"లేకపోతే ఏమిటీ? తిండికి, బట్టకూ దిక్కులేకపోయినా ప్రతి సంవత్సరం ఓ పాపాయిని మాత్రం తప్పకకంటూంటారు__"
"కాని దానికి బాధ్యత వాళ్ళదెలా అవుతుంది?"
"మరెవరిదేం?"
"ప్రభుత్వానిది..."
"బాగుంది. మధ్యలో ప్రభుత్వం ఏం చేస్తుంది? విరివిగా ప్రచారం చేస్తోంది. ఉచితంగా ఆపరేషన్ లు చేస్తోంది. అంతకంటే ఇంకేం చేయాలి."
"దేశ భవిష్యత్తుకి సంబంధించిన ఇలాంటి ముఖ్యమయిన విషయాన్ని అంత తేలిగ్గా చూడడమే ప్రభుత్వం చేస్తున్న తప్పు. కుటుంబ నియంత్రణ అనేది 'తప్పనిసరి' చేయాలి. కుటుంబానికి ఒక లిమిట్ పెట్టి ఆ లిమిట్ దాటిన అందరికీ నిర్భంధంగా ఆపరేషన్ చేయాలి. లేకపోతే అసలా పథకమే ఎత్తిపారేయాలి. ఇలా కర్రా విరగకుండా పామూ చావకుండా చేసే పనులవల్ల ప్రయోజనం ఎప్పుడూ జాప్యంగానే ఉంటుంది.
ఇంటర్వ్యూలో నేను ఈ పాయింట్ చెప్పినందుకే నాకీ ఉద్యోగం యిచ్చారు__" నవ్వుతూ అందామె.
అతని గది దగ్గర కొచ్చేశారిద్దరూ.
"ఇంక వెళతాను..." అతనివంక చూసి అంది.
"మీ యింటివరకూ తోడు రానవసరం లేదా?" అన్నాడతను.
"ఎందుకు?"
"చీకటి పడిందిగదాని..."
"భలేవారే! నేనేం చిన్నపిల్లనా ఏమిటి, చీకటి చూచి భయపడటానికి..." నవ్వుతూ అని ముందుకు నడిచింది సావిత్రి.
"గుడ్ నైట్..." నాలుగడుగులు వేశాక వెనుకనుంచి అతని గొంతు వినిపించింది.
"గుడ్ నైట్..." వెనక్కు తిరిగి అని మళ్ళీ నవ్వసాగిందామె. అతనింకా రోడ్డుమీదే తనవంక చూస్తూ కనబడి వున్నాడు.
ఇల్లు చేరుకుని మంచంమీదకి వరిగిపోయింది సావిత్రి. అంతా నిశ్శబ్దం. దూరంగా వుండుండి ఇంటి యజమాని బాలకృష్ణ గొంతు వినబడుతోంది.
ఊహు! తను భరించలేదు. అందరికీ ఎవరో ఒకరున్నారు. ఎవ్వరూ ఒంటరిగా లేరు. కేవలం తను ఒక్కతే. సంవత్సరాలు గడిచిపోతున్నాయ్. కానీ తను ఇంత దారుణమైన వంటరితనాన్ని అనుభవిస్తోంది.
ఆలోచనల్తోనే నిద్ర పట్టేసింది. తన పేరు గట్టిగా అరవడం వినిపించి చటుక్కున కళ్ళు తెరిచింది.
గడపలో నుంచుని తనవంకే ఆశ్చర్యంగా చూస్తూ శంకర్ కనిపించాడు...చీర సర్దుకొని త్వరగా లేచి నుంచుంది.
గదిలో లైటు వెలుగుతూనే ఉంది, అసలు ఆ సమయంలో టయమెంతయిందో, తలుపులు తెరుచుకొని అతనెలా లోపలికి రాగలిగాడో అంతా ఆశ్చర్యంగా కనిపించింది. కొద్దిక్షణాల తర్వాతగానీ అంతా గుర్తుకు రాలేదు.
