Previous Page Next Page 
కోమలి పిలుపు పేజి 29

    ఇంతవరకూ ఆమె ముఖమైనా చూడలేదు నేను. ఈ రోజామె నాఇంటి తలుపు తడుతున్నది.
   
    ఎందుకు?
   
    ఆ ఇంట్లో ఆమె ఒంటరి.
   
    ఈ ఇంట్లో నేను ఒంటరి.
   
    ఆమె నన్ను కల్సుకోవాలనుకుంటున్నది, ఎందుకు?
   
    నాలోని శ్రీరామచంద్రుడు మేల్కొన్నాడు.
   
    కానీ అంతలోనే వివేకమూ మేల్కొన్నది.
   
    ఆమె నాయింట అద్దెకుంటున్నది. ఎంతసేపూ నన్ను నేను సచ్చీలుడిగా భావించుకుంటూ ఇతరుల ప్రవర్తనను శంకించడం నా మనోదౌర్భల్యమే అవుతుంది. ఇంతకాలం నాకంటపడని ఆమె వున్నట్లుండి నా కంటపడాలని ఎందుకు అనుకుంటుంది?
   
    ఆమెకు ఏదో అవసరం వచ్చి వుంటుంది.
   
    సాయపడటం నా కర్తవ్యం.
   
    చటుక్కున తలుపు తీసి కాస్త వెనక్కు వెళ్ళాను.
   
    ఆమె.... డాక్టర్ విలాస్ భార్య.
   
    ఎప్పటలాగే నిండా మేలిముసుగు వేసుకుని ఉన్నది. అయినప్పటికీ తలవంచుకుని వుంది.
   
    ఆమె చేతులు, పాదాలు నాకు కనబడుతున్నాయి. అవి ఎంతో చక్కగా వున్నాయి.
   
    చేతికున్న ఎర్రరాయి ఉంగరం, పాదాలకున్న మట్టెలు నా వివేకాన్ని హెచ్చరిస్తున్నాయి.
   
    "ఏమయిందండీ?" అన్నాను.
   
    "నా స్నేహితురాలు కోమలి వచ్చింది. మిమ్మల్ని కలవాలనుకుంటున్నది. నేను దాన్ని పంపిస్తాను. మీరు దానికీ అలవాటు మంచిదికాదని నచ్చజెప్పి పంపేయండి" అన్నదామె.
   
    ఆమె స్వరం గుస గుసలాడుతున్నట్లుంది. ఈ విధంగా నాతో మాట్లాడవలసి వచ్చినందుకు బాధపడుతున్నది కూడా.
   
    నేనేదో అనేలోగా ఆమె చటుక్కున వెనుదిరిగి తన వాటావేపు వెళ్ళిపోయింది.
   
    నేను నివ్వెరపోయి చూస్తున్నాను.
   
    ఇప్పుడు కోమలి ఇక్కడకు వస్తుందా? ఆమె ఈమెకు స్నేహితురాలా?
   
    కోమలి ఇప్పుడు ఇక్కడకు ఎలా వచ్చింది!
   
    అప్రయత్నంగా నేను తలుపుదాకా నడిచాను.
   
    లోపలి గదిలోంచి మాటలు వినబడుతున్నాయి.
   
    ఇద్దరు మాట్లాడుతున్నారని తెలుస్తుంది.
   
    కొద్దిక్షణాల్లో గదిలోంచి ఒకామె డ్రాయింగ్ రూమ్ లోకి వచ్చింది.
   
    "త్వరగా వచ్చేస్తావు కదూ?" గదిలోంచి ఆమె గొంతు.
   
    డ్రాయింగ్ రూమ్ లోని వనిత తలూపింది.
   
    నేను వెనక్కు తగ్గాను.
   
    మరికొద్ది క్షణాల్లో కోమలి నా డ్రాయింగ్ రూంలో అడుగు పెట్టింది. అడుగు పెడుతూనే ఆమె తలుపు వేసింది.
   
    "కోమలీ....నువ్వు...ఇక్కడ?" అన్నాను.
   
    "థ్రిల్లింగ్ గా వుందా?" అంది కోమలి.
   
    నేను కోమలివంకనే చూస్తున్నాను. ఆమె తలంటి పోసుకున్నది జుత్తు వదులుగా పాయలు పాయలుగా కట్టుకున్నది. నుదుట ఎర్రని కుంకుమబొట్టు నయాపైసంత ఉన్నది.
   
    తెల్లని మల్లెపూవులాంటి చీర....అదే రంగు రవిక.
   
    నేను కోమలిని పరిశీలనగా చూస్తున్నాను.
   
    ఆమె మెడలో ఓ నెక్లెసున్నది. మంగళసూత్రం ఉన్నట్లు లేదు.
   
    చేతికి ఉంగరాలు లేవు.
   
    కాళ్ళకు మట్టెలు లేవు.
   
    నిన్న నేను చూసిన కోమలి ఇలా లేదు.
   
    నేనింకా కోమలివంకనే చూస్తున్నాను.
   
    "థ్రిల్లింగ్ గా ఉందా?" అన్నది కోమలి మళ్ళీ.
   
    "ఊఁ" అన్నాను.
   
    "కూర్చుందామా?" అన్నదామె.
   
    తలూపాను.
   
    ఇద్దరం సోఫాల్లో ఎదురెదురుగా కూర్చున్నాం.
   
    "కోమలీ! నిన్నిక్కడ చూస్తాననుకోలేదు.
   
    "చూసినందుకు విచారంగ వుందా, సంతోషంగా వుందా?"
   
    "భయంగా వుంది."
   
    "భయమెందుకు? నీ భార్య ఇక్కడ లేదుగా?"
   
    "అందుకే భయం."
   
    "ఆమె నన్ను గంటలో వెనక్కు వచ్చేయాలన్నది. కానీ నీతో మాట్లాడుతుంటే నాకు టైమెలా తెలుస్తుంది?" అన్నది కోమలి.
   
    "ఆమె ఎవరు? నీకెలా తెలుసు!"
   
    కోమలి నవ్వి "డాక్టర్ విలాస్ కథంతా నాకెలా తెలుసుననుకుంటున్నావ్? మా ఇద్దరిదీ మంచిస్నేహం..." అన్నది.
   
    "మీకు స్నేహమెలాగయింది?"
   
    ఇద్దరం ఒకేరకం అవస్థలో వున్నాం."
   
    "అంటే!"
   
    డాక్టర్ విలాస్ నా వెంటపడ్డాడు. నేను లొంగలేదు. నా భర్త నన్ననుమానించే పరిస్థితులు కలగజేశాడు. నా భర్తకు నాపై విరక్తి పుట్టింది. నా జీవితం నాశనమయింది. నేనిప్పుడు డాక్టర్ విలాస్ వెంటపడ్డాను."
   
    "ఎందుకు?"
   
    "అతడిని అడుగడుగునా ఎదుర్కొంటాను. అతడి ఆటలు ఒక్కటీ సాగనివ్వను" అన్నది కోమలి.

 Previous Page Next Page