Previous Page Next Page 
బ్లాక్ మాంబా పేజి 29


    "స్పెషల్ క్లాసెస్ కి వెళ్తున్నానని చెప్పి రోజూ చేస్తున్నదిదన్నమాట!" ఇప్పుడు కారుని ఓ సందు మొగ్గ దగ్గర ఆపేశాడు. "దిగు."

    అర్ధం కానట్టు చూశాడు చంద్రం.

    "ఈ ఏడాదితో గ్రాడ్యుయేషన్ పూర్తవగానే సమీరకి పెళ్ళిచేసి కెనడా పంపేద్దామనుకుంటున్నాను చంద్రం. నీకు తెలుసుగా సమీరని నేనెంత ప్రేమించేదీ"

    "యస్సర్" మసక వెలుతురులో సైతం శివానంద్ మొహంలోని భావాల్ని స్పష్టంగా చూడగలుగుతున్నాడు చంద్రం.

    ఎలాంటి సమస్యనైనా సునాయాసంగా తీసిపారేయగల శివానంద్ ప్రస్తుతం కొద్దిగా అలజడి చెందుతున్నాడు. ఆ విషయం స్పష్టంగానే బోధపడిపోయింది.

    "వ్యాపారంలోగాని, వ్యవహారంలోగాని నాన్చడం నాకు చేతకాదని నీకు తెలుసు..." ఓ క్షణం సాలోచనగా ఆగాడు. "వాడెవడన్నదీ తెలుసుకో...నచ్చచెప్పడానిక్కాదు...నిశ్శబ్దంగా పైకి పంపేయడానికి."

    "సర్" శివానంద్ నోట ఇలాంటి మాటలు వినడం చంద్రానికి తొలిసారి.

    "తప్పదు చంద్రం...ఒక్కగానొక్క కూతురు కదూ...దాని సుఖంకోసం ఈ ఒక్క హత్య తప్పదనుకుంటాను" కారు ముందుకు సాగిపోయింది.

    ఒక ష్రూడ్ బిజినెస్ మేన్ గా ప్రసిద్ధి పొందిన శివానంద్ తీసుకున్న ఏ నిర్ణయమైనా తిరుగులేనిది.

    ఇప్పుడు చంద్రం ఒక బాధ్యతని అంగీకరించిన వ్యక్తిలా పార్కువేపు నడుస్తున్నాడు.

    అప్పటికే భరత్ మోటార్ బైక్ స్టార్టు చేస్తున్నాడు. సమీర నడుపుకువెళుతున్న ఫియెట్ ని చూస్తూ...

    ఓ చెట్టువారన నిలబడ్డ చంద్రం భరత్ రూపాన్ని మాత్రమే కాదు, మోటార్ బైక్ నెంబర్నీ స్పష్టంగా చూసాడు. అది చాలు వివరాలు తెలుసుకోడానికి.

    సరిగ్గా ఇదే సమయానికి...

    పార్కుని దాటి జనారణ్యం వేపు దూసుకుపోతున్న పధ్నాలుగు అడుగుల 'బ్లాక్ మాంబా' బేగం పేట బ్రిడ్జికి సమీపంలోని ఓ పొదమాటున ఆగింది...

    చేరువలో హోరుమంటూ పరుగెత్తే కార్లు, నడుస్తున్న మనుష్యుల పాదాల తాకిడితో శరీరాన్ని చేరుతున్న శబ్ద ప్రకంపనలు సహనాన్ని నశింపచేస్తున్నాయి.

    తల్లితో అన్నం తిననని మారాం చేస్తున్న ఓ ఆరేళ్ళ పసిపిల్లాడు గుడిసెలో నుంచి బయటకు వచ్చి ఇప్పుడు ఆ పొద పక్కన చతికిలబడి ఏడుస్తూ కాళ్ళను నేలపై తాటిస్తున్నాడు.

    బ్లాక్ మాంబా నోరు ఊదిన బూది కుంపటిలా తెరుచుకుంది.


                       *    *    *    *


    "వ్వాట్" పార్శిల్ ని తెరిచిన డాక్టర్ శృతి స్థాణువులా నిలబడిపోయింది.

    సర్పాన్ని ఒడుపుగా అందుకుని కేజ్ లో వుంచాలని చాలా ప్రిపేర్డ్ గా వున్న జయేంద్ర కూడా అరక్షణం పాటు అప్రతిభుడయ్యాడు.

