చూస్తున్న నలుగురికీ కూడా ఒక్క క్షణం రాత్రి జరిగింది నిజం కాదేమో, పీడకలేమో అనిపించింది.
తమలో ఒకడైన ప్రకాశం...నిన్నటివరకూ తమతో ఉన్న ప్రకాశం ఈ క్షణం తమ మధ్య లేడు. అందుకే రాత్రి జరిగింది నిజమనుకోక తప్పటం లేదు. చాలా కాలంగా వాడిన కారు అమ్ముతున్నప్పుడూ, ఎంతో కాలంగా ఉంటున్న ఇల్లు వదులుతున్నప్పుడూ కూడా ఏదో బాధగా ఉంటుంది. అలవాటైపోయిన వాటిని వదులుకోలేక!
అలాంటిది సజీవంగా మన మధ్య తిరిగే మనిషి మన కళ్ళముందే అతి దారుణంగా చంపబడితే ఎలా ఉంటుందీ? భరించలేకపోతున్నాడు రవి.
"నేను పోలీస్ రిపోర్ట్ ఇస్తాను" అన్నాడు ఆవేశంగా.
"వీల్లేదు" చాలా రూడ్ గా, కఠినంగా అడ్డు చెప్పాడు విష్ణు.
"డాక్టర్ రవీ! మీకసలు బొత్తిగా లోక జ్ఞానం లేదు. అందుకే బహుశా మీ యూనివర్శిటీలో కూడా మీరు నెగ్గుకు రాలేకపోయారనుకుంటా? మీరు పోలీస్ రిపోర్టిస్తే ఏమవుతుందీ? ముందు మీ పీకకి చుట్టుకుంటుంది. మీ వ్యాళాసుర వ్యాఘ్రాసుర కథలు నిజమైనా, అబద్ధమైనా ఎవరూ నమ్మరు. నమ్మినా రికార్డుల్లో అది చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ఇక వజ్రాల హారం ప్రస్తావన తెచ్చారంటే, అదెక్కడుందో చూపించమని పోలీసులు మా ప్రాణాలు తీసేస్తారు. మీరూ మీతోపాటు మేమూ ఇక్కడ చిక్కుకు పోవలసివస్తుంది. పిచ్చి పిచ్చి ఆలోచనలు చెయ్యకండి!"
చల్లారిపోయాడు రవి. పోలీస్ డిపార్ట్ మెంట్ వ్యవహారాలు రవికి తెలియకపోలేదు. బందిపోటు దొంగలకీ, పోలీసులకీ ఉండే సంబంధాల గురించి ఎన్నో కథలు చదివాడు. సహకార సంఘాల సుబ్బయ్య విషయంలో ఆ సంబంధాలు ప్రత్యక్షంగా చూశాడు.
అనిల చెప్పినట్లు ఇది జమీందారీ కుటుంబాల వ్యవహారమే అయితే, వాళ్ళకీ పోలీసులకీ తప్పకుండా సత్సంబంధాలుంటాయి.
'ఏం చేద్దాం మనం?" నిరాశగా అడిగాడు రవి.
"గుహలోకి తర్వాత వెళ్దాం? ముందు లచ్చింబోడులో ఉన్న దిబ్బని తవ్వుదాం ఇవాళ!" అన్నాడు విష్ణు.
ఆ దిబ్బ కింద నిధులున్నాయనీ, అక్కడ తవ్విన వాళ్ళు నెత్తురు కక్కుకుని చచ్చిపోతారనీ కథలు ప్రచారంలో ఉన్నాయి ఆ గ్రామంలో. దాని విషయం తేల్చుకోవాలనుకున్నాడు విష్ణు.
విష్ణు ఎప్పటిలా కూలీలకి కబురు పంపాడు! అందరూ వచ్చారు. కానీ ఒక్కరు కూడా లచ్చింబోడులో ఉన్న దిబ్బ తవ్వటానికి ఒప్పుకోలేదు. విష్ణు ఎక్కువ కూలి ఇస్తామన్నా ఒప్పుకోలేదు.
