"అమ్మా! ఊరికే దిగుతానా? ఆయన చెట్టెక్కి రావాలి. చెట్టుకొమ్మ మీద కాసేపు కబుర్లాడుకోవాలి. ఇద్దరం ముచ్చట్లాడుకుని ఎన్నాళ్లయింది? హరిచందన ముద్దు ముద్దుగా అంది. ఆమె మాటల్లో అదోరకం యాస. తను నల్లమలకి వెళ్లనప్పుడు చెంచువాళ్ల మాటల్లో వినిపించిన యాస.
చాలా ఎత్తుగా శాఖోపశాఖలుగా పెరిగిన వేపచెట్లు కొమ్మల్లో క్రిందకి కాళ్లు జారవిడిచి కూర్చున్న కొమ్మల్నే ఉయ్యాల్లా ఊపుతోంది.
చిటారు కొమ్మల్లో సన్నగా వుందా కొమ్మ. ఏ క్షణంలో పుటుక్కుమని విరుగుతుందో!
"నాకు చెట్లెక్కడం రాదు చందనా! నువ్వే మెల్లగా కిందకి దిగిరా. నువ్వొచ్చాక అలాగే ముచ్చట్లాడుకుందాం" మృదువుగా చెప్పాడు సూర్య.
"చెంచు పుట్టుక పుట్టి చెట్టెక్కడం రాదని చెప్పడానికి సిగ్గులేదురా?"
"మొన్న పట్టింది చంద్ర దెయ్యమైతే, ఇప్పుడు పట్టింది చెంచు దెయ్యమా?" తల పట్టుకుంది అలివేణి.
"నీకు కావాలంటే ఎన్ని తేనెపట్టులైనా తెప్పించి పెడతానుగానీ, నా పిల్లనేమీ చేయకే. దిగిరావే! నీకు దండం పెడతాను."
"జింక మాంసం వండి కల్లు బుంగ తెప్పించి పెడతావా అమ్మా! దిగివస్త"
"నువ్వేది అడిగితే అది చేస్త. దిగిరావే.
హరిచందన సరాసరి దిగి వచ్చేసింది.
ఆ దిగడం చూస్తుంటే చెట్లెక్కడం ఆమెకు కొట్టిన పిండి అనిపిస్తోంది.
"నన్ను ధనలక్ష్మికి బలి ఇస్తివి కదరా! నిన్నూ ఆ ధనలక్ష్మికే బలి ఇస్తరా. నీ రక్తం కళ్లజూస్తే గానీ, నా పగ చల్లారదు"సూర్య దగ్గరగా వచ్చి పళ్లు పటపటలాడించింది.
ఆమెను తీసుకుపోయి గదిలో వేసి తలుపులు మూసాక గానీ 'అమ్మయ్య' అని ఊపిరిపీల్చుకోలేదు జనాలు.
"ఆ మధ్య మామామకి ఇలాగే బాపని దెయ్యం పట్టింది. తెలుగే సరిగా చదవడం రానివాడు చక్కగా సంస్కృతశ్లోకాలు చదవడం మొదలుపెట్టాడు, రెండు రోజులైనా స్నానం చేయడానికి బద్దికంచేవాడు తెల్లవారు భూపాలరాగాలు పాడడం, సంస్కృత శ్లోకాలు చదవడం, పూజలు చేయడం మొదలుపెట్టాడు. అక్కడికి తిరిగీ ఇక్కడికి తిరిగీ చివరికి మంత్రాలయం వెళ్లి స్వామిసేవ చేస్తే గానీ వదల్లేదా బాపని దెయ్యం."
"మా ఇంట్లోనూ ఒకసారి ఇలాగే జరిగింది. మా పిన్ని ఒకామెకి సాలె దెయ్యం పట్టింది బావిలో పడి చచ్చి దెయ్యమైందట. ప్రొద్దునే లేచి మగ్గంమీద పనిచేస్తున్నట్లుగా , దారాలు చుడుతున్నట్లుగా చేతులు, కాళ్లు ఆఢిస్తూ కూర్చునేది."
దెయ్యం పట్టిన వాళ్ల కథలు రకరకాలుగా చెప్పుకోసాగారు. ఓసారి ఇలా అయిందంటే మా ఇంట్లోనూ ఇలా జరిగిందంటూ.
సూర్య ముఖం ఎందుకో కాంతిహీనమైంది.
కేతకిని ధనలక్ష్మికి బలి ఇచ్చిన మంత్రగాడు తనేనా? మైగాడ్!
నల్లమలకి వెళ్లి చెంచుగూడెంలో పడుకున్నప్పుడు తన మంత్ర గాడుగా, కేతకిని బలిఇఛ్చినట్లుగా కల వచ్చింది. అది యదార్దమన్న మాట.
