"నేను అందంగా ఉంటానని నాకు తెలుసు. ఈ అందం వయసుదేనని కూడా నాకు తెలుసు. ఇంకో ఇరవై ఏళ్ళుపోతే నేనెలాగుంటానో కూడా నేనూహించగలను. అందుకే మీలాంటి వారెవరైనా నాకుత్తరాలు రాస్తే నేను గర్వంతో పొంగిపోను. రాసినవాళ్ళను అసహ్యించుకోను. కాని మీరు చేసిన పని పొరపాటు అని మాత్రం నేను అనుకుంటాను. ఒకరకం పొరపాటును ఒక పర్యాయం క్షమించవచ్చు. రెండోసారి చేస్తే అది పొరపాటు కాదు. దానికి క్షమా లభించదు. అంతకుమించి నేను మీతో మాట్లాడవలసినదేమీ లేదు" అంది ఇందిర.
స్వామి అక్కణ్ణుంచి బయటపడ్డాక, ఇందిరణు మనసారా అభినందించుకున్నాడు. ఆమె నిజంగా చాలా తెలివైనది. లేకపోతే ఇప్పట్నీంచే తనకు పెళ్ళి ఏమిటి? పెళ్ళి చేసుకుని ఏం చేస్తాడు? తనకు జీవితంలో చేరుకోవలసిన గమ్యాలు కొన్ని ఉన్నాయి. అవి చేరకుండా తను సంసారం ప్రారంభించటం మాట అటుంచి__సంసార జీవితం గురించి ఆలోచించడం కూడా తగదు. ఇందిరను అభినందించుకుంటూనే అతను ఆమెతో తనని పోల్చుకుని__ఆలోచనల్లో ఆమెపాటి తెలివితేటలు లేని తను ఆమె కంటె వయసులో పెద్ద అని గుర్తించి సిగ్గు పడ్డాడు.
ఆ తర్వాత స్వామి ఆడపిల్లల అందం గురించి ఎక్కువగా ఆలోచించలేదు. అతను తన లక్ష్య సిద్ధి గురించి కృషి చేయాలని నిశ్చయించుకున్నాడు.
స్వామికి తల్లిదండ్రులున్నారు కాని లేనట్లే లెక్క! ఎనమండుగురు పిల్లల్నికన్న వారు__ ఆ ఎనిమిది నోళ్ళకూ తిండి కూడా పెట్టలేని స్థితిలో ఉన్నారు. వారి దగ్గర బంధువు, స్వామిని దత్తత చేసుకున్నాడు. ఫలితంగా స్వామి తల్లిదండ్రులకో ఎకరం భూమి ముట్టింది. స్వామి పెంపుడు తండ్రి కూడా మరీ ఎక్కువ డబ్బున్నవాడు కాదు. అయిదెకరాల పొలమూ, నేలకు అయిదారొందలొచ్చే ఉద్యోగమూ ఉన్నాయాయనకు. స్వామిని దత్తత చేసుకున్నాక పెంపుడు తల్లికి కడుపుపండి ముగ్గురు పిల్లలు పుట్టారు. అందులో ఇద్దరు ఆడపిల్లలు. స్వామిపైన పెంపుడు తల్లిదండ్రులకు అభిమానమున్నది కాని, అతనిపట్ల పూర్తి బాధ్యతలు వహించడానికి వారికి రెండు కారణాలడ్డు వచ్చాయి. స్వామి చదువు గురించి ఎక్కువ ఖర్చు పెడితే తర్వాతి పిల్లలకేమీ ఉండదన్న భయం ఒకటి. స్వామి పైకివస్తే తమపిల్లల నాదరించడేమోనన్న అపనమ్మకం రెండవది. ఈ రెండు కారణాల వల్లనూ హైస్కూలుతో అతని చదువుకు మంగళగీతం పాడాలని వారు నిశ్చయించుకున్నారు. ఏదో చిన్న ఉద్యోగం దొరికితే కొన్నేళ్ళపాటు వేన్నీళ్ళకు చన్నీళ్ళుగా తోడుగా ఉంటాడని కూడా వారు భావించారు.
