ఉపోధ్ఘాతం
మనం ఏదేనా చేతి వ్రాతను చూడగానే 'ఇది అమ్మాయి వ్రాతలావుందే' అంటాం. అమ్మాయి అయినా, అబ్బాయి అయినా చేతికి అయిదువేళ్లే వుంటాయి. బొటనవ్రేలు, చూపుడువ్రేలు, మధ్య వ్రేలు నడుమే ఎవరైనా పెన్ను పట్టుకొని వ్రాస్తారు. అయినా కూడా అబ్బాయి చేతివ్రాతకీ, అమ్మాయి చేతి వ్రాతకి సాధారణంగా తేడా వుంటుంది. మరి, ఎవ్వరు వ్రాసినా అది చెయ్యే అయినపుడు వ్రాతలో తేడా ఎందుకుంటుంది?
సాధారణంగా మనం వ్రాతను చూసి 'ఇది అమ్మాయి వ్రాసిన వ్రాత' అని అనుకున్నప్పుడు తొంభైశాతం వరకూ మన అభిప్రాయం కరెక్ట్ అవుతూ వుంటుంది.
మీరు గమనించారో లేదో -c 1970 ముందు అమ్మాయిల చేతి వ్రాతలు ఎక్కువశాతం గుండ్రంగా వుండేవి. ఇటీవల కాలంలో అమ్మాయి చేతి వ్రాతకీ, అబ్బాయి చేతి వ్రాతకీ తేడా పట్టుకోవటం కొంచెం కష్టం అవుతోంది. దీనికి కారణం ఏమిటంటే, ఒకప్పుడు స్త్రీ అభిప్రాయాలలో పురాతన సంస్కృతి పట్ల గౌరవం, పొందిక, నెమ్మదితనం c ఇవన్నీ రంగరించి వుండేవి. ఇటీవల కాలంలో అమ్మాయిల్లో తనపట్ల తనకి నమ్మకం, ఆర్దిక స్వాతంత్రత, ఎక్కువ వ్యక్తిత్వం కనబడుతూ వుంటాయి. ఈ పరిణామాలన్నీ చేతివ్రాతల్లో కూడా మనం గమనించవచ్చు.
అలాగే పదహారేళ్ల అమ్మాయి వ్రాసిన చేతి వ్రాతకి, అదే అమ్మాయి ముప్పై సంవత్సరాల తర్వాత వ్రాసిన చేతివ్రాతకి తేడా వుంటుంది. దీనికి కారణం ఏంటంటే, వయసు పెరిగేకొద్దీ మానసికమైన వత్తిళ్లు ఎక్కువ కావటం, ప్రపంచ జ్ఞానం పెరగటం కారణాలై వుంటాయి.
అదే విధంగా, నేనేదైనా నవల వ్రాసేటప్పుడు, అందులో డ్రామా, టెన్షన్ సీన్లు వ్రాయవలసి వచ్చినప్పుడు నాచేతి వ్రాతలో మార్పు వస్తూవుంటుంది.
పైన చెప్పిన ఉదాహరణలన్నీ గమనిస్తే మనకోవిషయం బోధపడుతూ వుంటుంది. మనిషి స్వభావానికీ, మూడ్ కి చేతివ్రాతకి చాలా దగ్గర సంబంధం వుందని! ఆ సంబంధమేంటో తర్వాత ఛాప్టర్లలో పరిశీలిద్దాం.
చరిత్ర:
గ్రాఫాలజీ ఈ యుగానికి సంబంధించింది కాదు. మానవుడు గుహల్లో వ్రాయడం మొదలుపెట్టిన దగ్గర్నుంచీ వుందని శాస్త్రజ్ఞులు చెప్పారు. మానవుడు రాతిపై వేసిన గుర్తులన్నీ అతని మనస్తత్వాన్ని తెలియజేస్తాయి. ఉదాహరణకి, ఒక బాణం తగిలిన జింక ఎంతో భయవిహ్వలతతో దీనంగా చూడటం ఒక చిత్రకారుడు చిత్రిస్తే అతడియొక్క మనస్సు విలుకాడిదారుణానికి గురైన జింక స్థితి పట్ల జాలిని, ఆర్ద్రతనీ చూపుతుంది. ఇదే చిత్రాన్ని విలుకాడు మనకి దగ్గరగా వుండేటట్లు,జింక ఎక్కడో దూరంగా వుండేటట్టు చిత్రిస్తే విలుకాడి కళ్ళల్లో క్రౌర్యాన్ని ప్రస్పుటింపజేస్తుంది. ఇదేవిధంగా చేతివ్రాత కూడా.