అప్పుడిక రవి కల్పించుకున్నాడు "ఎందుకు భయపడుతున్నారు ఆ దిబ్బ తవ్వటానికి?"
"అక్కడ తవ్వినోళ్ళు నెత్తురు కక్కుకుని సత్తారంట!"
"మీలో ఎవరైనా అలా చచ్చిపోయారా?"
"లేదు. కానీ అట్టా సచ్చినోళ్ళున్నారని పెద్దోళ్ళు చెప్పుకుంటారు"
"మీరు అనవసరంగా భయపడుతున్నారు. మేమే కూడా మీతో కలిసి తవ్వుతాం. మామూలుగా ఇచ్చే కూలీకంటే రెట్టింపు కూలీ ఇస్తాం! రండి!"
కూలీలు కాస్త మెత్తబడ్డారు. అది కూలీ కోసం కాదు. గిరిజనులలో భయాలూ, మూఢ విశ్వాసాలూ మాత్రమే కాదు. భక్తి, కృతజ్ఞత కూడా ఉన్నాయి. రవి తమని పోలీసుల బారినుండి తప్పించాడు. తమలో ఒకరికి జబ్బు చేస్తే కాపాడాడు. అతడి మాట కాదనలేకపోయారు. అదీగాక అతడు కూడా తమతో తవ్వుతానంటున్నాడు అదొక ధైర్యం.
దిబ్బ దగ్గిర తవ్వకాలు జరపటానికి ముందు త్రిసికిని పూజలు చేసి మంత్రాలు చదవమన్నారు. రవికి అదంత ఇష్టంలేకపోయినా కూలీల సహకారం కావాలి కనుక ఊరుకున్నాడు.
త్రిసికి తలారా స్నానం చేసి, ముఖానికి పసుకు రాసుకుని, పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుని తూర్పు దిక్కుకు తిరిగి ఏవేవో మంత్రాలు చదివింది, అతి నెమ్మదిగా.
తరువాత తవ్వకాలు ప్రారంభించారు. కూలీలకు మాట ఇచ్చినట్లే రవీ ఒక గునపం పుచ్చుకున్నాడు. టెక్నీషియన్ ఫోటోగ్రాఫర్ కెమెరాలో ఫిల్మ్ లోడ్ చేసుకుని సిద్ధంగా వున్నాడు. స్థలాన్ని మొదట చిన్న చిన్న మడులుగా విభజించుకున్నారు. పైనుంచి లేయర్ మార్కింగ్ చేసుకుంటూ వర్జిన్ సాయిల్ VIRGIN SOIL తగిలే వరకూ తవ్వుకుంటూ పోయి అప్పుడు కిందనుంచి పైకి పిరియడ్ మార్కింగ్ Period Marking చేసుకోవాలి, దొరికిన ఆధారాల బట్టి.
ఎండ మండిపోతోంది. చెమటలు కక్కుకుంటూ తవ్వుతున్నారు. కూలీలు కుండ పెంకులూ, పూసలు మొదలైనవి దొరికితే ఏరి పక్కకి పెడుతున్నారు. నేల రంగు మార్పిడినిబట్టి Section cutting గుర్తుపెట్టుకోవాలి. నల్లగా బీటలు వారిన నేల కొద్దిగా మెత్తబడి, కొంత ఎరుపు రంగుకి మారినచోట Mark చేసుకున్నారు. అప్పటివరకూ ఏం దొరకలేదు. మళ్ళీ మొదలుపెట్టారు తవ్వటం. నేల కొంచెం మెత్తగా వుండి చురుగ్గా సాగుతున్నాయి తవ్వకాలు.
"ఆగండి!" అన్నాడు రవి గెడ్డ పలుగు ఎత్తబోతున్న కూలీతో. మట్టిలో మెరుస్తూ కనిపిస్తోంది గాజు పూస. అతి జాగ్రత్తగా దానిని తీశాడు. కంటి ఆకారంలో ఇలా వుంది ఆ పూస.
