ఎదురుగా కనిపించిన దృశ్యానికి అతడిలాంటి సాహసికి కూడా కళ్ళు గిర్రున తిరిగాయి.
నల్లటి చీకటిలాంటి రెండు భయంకర ఆకారాలు డ్రాఫ్ట్ మన్ ప్రకాశాన్ని నిలువునా రెండుగా చీలుస్తున్నాయి.
సూర్యనేత్రం గుహలో ఉన్న వ్యాఘ్రాసుర శిల్పాలలా వున్నాయవి. శిల్పాలలో వున్న ఎరుపురంగు లేదు. దట్టమైన నల్లని రంగు. కళ్ళు మాత్రం మిణుగురుపు రంగుల్లా మిణుకు మిణుకుమని మెరుస్తున్నాయి.
వాటి చేతులు పులి పంజాలలా వున్నాయి. ఆ పంజాల వాడి గోళ్ళతో ప్రకాశాన్ని నిలువునా చీలుస్తున్నాయవి.
మరొక చావు కేక పెట్టాడు ప్రకాశం! అంతే! అతడి శరీరంతో పాటు నోరు కూడా రెండుగా చీలిపోయింది. రక్త ప్రవాహాల మధ్య శరీరం రెండు భాగాలుగా నేలమీద పడింది.
భయంతో వేసిన వెర్రి కేకలు! మనుష్యులు ఒకరినొకరు తోసుకుంటూ పరిగెడుతున్న సవ్వడి.
ప్రకాశం కేక విని టెంట్స్ లోంచి విష్ణు వాళ్ళంతా వచ్చారు. ఆ ఆకారాలు చూసి అనిల భయంతో రవి దగ్గిరగా వచ్చి నిలబడింది. షాక్ లోంచి తేరుకున్న రవి తన ప్యాంట్ జేబులోంచి రివాల్వర్ తీసి ఆ ఆకారాలకు గురిపెట్టి కాల్చాడు.
పూలబంతితో కొట్టినట్లు నవ్వాయి ఆ ఆకారాలు వికటంగా. ఆ ధ్వని చాలా గమ్మత్తుగా ఉంది. ఏదో గుహ లోంచి వచ్చినట్లు.
మళ్ళీ కాల్చాడు మళ్ళీ-మళ్ళీ!
ఏమీ ప్రయోజనం లేకపోయింది. ఏదో గేమ్ ఎంజాయ్ చేస్తున్నట్లు వికటంగా నవ్వాయి అవి. భయంకరంగా గుహలోంచి వస్తున్నట్లుగా ఉన్న నవ్వు...చేతులు ఊపాయి. అరచేతులకు బదులుగా పులిపంజాలు, వాటికి వాడిగా ఉన్న గోళ్ళు. ప్రకాశం వేడి నెత్తురుతో తడిసిన గోళ్ళు.
తుపాకిలో గుళ్ళు అయిపోయాయి. రవికేం చేయాలో తోచటం లేదు. ఆ ఆకారాలు ఒకడుగు ముందుకు వేశాయి అనిలవైపు. చటుక్కున అనిలని తన వెనక్కు లాగి నిర్భయంగా నిలబడ్డాడు రవి మృత్యువునే సవాల్ చేస్తున్నట్లు.
కొద్దిగా ముందుకు వచ్చాయి ఆ ఆకారాలు. మరింత భయంకరంగా ఉన్నాయి అవి.వాటినే చూస్తూ నిలబడ్డాడు రవి. ఒక చేతిలో గుళ్ళులేని పిస్టల్. మరొక చెయ్యి అనిల చుట్టూ.
అంతలో ఆ ఆకారాల కళ్ళలోంచి కోటి మెరుపులంత తీక్షణమైన వెలుగు ప్రసరించింది. ఆ కాంతికి తట్టుకోలేక కళ్ళు మూసేశాడు రవి.
ఒక్కక్షణం ఆగి కళ్ళు తెరిచేసరికి ఆ ఆకారాలు మాయమైపోయాయి. ఒక చేత్తో కళ్ళు మూసుకుని వణుకుతూనే ఉంది అనిల.
