ఎలాగో డ్రెస్ ఛేంజ్ చేసుకుని బెడ్ మీదకు చేరి ఆమె ప్రక్కన పడుకున్నాడు.
పెళ్ళయిన కొత్తలో కొన్నాళ్ళు సఖ్యతగానే ఉన్నారు. తర్వాత వ్యక్తిగత అవసరాల కోసం జీవితం వికృత రూపం దాల్చింది. ఒకరికొకరు ఉపయోగపడుతోన్నా పరస్పరం ద్వేషించుకుంటూ, నిరంతరం కీచులాడుకుంటూ కాలం గడిపేస్తున్నారు. తర్వాత తర్వాత ఎవరి వ్యక్తిగత జీవితం వారిదిలా తయారయింది.
కుటుంబాలు బంగారు వనాలు అన్న సత్యం ప్రపంచలో ఎక్కడుందో వెతికి వెతికి గాలించాల్సి వస్తోంది.
అతనికి కామేశ్వరి గుర్తుకొచ్చింది. ఆమె రూపం, పర్సనాలిటీకి, పొంకం కొన్ని నిమిషాలు గుండెల్లో నాట్యం చేసి వివశుడ్ని చేశాయి. ఏ పరాయి స్త్రీని చూసినా అతన్లో వివశత్వం అలాగే కలుగుతూ ఉంటాయి. అంతలో నీరజ మనసులో మెదిలింది. ఆమెలోని నాజూకుతనం, కన్నె వయసు వల్ల వ్యాపించిన శరీరపు లావణ్యం, కళ్ళలోని మెరుపు అతని నరాల్ని జివ్వుమనిపించాయి. అలా కొన్ని క్షణాలు గడిచాక యిహ వుండలేక భార్యవైపు తిరిగి వక్షస్థలం చుట్టూ చెయ్యి వేస్తూ దగ్గరకి పొదువుకున్నాడు.
రాధాబాయి నిద్రపోలేదు. ఊరికినే కళ్ళు మూసుకుని పడుకున్నా అతని చేష్టలు గమనిస్తూనే ఉంది. ఒక్కసారిగా చిరాకనిపించి అతని చేతులు తోసేద్దామా అనుకుంది. కాని ఆరోజు ఉన్న మూడ్ లో అతన్తో కలయిక అవసరమనిపించింది. ఒకవేళ అవసరమనిపించకపోయినా యాంత్రికంగా లొంగిపోయి వుండేదే. పరస్పరం ద్వేషించుకుంటున్నా అలా వాళ్ళిద్దరి మధ్యే కాదు చాలా మంది భార్యాభర్తల మధ్య అలా జరుగుతూ వుంటుంది.
"ఊ" అంది అప్పుడే మెలకువ వచ్చినట్టు.
"ఇటు తిరుగు"
"అబ్బా! నిద్రపోతూంటే ఏమిటీ గొడవ" అంటూనే ఆమె తిన్నగా తిరిగింది.
పదినిమిషాలు గడిచాయి. ఆమె అతన్నుంచి వదిలించుకుని మళ్ళీ ప్రక్కకి తిరిగి పడుకుంది.
ఇద్దరికీ నిద్ర పట్టటంలేదు. ఆ సంగతి కదలికలవల్ల తెలుస్తోంది.
"నీతో ఓ విషయం మాట్లాడాలి" అంది రాధాబాయి కొంచంసేపున్నాక.
"ఏమిటి?"
"నువ్వు నాకు ఖర్చులకోసం నెల నేలా కేటాఇస్తోన్న డబ్బు సరిపోవటం లేదు. ప్రతిసారి అడగాలంటే యిబ్బందిగా వుంది. మనకి ఊళ్ళో నాలుగయిదు బిల్డింగ్ లూ, హైద్రాబాద్ లో గ్రేప్ గార్డెన్సూ వున్నాయి కదా. కొంత ఆస్థి నా పేర పెట్టెయ్యి."
ఆమె ఇలా ఎప్పుడో ఒకప్పుడు మాట్లాడుతుందని అతనికి తెలుసు.
"ఇప్పుడున్న బిజినెస్ లోగాని, ఆస్థిలోగాని నా పేర ఎక్కువేమీ లేదనీ, చాలావరకూ నీ పేరుమీదా, పిల్లల పేరుమీదా వుందన్న సంగతి నీకు తెలుసు"
"అది కేవలం ఇన్ కమ్ టాక్స్ లెక్కలకోసం ఆడిటర్స్ సలహా ప్రకారం చేసుకున్న ఏర్పాటు. కాని నీకు తెలీకుండా పైసా అయినా తీసుకునే అధికారం మాకులేదు. ఊరికినే సంతకాలు పెట్టటానికి మాత్రమే మేము పనికివస్తామనీ, అవసరమొస్తే మా సంతకాలు నువ్వే పెట్టేస్తావనీ నాకు తెలుసు. అలా కాకుండా దేనికది పూర్తిగా డివైడ్ చేసేయ్"
"అలా చేస్తే మేనేజ్ చెయ్యటం మీవల్ల కాదు.
"మేము అంత అసమర్థులమని అనుకోవటం లేదు. ఈ టాపిక్ పిల్లలు కూడా చాలాసార్లు తీసుకొచ్చారు. వాళ్ళకి కూడా ఇండిపెండెంట్ గా బిజినెస్ చేసుకోవాలని వుంది."
"దీన్ని గురించి కొంచం ఆలోచించుకోవాలి"
"ఆలోచించు. కాని చెయ్యక తప్పదు."
ఆ మాట తూణీరంలా వచ్చింది. గుండెల్లో బాగా లోతుగా దిగిబడినట్లయింది.
మళ్ళీ గదిలో నిశ్శబ్దం అలుముకుంది. అతనాలోచిస్తున్నాడు. ఈ మధ్య పిల్లల్లో చాలా వేగంగా దూసుకొస్తోన్న మార్పు అతను గమనిస్తూనే వున్నాడు. అరికట్టాలనుకున్నాడుగానీ, శక్తి చాలదని క్రమంగా గ్రహించి నిస్సహాయంగా ఊరుకున్నాడు.