"ఏమో బాబూ! నేను మాములు మనిషినే! నన్ను రాసి రంపాన పెడితే మాత్రం సహించలేను....."
"రాసి రంపాన ఎందుకు పెడుతుంది లతా? ఆవిడ నీకు శత్రువా? ప్రతిదీ మనసులో వుంటుంది. లోపాలు ఎంచాలను కుంటే లోపాలుగానే కనిపిస్తాయి - సర్దుకు పోదామనుకుంటే ఎలా అయినా సర్దుకు పోవచ్చు...."
"సర్దుకుపోక నేనేం జగడమడటానికి కూర్చున్నానా?" కళ్యాణి తెలివి గలది ....రామచంద్ర వడలిపోయిన ముఖం చూస్తూనే ఆమెకు లతా రామచంద్ర లు తాను ఆశించినంత అన్యోన్యంగా లేరని అర్ధమయిపోయింది. కట్న కానుకలకాశించ కుండా అందచందాలున్న పిల్లని చేసుకున్నా కొడుకు జీవితంలో సుఖం లేదా? కారణమేమిటి'?
"కులాసాగా వున్నావా అమ్మా?" లతను ఆనందంగా పలకరించింది కళ్యాణి.
"నాకేం? బాగానే ఉన్నాను. ...." తన సహజ ధోరణిలోనే అంది లత.
"ఈ అమ్మాయికి మాట తీరిక తెలీదు.....ఆ కారణంగానే రామచంద్ర మనసు కష్ట పెట్టుకుంటున్నాడా? చూడాలి " తనలో తను అనుకుంది. అన్నం తింటూ లత వంటను చాలా మెచ్చుకుంది కళ్యాణి. మనసులోనే తల్లి సభ్యతకు ఆనందించాడు రామచంద్ర. ఏ విధంగానూ ఏ ప్రత్యేకతా లేని తన వంటను మెచ్చుకుంటూన్న అత్తగారిని తెల్లబోయి చూసి "వెర్రి బాగులది" అనుకుంది లత.
అందరూ తినగా చాలా అన్నం మిగిలిపోయింది. ఆ అన్నమంతా పనిమనిషి కిచ్చేసింది లత. తెల్లబోయింది కళ్యాణి పనిమనిషి ఎదురుగా లత నేమి అనలేక , అది వెళ్ళగానే లతతో ఆదరంగా "అన్నమంతా పనిమనిషి కిచ్చేశావేమ్మా " అంది.
"ఏం చెయ్యాలి మరి!" ఆశ్చర్యంగా అడిగింది లత.
"ప్రొద్దున వండిన అన్నం సాయంకాలానికి ఏం పాడవుతుంది? మనమే పెట్టుకునే వాళ్ళంగా? అంత తినలేనప్పుడు కాస్త చూసి బియ్యం పోసుకోవాలి. కానీ, ఈ కరువు రోజుల్లో అంతంత అన్నాలు పనివాళ్ళకి చ్చుకుంటే ఎలా?"
"మేం ఇద్దరమే అయితే నాకు లెక్క సరిగ్గా తెలిసేది. మీరు కూడా రావటంతో లెక్క తెలీక పోసేశాను. "చివుక్కు మంది కళ్యాణి కి - అయినా మాములుగానే నవింది.
"నేను ఎంత తింటాననుకున్నవమ్మా? పోనీలే! అయిందేదో అయిపొయింది -- ఇంక మీదుట మిగిలితే పని వాళ్ళ కియ్యకు. సాయంత్రం సాంబార్ లోకి. మజ్జిగ లోకి పెట్టుకోవచ్చు.
"ఏమో బాబు! తీరా ఒకమెతుకు తక్కువయితే మా అమ్మకి అన్నం తక్కువయిందని మీ అబ్బాయి నన్ను తిట్టిపోయ్యరు ? ప్రొద్దుటన్నం సాయంత్రం వడ్డిస్తే మా అమ్మకి పొడన్నం పెడతావా అని ఇంతెత్తున లెవరూ? ఎలా వేగాలో ఏమిటో?" నిట్టూర్చింది లత. నిర్ఘంతపోయింది కళ్యాణి.
రామచంద్ర సంగతి కళ్యాణి కి బాగా తెలుసు. అతడు తిట్టిపోస్తాడో పోయ్యడో ఎంతేత్తున లేస్తాడో అర్ధం చేసుకోగలదు . ఏమిటీ అమ్మాయి...! ఇంక మాటలు పెంచకుండా ఇవతల కొచ్చేసి, కొడుకుతో పొలం గురించి కబుర్లలో పడిపోయింది.
మధ్యాహ్నం కాఫీ వేళకి , కాఫీ తయారు చేసి అత్తగారి కందించింది లత. చాలా స్ట్రాంగ్ ఉన్న కాఫీ రుచి చూసి లోలోపల చాలా ఆశ్చర్యపోయింది కళ్యాణి. సామాన్య సంసారాల్లో ఇంతింత స్ట్రాంగ్ కాఫీలు తాగితే ఎలా? కాస్త వెనకా ముందు చుసుకోవద్దూ?
