువా? మీ విచక్షణాజ్ఞాన మంతా ఎమయిందీ? అసలు మీ యిల్లాలితో నన్ను పోల్చడానికి మీకు నోరెలా వచ్చింది. నేనెవరిని పులిస్తరాకుని - చెత్త డబ్బాని - పెంట కుప్పని - పది మంది చీల్చిన గుజ్జు లేని పండుని ......"
    'అబ్బా! అపు వారిజా....."
    "ఆపను - వినండి - ఈ ప్ర్రేమ మూర్తి ప్రేమ గాధలు. ఒక చిత్రంలో హీరోయిన్ వేషం కోసం మొదట ప్రొడ్యుసర్ దగ్గిరా, ఆ తర్వాత డైరెక్టర్ దగ్గిరా గుడ్డ లిప్పుకుని తైతక్కలాడాను - అర్జంటుగా కొత్త మోడల్ కారు కొనుక్కోవలసి వస్తే, అందుకు రెండువేలు తక్కువయితే వాటి కోసం ఒక్క రాత్రంతా ఒక పశువుతో సమంగా తాగి తందానాలాడాను. మనసులో ఏమాత్రం ప్ర్రేమ లేకపోయినా అడిగిన వాళ్ళకల్లా శరీరాన్ని అప్పజేప్పేశాను - అనేక మొహమాటాల కోసం-  నన్ను రక్కినా, పికినా భరించాను - పశువుల్లా ప్రవర్తించినా సహించాను....."
    "వారిజా! వద్దు ........చెప్పకు......"
    "వినండి అధమతపు అంతు కనుక్కున్నాను ........పైచ్యానికి పరమావధి అనుభవించాను పాశవిక శక్తుల సారం చవి చూశాను. మనుష్యులలో అధముల్ని, నీచుల్ని మృగాల్ని చూసి చూసి అలసిపోయాన నాకు మీ మానవత్వం అపురూపంగా కనిపించింది. ప్రేమ కోసం పరితపించి పరితపించి, అన్నీ వైపులా నుంచీ లాలన, కాంక్ష, తృణీకారమూ, చీత్కారమూ, తప్ప ప్రేమనుభావానికి నోచుకోని నాకు మీ నిర్మల ప్రేమ దివ్య పరమయింది. మీ యిల్లాలు అయినింట పుట్టి అపురూపంగా పెరిగిన కన్య. లోకంలోని మాలిన్యం ఏ మాత్రమూ అంటని, తరుణ పుష్పం - జీవితమంటే ఏమిటో తెలియని మొగ్గ - నాలా ఎలా ఆలోచిస్తుంది? ఆలోచించాలని మీరు కోరటం మాత్రం ఏం న్యాయం?"
    "అపు వారిజ! లోకంలో మిగిలిన అందరు స్త్రీ లు మాత్రం అయినింట పుట్టి అపురూపంగా పెరిగిన వారు కదా? అందరూ లత ఉన్నంత మూర్ఖంగా ఉన్నారా?"
    "ఎవరి లోపాలు వాళ్ళవి మనిషన్నాక లోపం లేకుండా ఉంటారా? ఆవిడ మూర్ఖురాలు మరి మీ వివేకమేమయింది? నన్ను ప్రేమించారు నాతొ కొంత ప్రేమ అనుభవముంది మీకు. ఆ అనుభవంతో అనుక్షణమూ నాతొ పోల్చుకుని లత పట్ల అసంతృప్తి పెంచుకుంటున్నారు మీరు. మీ యీల్లాలు కూడా మీలాగే మరొకరితో మిమ్మల్ని పోల్చుకుంటూ అసంతృప్తి పెంచుకుంటే మీరు భరించగలరా?"
    అదిరిపడ్డాడు రామచంద్ర. అతని సర్వ శరీరము వణికింది.
    'అంతరాత్మ చావని మనుష్యులు కనుక చెప్తున్నాను. దోషం మీ యిల్లాలి కంటే మీలోనే ఎక్కువ వుంది. ఆవిడ కసలు ప్రేమంటేనే తెలియదు. మరి మీరు ఆవిడను ప్రేమించలేక పోవటమే కాక మరొకరిని ప్రేమిస్తున్నారు........"
    "వారిజా! నేను లతని ప్రేమించటానికి ప్రయత్నించాను కాని....."