రెండుసార్లు ఆమె తన చేతుల్లో చచ్చిపోయిందా? రెండుసార్లు ఆమె ప్రాణాలను హరించిన తను ఆమె చేతుల్లో చావడం న్యాయమే!
ప్రాణానికి ప్రాణం. రక్తానికి రక్తం. అదే న్యాయం!
మనిషి పుట్టడం ఎంత సహజమో, చనిపోవడం అంత సహజం.
మనిషి చనిపోయి మళ్లీ పుడతాడని హిందువుల నమ్మకం. ఆత్మ అదే జీర్ణవస్త్రం విడిచి నూతన వస్త్రం ధరించడంగా పేర్కొంటారు జ్ఞానులు.
గత జన్మ జ్ఞాపకాలేమీ వుండవు.
కానీ వుంటే బాగుండేది. గత జన్మలో చేసిన తప్పొప్పులు తెలుసుకుని ఈ జన్మలో దిద్దుకునే అవకాశం వుండేది. రెండుసార్లు స్త్రీ హత్యకు పాల్పడిన తనకు ఈ ఉత్తమ జన్మ ఎలా లభించిందో?
ఏ సుకృతం చేసుకున్నాడో?
రెండు రోజులు తిరగకుండానే మళ్ళీ చెన్నయ్య పరిగెత్తుకు వచ్చాడు.
"చిట్టికి బాగా జ్వరం వచ్చింది చినబాబూ! మీరు వెంటనే రావాలి."
మళ్లీ చెట్టెక్కుతోందా? పుట్టతేనెలు, కల్లుబుంగలు కావాలంటోందా?"
"ఎక్కడ పుట్టతేనెలు, కల్లుబుంగలు బాబూ! మొన్న భూతవైద్యం చేయించాలని బడేసాహెబ్ ని తీసుకువచ్చామా? వాడు మంత్రాలు చదివి దెయ్యాన్ని పారద్రోలుతాడనుకుంటే, పిల్లను మొరటుగా కొట్టి చంపాడండీ బాబూ!"
"వదిలిందా దెయ్యం?"
"దెయ్యం వదిలిందో లేదోగానీ పిల్లకి దెబ్బల నొప్పితో జ్వరం ముంచుకువచ్చింది.
వడలిన పవ్వులా నీరసంగా పడుకుని వుంది హరిచందన. ఒళ్ళంతా తేలిన వాతలకి వెన్న ఏదో రాశారు. ఒళ్లు జ్వరంతో కాలిపోతోంది.
"ఆ మంత్రగాడు పశువుని కొట్టినట్టు కొడుతుంటే మీరేం చేశారు?" అవి మంత్రగాడు కొట్టిన దెబ్బలని చూసి ఆగ్రహం వ్యక్తం చేశాడు సూర్య.
"వాడు దాని ఒంటిమీదున్న దెయ్యాన్ని కొడుతున్నాడనుకున్నాం బాబూ! ఒంటిమీద దెయ్యం వుంటే, దెబ్బలు ఆ దెయ్యానికే తగులుతాయంటారు. మరి ఈ పిల్లకెందుకు తగిలాయో, ఏమిటో. మా ప్రారబ్దానికి వచ్చింది" అలివేణి కళ్లొత్తుకుంటూ అంది. "అది దెయ్యమై నా మనమరాలి మీదకి ఎందుకు వచ్చిందో? ఏం పొందాలనుకుందో?"
"తిట్టకే నా బిడ్డను. ఇన్నేళ్లూ ఏమైందో తెలియని నా చంద్ర ఇప్పుడు దెయ్యమై ఎందుకు వచ్చిందో, అన్నెం పున్నెం ఎరుగని ఆ పిల్లనెందుకు ఆవహించిందో, మంత్రగాళ్లతో ఆ దెబ్బలెందుకు తింటూందో తెలియడంలేదు. అర్దాంతరంగా జీవితం ముగించిన నా చిట్టితల్లి చచ్చాక కూడా ఈ మనుష్యులవల్ల ఎన్ని బాధలు? ఎన్నిదెబ్బలు?" రంగసాని ఏడవసాగింది.
"చచ్చి దెయ్యమై వచ్చిన దాని గురించి ఈ ఏడుపేమిటి ముసలిదానా? అది అన్యాయంగా నా మనుమరాలిని పట్టి చంపుకుపోయేలా వుంది" తిట్టింది అలివేణి.
"ఏ మహానుభావుడైనా నా బిడ్డకు విముక్తి కలిగిస్తే బాగుండును. ఈ దెబ్బలూ, ఛీత్కారాలు తప్పేవి."
