"మీకేం సుఖంగా హోటల్లో తింటారు. నాకు ఆకలి మండిపోతుంది. నేను తిని వస్తాను.' లత వంటింట్లోకి వెళ్ళి హాయిగా అన్నం వడ్డించుకు తింటోంటే మనసు భగభగ మండిపోయింది రామచంద్రకు. అన్నం తినేసి వచ్చి తన మంచం మీద పడుకుంది లత.
"లతా!"
ఉద్రేకాన్ని అణచుకోటానికి శక్తినంతా వినియోగించి ప్రయత్నిస్తూ అన్నాడు 'అబ్బా! యిప్పుడు నాకు నిద్రొస్తుంది, పడుకుందురూ?" విసుగ్గా అంది లత.
రామచంద్రకు నిగ్రహించుకోవటానికి శక్యం కాని కోపమొచ్చింది.
"నాకు నాలుగు మాటలకు సమాధానం చెప్పి పడుకో! నిన్ను సినిమా కెవరు వెళ్ళమన్నారు?"
భర్త కటుస్వరానికి ఒక క్షణం గుండె గుభిల్లు'మన్నా నిర్లక్ష్యంగానే సమాధాన మిచ్చింది .
"ఒకరు వెళ్ళమనేదేమిటీ? నాకు చూడాలనిపించింది . నేనే వెళ్ళాను. ఆ మాత్రం స్వతంత్యం లేదా? మీరెక్కడికి వెళ్ళినా నాకు చెప్పే వెళ్తున్నారా? మీకో న్యాయం నాకో న్యాయమూనా? ఛీ! ఛీ! మొగజాటి?"
నోటిమాట రాలేదు రామచంద్రకు కాసేపు.
"ఈ చర్చలన్నీ యిప్పుడు కాదులే! నీకు డబ్బెక్కడిది?"
"ఎక్కడి దయితేనేం? మిమ్మల్ని అడగలేదుగా!"
"సమాధానం చెప్పు" గర్జించాడు రామచంద్ర.
అప్రయత్నంగా వణికిపోయింది లత. కళ్ళల్లోంచి నిప్పులు కురిపిస్తున్న భర్తను చూసేసరికి నోట మాట రాలేదు.
"అప్పు చేశావా?" పిడికిళ్ళు బిగిస్తూ అడిగాడు.
"లేదు."
"నిజం చెప్పు లేకపోతే ఎక్కడిది? అప్పే చేశావు ఛీ! అప్పుల్లో దిగితే ఇంక బతుకులకు మోక్షం లేదు. నువింక యిక్కడుండటానికి వీల్లేదు. మీ యింటికి వెళ్ళిపో, వెంటనే ! కావలసినన్నీ అప్పులు చేసుకో. మా నాన్నగారు ప్లీడర్ అయినా ఏనాడూ నయాపైసా అప్పు చెయ్యలేదు. నేనింత వరకూ ఎవరి దగ్గరా అప్పు చెయ్యలేదు. ఈనాటికి మా వంశంలో నువు తయారయ్యావా అప్పులు ప్రారంభించటానికి? వెంటనే వెళ్ళు మీ వాళ్ళ దగ్గరికి" తర్జనితో గుమ్మం వైపు చూపిస్తూ ఉరిమాడు రామచంద్ర.
ఇప్పటికి లతకు నిజంగానే భయం పుట్టి గడగడ వణికింది. ఏడుపు గొంతుకతో అంది. "కాదు, కాదు . అప్పు చెయ్యలేదు. మీరు డబ్బు లేదన్నారని నేను ఏడుస్తూ కూర్చుంటే నాగమణి వచ్చి "పోనిలే! మీ అయన ఇయ్యకపోతే! నేను ఇస్తానులే" అని తీసికెళ్ళింది. ఇద్దరి టిక్కెట్లూ తనే కొంది" మీ కేందుకూ అంత కోపం?" మీరా డబ్బు అప్పు తీర్చనక్కర్లేదు.'
నోటికొచ్చిన అబద్దం అడేసింది . తన ఓంట్లోంచి జీవశక్తి అంతా ఎవరో ఒక్కసారి లాగేసినట్లు కూలబడి పోయాడు రామచంద్ర.
"చివరకు ముష్టి ఎత్తి సినిమాకు వెళ్లి వస్తే కాని నీకు తృప్తి కలగలేదా?" అన్నాడు భరింపరాని బాధతో, అసహ్యంతో.
ముష్టి ఎత్తలేదు స్నేహ్నితురాలు గనుక తీసుకెళ్ళింది. "అమ్మ పెట్టా పెట్టదు . అడుక్కు తినానియ్యదు అన్న సామెతగా ఉంది మీ పని. మీరు డబ్బియ్యక పోగా ......"