ఆరువేల సంవత్సరాల క్రితం ఈ శాస్త్రం ఆవిర్బవించిందని శాస్త్రజ్ఞులు చెబుతారు. చేతివ్రాతబట్టి మనస్తత్వాన్ని పరిశీలించే విద్యను మొట్టమొదట కనుగొన్నవాళ్లు చైనీయులు. తర్వాత అరిస్టాటిల్ ఈ శాస్త్రాన్ని మరింత విస్తృత పరిచాడు. కొంతమంది ఫ్రెంచి శాస్త్రజ్ఞులు ఈ శాస్త్రానికి నియమాలు ఏర్పరచారు.
అమెరికాలో సైన్సులో ఒక భాగంగా ఇది గుర్తింపబడింది. యూరప్ లో దీన్ని పాఠ్యాంశంగా విశ్వవిద్యాలయాల్లో బోధిస్తున్నారు.
కొన్ని వేలవేల వేలి ముద్రలు పరిశీలించాక "ప్రపంచంలో ఏ ఇద్దరి వేలిముద్రలూ కూడా సరిపోవు' అన్న నిర్ణయానికి శాస్త్రజ్ఞులు వచ్చారు. అదేవిధంగా ప్రపంచంలోని ఏ ఇద్దరి చేతివ్రాతలూ కూడా సరిపోడానికి అసలు ఆస్కారంలేదు.
ప్రొఫెషనల్ గ్రాఫాలజీస్టులు చేతివ్రాతలను పరిశీలించటానికి కంప్యూటర్ లను ఉపయోగిస్తున్నారంటేనే ఇది చాలా అధ్బుతమైన శాస్త్రమని మనకి తెలుస్తోంది.
ఈ గ్రాఫాలజీ నేర్చుకోవాలంటే అన్నిటికన్నా ముందు 'కుతూహలం' కావాలి. మిగిలిన సైన్సు లాగే దీనికి కూడా ప్రత్యేకమైన సాంకేతిక నామాలు, పారిబాషిక పదాలూ వున్నాయి.
ఫోర్జరీ లాంటి నేరాలను కనిపెట్టడానికే కాకుండా, ఉద్యోగనియామక విషయాల్లో కూడా ప్రస్తుతం ఈ గ్రాఫాలజీ ఉపయోగపడుతోంది. ఉదాహరణకి అభ్యర్దులు స్వంతదస్తూరీతో అప్లికేషన్లు వ్రాయాలి అనే కండిషన్లో, అలా పంపిన దరఖాస్తు ఫారాలని పరిశీలించినప్పుడే గ్రాఫాలజీలో పరిచయమున్న అధికారులు, అభ్యర్ది ఎటువంటివాడో తెలుసుకోగలుగుతున్నారు. ఈ గ్రాఫాలజీ మీద సరియైన పట్టు సంపాదించినట్లైతే, జాతకాల కన్నా ఇదే అవతలి మనిషి యొక్క మనస్తత్వాన్ని కరెక్ట్ గా తెలియజేస్తుందనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే, జాతకం దేవుడు వ్రాసింది. చేతివ్రాత మనిషి వ్రాసింది.
ఈ పుస్తకం గ్రాఫాలజిస్టుల కోసం వ్రాస్తున్నది కాదు. ఎందుకంటే ఇందులో అన్నీ బేసిక్ విషయాలే చర్చించబడ్డాయి. కొత్తగా గ్రాఫాలజీ నేర్చుకునేవాళ్లకి, లేదా తమ చేతి వ్రాత చూసి తమ గురించి తెలుసుకుందామనుకునే వాళ్లకి, ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. అంతేకాక, ఈ పుస్తకం చదివి ఒక నిర్దిష్టమైన అవగాహన ఏర్పరచుకుంటే స్నేహితులకీ, అపరిచితులకీ కూడా వాళ్ల వాళ్ల చేతి వ్రాతలు బట్టి వారి మనస్తత్వాన్ని తెలియజెప్పి ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా స్ధానం సంపాదించుకోవచ్చు.