Previous Page Next Page 
కళ్ళు పేజి 29


    ఈలోగా హేమసుధ ఇంటి దగ్గర మఫ్టీలోవున్న పోలీసుల్ని నిఘా వుంచింది. ఆ ఇంటికి ఎవరు వస్తోన్నా, ఇంట్లోంచి ఎవరు పోతోన్నా వివరాలు నోట్ చేసుకొమ్మంది. రేపా వ్యక్తిని కలుసుకోవాలి.

 

    పద్మనేత్రాలయలో డాక్టర్లందరినీ కల్సుకుని, వాళ్ళ గొంతులు హేమసుధ వినేలా ఏర్పాటు చెయ్యాలి.

 

    ఆ తర్వాత...

 

    ఉన్నట్లుండి బెడ్ లైటు ఆరిపోయింది. ఫ్యాన్ తిరగడం మానేసింది. కరెంటు పోయినట్లుంది. కిటికీలోంచి పడుతూన్న వెన్నెలవల్ల, ఆమె కళ్ళు నిశితంగా చూడటానికి ఆ వెలుగు సరిపోతూవుండటంవల్ల ఇబ్బందేమీ కలుగలేదు. అంతకంటే చీకటిగావున్నా ఆమె కళ్ళు ఆ చీకట్లని చీలుస్తూ దృష్టిని సారించగలవు.

 

    రంజిత ప్రక్కమీద పడుకుని ఆలోచిస్తోంది. మామూలు మనిషికైతే రక్తాన్ని కరుడుకట్టించే నిశ్శబ్దం. తలత్రిప్పి చూసింది. ఆకాశంలో కదిలినట్లు కనిపించే నక్షత్రాలు. బయటేదో అలికిడైనట్లయింది. రంజిత చాలా శ్రద్ధగావింది. బయటెవరో నడుస్తోన్న అడుగులచప్పుడు. ఆమె కదల్లేదు. ఆమె కళ్ళు బయటి వాతావరణంలోకి గుచ్చిగుచ్చి చూస్తున్నాయి, ఒక్కక్షణం అడుగుల చప్పుడు ఆగినట్టయింది. రంజిత మెల్లగా లేచి కూర్చుంది. నెమ్మదిగా లేచి మంచం ప్రక్క గోడవార నిలబడి తల కొంచెం వంచి బయటకి చూసింది. ఎవరూ కనబడలేదు. ఓ నిమిషం అలాగే నిలబడింది. బయట మళ్ళీ ఏదో కదిలినట్లయింది. చాలా అస్పష్టంగా ఓ నీడలా కనిపించింది. రంజిత ఆలశ్యం చెయ్యలేదు. చప్పుడు చెయ్యకుండా నడిచి డ్రాయర్ దగ్గరకు వెళ్ళి సొరుగు తెరిచి రివాల్వర్ చేతిలోకి తీసుకుంది. డ్రాయర్ మీద టార్చిలైట్ కూడా తీసుకుని డోర్ దగ్గరకు వెళ్ళి లాక్ తీసి గభాల్న తలుపు తెరిచింది.

 

    క్షణమాత్రం ఏదో సవ్వడి. ఎవరో దూకినట్లు, పరిగెత్తినట్లు, రంజిత టార్చిలైట్ వేసి ఇంటి ముందున్న చిన్న గార్డెన్ లోని చెట్లమీదకి ఫోకస్ చేసింది. ఎవరూ కనబడలేదు. డోర్ బయట్నుంచి లాక్ చేసి, మెట్లు దిగి, మొక్కలవైపు వెళ్ళింది. కుడిచేత్తో రివాల్వర్ ఏ సెకన్లో అయినా ఉపయోగించేటట్లుగా పట్టుకుని, ఎడమచేత్తో టార్చిలైట్ ఫోకస్ చేస్తూ ఆ ప్రదేశమంతా గాలించింది. కాంపౌండ్ వాల్ దగ్గరకు వచ్చి రోడ్డుమీదకూడా రెండువైపులా లైటువేసి చూసింది. మళ్ళీ లోపలికి వచ్చి ఇంటికి ఉత్తరంవైపూ, దక్షిణంవైపూ, వెనకభాగాన వున్న జాగా అంతా చూసింది. ఎవరూ కనబడలేదు. సర్వత్రా నిశ్శబ్దం వ్యాపించివుంది. మళ్ళీ ముందుభాగంలోకి వచ్చి మెట్లెక్కి వరండాని చుట్టివున్న రెయిలింగ్ కి అనుకుని ఐదు నిముషాలపాటు నిలబడింది. ఎక్కడా ఏ అలికిడి లేదు.