    "నమ్మను - ప్రేమ వున్న చోట లోపాలుయిలా భూతద్దంలోంచి కనబడవు. వెళ్ళండి - ఆవిడను గాడంగా ప్ర్రేమించండి. ఈ పాపిష్టి దానితో - ఈ పరమ దౌర్భాగ్యురాలితో - ఈ జీవచ్చవంతో మీ శ్రీమతిని పోల్చకండి. ఆవిడను ఆవిడగా స్వీకరించి ప్రేమించండి ."
    "వారిజా!"
    "వెంటనే వెళ్ళండి. నాకు మీమీద ఉన్న ఆరాధనా భావమంతా మీ ఔన్నత్యం వల్లనే! ఆ స్థాయిలోంచి దిగి వచ్చాక మీరు నాకేమి కారు."
    "ఇప్పుడు నాలో అల్పత్వం ఏం చూశావు వారిజా?"
    "మీ అంతరాత్మ నడగండి - వేళకాని వేళ యిక్కడికి రావటం - ఇంత రాత్రయినా  నాతొ కబుర్లు చెబుతూ ఇక్కడుండటం - ఇదంతా మనసులో ఏమి లేకుండానేనా? మీ శ్రీమతి సరిగ్గా ఇలాగే ప్రవర్తించి నేను నిష్కల్మషురాలి నంటే మీరు నమ్ముతారా? వెళ్ళండి . మిమ్మల్ని ఆరాధిస్తూ బ్రతుకుతున్నాను. నా ఆరాధనా మూర్తిగా మసి పూయకండి. "పాలిపోయిన ముఖంతో , వణుకుతున్న శరీరంతో గబగబ అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు రామచంద్ర.
    పక్క మీద వాలి గుండెలు పగిలేలా ఏడ్చింది వారిజా.
    "లత కాపురాని కొచ్చాక కళ్యాణి రామచంద్ర దగ్గరికి రాలేదు. కొత్త దంపతుల మధ్య తనేందుకని ఊరుకుంది. రెండు నెలలు గడిచాక ఒకసారి కొడుకు , కోడలినీ చూడాలని వచ్చింది. లత చిన్నపిల్ల - సంసారం నిర్వహించుకోవటం చేతనవుతుందో, చేత కావటం లేదో? ఏమైనా తెలియకపోతే నేర్పించాలి" అనుకుంది.
    తల్లి దగ్గర్నుండి వస్తున్నట్లు ఉత్తరం రాగానే లతతో సాధ్యమైనంత మృదువుగా అన్నాడు రామచంద్ర.
    "రాక రాక మా అమ్మ వస్తుంది లతా! యిక్కడ వుండటానికి రావటం లేదు - మన సంసారం ఎలా వుందో చూడటానికి వస్తోంది ......అమ్మ ఉన్న నాలుగు రోజులయినా రుసరుసలూ, బుస బుసలూ లేకుండానే నవుతూ వుండు......' లత ముఖం ముడుచుకుంది.
    'అంటే అక్కడికి నేను రోజూ కస్సు బస్సు లాడుతుంటే మీరు పరమ శాంత మూర్తులయి సహిస్తున్నారు కదూ?"
    "అది కాదు .....ఊరికే హెచ్చరిస్తున్నాను. అమ్మ ఎదురుగా గొడవలు జరిగితే బాగుండదు . చూడు! అమ్మ ఒకవేళ ఏదయినా మందలించినా, నువు కాస్త నెమ్మదిగా సర్దుకుపో!"
    "అలాగే! నోరు మూసుకుంటాను - చచ్చినట్టు! ఎవరి కోసం" మూలిగింది లత. మనసు కొంత చివుక్కుమన్నా లత అంగీకరించిందే చాలనుకున్నాడు రామచంద్ర . "చూడు అమ్మ ఉన్న నాలుగు రోజులు సినిమా లంటూ బతల్దేరకు."
    "ఏం? సినిమాలు చూడకూడదా? అది మహా పాపమా? ఆవిడ అత్తగారయినా మాత్రాన ఆవిడ నుంచో మన్నట్లు నించుని కూర్చో మన్నట్లు కూచోవాలా? యింకా ఎంత కాలం బాబూ ఈ మూడ సాంప్రదాయాలు?ఈ కొడం కాలం నుంచి స్త్రీ జాతికి విముక్తి లేదా?" భరింపరాని కోపం తనను క్రమ్ము కుంటున్నా నిగ్రహించుకుని, అనునయంగా అన్నాడు రామచంద్ర.
    "ఎల్లకాలం మన దగ్గిర ఉండదుగా! రెండు రోజులో , మహా అయితే నాలుగు రోజులో! ఆ కొద్ది రోజులు కాస్త నిగ్రహించుకోలేవా?"

 Previous Page Next Page