కొంచెం పొందికగా ఉండమని చెప్పాలను కుంది. కాని లత కష్టపడుతుందేమో నని స్పష్టంగా చెప్పలేక నెమ్మదిగా "ఇంత స్ట్రాంగ్ గా నే తగలేనమ్మా! కొంచెం లైట్ గా ఇయ్యి....." అంది. లత నిరానగా నవి " మా ఇంట్లో అందరికీ స్ట్రాంగ్ గానే అలవాటు . లైట్ గా తాగాలెం" అంది.
లత కంఠస్వరంలో వెటకారం కళ్యాణి హృదయాన్ని తాకింది. ఎంత నిగ్రహించుకుందామన్న రోషం అణగలేదు.
"ఇట్లాంటి అలవాట్లుండ బట్టే గదా లతా దర్జాగా బ్రతకవలసిన సంసారం అలా చితికిపోయింది...." తన వాళ్ళని అన్నందుకు లతకు ఉక్రోషం వచ్చింది.
"మా దురదృష్టం వల్లనూ, మా నాన్నగారి కా పాడు బుద్దులు పుట్టి చితికిపోయాం కాని, లేకీగా పైసా పైసా కూడా బెట్టి పైకి వచ్చిన సంసారం కాదు మాది" చెళ్ళున ముఖం మీద కొట్టినట్లు అలా సమాధానం చెపుతోన్న కోడలిని నిర్ఘాంత పోయి చూడటం తప్ప మరేమీ చేయలేకపోయింది కళ్యాణి. ఆవిడ ముఖం పాలిపోయింది. కోడలు తనను మాటలందన్న బాధ కంటే ఇలాంటి వ్యక్తీతో రామచంద్ర సంసారంలో ఏం సుఖం పొందగలడనే వ్యధే ఎక్కువయింది కళ్యాణికి.
త్రాగుతోన్న కాఫీ సగంలో వదిలి, గ్లాసు క్రింద పెట్టి లేచాడు రామచంద్ర. "పదమ్మా నిన్ను వెంటనే రైలెక్కించి వస్తాను - ఇక్కడుండకు."
"తొందర పడకు రామూ!" గాభరాగా అంది కళ్యాణి.
"నీకు తెలీదమ్మా! ఈ ఇల్లు నీలాంటి మనుష్యులుండటానికి అనువయినది కాదు. చేసుకున్నాను కనుక నాకు తప్పదు. వెంటనే బయలుదేరు - నువు ఉంటానన్న నేను ఉండనివ్వను." కళ్యాణి కళ్ళలో గిర్రున నీళ్ళు తిరిగాయి.
రామచంద్ర "రిక్షా తెస్తాను ..." అంటూ బయటి కెళ్ళిపోయాడు. కళ్ళు తుడుచుకుని మౌనంగా పెట్టె సర్దుకో సాగింది కళ్యాణి.
"నేనిప్పుడే మంత కాని మాటలన్నానని ఇలా అర్ధంతరంగా ప్రయాణమవటానికి?" నిష్టూరంగా అంది లత.
"నాకు తెలీదమ్మా? వాడు రమ్మంటే వచ్చాను - వాడు వెళ్ళమంటే వెళ్తున్నాను." పొడిగా అంది కళ్యాణి. అంతలో రామచంద్ర రిక్షా తెచ్చాడు.
"నా మీద అత్తగారిని వెళ్ళ గొట్టిందనే నింద వెయ్యటానికి కాకపోతే , ఏమిటి అర్ధాంతరపు ప్రయాణం? నేను పోమ్మన్నానా?" కూచుని రాగాలు మొదలు పెట్టింది లత.
మూడురాలిలా నించున్న కల్యాణి చెయ్యి పట్టుకుని "పదమ్మా! ఆలోచిస్తే పిచ్చెక్కుతుంది రా! త్వరగా వెళదాం" అంటూ ఒక రకంగా లాక్కుని తీసికెళ్ళి రిక్షాలో కూర్చోబెట్టాడు రామచంద్ర.
దారి పొడవునా రిక్షాలో కళ్ళు తుడుచుకుంటునే వుంది కళ్యాణి. తను పట్టుబట్టక పొతే రామచంద్ర లతను చేసుకునేవాడు కాదు. లత తండ్రి ఎంతటి బలహీనుడో , తల్లి ఎంతటి సంస్కారహీను రాలో తనకు తెలుసు. అయినా వాళ్ళ సంతానాన్ని తన కోడలిగా గ్రహించటానికి సిద్దపడింది. అనుభవాలు, పాఠాలు నేర్పవా అనుకొంది. ఒకప్పుడు బ్రతికి చెడిన ఆ కుటుంబాన్ని చూసి జాలితో కదిలిపోయింది. కొంత ,మంది మూర్ఖురాళ్ళు జీవితంలో ఎన్ని అనుభవాలు పొందినా ఏ పాఠము నేర్చుకో లేరనేది ఇప్పుడే అర్ధమయింది. ఒక రకంగా ఇంతటి అనర్ధానికి కారణం కుమిలిపోయింది కళ్యాణి మనసు.