Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం-1 పేజి 30


    "నేను స్వాతంత్ర్య బాలను!
    నిరంతర నవనవోన్మేషశీలను!
    నేను స్వరాజ్యకుమారిని.
    నిత్యకల్యాణ సుకుమారిని!
    
    దాదాభాయి నౌరోజీ దేదీప్యమాన దేశభక్తి
    గోపాలకృష్ణ గోఖలే గురుతర స్వేచ్చానురక్తి
    బాలగంగాధర తిలకుల కూలంకష భావయుక్తి
    లాలా లజపతిరాయల జ్వాలామయ మహాశక్తి
    
    మదనమోహన మాళవీయ మధురమధుర సౌజన్యం
    చిత్తరంజన మహోదయుల ఉత్తేజిత చైతన్యం
    బార్డోలి సమరసేనాని అపప్రధలేని ఉపప్రధాని
    చెక్కుచెదరని ఉక్కుమనిషి పటేలు ప్రజ్ఞాప్రాభవం
    
    శాంతికి క్రాంతినేర్పిన తేజస్వంతుడు
    కాంతికి సంక్రాంతి తీర్చిన భాస్వంతుడు
    జాతీయ జగజ్జ్యోతి స్వాతంత్ర్య మహావిభూతి
    నేతాజీ సుభాస్ చంద్రుని నిరుపమ ప్రతిభా వైభవం
    
    నాకు ప్రాణంపోశాయి నన్ను పెంచి పెద్దచేశాయి
    నాకు బలం చేకూర్చాయి నన్ను ముందుకు నడిపించాయి
    
    ఆయన పలుకు విశ్వానికి పంచమవేదం
    ఆయన పిలుపు దేశానికి శంఖ నినాదం
    ఆయన దీక్ష సమస్త జగత్తుకు శ్రీరామరక్ష
    ఆయన జీవనం మానవజాతికి ఉజ్జీవనం
    
    ఆయన ఒక విచిత్ర విశ్వవిద్యాలయం
    ఆయన ఒక పవిత్ర ధర్మ దేవాలయం
    ఆయన ఒక ఉత్తుంగ హిమాలయం
    ఆయన సత్యాహింసల సమన్వయం
    
    ఆయన అజాతశత్రుడు ఆయన మహాతపస్వి
    ఆయన యుగపురుషుడు ఆయన మహామనస్వి
    ఆ మహాత్ముని ఆ మహామహుని అమరహస్తాలు
    ప్రేమతో అమృతం పోసి పెంచి పెద్దచేశాయి నన్ను.
    
    "స్వాతంత్ర్యలక్ష్మి"ని నేను. "స్వరాజ్యలక్ష్మి"ని నేను.
    జాతికి చైతన్యం చేకూర్చే "సౌభాగ్యలక్ష్మి"ని నేను.
    
    ఆనాటి ఆగస్టు విప్లవం
    ఏనాటికీ మరపురాని మహోపప్లవం
    
    అది హరుడు హాలాహలం మ్రింగిన మహాశివరాత్రి
    ఆనాడు కంపించింది సమస్త భూతధాత్రి
    
    చకచకా కదిలింది ముందుకు క్రాంతిరథం
    స్వగతం పలికింది స్వాతంత్ర్యమహాపథం
    
    ఊగింది మహాప్రజ
    రేగింది మహాప్రజ
    సాగింది మహాప్రజ
    
    కాలి కూలాయి కార్యాలయాలలో కవిలెకట్టలు
    నేల రాలాయి రాబందుల్లా పోలీసుల బుట్టలు
    
    సత్యాగ్రహం చేశాయి రైళ్ళు
    తలుపులు తెరచుకున్నాయి జైళ్ళు
    
    తల్లడిల్లింది తెల్లదొరల ప్రభుత్వం
    దద్దరిల్లింది స్వార్ధపరుల నిరంకుశత్వం
    స్వరాజ్యదేవాలయం ఘంటలు "గణగణ" ధ్వనించాయి
    స్వతంత్ర విజయదుందుభులు "ధణధణ" విన్పించాయి
    
    అది యజ్ఞం - అది అఖండ మహాయజ్ఞం
    అది నిరంతరంగా సాగిన స్వరాజ్య మహాయజ్ఞం
    యుగయుగాలు వెలిగించిన అల్లూరి సీతారామరాజులు
    "దేశభక్తులు" "దేశోద్దారకులు" "ఆంధ్రరత్నాలు" "ఆంధ్ర కేసరులు"
    
    అర్ధరథులు అతిరథులు మహారథులు
    అసమానశౌర్యధైర్యనిధులు
    అజ్ఞాత వీరకుమారు లెందలెందరో ముందుకు దూకారు
    పవిత్ర యజ్ఞకుండాల్లో బ్రతుకులు బలిచేశారు.
    
    కండలు వ్రేల్చారు! రక్తం కార్చారు!
    ఆహవ మహాగ్ని కీలల్లో స్వాహా అయిపోయినారు!
    భగభగ మండే జ్వాలల్లో భస్మావశేషమైనారు!
    
    తల్లుల కన్నీటిధారల్లో తడిసితడిసి
    చల్లబడింది స్వరాజ్య హోమకుండం.
    పంకిలమైన యజ్ఞకుండం పంకంలోనుంచి
    అంకురించిం దొక అత్యద్భుతమైన పంకజం.
    
    పంకజంలో ప్రభవించిన "భారత భాగ్యలక్ష్మి"ని నేను.
    "స్వాతంత్ర్యలక్ష్మి"ని నేను - "స్వరాజ్యలక్ష్మి"ని నేను.
    