అయితే స్వామికి బాగా చదువుకోవాలని ఉంది. అక్కడితో చదువు ఆపేసి ఉద్యోగం చేయడం అతనికి సుతరామూ ఇష్టం లేదు. అతను కన్నతండ్రి దగ్గరకు వెళ్ళి మొర పెట్టుకున్నాడు. కన్నతండ్రి పెంపుడు తండ్రి వద్దకు రాయబారం వెళ్ళాడు. అందుకు పెంపుడు తండ్రి మండిపడ్డాడు- "వాణ్ణి చదివించేశక్తి నాకు లేదు. నీకుంటే నువ్వు చదివించుకో. వాడు చదువుకుని వృద్దిలోకి వస్తే ఆ సంపాదన కూడా నాకక్కర్లేదు. నువ్వే అనుభవించు" అన్నాడు. ఆ మాటలకు కన్నతండ్రి హృదయం ద్రవించింది. తన సర్వస్వమూ ధారబోసినా కొడుకును చదివించాలనుకున్నాడాయన. కాని ఆయన సర్వస్వమూ ధారబోసినా కొడుకు చదువు ఎంతో దూరం వెళ్ళదని ఆయనకూ తెలుసును. ఆ సమయంలో ఆ ఊరి హెడ్మాస్టరు దేవుడిలా వీరికి సాయపడ్డాడు. స్వామికి మంచి స్కాలర్ షిప్ లభించింది. జాగ్రత్తగా ఉంటే ఆ డబ్బుతో అతనికి అన్ని ఖర్చులూ వెళ్ళిపోతాయి. ఎటొచ్చీ చదువుకుంటున్నంత కాలమూ అతనికి అన్ని పరీక్షల్లోనూ అరవైకి తక్కువ శాతం కాకుండా మార్కులు రావాలి. ఎప్పుడు తగ్గితే ఆ క్షణం నుంచి స్కాలర్ షిప్ ఉండదు.
ఈ స్కాలర్ షిప్ ని దేవుడిచ్చిన వరంగా భావించాడతను. అతని చదువు సలక్షణంగా సాగి పోవడమే కాక-కష్టపడి చదువు కోవలసిన బాధ్యత కూడా ఈ స్కాలర్ షిప్ అతనికి ఏర్పరచింది.
స్వామి తన తండ్రి కష్టాలను గమనిస్తూనే ఉన్నాడు. తను కష్టపడి చదువుకుని ఆయనకు సాయపడాలని అతననుకుంటున్నాడు. తన పెంపుడు తండ్రి అసూయ పడే స్థాయికి తను రావడమే కాక, తన కుటుంబాన్ని కూడా తీసుకు రావాలని అతననుకుంటున్నాడు. ఇంతవరకూ ఎన్నడూ అతనీ విషయంలో ఏమరలేదు. మంచి మార్కులు తెచ్చుకునేందు కింతవరకూ అడ్డదార్లు తొక్కలేదు. అన్నింటికీ స్వయం కృషి మీదనే ఆధారపడ్డాడు. అతని ప్రవర్తనలో ఇంతో అంతో లొసుగంటూ వచ్చిందంటే, అది ఇందిర విషయంలోనే కానీ, ఇందిర చాలా మంచి అమ్మాయి కావడం కారణంగా అతను తొందరగానే తన తప్పు తెలుసుకోగలిగ
2
అంత క్రితం సంవత్సరం ఆ కాలేజీకి గ్రాడ్యుయేట్ కోర్సులో చాలా తక్కువ శాతం కృతార్దత లభించింది. ఆ కారణంగా కాలేజీ ప్రిన్సిపాల్ ఈ సంవత్సరం పరీక్షలకు రెండు నెలల ముందు సెలక్షన్ ఎగ్జామినేషన్స్ ఏర్పాటు చేశాడు. అందులో నలభై శాతం అయినా రాని వారిని పబ్లిక పరీక్షలకు కూర్చోనివ్వనని ఆయన హెచ్చరించాడు. ఆ హెచ్చరిక సామాన్యమైనది కాదు.
ప్రిన్సిపాల్ రుద్రరాజుగారు నిజంగానే రుద్రుడి వంటి వాడు. నిష్కల్మషమైన మనసు కలిగిన ఆయనకు నిష్కళంకుడని కూడా పేరుంది. విధ్యుక్తధర్మాన్ని నిర్వహించడంలో ఆయనకు ఆయనే సాటి అని అంతా చెప్పుకుంటారు. క్రమశిక్షణ విషయంలో చాలా ఖచ్చితమైన వాడాయన. ఎటువంటి ఒత్తిడులకూ లొంగని, చలించని మనస్తత్వం ఆయనిది!
సెలక్షన్ పరీక్షలు కాలేజీలో చెప్పుకోదగ్గ సంచలనాన్ని కలిగించాయి. పరీక్షలకు ప్రశ్నపత్రాల విషయంలో రుద్రరాజు చాలా శ్రద్ధ తీసుకున్నాడు. ఆయా సబ్జక్ట్స్ కు చెందిన లెక్చరర్ల చేత ముఖ్యమైన ప్రశ్నలు సబ్జక్టుకు యాభై చొప్పున తయారు చేయించాడు. వాటి నుంచి తను ప్రశ్నపత్రాలు తయారు చేసి రహస్యంగా ఉంచాడు. విద్యార్ధులను బాగా భయ పెట్టడానికీ, శ్రద్ధగా చదివించడానికీ ఆయన తీసుకున్న జాగ్రత్తలవి!