    పార్శిల్లో 'బ్లాక్ మాంబా' లేదు.

    తెల్లగా వున్న ప్లాస్టిక్ పేకెట్సు వున్నాయి. ఓ పేకెట్ ని అందుకుని వాసన చూసిన డాక్టర్ శృతి ఆ పార్శిల్లో ఉన్నది 'హెరాయిన్' అని సునాయాసంగానే గుర్తించింది.

    ఏళ్ళ తరబడి ఎంతో ప్రయాసంగా ఎదురుచూసినందుకేమో ఆమె నుదురు స్వేదంతో నిండిపోయింది. "హోవ్...హోవ్ డిడ్ దిస్ హేపెన్...ఇదెలా మనకొచ్చింది?" మరోమారు పార్శిల్ పేకేజిపైన అక్షరాల్ని చూసింది. "స్నేక్... హేండిల్ విత్ కేర్" స్పష్టంగా కనిపిస్తున్నాయి.

    "మిస్ ప్లేస్ అయ్యుంటుంది."

    తల పంకించింది భావరహితంగా...అదీ అరక్షణంపాటే... వెనువెంటనే ఉద్వేగం ఒక తరంగంలా ఉబికి ఆమెను నిలువునా ఆక్రమించింది. "గాడ్!" ఆమె పెదవులు అదురుతున్నాయి. "ఇప్పుడు...ఇప్పుడెలా."

    "ఏమైంది శృతీ."

    వెంటనే ఆమె ఎయిర్ పోర్టు ఎంక్వయిరీకి ఫోన్ చేసింది.

    మొత్తం పార్శిలన్నీ అందచేయబడ్డాయి. అంటే 'బ్లాక్ మాంబా' ఉన్న పార్శిల్ కూడా ఎవరో తీసుకుపోయారు.

    అదికాదు ఆ క్షణంలో ఆమె ఆలోచిస్తున్నది.

    పొరపాటున ఎక్కడ జరిగినాగాని ఇప్పుడు కొన్ని ప్రాణాలకు హాని జరగబోతూంది. అసలు పొరపాటు ఎక్కడ ఎలా జరిగింది.

    ఆమె వూహకి అందడం లేదు.

    కంపించిపోతూంది డాక్టర్ శృతి. "జయేంద్ర" గొంతు తడారిపోతున్నట్టుగా అంది. "హెరాయిన్ లాంటి మాదకద్రవ్యంగల ఈ పార్శిల్ పై 'స్నేక్' అన్న అక్షరాలు ఎందుకు రాయబడ్డాయో అలా రాయడంలో గల ఆంతర్యమేమిటో నాకు తోచడంలేదు...కారణం ఏదైనా కావచ్చు. కాని ఇప్పుడు ప్రమాదం జరిగిపోతూంది...ఇప్పుడెలా..." బాధగా కణతలు నొక్కుకుంటూ కుర్చీలో కూలబడింది.

    "నా అంచనా తప్పుకాకపోతే... ..." జయేంద్ర విషయాన్ని క్రమంగా విశ్లేషిస్తూ చెప్పాడు. "ఆ పార్శిల్ 'స్నేక్' అన్న అక్షరాలతో అందర్నీ మభ్యపెట్టిన ఆ స్మగ్లర్ ని చేరుకుంటుంది....కోట్ల లాభాన్ని అక్రమంగా ఆర్జించగలుగుతున్నామన్న ఆలోచననుంచి అతడు తేరుకోక ముందే బ్లాక్ మాంబా కాటుకి గురై బహుశా అక్కడ కొందరు ప్రాణాలు కోల్పోతారు.

    "అక్కడితో ఆగితే ఫర్వాలేదు జయేంద్రా. బ్లాక్ మాంబా ఎంత ప్రమాదకరమైన విషసర్పమూ అంటే కాటువేసిన మరుక్షణం అసాధారణమైన వేగంతో బయటపడుతుంది...తన ఒంటి నిడివిని తగ్గించుకుని చిన్న రంధ్రంలోనుంచి సైతం ప్రపంచంలో అడుగుపెడుతుంది. అది కూడా కాదు. బ్లాక్ మాంబా విషం రెండు మిల్లీలీటర్లుచాలు ఒక మనిషి ప్రాణం తీయడానికి. సుమారు రెండువందల మిల్లీలీటర్ల విషాన్ని గ్రంధుల్లో దాచుకున్న బ్లాక్ మాంబా ఒకే వరుసలో వందమందిని చంపగలదు... అక్కడితో ఈ మారణ హోమం ఆగుతుందీ అన్న గ్యారంటీ కూడా లేదు."