"అనిలా! ఆ ఆకారాలు లేవు. వెళ్ళిపోయాయి" ఈ లోకంలో లేనట్లున్న ఆమెని చేత్తో కదుపుతూ అన్నాడు.
కళ్ళు తెరచి చూసి కెవ్వున కేకవేసి మళ్ళీ కళ్ళు మూసుకుంది అనిల. నిలువునా రెండుగా చీలిపోయి నెత్తురు ప్రవాహంలో పడివున్న ప్రకాశాన్ని చూసి- ఎంతో భీభత్సంగా ఉంది ఆ దృశ్యం!
ఎలాంటి ఘోరమైన మరణం! రవి కూడా చూడలేకపోతున్నాడు ఆ శరీరాన్ని. అంతటి భీభత్సంలోనూ కళ్ళకు మిరుమిట్లు గొలుపుతూ ఆకర్షిస్తోంది. జీవం లేని ప్రకాశం గుప్పెట్లో ఉన్న వజ్రాల హారం.
"డాక్టర్ రవీ! మనం ఇక్కడినుంచి వెళ్ళిపోదాం?" అంది అనిల. స్పృహ తప్పిపోయేలా ఉంది ఆ అమ్మాయి.
"అనిలా! అతడి చేతిలో ఆ వజ్రాలహారం...."
"అది ముట్టుకోవద్దు. పద పోదాం. ఆ హారం ఎవరూ తియ్యరు. ఈ ప్రాంతం వాళ్ళు ముట్టుకోరు. టెంట్స్ లోకి పద. నేను భరించలేకపోతున్నాను."
ఈ మాటలంటూనే కడుపులో తిప్పి పెద్ద వాంతి అయింది అనిలకి. కింద కూలబడిపోయింది. ఇక ఆలస్యం చెయ్యకుండా ఆమెను చేతుల్లో ఎత్తుకుని టెంట్లోకి వచ్చాడు రవి.
ఆ పాటికే రవి, అనిల టెంట్ లో అందరూ గుమిగూడి ఉన్నారు. వణికిపోతూ- తెలివి లేని అనిలని పక్కమీద పడుకోబెట్టాడు రవి. త్రిసికి ఆమె ముఖం మీద నీళ్ళు చల్లి- ముఖం కడిగి నీళ్ళు తాగించింది. లేచి కూర్చుంది అనిల.
తెల్లవారుజామున సూచిస్తూ దూరంగా కోడి కూసింది. ఆ కూత వింటేనే అందరికీ ప్రాణం లేచొచ్చినట్లుగా అయింది. రాత్రి అంటే, చీకటి అంటే భయం మనుష్యులందరికీ. తమస్సు- ఆజ్ఞానానికీ, ఆటవితకీ, కల్మషానికీ, కుత్సితానికీ ప్రతీక.
చీకట్లలో ప్రాణి కోటి అంతరంగాలలోని చీకటి కోణాలన్నీ పురివిప్పి నాట్యమాడుతూ, ఎవరి ఆత్మ వాళ్ళనే భయపెడుతుంది కాబోలు!
కర్మసాక్షి, లోక బాంధవుడు, సూర్య భగవానుడు వస్తున్నాడంటే కొండంత ధైర్యం. సమస్త సృష్టిలో శృతి తప్పని సమన్వయాలకి ప్రత్యక్ష నిదర్శనం పొడిచే సూర్యుడు.
ఒకరితో ఒకరు మాట్లాడుకోవటానికి భయపడుతున్నట్లు అందరూ నిశ్శబ్దంగా కాలకృత్యాలు తీర్చుకున్నారు.
ఎక్కువగా భయపడుతున్నది పనివాళ్ళు. తమ చుట్టూ దెయ్యాలో భూతాలో ఉన్నట్టు బెదిరిపోతున్నారు. వాచ్ మన్ ఎప్పుడో పారిపోయాడు, కాగడా కింద పారేసి. అనిలని అంటి పెట్టుకుని ఉంది త్రిసికి.
అందరిలో ముందుగా మాట్లాడింది అనిల "ఇలాంటివి ఇక్కడ జరుగుతున్నాయని విన్నాను. కాని ప్రత్యక్షంగా చూడటం ఇదే మొదటిసారి."