ఛీ! ఛీ!
లత మాట్లాడుతుంటే మధ్యలోనే చీత్కారం చేసి ఆ చీకట్లో బయటికి వెళ్ళిపోయాడు రామచంద్ర.
ఒక్క క్షణం విసుగ్గా అతడు వెళ్ళిన వేపు చూసి, తలుపు లోపల గడియ బిగించి పడుకుంది లత.
---------
లత వచ్చి తనను డబ్బడిగి తీసికెళ్ళిన దగ్గర్నుంచి మనసంతా చికాకయిపోయింది వారిజకు, యాంత్రికంగా వంట ముగించింది. కానీ అన్నం తినాలని పించలేదు. రెండు అరటిపళ్ళు తిని మంచినీళ్ళు తాగి కళ్ళు మూసుకుని పడుకుంది.
కనీసం చెల్లెలయినా సుఖంగా ఉంది కదా అనుకొంటుంటే ఇదేమిటి? తన ముందున్న అదృష్టాన్ని గుర్తించలేని చెల్లెలి ముర్ఖర్వానికి బాధపడాలా? లేక తను సర్వస్వంగా ప్రేమిస్తోన్న రామచంద్ర జీవితంలో సుఖం పూర్తిగా కరువయిందని బాధపడాలా?
అలోచనలతో తల పగిలిపోతుండగా ఎప్పటికో నిద్ర పట్టింది వారిజకి. తలుపు తడుతున్న చప్పుడికి మెలుకువ వచ్చి భయంగా "ఎవరూ?" అంది.
"నేను రామచంద్రని" తలుపవతల నుంచి వచ్చింది సమాధానం. రామచంద్ర కంఠ స్వరం గుర్తించింది వారిజ, గబుక్కున మంచం దిగి తలుపు తెరిచింది. వేళ గాని వేళా! తన యింటికి ఎందుకు ! వణికిపోయింది వారిజ. రేగిపోయిన జుట్టూ, ఎంతో అలసటగా ఉన్న ముఖం- ఎర్రబడిన ముఖం .....యింకా అడురుతోన్న పెదవులూ , ఇంట్లో ఏదో గొడవ జరిగి ఉంటుందని భయం వేసింది వారిజకి.
"నాకు బాగా ఆకలేస్తోంది అన్నం పెట్టు."
పసిపిల్లాడు తల్లి ని అడిగినట్లు అడిగాడు రామచంద్ర.
తల్లడిల్లిపోయింది వారిజ.
"రండి" అంటూ వంటింట్లో పీటవాల్చి కంచం పెట్టింది . అన్నం చూసింది చల్లారిపోయింది.
"అయ్యో ! చప్పగా చల్లారిపోయింది . ఒక్క క్షణం ఆగండి. గబగబ వండేస్తాను."
"నాకు ఆకలి దహించుకు పోతుంది. ఇక ఆగలేను. మధ్యాహ్నం కూడా సరిగా తినలేదు. చల్లగానో, వేడిగానో ఎలాగో పెట్టేయ్ త్వరగా."
"అయ్యో! నా ఒక్కదాని కోసమే కదా అని దోసకాయ పచ్చడి నూరుకున్నాను కూరేమి చేయలేదు. గబగబ ఇన్ని బంగాళదుంపలు వేయించనా?"
'అబ్బ! ఆకలి మండుతోందంటే వడ్డించకుండా అదీ ఇదీ మాట్లాడతావెం ? ఏం లేకపోతే చారు పొయ్యి. అదీ లేదా?" కసురుకున్నాడు కోపంగా.
గబగబ చల్లారిపోయిన అన్నమే వడ్డించి , పచ్చడి వేసి నేతి గిన్నె దగ్గర పెట్టింది. స్టౌ వెలిగించి, మూకుడు పెట్టి అందులో నూనె పోసింది.
"ఏంటీ?"
ఏం లేదు- రెండు అప్పడాలు వేయిస్తున్నాను. నంజుకోడానికయినా పనికొస్తాయి ..... త్వరత్వరగా నాలుగప్పడాలు వేయించి వేరే పళ్ళెం లో పెట్టి రామచంద్ర కంచం పక్కన పెట్టింది వారిజ .
ఆవురావుమంటూ పచ్చడి మెతుకులు తింటున్న రామచంద్ర ను చూస్తుంటే కడుపులో చెయ్యి పెట్టి తిప్పినట్లయింది వారిజకు. ఇంత ఆకలితో భర్తను ఉంచగలిగిందా లత? అయ్యో! తన కేలా చెప్తే అర్ధమవుతుంది?
