"మనకీ ఎందుకే? ఈ కాలం పిల్లలు ఇలాగే వున్నారు. చెడే కాలానికి కుక్కమూతి పిందెలనీ....మరీ సినిమాలు చూసీ, నవలలు చదివీ చెడిపోతున్నారు" అన్నాడు ముసలాయన చిరాగ్గా.
ఈ లోపులో అమృత తిరిగొచ్చి-చలం "దైవమిచ్చిన భార్య'లోకి తలదూర్చి, అందులో నిమగ్నమయిపోయింది.
ట్రైన్ దూకుడుగా తన గమ్యంవైపు సాగిపోతోంది.
* * *
ట్రైన్ ప్లాట్ ఫాం మీదకి రాగానే అమృత తల వంచి కిటికీలోంచి అటూ ఇటూ వెతికి చూసి "నాన్నా!" అంటూ అరచింది ఆనందం పట్టలేనట్లు.
"అదుగోనండి అమ్మాయి!" అంటూ జగదీస్వరీ, ఆ వెనకాలే చక్రధరరావుగారూ ట్రైన్ తోబాటు పరిగెడ్తూ వచ్చి ఆగగానే లోనికి ఎక్కేశారు.
"అమ్మా ప్రయాణం బాగా జరిగిందా? అల్లుడు రాలేదా?" అడిగింది జగదీశ్వరి కూతుర్ని ఆప్యాయంగా చూసుకుంటూ.
పక్కన కూర్చున్న ముసలాయన పాత స్నేహితుడిని గుర్తుపట్టినట్టు లేచి "చక్రీ" అన్నాడు చక్రధరరావుగారి భుజం మీద చెయ్యి వేసి.
"ఆ మీరా? ఏమిటీ హైదరాబాద్ నుండి వస్తున్నారా? మా అమ్మాయి అమృత కూడా హైదరాబాద్ నుంచి వస్తోంది" అని అమృత వైపు తిరిగి "ఈయన అప్పట్లో మా ఆఫీసులోనే పనిచేసేవారు చలపతిరావుగారు" అంటూ పరిచయం చేశారు.
బామ్మగారు అక్కసుగా "మీ అల్లుడు బాగుంటాడా? ఏం ఉద్యోగం చేస్తాడు?" అంది జగదీశ్వరితో.
"మా అల్లుడికేం? చందమామలా వుంటాడు. పెద్ద ఎడ్వర్ టైజ్ మెంటు కంపెనీలో ఆఫీసర్. ఈ ఏడే పెళ్ళిచేశాం" అంది జగదీశ్వరి.
"అమ్మా ఆకలి వేస్తోంది, త్వరగా దిగండి" అంది అమృత. వాళ్ళిద్దరూ ఎక్కువ మాట్లాడుకోవటం ఇష్టం లేనట్టూ.
"చక్రీ! నీతో మాట్లాడాలి. ఆసింటారా!" అంటూ ముసలాయన చక్రధరరావుగారి చెయ్యి పట్టుకుని దూరంగా తీసుకెళ్ళాడు. "చక్రధరం ...నీతో ఈ విషయం చెప్పాల్సిరావడం నాకు చాలా బాధగా వుందోయ్" అన్నాడు చలపతిరావు.
"ఏ విషయం?" చక్రధరరావు కంగారుపడ్డాడు.
"మీ అమ్మాయి...అదే అమృత ప్రవర్తన గురించి..." అంటూ ఆయన నీళ్ళు నమిలాడు.
"మా అమ్మాయి ప్రవర్తన గురించా! మిమ్మల్ని ఏమైనా అందా?" ఆతృతగా అడిగాడాయన.
"అది కాదు! నిక్షేపంగా పెళ్ళి అయిన అమ్మాయి పరాయి పురుషుడితో అదీ అప్పుడే ఎవర్నో ట్రైన్ ఎక్కించడానికొచ్చిన అబ్బాయితో నీకెలా చెప్పాలో తెలియడం లేదనుకో!
"ముక్కూ మొహం తెలియని అబ్బాయితో క్షణాల్లో పరిచయం చేసుకుని ప్రేమ కబుర్లు మొదలెట్టింది. పెళ్ళికానంత వరకూ పర్వాలేదు గానీ, పెళ్లయ్యాకయినా పెద్ద మనిషి తరహాగా ఇలాటి కబుర్లు మానెయ్యాలి. ప్రవర్తన మార్చుకొమ్మని నీ కూతురికి చెప్పు. నీకు నేను ఇలా చెప్తుంటే బాధగానే వుంటుందనుకో! కానీ నీకంటే పెద్ద వాడిగానూ, నీ మేలు కోరేవాడిగానూ నీకీ విషయం చెప్పడం అత్యవసరం అనుకుంటున్నాను..." అని ఆగి చక్రధరరావుగారి ముఖంలో భావాలు గమనించసాగాడు.
చక్రధరరావుగారు గంభీరంగా మొహం పెట్టి చెప్పమన్నట్టు చూశారు.
"ఇవాళ రాత్రి ఆ అబ్బాయి బయల్దేరి ఇక్కడికి వస్తానన్నాడు.....వీళ్ళిద్దరూ అస్సాం పారిపోయి హేపీగా వుంటారంట!
"నీ కూతురు లేచిపోతుందిట" అని ముసలాయన చెప్తున్నా చక్రధరరావుగారిలో పెద్దగా మార్పు ఏమీ కనబడలేదు. అయితే అతి కష్టంమ్మీద మామూలుగా వుండటానికి చేసే ప్రయత్నం కనపడింది.
"ఇది ఇంతగా తెగించిందన్నమాట!" అన్నారు శాంతంగానే.
"శాంతంగా అమ్మాయికి బుద్ది చెప్పుకో! అంతేగానీ, కత్తా, బద్డా అనకు. అసలే ఈ కాలం పిల్లలూ" అని ముసలాయన సాగదీస్తుంటే, చక్రధరరావుగారు వారించారు.
ఇంకేం చెప్పకండి. వెళ్ళగానే నేను డాని సంగతి చూస్తాను. మీరోసారి మధ్యాహ్నం ఇంటికొచ్చి కనపడండి. ఇదిగో నా అడ్రస్" అంటూ జేబులోంచి విజిటింగ్ కార్డు తీసి అందించాడు.