పబ్లిక్ పరీక్షలకు మించి అందరూ సెలక్షన్ పరీక్షలకు శ్రద్ధగా చదవసాగారు. అయితే అప్పుడప్పుడే చదువు మొదలు పెట్టిన విద్యార్ధులు చాలామంది ఉన్నారు. వాళ్ళకీ సెలక్షన్ పరీక్షల గురించి చాలా బెంగగా ఉంది.
ప్రిన్సిపాల్ గారు అవలంబించిన ఈ పద్ధతి చాలా మండి లెక్చరర్సుకి కూడా నచ్చలేదు. వారిలో చాలా మందికి విద్యార్ధుల పట్ల సానుభూతి ఉంది. కాని చేయగలిగిన దేమీలేదు. పరీక్షల సమయంలో ఎవరైనా కాపీ కొడితే చూసీ చూడనట్లూరు కోవాలని చాలా మంది నిర్ణయించుకున్నారు.
సెలక్షన్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పేపర్లు కష్టంగా ఉన్నాయని అందరూ అనుకోసాగారు. చాలా మండి స్లిప్సు పెట్టి రాస్తున్నారు. లెక్చరర్సు చూసీ చూడనట్లూరు కుంటున్నారు. ఆ సమయంలో రుద్రరాజు రుద్రుడిలా సర్ప్రయిజ్ విజిట్ చేశాడు. ఆయన వెళ్ళిన క్లాసు స్వామిది!
రుద్రరాజు జరిగిన సంగతి పసిగట్టారు. మొత్తం క్లాసునంతా తణిఖీ చేశాడు. అందరి వద్దా స్లిప్పులున్నట్లు ఆయన కనుమానం వచ్చింది. లెక్చరర్సు అట్టే పట్టించుకోని కారణంగా ఆడపిల్లలు కూడా పుస్తకాలు చూసి రాసేస్తున్నారు. రుద్రరాజుకు వళ్ళు మండిపోయింది-మొత్తం క్లాసునంతా ఆ సంవత్సరం పరీక్షకు వెళ్ళకుండా చేస్తానన్నాడు ఆయన. విద్యార్ధులందరూ ఏం మాట్లాడాలో తోచక భయం భయంగా చూస్తున్నారు. ఇలా జరుగుతుందని ఎవరూ అనుకోలేదు.
ఆ క్లాసుకు ఇన్విజిలేటర్సుగా ఉన్న యిద్దరు లెక్చరర్సునీ తనతో రమ్మని చెప్పి- ఆయన విద్యార్ధుల వైపు తిరిగి-"మీరింక పరీక్షలకు రానవసరం లేదు" అన్నాడు. అక్కణ్ణించి ఆయన కదలబోతూండగా స్వామి లేచి నిలబడి "సార్!" అన్నాడు.
రుద్రరాజు ఆగి-'ఏమిట'న్నట్లు వెనక్కు తిరిగి చూశాడు.
"అందరి సంగతీ నాకు తెలియదు. నేను కాపీ చేయలేదండి!" అన్నాడు స్వామి.
"ఇంత క్లాసులో నువ్వొక్కడివీ కాపీ చేయలేదంటే నమ్మడం కష్టం. ఇంచు మించు ప్రతి ఒక్కరి వద్దా స్లిప్సూ, పుస్తకాలూ ఉన్నాయి" అన్నాడు రుద్రరాజు.
"కానీ, నా దగ్గర లేవండి!"
"నన్ను చూస్ విసిరేసి ఉండొచ్చు. లేదా పక్కవాడి దగ్గరకు తోసి ఉండొచ్చు. నువ్వొక్కడివీ మడికట్టు క్కూర్చున్నావంటే నమ్మలేను."
"నా ప్రవర్తనను నేను ఋజువు చేసుకోగలను" అన్నాడు స్వామి.
"ఎలా?"
"ఇప్పటికిప్పుడు మీరు ఈ సబ్జక్టులో కొత్త పేపరు కానీ, తోచిన సబ్జక్టులో పేపరు కానీ ఇవ్వండి. కనీసం యాభై మార్కులు తెచ్చుకోగలను" అన్నాడు స్వామి ధైర్యంగా.
రుద్రరాజు ఆశ్చర్యంగా స్వామి వంక చూసి "నేను పరీక్షించనని ధైర్యమా?" అన్నాడు.
"కాదండి! నా తెలివి తేటలపైన నమ్మకం" అన్నాడు స్వామి.
