Previous Page Next Page 
పసుపు కుంకుమ పేజి 29


    "అప్పుడే నిర్ణయం తీసుకోలేకపోతున్నావా? టైము తీసుకో, ఫర్వాలేదు" అంటూ మళ్ళీ శంకర్ దగ్గరకు వెళ్ళాడు. "ఈ డబ్బు తీసుకో."

    శంకర్ లో చలనం లేదు.

    అతను ఆజ్ఞాపిస్తున్నట్లు 'టేకిట్!' ఉరుము ఉరిమినట్లు......అరిచాడు.

    శంకర్ త్రుళ్ళిపడినట్లయి అప్రయత్నంగా చేతులు చాపి ఆ నోట్లకట్టలు అందుకున్నాడు.

    ఉన్నట్లుండి పిచ్చి పట్టినట్లుగా శేఖర్ గట్టిగా నవ్వాడు.

    "యు ఆర్ గ్రేట్ శంకర్! నువ్వు చాలా పనులు చెయ్యగలవు. ఊఁ ఇహ వెళ్ళిపో. ఐ సే గెటవుట్!"

    శంకర్ ఒక్కక్షణం స్నేహితుడి కళ్ళలోకి చూశాడు.ఆ సమయంలో ఏమనడానికీ అతనికి ధైర్యం లేకపోయింది. మంత్రబద్ధుడైనట్లు తలవంచుకుని అక్కడ్నుంచి బయటకు వెళ్ళిపోయాడు.

    ఆవేశంలో ఊగిపోయినట్లు, దాన్ని బలవంతంగా అణచుకుంటున్నట్లు కనబడుతున్న శేఖర్....అతని ముఖమంతా ఎర్రని జ్వాలలు అంతలోనే అంతరించి హఠాత్తుగా నల్లబడినట్లయిపోయాడు. ముఖమంతా చెమటలు క్రమ్మివేశాయి. గుండెదగ్గర పెద్దనొప్పి వచ్చింది. వగరుస్తున్నాడు. తట్టుకోలేకపోతున్నాను.

    మాలతి గ్రహించింది. ఆందోళనతో "శేఖర్!" అంటూ వచ్చి అతని భుజంమీద చెయ్యి వేయబోయింది.

    "ఊఁ" అంటూ మెరుపులా ఆమెను నెట్టేశాడు. " డోన్ట్ కమ్ టు మీ."

    "ఏమండీ!"

    "ఇంతవరకూ ఏ స్పర్శకోసం తపించానో ఆ స్పర్శ ఇప్పుడు నాకు రోత కలిగిస్తుంది. సారీ మాలాతీ! నిజం మాట్లాడకుండా వుండలేకపోతున్నాను."

    చాలాసేపు ఇద్దరూ మాట్లాడకుండా మౌనంగా వుండిపోయారు. చివరకు మాలతి జాలిగా అడిగింది. "ఏమండీ! ఇప్పుడు నన్నేం చెయ్యమంటారు?"

    "నేను అడిగే ప్రశ్న నువ్వు అడుగుతున్నావా మాలతీ! ఇది నాకు నేను వేసుకుంటూన్న ప్రశ్న. నిన్ను నేను అడుగుదామనుకుంటున్న ప్రశ్న."

    ఏం చెప్పాలి? అసలిలాంటి సన్నివేశంలో ఏం జరుగుతుంది?

    "మిమ్మల్ని క్షమాపణ కోరే అర్హత నాకులేదు. ఏ శిక్ష విధించాలో మీరే నిర్ణయించండి."

    "నేనిప్పుడు శిక్షలగురించి ఆలోచించే స్ధితిలోలేను మాలతీ! నాగుండెలో రగిలే మంటల్ని ఎలా చల్లార్చగలనా అని ఆలోచిస్తున్నాను. ఈ అనుభవంలో ఇంత అసూయ దాగివుంటుందా? ఇంత ద్వేషం వుంటుందా? ఇంత బాధ వుంటుందా? ఈ మాటలని ఎలా భరించను? నేనెందుకింత ఉడికిపోతున్నాను? ఎందుకింత పిచ్చెక్కిపోతున్నాను?"

    ఆ సన్నివేశాన్ని మాలతి తలుచుకోలేక, నిస్సహాయురాలయిపోయింది.

    "ఏమండీ! మీ బాధ నేను చూడలేకపోతున్నానండీ!"

    అతను ఆమెవంక సానుభూతిగా చూశాడు. "అవును మాలతీ! ఇంత భీభత్సంలోకూడా నిన్ను చూస్తే జాలేస్తోంది. నేను నాగురించే  బాధపడుతున్నాను. నువ్వు నీగురించి బాధపడుతూ, నాగురించి బాధ పడుతున్నావు" అతని కళ్ళలో నీళ్ళు గిర్రున తిరుగబోతుంటే నిగ్రహించుకున్నాడు.      

