Previous Page Next Page 
దశావతారాలు పేజి 29


                                  విలువలు


    "ప్రతి రంగంలోనూ హైక్లాస్, మిడిల్ క్లాస్, క్లాస్ లో అని ఉంటాయి. ఏ రంగంలోనైనా హైక్లాస్ దొంగని పట్టగలిగే పోలీసుల లేడు! హైక్లాస్ లో ఏది చేసినా గౌరవంగానే వుంటుంది....చివరకు వ్యభిచారం కూడా........"
    నాగావళి ఆనందానికి అంతులేదు. యించుమించు నాలుగేళ్ళ తరువాత సరోజను కలుసుకోబోతుంది.
    సరోజ తన చిన్ననాటి స్నేహితురాలు. ఇప్పుడెలా వుందో? ఆనాడు తను నిస్సహాయ స్థితిలో వున్నప్పుడు తననెంతగా ఆదుకుంది? ఎవరైనా ఎంత చేసారు అన్నది ప్రధానం కాదు. ఎలాంటి హృదయంతో చేసారన్నది ప్రధానం...అప్పట్లో తనకు ఉద్యోగంలేదు. బి.ఏ. డిగ్రీ పొంది దానితో ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఒక్కటీ ఫలించలేదు. చిన్నప్పటినుండీ తను దురదృష్టవంతురాలే! పుడుతూనే తల్లిని కోల్పోయింది. తండ్రి పదేళ్ళవరకు చక్కగానే పెంచాడు. ఆ తరువాత ఆయన పోయాడు. బాబాయి పంచన చేరటం తప్ప తనకు గత్యంతరం లేకపోయింది. ఆనాటి నుండీ బాబాయి, పిన్నీ తనను పెట్టిన ఆరిళ్ళు ఇన్నీ అన్నీ కావు. న్యాయానికి వాళ్ళను అనవలసిన పనికూడా లేదేమో! ఈ కరువు రోజుల్లో ఒక మనిషికి మరొక మనిషి బరువైతే భరించటం కొంచెం కష్టమేమరి! ఆ రోజుల్లో తనకు వూపిరిపోసింది సరోజ స్నేహమే! సరోజ మాత్రం మహా భాగ్యవంతురాలా అంటే అదేమీ కాదు. వాళ్ళదీ మధ్య తరగతి కుటుంబమే! అయినా వాళ్ళ అమ్మను బ్రతిమాలి బ్రతిమాలి తనకుకూడా ఫలహారాలు పెట్టేది, సాధ్యమయినంతవరకూ భోజనం వాళ్ళింట్లో గడిచిపోయేలా చూసేది. ఏదో వంకపెట్టి తన చీరల్లో కొన్ని ఇచ్చేసేది. ఏనాటికయినా సరోజ రుణం తీర్చుకోగలనా అనిపించేది ఆ రోజుల్లో. అలా అతి కష్టంమీద బి.ఏ. పాసయింది. ఆ రోజుల్లోనే సరోజకు పెళ్ళయింది. కన్నీళ్ళతో యిద్దరూ విడిపోయారు. బి.ఏ. పాసవగానే తన కష్టాలన్నీ గట్టెక్కుతాయని కన్న కలలన్నీ కల్లలయిపోయాయి. ఎంతో ప్రయత్నించింది ఉద్యోగం కోసం! ఇంట్లో పిన్ని సతాయింపు లెక్కువయిపోయాయి. కంచంలో అన్నం పెట్టి తిట్టే ఆ తిట్లు...ఆ తిండి ఎలా తినగలిగిందో ఎలా బ్రతకగలిగిందో... అంతలో కంచె చేను మేసినట్లు...బాబాయే...
    చివ్వున నీళ్ళు చిమ్మాయి నాగావళి కళ్ళలో...కళ్ళు తుడుచుకుని కసిగా నవ్వుకుంది.