"ఏం విన్నారు?" అడిగాడు రవి.
"ఈ జంట గ్రామాలలో ఎక్కడో భవానీ మాత దేవాలయం ఉందట! ఆ దేవి విగ్రహం మీద కోట్ల విలువచేసే నగలున్నాయట! ఇక్కడి జమీందారులకి తరతరాలుగా ఆమె కుల దైవమట!
శివాజీ మహారాజు కూడా ఈ మాతని దర్శించుకుని, తనూ కొన్ని ఆభరణాలు కానుకగా ఇచ్చాడట! ఆ దేవి విగ్రహం మీద ఆభరణాలు ఎవరైనా దొంగిలించాలని ప్రయత్నిస్తే భవానీమాత కింకరులు ఆ దొంగలను చీల్చి చంపేస్తారట. ఇలాంటి కథలు విన్నాను. కానీ..." ఆగిపోయింది అనిల.
ఏం చెప్పాలో తోచలేదు. ఇప్పటికీ ఆ కథలను ఆమె మనసు అంగీకరించలేకపోతోంది.
"ఆ నగలు ఇప్పటికీ ఉన్నాయా?" గ్రీడీగా అడిగాడు విష్ణు.
"ఉన్నాయనే అంటారు" చెప్పింది అనిల.
"చచ్చిపోయిన ప్రకాశం గుప్పెట్లో ఉంది ఒక వజ్రాలహారం. దేవి కింకరులే చంపారో, వ్యాళాసుర వ్యాఘ్రాసురులే చంపారో, లేక మరెవరైనా చంపారో... ఏమయిందో కానీ, ఆ వజ్రాల హారం కారణంగానే ఈ హత్య జరిగింది" రవి అన్నాడు. గుటక మింగాడు విష్ణు.
"ఏం చేశారు ఆ హారాన్ని?" అడిగాడు అనుమానంగా.
"అయ్యా భూతయ్యగారూ! ఆ స్థితిలో శవాన్ని మాలో ఒకరం ముట్టుకుంటామని ఎలా అనుకున్నారు? చంపినది పిశాచాలైనా ముట్టుకోకూడదు. మనుష్యులైనా ముట్టుకోకూడదు. పోలీస్ కేసు అవుతుంది."
"అవునవును. ఇంతకీ భవానీమాత దేవాలయం ఎక్కడుంది?" అనిలని ఉద్దేశించి అడిగాడు.
"నాకూ తెలీదు. అలాంటి దేవాలయం ఉందని వినటమే కానీ, నేనూ చూడలేదు. ఇక్కడి జమీందారీ కుటుంబాలు మాత్రమే తరతరాలుగా ఆ దేవిని పూజిస్తున్నాయట"
"మీరూ ఆ కుటుంబాలకు చెందినవారే కదా!"
"ఇంకా ఆ కుటుంబాలలో వ్యక్తిని కాలేదు. ప్రస్తుతానికి దూరపు బంధువుని మాత్రమే!"
విష్ణు మాట్లాడలేదు. ఆ విషయం పైన వాదించదలచుకోలేదు. అనిల తనకు తెలిసే దాస్తోందని అతని అనుమానం. ఎవరినీ నమ్మలేడు అతడు.
ఉదయం ఏడుగంటలైనా కాకుండానే ఎండ బాగా వచ్చేసింది. ఎండలూ, మండుటెండలూ తప్ప మరో ఋతువు లేని ప్రదేశం అది.
"లెటజ్ గో టు ది స్పాట్!" ఎండని చూస్తూ ధైర్యంగా అంది జెన్నిఫర్.
టెంటులో ఉన్న అయిదారుగురు కూలీలూ రావటానికి ఒప్పుకోలేదు. అనిల, రవి, జెన్నిఫర్, విష్ణు, ప్రకాశం చంపబడ్డ కొండ మలుపు దగ్గరకి వచ్చారు.
అక్కడ ప్రకాశం శవం లేదు! నెత్తుటి మరకలు కూడా లేవు. ఒక మనిషి హత్య చేయబడ్డ ఆనవాలే లేదు.