Read more!
 Previous Page Next Page 
నిషా పేజి 2

    "నిధి అంటే ఎవరో పిసినారి ముసలమ్మ నాలుగు బంగారు నాణాలు జమజేసి. మట్టి పిడతలో పెట్టి భూస్థాపితం చేసిందనుకుంటున్నావా? అపారమైన సంపద. బంగారం, నవరత్నాల రూపంలో రెండు మండపాలకైనా భూస్థాపితం చేసిన సంపద అది. ఆ సంపద పైకి తీసి అనుభవించాలంటే ప్రభుత్వం దృష్టిలో పడకుండా కాపాడుకోవడం కష్టతరం. సంపద మోహనవంశీ అనుభవిస్తుంటే మురుక్కాలువలో చేపలు పట్టినట్టుగా ఈ చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాడు కాదురా, హాయిగా కాలుమీద కాలు వేసుకొని అనుభవించేవాడు."

     రంజిత్ అన్నాడు. "చెడ్డకొడుకు, మంచికొడుకు అని ఏ తండ్రీ విడదీసి వుండడు. నిజంగా నిధి భూస్థాపితం అయి ఉంటే మీ ముత్తాతగారు మీ తాతగారికి తప్పక చెప్పి వుండేవారు. ఏ తండ్రీ తన కొడుక్కి అటువంటి అన్యాయం చేసి వుండడని నా నమ్మకం"

    "అన్యాయం చేసి వుండకపోతే మా తాతగారు అలా ఎందుకు వాపోతారు? దొంగలతో చేతులు కలిపి సంపాదించినదంతా భూస్థాపితం చేయకపోతే ఏమైపోయి వుండేది"

    "ఒకవేళ మీ తాతగారు అన్నట్లు ఆ నిధి భూస్థాపితం అయినా ఆ రహస్యం మోహనవంశీకి తెలిసి వుండదనే నా నమ్మకం"

    "ఎలాగూ వాడిని, వాడిని వుంచుకున్నదాన్ని చంపబోతున్నాం. చంపబోయే ముందు చిన్న ప్రయత్నం చేసి చూడడంలో నష్టమేంటి?"

                                           *    *    *

    దట్టమైన అడవి మధ్యన ఎవరో త్రవ్వించిన కోనేరు. కోనేరు ప్రక్కనే శిధిలావస్థకు లోనైన శివాలయం. కోనేటి ప్రక్కన రెండు గుడారాలు చకచకా వేశారు నౌకర్లు. పనివాళ్ళకోసం ఒకటి, రాజా దంపతులకు ఒకటి.

    రహమాన్ అలా వెళ్ళి ఇలా రెండు కుందేళ్ళు వేసుకువచ్చాడు ఆ పూట వంటకి.

    భోజనం టైంకి తిరిగి వచ్చేస్తామని చెప్పి జీపులో బయలుదేరారు సౌదామిని మోహనవంశీ.

    దట్టమైన అడవిలో జీపుని పోనిస్తున్నాడు మోహనవంశీ.

    సౌదామిని బైనాక్యులర్ లోంచి చూస్తోంది వనకన్య సోయగాల్ని, చెట్లమీద కువకువలాడుతూ ఎగిరే పక్షుల్ని.

    పెద్ద మర్రిమానుమీద కూర్చుని తన పొడుగాటి ముక్కుతో మానుమీద టక్కుటక్కున పొడుస్తున్న వడ్రంగి పిట్టను చూడగానే సౌదామిని జీపుని ఆపమంది.

    తలమీద కిరీటంలా వున్న జుట్టు, వీపుమీద నలుపు తెలుపు చారలు, ఇనుముతో తయారుచేసినట్టుగా వున్న సన్నటి పొడుగాటి ముక్కు అది పొడుస్తున్న మర్రిమానుతో సహా సౌదానిమి కెమెరాలో బంధించింది.

    సౌదామినికి పక్షులన్నా, దట్టమైన అడవి అన్నా, గుట్టలమీద నుంచి జారిపడే సెలయేళ్లన్నా ప్రాణం. ఆమెతో కలిసి వేటకు వచ్చినప్పుడు జంతువుల్ని తప్ప పక్షుల్ని కొట్టనివ్వదు.

    మళ్లీ జీపు బయలుదేరబోతుంటే నలుగురు చెంచులు జీపుని చుట్టుముట్టారు. మెరుపువేగంతో జీపులో చొరబడి ముక్కుకి ఏదో వాసనచూపి ముఖాలమీద ముసుగులు కప్పారు. త్రాళ్లతో ఇద్దరి కాళ్లూ చేతులు కట్టిపడేసారు. జీపుని కొంతదూరంవరకు తీసుకెళ్లి అక్కడ వదిలేసారు.

    అక్కడొక కారు రెడీగా వుంది.

    శవాల్లా వ్రేలాడిపోతున్న ఇద్దర్నీ కారులోకి చేర్చారు.

    కారు దూసుకుపోతోంది.

                                                                      *    *    *

    మధ్యాహ్నం రెండయింది. మూడయింది.

    టెంట్ దగ్గర రాజాసాబ్ పరివారం వాళ్లకోసం ఎదురుచూసి, చూసి విసిగిపోయారు.

    అందరి కడుపుల్లో ఆకళ్లు మండిపోతున్నాయి.

    వండిన పదార్ధాలన్నీ చల్లారిపోయాయి.

    ప్రొద్దుగ్రుంకింది.

    అందరిలోనూ ఆందోళన మొదలైంది.

    ఏమైపోయారు వీళ్లు? అడవిలో తప్పిపోయారా? ఈ అడవి రాజాసాబ్ కి సుపరిచితం ఏదైనా జంతువు వాతపడ్డారా? ఊహూ........ రాజాసాబ్ చేతిలో తుపాకీ వుంటే ఆయనకు ఎదురునిలిచే జంతువేదీ వుండదు. రహమాన్ డ్రైవరు కలసి రెండో జీపులో బయలుదేరారు.

    రాత్రి ఎనిమిదివరకు తిరిగి తిరిగి చూస్తూనే వున్నారు.

    చివరికి కనిపించింది వదిలివేయబడిన ఖాళీ జీపు.

    ఏమైపోయారు వీళ్లు?

    మళ్లీ మళ్లీ అదే ప్రశ్న.

    రహమాన్ టార్చీవేసి చూసాడు జీపులో.

    ముందు సీట్లో సౌదామిని హేండ్ బాగ్ పడివుంది.

    సీట్లక్రింద ఏదో వుండలా కనిపిస్తే అనుమానంతో చేతిలోకి తీసుకున్నాడు రహమాన్. పత్తి వుండ అది. ముక్కు దగ్గరికి తీసుకుని వాస చూసాడు. కొద్దిగా పీల్చగానే అతడికి కళ్లు తిరిగినట్లు అయింది. భయంగా ఉండ కింద పడేసి చెప్పాడు డ్రైవర్ తో "అమ్మగారినీ, అయ్యగారినీ ఎవరో స్పృహ తప్పించి తీసుకుపోయారు. ఇదిగో ఈ మట్టిరోడ్డుమీద ఏదో వాహనం పోయినట్లుగా టైర్ల గుర్తులు కనిపిస్తున్నాయి."

    "ఈ చీకట్లో ఎక్కడని వెదుకుదాం?" అన్నాడు డ్రైవరు.

    "నిజమే. చీకట్లో ప్రయోజనంలేదు. కోరి ప్రమాదం తెచ్చుకోవడం తప్పితే. తెల్లవారుతూనే వెదుకుదాం."

                                              *    *    *

 Previous Page Next Page