    నేను స్వాతంత్ర్యస్వర్ణలతను - నా ఆకులు "పచ్చన"
    నా చివుళ్ళు "ఎర్రన" - నా పువ్వులు "తెల్లన"
    మువ్వన్నెల "పతాకానికి" ముద్దుల "ప్రతీకాన్ని" నేను
    అందమైన అశోకచక్రానికి అమృతాభిషేకాన్ని నేను.
    
    (ఇది 1961 రిపబ్లిక్ దిన మహోత్సవం నాడు ఢిల్లీ నగరంలో ఆకాశవాణి కేంద్రంవారు ఏర్పాటుచేసిన "జాతీయ కవి మహా సభ"లో తెలుగుకవిగా ఆహ్వానింపబడి చదివిన కవితాఖండిక.)
    
                                                     భువనవిజయం
    
    మహారథం విజయరథం భువనవిజయ మహారథం
    మాధవ విద్యారణ్యుల మధురమధుర మనోరథం
    తిమ్మరసు మహామాత్యుల కమ్మనికలల శుభాకృతి
    మూరురాయగండడు రస భారతి కిడిన బహూకృతి.
    
    కృష్ణరాయ మౌళిమకుట కీలిత మణిసంక్రాంతులు
    ఆంధ్రభోజ విజయపతా కాంచల చంచత్కాంతులు
    దిగంతాలు వెలిగించెను దృగంతాలు మెరపించెను
    జయశ్రీలు కురిపించెను జగమునెల్ల మురిపించెను.
    
    తెలుగుతల్లి గుమ్మంలో వెలిగించిరి గుమ్మటాలు
    నలుదిక్కుల గుమాయించె తెలుగుతోట పరిమళాలు
    మహారథం విజయరథం భువనవిజయ మహారథం
    మాధవ విద్యారణ్యుల మధురమధుర మనోరథం
    
    తియ్యతియ్యగా తెలుగువీణ దేశమంతా మ్రోగింది
    ఒయ్యారంగా తెలుగుకవిత ఉయ్యాలలూగింది
    కర్ణాటాంధ్ర రాజ్యశ్రీ కరకంకణ నిక్వణాలు
    వినిపించుతున్నవి మునుముందుగా వీనులవిందుగా -
    
    హంపీ విరూపాక్షదేవుని ఆలయగోపురం
    జంపుగా సగర్వంగా నిలుచున్నది రొమ్మువిరిచి
    పంపా సరస్సులోని బంగారు పద్మాలు
    పకపక నవ్వుతున్నవి మైమరచి.
    
    తుంగాభద్రా సముత్తుంగ తరంగాలు
    పొంగిపొరలుతూ నాట్యమాడుతున్నవి
    స్వామి గుడి ముందరి సంగీతమంటపం స్తంభాలు
    సంతోషంతో సరిగమలు పాడుతున్నవి.
    
    వీచిందీనాడు మందమందంగా మలయమరుత్తు
    తోచిందీనాడు నవరసమయమై కావ్యజగత్తు
    పూచిందీనాడు అందంగా ఆనందంగా విజయశరత్తు
    చాచిందీనాడు సుందరసువర్ణ హస్తం సాహితీపరిషత్తు.
    
    అశోకవనంలో ఆనాడు అమ్మణ్ణిని చూచిన
    "ఆంజనేయుల ఆనందబాష్పం" ఈ మహాసభ
    విద్యానగరం ఉద్యానవనంలో పూచిన
    గుమగుమలాడే గులాబీపుష్పం ఈ మహాసభ.
    
    అర్దేందుధరుడు హరుని అష్టతనువుల వలె
    ఆదిశక్తి ఉమాదేవి అష్టబాహుల వలె
    ఆనందమూర్తి శ్రీకృష్ణుని అష్టభార్య్హల వలె
    ఆచార్యభరతుని నాట్యశాస్త్రంలోని అష్టరసముల వలె

    అవనికి ఆధారమైన అష్టదిగ్గజముల ప్రతినిధులు
    అమృతరసం చిందించే ఆనంద కళానిధులు
    సరిగా ఎనిమిదిమందికవులు సరిక్రొత్త చవులు
    సరస సాహితీ స్వయంభువులు !
    
    ఇందీవరము లీను క్రాల్గన్నుల సుందర శరదిందుముఖులు
    అందంగా అటూఇటూ వింజామరాలు వీస్తున్నారు
    వందిమాగధులు కైవారాలు చేస్తున్నారు
    చందనతాంబూలా లిచ్చి సభ్యులను సత్కరిస్తున్నారు.
    
    అభివాదాలండీ ఆంధ్రకవితాపితామహులు !
    "అల్లిక జిగిబిగి" పెల్లుబికిన అల్లసాని మహామహులు !
    రత్నాల గండపెండారం రాయలచే గ్రహించారు
    సురుచిర "శిరీష పేశల సుధామయోక్తు"లకు పేరు వహించారు.
    
    "శతపత్రేక్షణ" "చంచరీకచికుర" "చక్రస్తని"
    అందాలరాణి మీ వరూధిని సౌందర్య సర్వస్వబోధిని
    అన్నులమిన్న అమరకంఠం విప్పి "ఆనందోబ్రహ్మ" అన్నది
    "చిన్నివెన్నెలకందు వెన్నుదన్ని" క్షీరాబ్దిలో జన్మించిన చిన్నది.

 Previous Page Next Page