Previous Page Next Page 
ప్రణయ వీచికలు పేజి 3

అతని దవడలు బిగుసుకున్నాయి.
"అర్థం అయింది" అతని గవద ఎముకలు కదలాడాయి.
"ఏమిటి అర్థం అయింది?"
"నువ్వు ఆయన పనికి ఉపయోగపడుతున్నావు. అందుకే నిన్ను ఇండియాకు తీసుకెళుతున్నాడు. అవునా?"
"అవును! అసలు నాకు ఈ ప్రయాణం ఇష్టం లేదు. ఇదేకాదు, మా బాబాయితో ఎక్కడికి వెళ్ళాలని ఉండదు. అందుకే నేను ఎంతో ప్రాధేయపడ్డాను. అయినా వదల్లేదు."
అతను ఓ క్షణం మౌనంగా ఉండిపోయాడు.
"నీ క్రిస్టియన్ పేరు ఏమిటి?"
"సీత!"
అతను త్రుళ్ళిపడ్డట్టుగా చివ్వున తలెత్తి ఆశ్చర్యంగా చూశాడు. అతని కనుబొమ్మలు కొద్దిగా ఆగాయి.
"హిందువుల పేరు! అంతే కాదు! సీత భారతీయులకు ఆరాధ్య దేవత. భారత స్త్రీలకు ఆమె ఆదర్శమూర్తి. పతివ్రతల పేర్లు చెబుతున్నప్పుడు ఇండియన్స్ ముందు సీత పేరును చెబుతారు. ఆమె చరిత్ర హిందూజాతి గర్వించతగింది.
"నిజంగా? అయితే నేను ఆ పేరుకు తగను." తనకుతనే చెప్పుకున్నట్టుగా అన్నది సీత.
"నీ పేరును సార్థకం చేసుకోవడానికి ప్రయత్నించి. అది సరే! నీకు ఈ పేరు ఎందుకు పెట్టారు?"
"నేను భారతదేశంలో పుట్టాను, మా నాన్న బెంగాల్ లైట్ బ్రిగేడ్ గా పనిచేస్తూ ఉండేవాడు."
"నువ్వు అక్కడకు చేరాక నీకు నీ స్వంత దేశం వచ్చినట్టు అనిపిస్తుందనుకొంటాను."
"ఏమో! నాకు తెలియదు. నువ్వంటున్నావు కనక కరక్టే కావచ్చు" ఆమె గతంలోకి జారిపోతూ చిన్నగా అన్నది.
"అవును! అక్కడ దిగగానే నేను చెప్పింది కరెక్ట్ అని నీకు తప్పక అనిపిస్తుంది. మీ బాబాయ్ హైదరాబాద్ వెళుతున్నాడు. అవునా?"
"నీకెలా తెలుసు?"
అతను సమాధానం ఇవ్వలేదు.
"నువ్వు నేను అడిగిన మాటకు సమాధానం యివ్వలేదు."
"ఏమిటి?"
"అదే నన్ను సౌత్ యామ్ ప్టన్ లో చూచినట్టు...ఇక్కడ డెక్ మీద కలుసుకున్నట్టు... మర్చిపోవాలి..."
ఆమె ఆశ్చర్యంగా అతని ముఖంలోకి చూసింది.
"మనం మళ్ళీ కలుస్తామా?" సీత అడిగింది. ఆశ్చర్యం నుంచి పూర్తిగా బయటపడకుండానే.
"తప్పక కలుస్తామనే ఆశిస్తున్నాను. ఈసారి నేను నిన్ను సంతోషంగా నవ్వుతూ చూడాలి. ధైర్యంగా ఉండాలి. నీ పేరును సార్థకం చేసుకోవాలి. సీత పిరికిది కాదు."
"అది అసాధ్యం!" విసుగ్గా అన్నది సీత.
"కొన్నిరోజులు పోతే నీ అభిప్రాయం సరైంది కాదని నువ్వే తెలుసుకొంటావ్. సరే! నాకు ఒకమాట ఇవ్వాలి... అదే ప్రామిస్ చెయ్యాలి"
"ఏమిటా ప్రామిస్?" చిరాకు పడింది.
"ఏ పరిస్థితుల్లోనూ నువ్వు ఇంతకుముందు చెయ్యబోయిన తెలివితక్కువ పని మళ్ళీ చెయ్యనని నాకు మాట ఇవ్వాలి.
"ఎందుకు చెయ్యకూడదు? ఈ జీవితం నేను కోరుకుంటే రాలేదు. నా జీవితం నా ఇష్టం. నాకు జీవించాలని లేనప్పుడు..."
"మీ నాన్న సీత అని పేరు పెట్టినప్పుడు నువ్వంత పిరికిదానివిగా తయారవుతావని అనుకొని వుండడు." ఆమె మాట పూర్తికాకుండానే మధ్యలో అందుకొని అన్నాడు.
"నీ కర్మ. నువ్వు పిరికి తనంతో పారిపోయే ప్రయత్నించడాన్ని మీ తల్లిదండ్రులు కూడా తప్పక నిరసించేవారని నా నమ్మకం!" అన్నాడు మళ్ళీ.
"మా బాబాయి వల్లనాకు కష్టాలు రావడం నా కర్మ అనుకొంటున్నావ్? అవునా?"
కనుబొమ్మలు ముడిచాడు.
"అవును! కానీ నువ్వు ఆత్మహత్య చేసుకొంటే మళ్ళీ జన్మించాల్సి వుంటుంది. ఆ జన్మలో ఇంతకంటే ఎక్కువ కష్టాలు అనుభవించాల్సి రావచ్చు.
"అవును? పునర్జన్మ సిద్ధాంతాన్ని భారతీయులందరూ నమ్ముతారు."
కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకున్న తర్వాత నీకూ ఆ నమ్మకం కలుగుతుంది."
"నేను నీ మాటలు నమ్మను. నాకు మంచి భవిష్యత్తు ఉన్నట్టుగా భ్రమ కలిగిస్తున్నావు."
"కొంతకాలం తర్వాత నేను చెప్పింది నిజం అని నువ్వే అంటావు. షరతు పెడ్తావా?" ఆమెను ఉత్సాహపరుస్తున్నట్టుగా అన్నాడు.
"షరతు పెట్టడానికి నా దగ్గిర ఏమీలేదు. మా బాబాయి నాకు డబ్బు ఇవ్వడు." అమాయకంగా అన్నది.
తను ఇండియాకు బయలుదేరేముందు బాబాయిని గొత్త గౌను కొనుక్కోవడానికి డబ్బు అడిగి తిట్లు తిన్నది. ఆ డబ్బు కూడా తనదే. అయినా ఇవ్వడు.
"బాబాయ్! ఇండియాలో వేడి. నాకున్న దుస్తులు ఆ దేశంలో పనికిరావు" తను నసుగుతూ అన్నది.
"మీ నాన్న చచ్చిపోయేముందు సంపాదించిన ఆ కొద్ది డబ్బు నీపేరు మీద ఫిక్స్ డ్ డిపాజిట్ లో వేశాడు. నీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే అందులోంచి ఒక్క దమ్మిడీ కూడా తియ్యను. నేను శాశ్వతంగా వుండను. ఇకపోతే నేను సంపాదిస్తున్న డబ్బును అనవసరమైన వస్తువుల కోసం ఖర్చు చెయ్యలేను" సమాధానం ఇచ్చాడు తనకు బాబాయ్.
కొంచెం ఆగి బాబాయి తన ముఖంలోకి చూశాడు. తనకు ఏం చెప్పాలో తోచలేదు.

 Previous Page Next Page