    పోనీలే! అంతా మంచికే జరిగిందేమో ఇప్పుడు తనకేం తక్కువయిందని. దర్జాగా బ్రతుకుతోంది. ఆనాడు ఏ గుమాస్తా ఉద్యోగమో దొరికి ఉంటే ఏ కుర్చీకో బ్రతుకు అంకితమయ్యేదేమో! జరగని విషయాలు తలుచుకునీ బాధ పడేకంటే జరిగిన దానిలో మంచిని ఎంచుకోవటం మేలు కదూ! అవును! తను అదృష్టవంతురాలే! విలాసంగా నవ్వుకొంది నాగావళి.
    సరోజకోసం ఎర్రపట్టుచీర కొంది. దానిమీదికి కెంపుల దుద్దులూ ఎర్రరాళ్ళ నెక్లెసూ కూడా తీసుకుంది. సరోజకు ఇద్దరు పిల్లలు వున్నారని వింది. వాళ్ళకు కూడా బట్టలు కొంది. ఇంకా స్వీట్స్, పళ్ళూ అన్నీ కొని కారులో సరోజ ఎడ్రెస్ వెతుక్కుంటూ బయలుదేరింది.
    తలుపుతీసిన వ్యక్తిని "సరోజగారున్నారా?" అని అడిగింది.
    ఆ వ్యక్తి నాగావళిని విస్తుపోయిచూస్తూ "నువ్వు నాగావళివి కదూ!" అంది.
    ఆ కంఠం విని నాగావళికి మతిపోయినట్లే అయింది.
    "సరోజా..." అంటూ కౌగిలించుకుంది. ఆవేదనతో కళ్ళలో నీళ్ళుతిరిగాయి. "ఏమిటిది ఎందుకిలా అయిపోయావ్? నా మనసులో ఎప్పుడూ ప్రతిధ్వనించే ఆ కంఠం ఒక్కటి అలాగే ఉండబట్టి గుర్తుపట్టగలిగాను. బొత్తిగా రూపు మారిపోయావు__ఆరోగ్యం బాగుందా?..."
    నాగావళి పొందుతోన్న ఉద్వేగంలో సగంకూడా సరోజకు కలగలేదు. తనను చుట్టిన నాగావళి చేతులను ఒక రకం విసుగుదలతో విడిపించుకొంది.
    "ఎందుకొచ్చావ్?"
    ఇంకా కన్నీళ్ళు కారుస్తోన్న నాగావళి కళ్ళు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి. కొయ్యబొమ్మలా నిలబడిపోయింది. ఆ చూపులు కాని, వాటిలో వున్న దైన్యంకాని సరోజను కొంచెం కూడా కదిలించలేకపోయాయి.
    "ఎందుకొచ్చావ్?" మళ్ళీ అంది. కూర్చోమనైనా అనకుండా....నాగావళికిఒ అర్ధమయిపోయింది. నీరసంతో తనే ఒక కుర్చీలో కూలబడింది.
    "సరూ! నువ్వూ నన్ను నలుగురిలాగే అనుకుంటున్నావా?"
    "నేను నలుగురిలో బ్రతుకుతున్నదాన్ని నలుగురితో వేలెత్తి చూపించుకోకుండా బ్రతకాలనుకుంటున్నదాన్ని..."
    నాగావళి ఆడనాగులాగే బుసలుకొడుతూ లేచింది.
    సరోజ ముఖం చూస్తూ తీక్షణంగా ఏదో అనబోయి గతస్మృతులు కనులముందు కదలాడగా కరిగిపోయి "సరూ! ఏం జరిగిందో తెలుసుకోవాలని లేదా నీకు?" అంది.
    "ఏదో జరుగుతుంది. ఎలాగో అవుతుంది. అవన్నీ తెలుసుకొనిమాత్రం నేనేం చేయగలను? సామాన్య సంసారిని..."
    ఇంక మాట్లాడదలచుకోలేదు నాగావళి...
    తను తెచ్చిన చీర, నగలు__పిల్లలకి బట్టలు అవన్నీ పైన పెట్టింది.
    "ఇంక వెళుతున్నాను__" అంటూ లేచింది.
    "అవికూడా తీసికెళ్ళు...."
    "ఏం? నా చేత్తో ముట్టుకుంటే వీటికి కూడా పాపం అంటుకుంటుందా?"