    జయేంద్ర సైతం అబ్బురంగా వింటున్నాడు.

    "జయేంద్రా" ఒక అసాధారణమైన చరిత్రగల బ్లాక్ మాంబా గురించి తెలిసిన విషయాలను మననం చేసుకుంటూ ఉద్విగ్నంగా చెప్పుకుపోయింది. "వరుసగా ముగ్గురు నలుగుర్ని కాటేసాక గ్రంధుల్లోని విషం ఇంకిపోయి తర్వాత మనిషిని మరో నెలదాకా కాటేసినా అది డ్రై బైట్ గా మారి ఎలాంటి హానీ జరక్కపోవడం మనదేశంలోని సర్పాలకు సంబంధించిన లక్షణం. కాని 'బ్లాక్ మాంబా' పరిస్థితి అలాంటిది కాదు జయేంద్రా...కొన్ని గంటల వ్యవధిలో గ్రంధుల్లో విషం పేరుకుంటుంది. డ్రై బైట్ అన్న ప్రసక్తిలేకుండా అది కాటేసిన ప్రతి మనిషి ప్రాణమూ పోతూనే వుంటుంది. గాట్ ఇట్స్ క్రానికేన్వూరోటాక్సిన్...కాబట్టే మన ఏంటీవీనమ్ ఇంజక్షన్స్ దానికి పనిచేయవు" ఒక అపూర్వమైన ప్రయోగంకోసం రప్పించబడిన సర్పం చేజారిందన్న బాధకన్నా ఆ క్షణంలో ఆమె ఆలోచిస్తున్నది నిన్ననే సర్పాల మూలంగా ముగిసిన నరమేధం ఇప్పుడు బ్లాక్ మాంబాతో మళ్ళీ మొదలు కాబోతూందని. 

    భయ విహ్యలత అణగదొక్కే కాలసర్పంలా మనసులో బుసకొడుతుంటే నిన్నదాకా విన్న తల్లులూ పిల్లల ఆక్రంధనలే గుర్తుకొచ్చాయో లేక ఇప్పుడు మళ్ళీ అలాంటి స్థితికి పరోక్షంగా తన పొరపాటే కారణమయ్యిందన్న బాధో ఆమె కళ్ళలో గిర్రున నీళ్ళు తిరిగాయి.

    "లేదు జయేంద్రా...ఏది ఏమన్నాకాని ఈ మారణహోమాన్ని ఆపాలి. ఇందులో బలికాబోతున్న ఎలాంటివాడన్న కానియ్ వెంటనే రక్షించాలి" ఆమెకు ఆ సమయంలో డి.సి.పి. ప్రసన్న గుర్తుకొచ్చాడు.

    సరిగ్గా అప్పుడు ఫోన్ రింగయింది.

    ఆ చప్పుడు గుండెలపై సమ్మెటపోటులా వినిపించింది.

    బలాన్ని కూడగట్టుకుంటూ రిసీవర్ అందుకుంది. "హలో!"

    "బాగున్నావా శృతీ" బొంగురుగా వినిపించింది. "కంగారుపడకు...నేను బ్లాక్ మాంబాని."

    ఓ క్షణంపాటు ఆమె ఊపిరి పీల్చడం మర్చిపోయింది.

    "నా పార్శిల్ నీ దగ్గర కొచ్చినట్టుంది కదూ..."

    "ఆ...!" తలాడించింది స్వప్నంలోలా "అవును."

    "చిత్రం చూశావా...నీకు అందాల్సిన పార్శిల్ నా దగ్గరుంది!"

    "తెరిచారా" ఉద్వేగంగా అడిగింది. "అందులో బ్లాక్ మాంబా చాలా ప్రమాదకరమైంది."

    "పాపం ఇంకా మత్తులోనే వుంది నిద్రపోతూ...చూస్తాను."

    థేంక్ గాడ్" అసంకల్పితంగా అనేసింది తేరుకుంటూ.

 Previous Page Next Page