Previous Page
బంధితుడు పేజి 30


    ఒక్క క్షణం ఆగిపోయాడు.

    పద్మ ముఖం ఎలా చూడాలి?

    తనగాజులు ఏమైనాయంటే ఏం  సమాధానం చెబుతాడు?

    ఏం? ఎందుకు చెప్పలేడు? తన చెల్లేలి కిచ్చానని చెబుతాడు. తను చేయించిన వేగా?

    కాని తన చెల్లెలు ఏమంది? "ముష్టి గాజులు ణా కెందుకు? పెట్టుకు పెట్టుకు అరిగిపోయిన గాజులు ణా కెందుకూ?" అన్నది.

    ముందుకు బరువుగా అడుగులు వేస్తూ కదిలాడు.

    ఇల్లు దగ్గరపడుతూ వుంది. గుండె వేగం హెచ్చుతూంది.

    వాన రాబోయేముందు లేచే తూనీగల్లా సత్యనారాయణ బుర్రలో ఆలోచనలు రెక్కలు విప్పుకొని లేచాయి.

    సత్యనారాయణ ఇంటిముందుకు వచ్చి నిలబడ్డాడు.

    కాలు కదలడంలేదు.  శరీరం బండబారిపోయింది.

    స్థాణువులా నిలబడిపోయాడు.

    వీధి తలుపులు బార్లాగా తీసివున్నాయి.

    వాకిట్లో పల్చగా ఆడా మగా జనం వున్నారు.
   
    ఆ వాతావరణంలో ఏదో అపశృతి వినిపిస్తోంది.

    ఇంటిలోనుంచి ఘోల్లున ఏడ్పులు వినిపిస్తున్నాయి.

    సత్యనారాయణ ఒళ్ళు బిగిసిపోతూంది.

    ఎవరో వచ్చి సత్యనారాయణను పట్టుకొని లోపలకు నడిపించుకుపోతున్నారు.

    తనను ఎవరు పట్టుకున్నారో తెలియడంలేదు.

    ఎందుకు తను పట్టుకొని లోపలకు యాంత్రికంగా నడిచాడు. కలలో నడిచినట్టు నడిచాడు.

    ఇంటినిండా జనం గుమిగూడి వున్నారు.

    సత్యనారాయణ చూసి కళ్ళు తుడుచుకుంటూ దోవవదిలి ప్రేక్కకు జరిగారు జనం.

    సత్యనారాయణ రెండుడుగులు వేసి పిచ్చి చూపులు చూస్తూ నిలబడిపోయాడు.

    సత్యనారాయణను చూడగానే పద్మతల్లి, బందువులూ ఘోల్లుమన్నారు.

    సత్యనారాయణ భార్య నేలమీద చాపమీద పడుకొని, కళ్ళుతెరిచి రెప్పవేయ కుండా పైకి చూస్తూవుంది.

    ఆ చూపుకు అర్థం లేదు.

    చలనంలేదు.

    కాని సత్యనారాయణ ఆ చూపులో ఎన్నో అర్థాలు చదువుకున్నాడు.

    పద్మ తలదగ్గిర పెట్టిన దీపంలో పక్కన నుంచున్న ఒక  ముత్తేయిదువు నూనెపోసి నెత్తిని పైకి జరిపింది.

    "పాపం! అబిమానం గల ఆడది" జనంలోనుంచి ఓ ఆడగొంతు పలికింది.

    "ఇంత అఘాయిత్యం ఎందుకు చేసుకుందో?"

    "సుఖంగా వుండలేక"

    "కాదులే భర్త ఏదో అన్నాడట"

    "కొట్టాడట కూడా పక్కింటి ఆమె చెప్పింది. నిన్న పండగపూటంతా ఏడుస్తూనే వుందట?"

    "అతడు చూట్టానికి చాలా మేదకుడులా కన్పిస్తాడే!"

    "చాలా మంది మగవాళ్ళు ఊళ్ళో వాళ్ళముందు అలాగే కన్పిస్తారు. పెళ్ళాం దగ్గిరకు వచ్చేప్పటికే ఎక్కడలేని అహంకారం వస్తుంది ఈ మగాళ్ళకు"

    "ముత్తేయిదువు చావు! అదృష్టవంతురాలు!"

    రకరకాలు మాటలు జనంలోంచి వినవస్తున్నాయి.

    సత్యనారాయణకు ఆవేవీ విన్పించడంలేదు.

    అత్తగారు అల్లుడ్ని ఏడుస్తూనే తిట్టి పోస్తూ వుంది.

    సత్యనారాయణకు ఏమీ విన్పించడం లేదు  కనిపించడం లేదు.

    సత్యనారాయణ భార్య ముఖంలోకి చూస్తూ రాతి విగ్రహంలా నిలబడివున్నాడు.