    "మాలతీ! ఎందుకిలా జరిగింది? కలలోనైనా ఊహించనిది, ఊహనైనా తలంచలేనిది ఎందుకు జరిగిపోయింది?....."ఆమెకు దగ్గరగా వెళ్లాడు.

    "ఎందుకిలా చేశావు?"

    ఆమె తన కన్నీళ్ళతో అతని కళ్లలోకి చూసి, ఆ కళ్ళు దించేసుకుంది.

    "నువ్వు చెప్పవు. చెప్పలేవు కానీ ఫలితం మాత్రం ఇద్దరం అనుభవిస్తున్నాం. మాలాతీ! ఈ కాస్త వ్యవధిలో రకరకాలుగా ఆలోచించాను. నాకు ఒక్కటే పరిష్కారం కనబడుతోంది. మనం....."

    తను ఊహిస్తున్నది అతన్ని చెప్పవద్దన్నట్లు దీనంగా, అర్ధిస్తున్నట్లు చూస్తున్నది.

    "మనం...... విడిపోవాలి....."

    మాలతి మళ్ళీ భోరుమని ఏడ్చేసింది. "నాకు తెలుసండీ, ఈ మాట అంటారని. కానీ వద్దండీ. ఇంకేదన్నా పరిష్కారం సూచించండీ.........!"

    "నేను మానవుణ్ణి మాలతీ! అంతకంటే మరో మార్గం కనిపించటంలేదు."

    "వద్దండీ! అంతటి శిక్ష విధించకండి. ఒకవిచిత్రమైన క్షణంలో విపరీతమైన మానసిక సంక్షోభంలో వున్నప్పుడు జరిగిపోయిన సంఘటనకు ఇంతటి దారుణమైన ముగింపు వద్దండీ!.....నన్ను ప్రేమించి పెళ్ళిచేసుకున్నారు. మీ మాలతినండి........ఇంత తొందరగా దూరం చేసుకుంటారా?"

    "నా మాలతి....." వణికే పెదవులతో నవ్వాడు.

    "అవును. ఆ మాట చెప్పడానికి ఇంతకన్నా హీనమైన స్ధితిలో కూడా వెనుకాడను. నేను మీ మాలతినండీ. ముమ్మాటికీ మీ మాలతినండీ."

    "కాదు కాదు కాదు" అని అరిచాడు శేఖర్ బిగ్గరగా. "నా మాలతి ఇప్పుడు లేదు. నాకు కావాల్సిన మాలతి ఇప్పుడు లేదు."

    అయ్యో! జీవితాలు ఎంత భయంకరంగా వుంటాయి? ఇష్టంలేని అనుభవాలను భరించాలి. ఇష్టంలేని సంక్షోభాలను భరించాలి. జీవితంలో ప్రేమలు లేవు, మాధుర్యాలు లేవు. నమ్మకాలు లేవు. బంధాలు లేవు......

    మాలతికి లోపల్నుంచి ఆవేదనతో కూడిన ఉద్రేకం పొంగుకువచ్సింది. మాట్లాడకుండా వుండలేకపోయింది. "లేవనకండి, ఉన్నాయి. ఒకసారి తప్పు చేసినంత మాత్రాన మరో మనిషినిగురించి అంత అన్యాయంగా మాట్లాడకండి. నేను తప్పుచేసి వుండవచ్చుగానీ వ్యభిచారిణిని కాదండీ. నేను పతితురాల్ని కావచ్చుగానీ అవినీతిపరురాల్ని కాదండీ."

    శేఖర్ ఆమెను అభిముఖంగా నిలబడి తదేకంగా చూశాడు. ఆ ముఖాన్ని విడిచిపెట్టలేదు, అంతకన్నా భరించలేదు.

    "ఆ తేడాలు, తారతమ్యాలూ నాకు తెలీదు మాలతీ!" మరీ కఠినంగా మారిపోతున్నాను. "నాకు తెలిసిన నిజమల్లా ఒక్కటే. నిన్ను నేను భరించలేనని. చూడూ! నువ్వు ఇక్కడ్నుంచి వెళ్ళిపో."

    "వెళ్ళనండీ! మిమ్మల్ని విడిచి వెళ్లలేను" అని మాలతి ఆక్రోసించింది. "నాకోసం కాదు, మీకోసం మిమ్మల్ని విడిచి వెళ్ళలేను. నేనులేని మీ జీవితం ఊహించడం నావల్లకావడం లేదండీ....."

    "మాలతీ! కబుర్లు కట్టిపెట్టు. వెడతావా? లేదా?"

    సరిగ్గా ఆ సమయానికి లోపల్నుంచి గోపయ్య పరుగెత్తుకు వచ్చాడు. జరిగిందంతా అతను వింటూనే వున్నాడు. అతని కళ్ళవెంబడి నీళ్ళు కారుతున్నాయి.
 యజమానితో అతనెప్పుడూ అవసరాల్ని మించి మాట్లాడడు. ఇప్పుడా అవసరంలోని బలం అతన్ని మాట్లాడేటట్లు చేసింది.                                                                                     

 Previous Page Next Page