శ్మశానం నుంచి ఊరు కదిలి వెళ్ళిపోయిన తరువాత విషాచి ఆ కుర్రవాడికేసి క్షణం తీక్షణంగా చూసేడు. పదేళ్ళ కుర్రవాడు, ధృడమయిగా ఉన్నాడు. కానీ లేతగా వున్నాడు. చదువు లేదు. కానీ మొహంలో జ్ఞానం వుంది.
విషాచి చూపులకి ఇంకొకరైతే గజగజ వణకాల్సిందే. ఆ కుర్రవాడు తొణకలేదు. నిర్లిప్తంగా చూస్తూ నిలబడ్డాడు.
నిర్లిప్తత అన్న పదాన్ని ఇక్కడ గమనించాలి.
మంత్రగాడి మొహంలో ఏ భావమూ సామాన్యంగా కనబడదు. కనబడకూడదు. మోహావేశాలకి అతీతంగా వుండాలి. కాద్రా అలానే వుండేవాడు. నిర్లిప్తంగా ప్రతీ విషయానికీ....... రక్తం త్రాగేటప్పుడు కూడా.
విషాచి పెదవులమీద నెమ్మదిగా చిరునవ్వు వెలిసింది. సంతృప్తితో తల పంకించేడు. తను అప్పచెప్పబోయే కార్యాన్ని సమర్ధవంతంగా నిర్వహించగలడనే నమ్మకం కుదిరింది. దగ్గిరకు రమ్మన్నట్టు పిలిచేడు. కుర్రవాడు దగ్గరికొచ్చాడు.
"ఇతడి పేరు తెలుసా?" వృద్ధుడివైపు తిరిగి అడిగేడు.
వృధ్దుడు తెలీదన్నట్టు తలూపేడు. అతడికి అయోమయంగా వుంది. మంత్రం నేర్పేటప్పుడు మూడోవాడు వుండకూడదన్నది ఆచారం. మరి విషాచి తనని ఎందుకు వుండమన్నాడు?
"...... ఈ కుర్రవాడి పేరు దార్కాసాహు. అందరూ దార్కా అంటారు" ఉన్నట్లుండి విషాచి కంఠం తీవ్రమైంది. ఆ శ్మశానమే కంపిస్తుందా అన్నట్లు అరిచేడు. "బిస్తా గ్రామపు మంత్రగాళ్ళకు దార్కాని నాయకుణ్ని చేయబోతున్నాను. ఎవరికయినా అభ్యంతరం వుందా?"
కీచురాయి కూడా భయపడినట్టు చప్పుడు చేయడం మానేసింది. ప్రేతాత్మలు లయ విన్యాసం ఆపుచేసి క్రతువును చూడడానికి ఆగేయి.
విషాచి మొహం మంటల వెలుగులో ఎర్రగా వుంది.
"దార్కా! ఈ రోజు నేను నిన్ను శిష్యుడిగా స్వీకరిస్తున్నాను. చేతబడి నుంచి కాష్మోరా వరకూ అన్ని విద్యలు నీకు నేర్పబోతున్నాను. నేను మరణించే లోపులో ఈ విద్యలు నువ్వు నేర్చుకోవాలి. నేర్చుకుంటే.... నేర్చుకుంటే ప్రపంచంలోకెల్లా అత్యంత చిన్న వయసులో మహా మాంత్రికుడివైన ఖ్యాతి నీకు దక్కుతుంది."
చెట్లు -చేమలు -పుట్టలు -పక్షులు అన్నీ మౌనంగా, భయంగా విషాచి చెప్పేవి వింటున్నాయి.
"మంత్రగాడికి జాలి, దయ, క్షమ, వుండకూడదు. మనం చేతబడి చేసినవాడు రక్తం కక్కుకుంటున్నా చలించకూడదు. బాధతో విల విలలాడ్తున్నా బాధపడకూడదు. ఆ మనసు ఈ వయసులో నీ కుందని నిరూపించుకోవాలి నువ్వు."
దార్కా నిశ్చలంగా నిలబడి వున్నాడు.
వృద్ధుడు విషాచి చెప్పేది వింటున్నాడు.
విషాచి మంటల వెనుకనుంచి ఒక కర్ర తీసేడు. దాన్ని చూడగానే వృద్ధుడు అప్రయత్నంగా అడుగు వెనక్కి వేసేడు.
"ఎవరో ముగ్గురు పరాయి దేశస్థులు బిస్తా మంత్రగాళ్ళ సామ్రాజ్యంలో ప్రవేశించి, ఆ గ్రామపు ఒకే ఒక కాష్మోరా ప్రయోగశాలిని చంపితే చేతులు ముడుచుకుని కూర్చునే వాళ్ళు ఎవరూ లేరిక్కడ. అయితే కాద్రా శ్మశానంలో కాష్మోరా నిర్వహిస్తున్నాడని వాళ్ళకి ఎలా తెలిసింది."
