ఆ సమయానికే శంకరం ఆ గదిలోకి వచ్చాడు. తండ్రి రాముణ్ణి తిడుతూండటం, వాడు ఏడుస్తూండటం చూసి అంతా అర్ధంచేసుకున్నాడు. చటుక్కున జేబులోంచి ఒక రూపాయి బేడా బయటకు తీసి "అప్పుడే మరిచిపోయి అలా ఏడుస్తావేమిట్రా రాముడూ! లోపలికి వచ్చేముందు అయ్యగారు వుంటారో వుండరో అని నాకిచ్చావుగా ఇమ్మనమని" అని వాడితో అని "ఇందాక నాకిచ్చాడు నాన్నా నీకిమ్మని, అప్పుడే మరిచిపోయాడు. మతిమరుపు వెధవ!" అంటూ తండ్రికి అందిచ్చాడు. నారాయణరావుగారికి నమ్మక తప్పలేదు. "అంతే అయివుంటుంది లేకపోతే కొడుకుదగ్గర డబ్బెక్కడ వుంటుంది?" అని వూరుకున్నాడు.
ఆ తర్వాత శంకరం, రాముడ్ని పిలిచి అడిగాడు ఆ రూపాయి బేడా ఎలా పోయిందని రాముడికేం గుర్తులేదు. వాడేం చెప్పలేకపోయాడు. "ఆ కొట్టువాడు నాకిచ్చాడో లేదో గుర్తులేదండి ఇస్తే నేను పారేశానేమో ఒకవేళ" అన్నాడు. శంకరం వెంటనే వెచ్చాలషాపుకి బయల్దేరాడు. వెళ్ళగానే ఆ షాపు యజమాన్ని చూస్తూ "ఇందాక మీరు రాముడికి రూపాయి బేడా యిచ్చారా లేదా?" అనడిగాడు గట్టిగానే షాపువాడు వెంటనే గల్లాలోంచి ఆ డబ్బుతీసి యిచ్చేస్తూ, "ఇందాక నేను ఆ డబ్బు తీసి యిద్దామనుకుంటుంటేనే ఆ కుర్రాడు పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడండి. ఒకళ్ళ సొమ్ము మా కెందుకండీ? అన్యాయం సొమ్ము" అన్నాడు. శంకరం మాట్లాడకుండా ఆ డబ్బు తీసుకుని యింటిదారి పట్టాడు.
6
నాటకం వేసేరోజు క్రమేణా సమీపించింది. శంకరానికి ఉత్సాహంతో పాటు భయంకూడా ఎక్కువవుతూ వచ్చింది. మేష్టారు నాన్నగారిని కూడా నాటకానికి రమ్మనమని చెప్పారు. బహుశా వీలైతే ఆయనకూడా వస్తాడు. ఆయన ముందు తను ఇంటిదొంగగా ఎలా నటించటం?
ఆయనకుగాని తనమీద ఏమీ అనుమానం కలగదు కదా! ఏమిటి చెయ్యటం? శంకరం ఏమీ ఆలోచించుకోలేకపోయాడు. చివరికి ఒక నిశ్చయానికి వచ్చాడు. ఏమవుతుంది? నాన్న తనను ఎందుకని అనుమానిస్తాడు? అది నాటకమని తెలుసుగా? అయినా ఆయనకు యింతవరకూ యింట్లో డబ్బు తనే తీశానని అనుమానం లేదు. ఎలా వస్తుంది? తను అనుమానం వచ్చేట్లు చెయ్యడుగా? మొన్న పెట్లోంచి తీసిన డబ్బుగురించి ఆయనింకా చూసుకోలేదు. అప్పుడే చూసుకోడు ఆ డబ్బు ఏ బ్యాంకికి తీసుకుపోయేటప్పుడో చూసుకుంటాడు. అయినా తనమీదకు రాదు.
శంకరానికి కొద్దిగా ధైర్యం వచ్చింది.
నాటకంరోజు రానే వచ్చేసింది. శంకరం తన స్నేహితులందరికీ తప్పకుండా రమ్మని మరీ మరీ చెప్పాడు. చలానికి ప్రత్యేకంగా చెప్పాడు. అన్నట్లు చలం తండ్రికి మొన్ననే ఎక్కడో పని దొరికింది. ఎనభైరూపాయలిస్తున్నారట. ఈ విషయం శంకరంతో చెప్పి మురిసిపోయాడు చలం. తనతండ్రితో చెప్పి అతను తనకోసం జీతంకట్టిన డబ్బు ఇప్పించేస్తానంటే "పిచ్చి పిచ్చి వేషాలేం వెయ్యబోకు" అన్నాడు శంకరం.
బావనీ, అక్కయ్యనికూడా రమ్మని ఆనాడు యింకా యింకా పిలిచాడు శంకరం. వాళ్ళమ్మని మాటవరుసకైనా పిలవలేదు. పిలిచినా ఆవిడ రాదని తనకు తెలుసు. రాకపోయినా యిష్టమే. తండ్రివిషయమే ఎటూ తేలలేదు అతనికి. కాని అంతలోనే అర్ధమయే పరిస్థితి ఏర్పడింది. తెలుగు మాస్టారు ప్రత్యేకంగా తన యింటికి వచ్చి తన తండ్రిని పిలిచాడు. ఆయన మొదట "పోనీండి, పిల్లలు వేసే నాటకానికి నేను రాకపోతేమట్టుకేం?" అని తప్పించుకోబోయాడు. కాని తెలుగుమేష్టారు "అలా కాదు మీవంటి పెద్దలుకూడా చూసి కళలోని సారాంశం గ్రహించాలనేగా మా అభిమతం. కాబట్టి మీరెలాగైనా వచ్చితీరాలి" అని బలవంతం చేశాడు. నారాయణరావుగారికి తప్పించుకు నేందుకు ఎంత ప్రయత్నం చేసినా వీలులేకపోయింది. తప్పక చివరికి వస్తానన్నాడు.