"సరే-అయితే ఈ పేపరు కాన్సిలయింది. ఒక రోజు తేడాతో పాత టైం టేబుల్ ప్రకారమే పరీక్షలు జరుగుతాయి. పరీక్ష ఫెయిలైన వారినైనా క్షమించగలను కానీ- కాపీ కొట్టిన వారని మాహ్రం క్షమించలేను" అన్నాడు రుద్రరాజు తీవ్రంగా.
తర్వాత రుద్రరాజు కాలేజీ అంతా తిరిగి అన్ని క్లాసుల్లోనూ అదే పద్ధతి కొనసాగుతున్నట్లు గమనించాడు. లెక్చరర్సు అందర్నీ పిలిచి ఆయన సమావేశం జరిపాడు. సెలక్షన్ పరీక్షలు నగరంలో సంచలనాన్ని కలిగించవచ్చుననీ, పబ్లిక్ పరీక్షలలో ఏమైనా ఫరవాలేదు కాని, సెలక్షన్ పరీక్షల పేరు చెప్పి విద్యార్ధులను పబ్లిక్ పరీక్షలకు వెళ్ళనివ్వకపోతే వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకు రాగలరని లెక్చరర్సందరూ ఇంచు మించు ఏక కంఠంతో చెప్పారు. దానికి బదులుగా రుద్రరాజు ఇలా అన్నాడు.
"ఈ కాలేజీకి నేను ప్రిన్సిపాలుని. ఏ విషయంలోనైనా నిర్ణయం తీసుకోవాల్సిన వ్యక్తిని నేను. ఆ నిర్ణయపు బాధ్యతలనుభవించ వలసిన వ్యక్తిని కూడా నేను. ఏ గొడవలు జరిగినా, ఏ ఒత్తిడులు వచ్చినా భరించేవాడిని నేనున్నాను. మీరా విషయం పట్టించుకోవద్దు. పరీక్షలను సక్రమంగా జరిపించవలసిన బాధ్యత మీది. ఈ పరీక్షలకు నేను బయటి నుంచి ఇన్విజిలేటర్సును తీసుకురావాల్సి వస్తే అది మీకు అవమానం. మిమ్మల్ని అవమానించడం నాకిష్టం లేదు. మీ కారణంగా ఒక రోజు పరీక్షలు రద్దయ్యాయి. ఇక మీదట అలా జరక్కూడదు. మీ బాధ్యత మీరు నిర్వహించండి. ఫలితాలకు నేను బాధ్యత వహిస్తాను."
లెక్చరర్సెవ్వరూ కిక్కురుమానలేదు.
ఆ తర్వాత సుహృద్వాతావరణంలో పరీక్షలు జరిగిపోయాయి. పరీక్షలలో చాలా ఎక్కువ మండి తప్పారు. మొదట చెప్పిన విధంగా కాక-ఇరవై శాతం దాటి వచ్చిన విద్యార్ధులందర్నీ పబ్లిక్ పరీక్షలకు పంపడానికి నిశ్చయించాడు రుద్రరాజు. మిగతా వారి విషయంలో ఆయనపై చాలా ఒత్తిడులు వచ్చాయి. ఆయన చలించలేదు.
పరీక్షలైపోయిన పది రోజులకు ఆయన స్వామి గురించి కబురు పెట్టి కాలేజీకి పిలిపించాడు. స్వామి వచ్చి నమస్కరించగా ఆయన అతన్ని కూర్చోమని చెప్పి, "నేకు మొన్నటి పరీక్షల్లో మార్కులు చాలా బాగా వచ్చాయి. అయినా నీ మాటల్లో నిజా నిజాలు పరీక్షించడానికి ఇప్పుడు ఈ క్షణంలో ఫిజిక్సులో పరీక్ష ఇవ్వబోతున్నాను. వ్రాయగలవా?" అన్నాడు.
స్వామి ఆశ్చర్యపోయాడు కాని భయపడలేదు. అతను అప్పటికప్పుడు ఆయన ఇచ్చిన ప్రశ్నపత్రాన్నందుకుని ఆన్సరు చేశాడు. రుద్రరాజు అతని జవాబులకు తనవద్దనున్న వాటితో పోల్చుకొని తలాడించి, "నీ నిజాయితీని నిరూపించుకున్నావనుకుంటాను. నీలాంటి కుర్రాడు నా కాలేజీలో విద్యార్ధి కావడం నాకు గర్వకారణం" అన్నాడు.
స్వామి వినయంగా తన పరిస్థితి ప్రిన్సిపాల్ కి చెప్పి, "కృషి, నిజాయితీ నా లక్ష్యసిద్ధికి చాలా అవసరం. ఆ అవసరం లేని వాళ్ళవి పాటించడం లేదు. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదండీ!" అన్నాడు.