    ఆ కళ్ళు సత్యనారాయణ ప్రశ్నిస్తున్నాయ్!___

    "ఏవీ ణా గాజులు? ణా గాజులు? నేను ఎంతో ఇష్టపడి చేయించుకున్న గాజులు? నేను పెట్టుకునే గాజులు? తీసుకెళ్ళి మీ చెల్లెలికి ఇస్తావా? అదీ దొంగతనంగా? నన్ను కొట్టి ణా నగలు నాకు తెలియకుండా తీసుకెళ్ళి చెల్లేలికిస్తావా? పెళ్ళాం అంటే నీకు అంత చులకనా?"

    ఎన్నో ప్రశ్నలు విన్పిస్తున్నాయి! సత్యనారాయణ చెవులకు? అన్నీ ప్రశ్నలే! సమాధానాలులేవు.

    కళ్ళు తిరిగి పడిపోతున్న సత్యనారాయణకు తనను ఎవరో రెండో చేతుల్తో పట్టుకున్నట్టు లీలగా అన్పించింది.

    పద్మ ఆరోజు రాత్రి....పండగనాటి రాత్రి...దీపావళి రాత్రి__దొడ్లోవున్న బావిలోపడి ప్రాణాలు తీసుకుంది. దీపావళినాడు ఇంట్లో దీపం వెలగలేదు.

    శవం పంచాయితీ జరిపి ఆత్మహత్య అని తేల్చారు.

    తన చావుకు తనే బాధ్యురాలననీ, దీనికి మరెవరూ బాధ్యులు కారని  రేసి పెట్టి చనిపోయింది పద్మ.

    చితిమీద పడుకున్న పద్మ కళ్ళు తలకోరివి పెడ్తున్న సత్యనారాయణకు "ఏవీ ణా గాజులు? ఏం చేశారు? చెల్లెలి కిచ్చారా? ణా గాజులు దొంగిలించి తీసుకెళ్ళారా నన్నడిగితే ఇవ్వనూ? మొదట కొంత గొడవపెట్టినా, మీరు బాధపడుతున్నారని తెలిస్తే ఇవ్వనూ?

    నన్ను కొట్టావు గదూ? నీ చెల్లెలికి నేనేం తక్కువ చేశాను? ఎన్నడైనా ఆ పిల్లమీద చాడీలు చెప్పానా?

    మీ ఇద్దరూ మేరీ పూలిష్ గా సినిమాల్లోని అన్నా చెల్లెళ్ళలా, ఎబ్బెట్టుగా, బాధ్యతల్ని విస్మరించి సెంటిమెంటల్ పూల్స్ గా  ప్రవర్తిస్తూ ఉంటే మీ భ్రమల్ని తొలగించాలని ప్రయత్నించాను.

    అంతేగాని సరోజ అంటే నాకు ద్వేషంలేదు.

    మీరంటే చిన్నచూపులేదు. అలాంటి భావం చాలా తలఎత్తిన  నాడు నేను మీతో మళ్ళీ కాపరం చేస్తానను కొన్నారా?

    మీరు కోపంలో కొట్టినందుకు నాకు బాధలేదు.

    మీరు నన్ను అవమానించారు.

    నీ చెల్లెలికోసం నన్నూ ణా బిడ్డల్నీ పండగపూట వదిలి వెళ్ళిపోయారు.

    అంత ఉపద్రవం ఏం వచ్చింది?

    ఆ ఉత్తరం నాకు చూపిస్తే నిజంగా సరోజ కష్టంలో ఉందంటే నేనే మిమ్మల్ని ప్రయాణం చేసే దాన్ని కాదా?

    ఏడేళ్ళు కాపరం చేసినా నన్ను అర్థం చేసుకోలేకపోయారు.

    నీలాంటి పూలిష్ మగవాడితో నేను జీవితాన్ని ముడివేసుకొని ఇక ఉండలేను.

    అందుకే వెళ్ళిపోయాను.

    ఈ మాటలు పద్మ అనలేదు.

    ఉత్తరంలో రాయలేదు.

    సత్యనారాయణకు ఆమె కళ్ళు తనను నిలదీసి అడుగుతున్నట్టుగా అన్పించింది.

    పద్మా!" గావుకేక పెట్టాడు.

    జుట్టు పీక్కున్నాడు.
   
    బావురుమని ఏడ్చాడు.

    "ఊరుకో సత్యం! లే! అసలే నీళ్ళలో నానిపోయిన శవం! త్వరగా కర్మకాండ జరిపించాలి."

    అలా ఊరడిస్తున్న వ్యక్తిని పిచ్చివాడిలా చూస్తున్నాడు సత్యం.

       
                             (శుభం)

 Previous Page