"అదేమిటి! అలా తలుపులు తెరచే పడుకున్నారు?"
"నిద్రమత్తు ఇంకా పూర్తిగా వదలని ఆమె కళ్ళు ఎంతో అందంగా కనిపిస్తున్నాయతనికి."
"అనుకోకుండా నిద్రపట్టేసింది..." సిగ్గుపడుతూ అందామె.
లోపలికొచ్చి కూర్చున్నాడతను. సావిత్రికి ఇంకా ఆశ్చర్యంగానే వుంది.
అలారం టైంపీస్ లో టైం సరిగ్గా అర్ధరాత్రిని చూపుతుంది.
"ఇంత రాత్రివేళ అతను ఎందుకొచ్చినట్లు?"
"నేను ఇంత రాత్రివేళ ఎందుకొచ్చానా అని ఆశ్చర్యంగా ఉందా?" నవ్వుతూ అడిగాడతను.
సావిత్రి నవ్వేసింది.
"బాలకృష్ణగారు బాగా తాగి అల్లరి చేయడం మొదలెట్టారట. ముసలావిడ నా దగ్గరకు పరిగెత్తుకొచ్చింది రెండు గంటల క్రితం...బలవంతంగా ఆయనని ఇంట్లోకి చేర్చి మంచంమీద పడేసి కాసేపు కూర్చున్నాను. ఇప్పుడే ఆయన నిద్రలోకి జారాడు. తిరిగి వెళ్ళబోతుంటే మీఇంట్లో లైటు వెలుగుతూండడం చూశాను. ఇంత రాత్రివరకూ ఏం చేస్తున్నారా అని వచ్చాను."
సావిత్రికి అతను చెప్పే మాటలన్నీ చాలా ఆశ్చర్యం కలిగించినయ్.
"బాలకృష్ణగారు తాగారా?"
"అవును. చేతికి డబ్బులు దొరికితే చాలు ఓ బాటిల్ యింటికి తెచ్చుకొని తాగేస్తారట. అందుకనే ఆయన చేతికి డబ్బులు దొరక్కుండా ముసలావిడ జాగ్రత్త పడుతుందట. ఇవాళ వాళ్ళమ్మాయ్ దగ్గర్నుంచి ఎమ్.వో. వచ్చింది. ముసలామెని బెదిరించి అందులోనించి ఓ పాతిక లాక్కుని బ్రాందీ బాటిల్ తెచ్చుకొన్నాడట. ముసలావిడ యెంత చెప్పినా వినకుండా తాగి తాగి పదింటికల్లా నిషా బాగా ఎక్కిపోయి అల్లరి, కేకలు వేసి ఇల్లంతా తిరిగి చివరికి తోటలో నూతి దగ్గర పడిపోయాడట. ఆవిడ భయపడి నా దగ్గరికి పరిగెత్తుకొచ్చింది. తీసుకొచ్చి ఇంట్లో పడుకోబెట్టేసరికి ఈవేళయింది."
సావిత్రి కెంచేతో అతను చెప్పేది నమ్మబుద్ధి కావటంలేదు...బాలకృష్ణ అలాంటి మనిషంటే ఆశ్చర్యంగా వుంది...అయితే ఒకటి రెండుసార్లు జరిగిన సంఘటనలు గుర్తుకొచ్చేసరికి భవానీ శంకర్ మాటల్లో ఏమీ అతిశయోక్తి ఉన్నట్లు కనిపించలేదు. ఓసారి తనూ, శాంతి ఫస్టు షో సినిమాకెళ్ళి ఇంటికి తిరిగివస్తూంటే ఆయన గదిలో నుంచి గట్టిగా ఆయన గొంతు వినబడింది. బహుశా ముసలామెతో పోట్లాడాడేమో అనుకున్నారిద్దరూ. ఆ రాత్రి చాలాసేపు అలా అరుస్తూనే వున్నాడాయన. కాని తామిద్దరూ అతను తాగి అరుస్తున్నాడన్న అనుమానమే రాలేదు.