వృద్ధుడు మరో అడుగు వెనక్కి వేసేడు.
"దార్కా -మన ఆచారాలను ఇతడు అగౌరవ పరిచేడు. అజ్ఞానం. వల్లనైతేనేం -నల్లమందు మత్తులో నైతేనేం శత్రువుకి ఆచూకీ చెప్పాడు. బిస్తా గ్రామానికి తలవంపులు తెచ్చాడు. అతడిని శిక్షించే బాధ్య....." విషాచి వాక్యం పూర్తి కాలేదు. దార్కా చిరుతకన్నా వేగంగా కదిలేడు. అతడి వేళ్ళు మెరుపుకన్నా వేగంగా - అతడి గోళ్ళు డేగ కన్నా వాడిగా -
వృద్ధుడు పెట్టిన కేక శ్మశానంలో మారుమ్రేగింది. కళ్ళనుంచి కారిన రక్తంతో కలిసి, ఆగిన గుండె చర్మం పైగా జారి, వాలిన శరీరం మీదనుంచి భూమ్మీదకు జారిపోయింది.
భయంతో గుడ్లగూబ మరింత మునగ దీసుకుంది.
తీతువు అరవబోయి మానేసింది.
విషాచి కళ్ళు వృద్దుడు అచేతన శరీరంవైపు నిర్లిప్తంగా - దార్కా వైపు అభినందిస్తున్నట్టూ చూశాయి.
"దార్కా -ఇప్పుడు నీకో మంత్రం నేర్పబోతున్నాను. దశ విధనాడులు గురించి నేను చెబ్తాను. విను.ముక్కుకి ఎడమభాగాన వుండేది ఇడా నాడి. కుడివైపు వుండేది పింగళనాడి. మధ్య నుండేది సుషుమ్న నాడి. కుడి నేత్ర గాంధార నాడి - నాలుక ఆస్తిని నాడి -చెవి పుషానాడి. ఎడమ చెవి పయస్విని, నాభితో శంఖినీ నాడి వుంటాయి.
పది నాడుల్నీ పది క్షుద్రదేవతలు ఆశ్రయించి వుంటాయి. వాటిని నువ్వు నీ చెప్పు చేతల్లోకి తీసుకున్న క్షణం ఎవరినైనా నీ చేతబడేటట్టు చెయ్యవచ్చు. నువ్వు చేతబడి చేసినవాడు నువ్వు ఏ క్షుద్ర దేవతను ఆ రోజు కొలిస్తే ఆ రోజు ఆ అంగం బాధతో గిలగిల లాడ్తాడు. పురుషుడికి నడుము నొప్పితో - స్త్రీకి పొత్తి కడుపు నొప్పితో ప్రారంభమయ్యే ఈ చేతబడి ఎలా నేర్చుకోవాలో నీకు చెబ్తాను దానికి ముందుగా నువ్వోమాట ఇవ్వాలి.
కాష్మోరాకు ఒక రోజు నిద్ర మనిషికి పదకొండు సంవత్సరాలు. పదకొండు సంవత్సరాల తర్వాత, అసంతృప్తుడై కాష్మోరా నిద్ర లేస్తాడు. ఆ విలయతాండవానికి ఆజ్యం నువ్వు పోయాలి. ఎవరి మీద ఈ కాష్మోరా ప్రయోగింపబడిందో నువ్వు కనుక్కోవాలి. వాళ్ళని కాష్మోరా పీక్కు తింటాడు.
అంతకన్నా ముఖ్య విషయం
పగ.
ఎవరు బిస్తాలోకి వచ్చింది?
కనుక్కోవటానికి ఆధారం లేదు. అందుకే నువ్వు నాగరిక ప్రపంచములోకి వెళ్ళాలి నీ క్షుద్రశక్తుల సంగతి ఎవరికీ తెలియకుండా వాళ్ళలో కలిసిపోవాలి. ఎలా కనుక్కుంటావో నాకు తెలియదు. కనుక్కోవాలి. ఆ ముగ్గుర్నీ చంపాలి. నాకా మాట ఇవ్వు."
దార్కా మాట ఇస్తున్నట్టు దక్షిణం వైపుకి చెయ్యి ఎత్తేడు. సంతృప్తుడయిన విషాచి ఆకుల దొప్ప పైకి ఎత్తాడు.
అందులో కాద్రా మెదడు ఉంది.