"ఇవి శాతవాహనుల కాలం నాటివే. దృష్టి దోషం తగలకుండా ఇలాంటివి కట్టేశారు. ఇంటి వాకిళ్ళకీ... ఇంకా..." ఆగిపోయాడు రవి.
"ఇంకా...?" ఆత్రంగా అడిగాడు విష్ణు.
"ధన ధాన్యాలున్న చోట కూడా ఇలాంటివి కట్టేవారట, దృష్టి తగిలి వస్తువులు పాడయిపోకుండా."
"ఇంకా తవ్వండి" ఉత్సాహంతో ప్రోత్సహించాడు విష్ణు. అనిల కూడా దిగబోయింది. త్రిసికి దిగనీయకుండా పట్టుకుంది.
మూడో సెక్షన్ లో మరో రకం పూసలు దొరికాయి నాలుగయిదు.
ఈ ఆకారంలో ఉన్నాయి ఆ పూసలు. "ఈ పూసలు శంఖానికి చిహ్నం. లక్ష్మీకి గుర్తు" రవి అన్నాడు. వాటిని పరిశీలించి అతి జాగ్రత్తగా పక్కకి పెడుతూ వాటికి వున్న నల్ల పాలిష్ చూసి అవి క్రీస్తు పూర్వం నాటివని అనుకున్నాడు రవి.
చెకుముకిరాళ్ళు బయట పడుతున్నాయి. ఒకనాటి వారు నిప్పు తయారుచేసుకునే రాళ్ళు. మొత్తం మీద ఆ స్థలంలో ప్రాచీన సంస్కృతి విశేషాలు తెలియవచ్చుననే విశ్వాసం బలపడుతోంది అందరిలో.
ఆ సమయంలో అక్కడికి రెండు జీపులు వచ్చి ఆగాయి. ఇద్దరు నారాయణులూ చెరొక జీపులోంచీ దిగారు. విలసిత కూడా వచ్చింది. కానీ దిగకుండా జీపులోనే కూర్చుంది.
"ఏం చేస్తున్నారు?" తీవ్రమైన స్వరంతో అడిగాడు దేవనారాయణ్. సాధారణంగా అతడే మాట్లాడతాడు. యజ్ఞనారాయణ్ వయసులో పెద్దవాడు కావటం వల్ల లేక ధాటీగా మాట్లాడే శక్తి సహజంగానే లేకపోవటం వల్లో అంతగా మాట్లాడడు. సాధారణంగా అతడి బదులు విలసిత మాట్లాడుతుంది.
రవి, విష్ణు వైపు చూశాడు సమాధానం చెప్పమన్నట్లు. దేవనారాయణ్ ని చూడగానే రవికి రాత్రి జరిగిందంతా గుర్తొచ్చింది. తన భావాలు దాచుకుని మామూలుగా కనపడటానికి చాలా శ్రమపడవలసివస్తోంది.
విష్ణు గొంతు సవరించుకున్నాడు "ఈ ప్రాంతంలో శాతవాహనుల కాలంనాటివనిపించే పూసలు దొరుకుతున్నాయి. ఇంకా నాణేలు కానీ, మరేమైనా విశేషాలు కానీ దొరుకుతాయేమోనని పరిశీలిస్తున్నాం!"
"ఆ గొడవలు మాకు తెలీవు. కాని తరతరాలుగా ఈ దిబ్బలో భూత ప్రేతాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు. అందుకే ఈ ప్రాంతాలకి గ్రామీణులు కానీ, గిరిజనులు కానీ ఎవరూ రారు. ఇప్పుడు మీరీ దిబ్బ తవ్వుతున్నారు. ఇంతవరకూ ఈ దిబ్బ నాశ్రయించుకుని ఉన్న భూతాలన్నీ గ్రామాల మీద పడితే, మా గతేం కావాలి? మా ప్రజల గతేం కావాలి?"