 

    డోర్ తెరిచి ఇంట్లోకి వచ్చింది. బెడ్ ప్రక్కనేవున్న ఫోన్ రింగవుతోంది. ఆమెకోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఫోన్ అది.

 

    రిసీవర్ అందుకుని "హలో!" అంది.

 

    అవతల్నుంచి జవాబులేదు.

 

    "హలో!" అంది రంజిత మళ్ళీ.

 

    "అవతల్నుంచి చిన్న నవ్వు. తర్వాత ఫోన్ డిస్ కనెక్టయిపోయింది.


                                         11


    రంజిత అధునాతనంగా కట్టబడిన ఓ మేడముందు కారాపి బయటకు దిగింది. గేటుకు ప్రక్కగా చిన్న నేమ్ ప్లేటుంది. దానిమీద ప్రఫుల్ల కుమార్ అని రాసివుంది. క్రింద డిగ్రీకాని, ఉద్యోగంకానీ, వృత్తిగానీ ఏమీలేదు. గేటు తీసుకుని లోపలికి వెళ్ళి బజర్ నొక్కింది. లోపల్నుంచి ఎవరో నడిచి వొస్తోన్న చప్పుడు. తర్వాత తలుపు తియ్యబడింది.

 

    లోపల ఆరోజు హేమసుధ ఇంట్లోంచి బయటకు వచ్చి కారెక్కి వెళ్ళిపోయిన యువకుడు నిలబడి ఉన్నాడు. పైజమా, లాల్చీ వేసుకుని అంతకుముందే స్నానం చేసినట్లు ఫ్రెష్ గా వున్నాడు. ఆమెవంక కనుబొమలు కొంచెం ముడివేసి ప్రశ్నార్థకంగా చూశాడు.

 

    "ప్రఫుల్లకుమార్ గారిని కలుసుకుందామని వచ్చాను" అంది రంజిత.

 

    "నేనే ప్రఫుల్లకుమార్ ని!"

 

    రంజిత తన ఐడెంటిటీని దాచలేదు. తాను ఓ రహస్య గూఢచారిణిగా పనిచెయ్యటం లేదు. ఎవర్ని కలుసుకున్నా అఫీషియల్ గానే కలుసు కుంటోంది. ఇప్పటికే తన గురించి చాలామందికి తెలిసింది. తనెవరో ఇతరులు తెలుసుకోలేరనుకోవటం హాస్యాస్పదంగా ఉంటుంది.

 

    అతని మొహంలో రంగులు మారాయి. "లోపలకు రండి" అన్నాడు.

 

    రంజిత గుమ్మందాటి గదిలోకి అడుగుపెట్టింది. ఆమె లోపలకు రాగానే టక్ మని చప్పుడుతో తలుపు మూసుకుంది. ఆమె తల వెనక్కు త్రిప్పి చూసి, మౌనంగా వూరుకుంది. ఏమీ వ్యాఖ్యానం చెయ్యలేదు.

 

    అదో ఆఫీసు గదిలా అమర్చివుంది. తూర్పువైపు మొహంపెట్టివున్న రివాల్వింగ్ చైర్, దానిముందు ఖరీదయిన గ్లాస్ వేసి ఉన్న గాడ్రేజ్ టేబుల్, ఇటువైపు ఫ్రేము అల్లికతోవున్న మూడు స్టీల్ ఛైర్స్, గోడకు ఆన్చి వేసివున్న సోఫాలు...

 

    "కూర్చోండి!" అన్నాడు.

 

    ఆమె అతనివంక పరిశీలనగా చూసింది. ఇంచుమించు ఆరడుగుల పొడవు, బలిష్టమైన శరీరం, ముఖంలో కళ వుట్టిపడుతోంది.

 

    "ఏమిటలా చూస్తున్నారు?"

 

    "ఏమీలేదు" అని తల ప్రక్కకు త్రిప్పుకుంది.

 

    "అలా కళ్ళార్పకుండా నా వంక చూసే అందమైన అమ్మాయిలంటే నాకు చాలా ఇష్టం."

 

    రంజిత అతనివైపు కోపంగా చూసింది. "నేను మీ దగ్గరకు అమ్మాయిల గురించి మీ అభిప్రాయాలు వినటానికి రాలేదు. అమ్మాయిల గురించి మీ అభిరుచి ఏమిటో తెలుసుకుందామనీ రాలేదు" అంది.

 

    "ఈరెండు పాయింట్లూ కరెక్టే అని ఒప్పుకుంటాను. కాని చూశారూ! నా మనసులోకి వచ్చిన ఆలోచనలు ఎప్పటికప్పుడు బయటపెట్టకపోతే నాకు తోచదు. అదే నాతో వచ్చిన చిక్కు!"

 

    "అలాగా?" అంది రంజిత.

 Previous Page Next Page