"పాపిష్టిదాన్ని - పచ్చడి తో మీకు అన్నం పెట్టాను పెరుగు కూడా లేదు - మజ్జిగే " నొచ్చుకుంటూ అంది.
"పరమ పుణ్యాత్మురాలివి. రెండు రోజుల తరువాత సుఖంగా తిన్నాను. నిజం, పప్పూ, కూరలూ, పచ్చళ్ళు అన్నీ ఉన్నా ఇంత తృప్తిగా ఎన్నడూ తినలేదు."
వెనుకటి చిరాకంతా నశించి చిరునవు నవగలుగుతున్న అతని మనసుకు తిరిగి చికాకు కలిగించటం ఇష్టం లేకపోయినా చెల్లెలి కోసం, తన సామీ కోసం. ఇద్దరి సుఖం కోసం సాహసించి అంది.
"ఏం ఇల్లాలు వండి వడ్డిస్తోంటే తృప్తి ఎందుకు లేకపోవాలి?" చూస్తుండగానే రామచంద్ర ముఖం చిరునవు చెరిగిపోయి , కఠినంగా మారింది. ఆ కఠిన్యం వారిజకు బాగా అనుభవమే! అతి సుకుమారమయిన అతని మనసు బలమైన ఎదురు దెబ్బ తగిలీ తగలగానే వజ్రం కంటే కఠోరమవుతుంది.
"ఇల్లాలు - ఇల్లు! నీకు అర్ధం కాదు వారిజ! నాకు ఎంత క్షోభ కలగకపొతే ..." బాధగా తల చేతులలో అదుముకుని వాక్యం ఆపేశాడు.
వారిజకు తెలుసా సంగతి - తనను తాను నిగ్రహించుకోవటానికి ప్రయత్నించి ఏ విధంగానూ నెగ్గలేని అవాంచనీయ పరిస్తితు లేర్పడటం వలెనే తన దగ్గరికి రామచంద్ర వచ్చాడని. అనునయంగా అడిగింది. ఉద్రేకంగా అన్నాడు రామచంద్ర.
"పిచ్చి - సినిమా పిచ్చి - వచ్చిన సినిమా కెల్లా వేలం వెర్రిలా బయలు దేరటమే! ఇంట్లో పరిస్థితి వెనుకా ముందూ గమనింపూ - ఏం లేదు. ఇవాళ సినిమాకి వెళ్తానంది వద్దన్నాను - డబ్బు లేదన్నాను. ఆమాత్రం అర్ధం చేసుకోవద్దూ చివరకు పక్కింటి నాగమణి ముష్టడిగి చూసి వచ్చింది. ఇంత తేలిక మనిషిని ఎలా ప్రేమించటం? నాకు కష్టం తోచి, అన్నం వద్దని పడుకుంటే తను తినేసి పడుకుంది. ఇలాంటి ముర్ఖురాలిని ఎలా భార్యగా అంగీకరించటం? నా వల్ల కాదు - ఈ క్షోభ నేను పడలేను."
నిర్ఘాంత పోయింది వారిజ. లత అడగ్గానే డబ్బియ్యటం ఇంతకు తెచ్చింది. ఒక రకంగా ఈ అనర్ధానికి కంతకూ తనే భాద్యురాలు.
"నువు చూడు? నాకోసం ఇంత రాత్రి వేళ ఇప్పటికిప్పుడు అన్నం వండటానికి తయారయ్యావు. వేడిగా ఉండాలని, పచ్చడితో పెట్టవలసి వచ్చినందుకు విలవిల లాడిపోయావు నేను కడుపు నిండా తిన్నానంటే నీ కళ్ళు తృప్తితో వెలిగిపోయాయి. ఈ ప్రేమలో వెయ్యోవంతు లేదే ఆ ముర్ఖురాలికి. "వణికి పోయింది వారిజ.
"ఛీ! ఛీ! మీ ఇల్లాలిని నాతొ పోలుస్తున్నారా? నేనెక్కడ? అవిడేక్కడ?"
"అవును -ఇద్దరికీ పోలికే లేదు. అసలు నేను లత నెందుకు చేసుకున్నానో తెలుసా/ లతలో నీ పోలికలు చూసి! నువు చూస్తే ఆశ్చర్యపోతావు. మీరిద్దరూ అక్కా చెల్లెళ్ళలా వుంటారు. లతలో నీ ఛాయలు కనిపించగానే పేరాసతో ఒప్పేసుకున్నాను. రూపంలో నీ పోలిక కాని, స్వభావంలో మాత్రం నీకు వ్యతిరేకత ఆవిడ. నువు ప్రేమ మూర్తివి. అది మానవ రూపంలో ఉన్న పశువు!"