సాయంత్రం ఏడయేసరికి అందరు పిన్నా-పెద్దా చాలామంది స్కూలు ఆవరణలో చేరుకొన్నారు. తెలుగుమేష్టారు కష్టపడి స్టేజి అందంగానే అమర్చారు. మొత్తంమీద ప్రేక్షకులు అనుకున్నదానికంటే ఎక్కువగానే వచ్చారు. నాటకం ప్రారంభమయ్యేముందు తెలుగుమేష్టారు స్టేజిమీదకు ఎక్కారు. "మీరు యిప్పుడు చూడబోయే నాటకంపేరు పిల్లదొంగ. ఒక చిన్న కుర్రవాడి మనస్తత్వం యిందులో మీరు నిశితంగా అర్ధం చేసుకోగల్గుతారు. పిల్లలకు ఏది తప్పో, చెడ్డో తెలియదు. తమబుద్దికి ఏది తోస్తే అలా చేస్తారు. వాళ్ళని మంచి త్రోవలో పెట్టటం పెద్దవాళ్ళ విధి. పెద్దవాళ్ళు పిల్లల్ని అర్ధం చేసుకొని వాళ్ళమనస్సుకు సరిపోయేటట్లు నచ్చేమాటలు చెప్పి పెడత్రోవను పోకుండా అరికట్టాలి. లేకపోతే ఎందుకూ కాకుండా చెడిపోతారు. ఈ నాటకంలో అలానే అల్లరి తిరుగుళ్ళు తిరిగి చెడిపోయి చివరికి ఎలానో బుద్దితెచ్చుకున్న ఒక కుర్రవాడి కథను చూస్తాహరు. ఇది నా మొదటి ప్రయత్నం ఏమైనా తప్పులుంటే క్షమించాలి" అంటూ కూచున్నారు. కరతాళధ్వనులు చేశారు ప్రేక్షకులు.
హెడ్ మాస్టర్ గారు, శంకరం తండ్రి, బావ, అక్కయ్య ఇంకా కొద్దిమంది ప్రముఖులు ముందువరుసలో కూర్చున్నారు తెర లేచింది.
మొదటి రంగం: కుర్రవాడి బాగోగులను గురించి తల్లిదండ్రులు మాట్లాడుకుంటూ వుండటం. "మన కుర్రవాన్ని ఎంతో బుద్దిమంతుడుగా చెయ్యాలి. వాడు పెద్దవుతే మణిపూసవంటివాడుగా తయారవ్వాలి" అంటాడు తండ్రి. "అదెలాగ సంభవం? వాడి మనస్సుని బట్టి వుంటుంది కాని మీరు తలుచుకుని ఎలా తయారు చెయ్యగలరు? అంటుంది తల్లి. "నీకు తెలీదు చూస్తూ వుండు. నేను చెప్పేమాటలు కొన్ని ఆచరణలోపెట్టు. వాడిని అడ్డమయినవాళ్ళతో తిరగనివ్వకు. ఖర్చుకి కాణీ యివ్వబోకు. వాడికి ఏంకావాలో అవన్నీ యింట్లోనే చేసిపెడదాం. ఎక్కడికీ తిరగనివ్వద్దు. చూద్దాం వాడెందుకు మాణిక్యం వంటివాడు కాడో!" అంటాడు. తల్లి దానికి సరేనని ఒప్పుకుంటుంది. (మొదట పిల్లలకు చెప్పినదానికన్నా బాగా వుంటుందని మేష్టారు కొద్దిగా మార్పుచేశారు)
రెండో రంగం: తల్లి యింట్లో పనిచేసుకుంటూ వుంటుంది. అబ్బాయి కుర్చీలో కూర్చుని ఏదో పాఠ్యపుస్తకం చదువుకుంటూ వుంటాడు. గోడమీది గడియారం టైం అయిదున్నర చూపిస్తూ వుంటుంది. (సాయంత్రం) ఇంతలో ఒక స్నేహితుడు వస్తాడు. అబ్బాయిని పిలుస్తాడు. "ఎందుకురా?" అంటాడు అబ్బాయి. "లీలామహల్లో బలే పిక్చర్ వుంది పోదాం వస్తావా?" అంటాడు స్నేహితుడు. "మా అమ్మ కోప్పడుతుందేమో" అంటాడు. అబ్బాయి "ఫర్వాలేదులే అడుగు" అంటాడు స్నేహితుడు "అమ్మా అమ్మా ఇవాళ మంచి సినిమా వుంది. నేను వెళ్తానే" అంటాడు అబ్బాయి. అమ్మకు కోపం వస్తుంది. "ఇంకేం పన్లేదా? ఎప్పుడూ సినిమాలేనా?" అని తిడుతుంది. అబబాయి గునుస్తాడు. అమ్మకు యింకా కోపం ఎక్కువవుతుంది. "ఏమన్నా బాగుపడదామనేనా సినిమాలు చూసి?" అని కోప్పడుతుంది. అబ్బాయి స్నేహితున్ని పిలిచి "నీకేం పనిలేదూ? నువ్వు చెడిపోయేది కాక అందర్నీ చెడేట్లు చేద్దామనుకుంటున్నావా? రేపటినుంచి మా యింటికిరా, కాళ్ళు విరగ్గొడతాను" అని అదిలిస్తుంది. స్నేహితుడికి భయంవేసి పారిపోతాడు. అబ్బాయి కళ్ళు తుడుచుకుంటూ వుంటాడు. తెర పడుతుంది.