    "అదికాదు నిన్ను ఆదరించగలిగే సాహసం నాకు లేనప్పుడు ఈ బహుమతులు తీసుకునే అర్హత కూడా లేదు."
    నాగావళి మౌనంగా తను తెచ్చిన సామానులన్నీ తనే తీసుకుని కారులో కూర్చుంది. కారు ముందుకు కదలగానే ఒక్కసారి వెనక్కు తిరిగింది. అంతవరకూ గుమ్మంలో నిలబడ్డ సరోజ లోపలకు తప్పుకుంది. తలుపులు మూసుకున్నాయి.
    నాగావళి మనుష్యులందరిమీద కసితో భగ్గుమంది.
    ఆనాడు పిన్ని ఆప్యాయంగా తలంటినప్పుడు, కొత్తచీర కట్టుకోమన్నప్పుడూ, కంచె చేను మెయ్యబోతున్నదని ఊహించలేకపోయింది. బాబాయ్ బాస్ గదిలోకి తనను పంపిస్తున్నప్పుడు సంగతి అర్ధమయిపోయింది. ఒక్క సంగతి కాదు! చాలా సంగతులు అర్ధమయిపోయాయి. బాబాయి స్వార్ధానికి తనను బలిపశువుగా వాడుకోబోతున్నాడు. తప్పించుకునేందుకు ఏవిధమయిన మార్గమూలేదు. తప్పించుకుని చెయ్యగలిగినదీ లేదు.
    చిరునవ్వుతో సమీపంచిన తనను చూసి అతడు ఆశ్చర్యపోయాడు. అతడు పేరు గుర్తులేదు. అయినా పేర్లతో, వ్యక్తులతో తనకు నిమిత్తమేమిటీ?
    "నువ్వు బెదిరిపోతావనీ, గోల చేస్తావనీ చెప్పాడు మీ బాబాయ్..." అన్నాడు వెకిలి నవ్వుతో...అందుకు తను సంసిద్ధంగా వున్నట్లు...
    "అవును! ఈ గదిలో అడుగుపెట్టేవరకూ బెదిరిపోతూనే వున్నాను__ఎలా తప్పించుకోవాలా అని శతవిధాలా ప్రయత్నిస్తున్నాను. కానీ...మిమ్మల్ని చూసాక ఇప్పుడు...తప్పించుకోవాలని లేదు! ఇదీ అదృష్టమేననిపిస్తోంది..." వందమంది బడిపంతుళ్ళకంటే బ్రతుకు భలే పాఠాలు నేర్పిస్తోంది.
    పొంగిపోయాడా సరసుడు. తనను తాను మరోసారి అద్దంలో చూసుకున్నాడు. సగర్వంగా నవ్వుకున్నాడు.
    "మీరు మా బాబాయికెంత యిస్తానన్నారు?"
    చిరునవ్వుతోనే గోముగా అడిగింది.
    "వెయ్యి రూపాయలు యిస్తానన్నాను" దర్జాగా అన్నాడు ఆ సరసుడు.
    "అబ్బా! ఎందుకండీ అంత ఇవ్వటం? అసలేమీ ఇవ్వద్దు..."
    "ఎలా? ఇస్తానన్నానే!"
    "ఇంకా నయం! ముందుగానే ఇచ్చారు కాదు. నా మాట వినండి ఏమీ ఇవ్వకండి...
    నాగావళి అతని మెడచుట్టూ చేతులు పెనవేసి గిలిగింతలు పెడుతూ ముద్దు పెట్టుకుంది, నిలువెల్లా పులకించి పోయాడా పురుష పుంగవుడు.
    విధి తన జీవితవిధానాన్ని ఇలా నిర్ణయిస్తే...కానియ్యి...ఇందులోనే తను రాణించాలి!
    "నన్ను మీతో తీసుకుపొండి..."
    గారాభంగా అంది నాగావళి!
    అంతులేని ప్రేమ ప్రవాహంలో మునకలు వేస్తోన్న ఆ మహానుభావుడు ఉలికిపడ్డాడు. లోలోపల విరగబడి నవ్వుకుంది నాగావళి.

 Previous Page Next Page