ఆ రోజే జీపులో హరిచందనని సిటీకి తీసుకువెళ్లాడు సూర్య. వెంట అలివేణి, చెన్నయ్య వెళ్లారు.
అన్ని పరీక్షలు చేయించాడు. అంతా నార్మల్ గానే వుంది. జబ్బేమీటో తేలలేదు. రోజుల తరబడి తినకుండా, నిద్రపోకుండా కనీసం రెప్పలయినా వాల్చకుండా ఎందుకుంటుందో చెప్పలేకపోయారు.
"జబ్బేమీలేదు. ఎందుకో మానసికంగా అప్ సెట్ అయినట్టుంది. కొంతకాలం సైకియాట్రిస్ట్ పర్యవేక్షణలో వుంచడం మంచిదేమో!" అన్నాడు అన్ని పరీక్షలూ ముగించిన డాక్టరు, ఏవో కొన్ని మందులు ప్రస్తుతానికి వాడి చూడమని.
ఊరికి తీసుకువచ్చేశారు.
రోజులు గడిచిపోతున్నాయి.
చక్కగా ఆడీపాడే పిల్ల మంచం మీద పడుకుని నీరసించిపోతోంది. తిండి తినదు. నిద్రపోదు. ఎవరితో మాట్లాడదు. పిచ్చిదానిలా పైకప్పుకేసి చూస్తూ వుంటుంది.
సూర్య రోజూ వచ్చిచూస్తున్నాడు.
ఒకరోజు ముఖం తేటగా, ఏ సూస్తీ లేనిదానిలా వుంటుంది. ఒక్కో రోజు ముఖంలో రక్తమంతా ఎవరో పీల్చేసినట్టుగా అవుతుంది.
దెయ్యాలు ఒంటిమీదకి రావడం, పలకడం, ఏడవడం ఇప్పుడవన్నీ ఏంలేవు. బడేసాహెబ్ కొట్టి దెబ్బలకి పారిపోయిందో ఏమో తెలియదు.
జబ్బు ఇదీ అని ఖచ్చితంగా నిర్దారించలేకపోయినా, సూర్య తనకు తోచిన మందులు వాడుతున్నాడు. సిటీలో ప్రముఖ సైకియాట్రిస్ట్ సలహా కూడా తీసుకుంటున్నాడు.
* * * * *
ఆ రోజు హరిచందనకి కొంచెం కులాసాగానే వుంది. తలంటి పోసింది అలివేణి.
"నాట్యం చేస్తాను అమ్మమ్మా! చాలా రోజులయింది ప్రాక్టీస్ మానేసి."
"చెయ్యి తల్లీ! నువ్వు ఆడుతూ పాడుతూ మామూలుగా వుండడమే నాకు కావలసింది" మనుమరాలు చాలా రోజులకు గజ్జెలు చేతబట్టుకోవడం చూసి అలివేణికి కలిగిన సంతోషం అంతా ఇంతా కాదు. ఆ పిల్ల నెమ్మదిగా మనుషుల్లో పడుతూందన్న నమ్మకం కలిగింది. ఆ సంతోషంతో కూర్చుని తాళంవేస్తూ పాడసాగింది.
ఆమె కాలికి గజ్జె కట్టుకుంటుంటే వచ్చాడు సూర్య.
నెమ్మదిగా నర్తిస్తోంది.
మబ్బులు ముసిరిన ఆకాశం కింద పురివిప్పి ఆడుతున్న నెమలిలా వుంది ఆమె. ద్వారబంధాన్ని ఆనుకుని నిలబడ్డ సూర్య చేతులు కట్టుకుని ముగ్దుడై చూస్తున్నాడు.
సన్నగా వీచేగాలికి పువ్వు రేకలు కదిలినట్లుగా మొదలైన నాట్యం ఉదృతమైన గాలిలో చెట్టుకొమ్మలు పిచ్చిగా వూగుతున్నట్లుగా మారిపోయింది.
పాటకీ, సంగతికీ, తాళానికీ సంబంధం ఎప్పుడో త్రెగిపోయింది.
పిచ్చిగా చేతులు త్రిప్పుతూ ఎగురుతోంది.
"ఏయ్ చిట్టీ! ఇది కూచిపూడి నాట్యామా? పిచ్చిగంతులా?"కోపం పట్టలేక అరిచింది అలివేణి.
అగలేదు హరిచందన.
గిరగిరా తిరిగి పడిపోతుంటే, ఆమెనే జాగ్రత్తగా గమనిస్తున్న సూర్య చప్పున ముందుకొచ్చి ఆమెను పట్టుకున్నాడు.
వడిలిన పువ్వులా అతడి వడిలో ఆమె. అరగంటనుండి నర్తిస్తుంన్నందుకే ఆమె ముఖంలో పట్టిన స్వేదం.