Previous Page Next Page 
అందమైన శతృవుతో అరవై రోజులు పేజి 2


    "అన్నట్లు నీ ఫ్రెండ్స్ ఏరీ? ఎవర్నో తీసుకొస్తున్నానని చెప్పావ్ కదా?"
    "అరుగో" వెనక్కు తిరిగిచూసి ఓ పక్కగా నిలబడ్డ ఆరుగురు యువతులను చూపిందామె.
    అందరూ చాలా ఆధునికంగా చాలా ఖరీదయిన దుస్తుల్లో వున్నారు.
    అందరూ ధనిక కుటుంబాలకు చెందినవారేనన్న విషయం తెలిసిపోతోంది.
    సిమ్లాలోని ఆ కాలేజ్ లో చేరాలంటే ఎంతో ధనికులయి వుండాల్సిందే. లేకపోతే ఆ కాలేజ్ దరిదాపులకు కూడా వెళ్ళటం కష్టమే.
    అందుకే దీపను అందులో చేర్చాడతను.
    ఆ యువతులూ దగ్గరకొస్తూ విష్ చేశారు.
    "అందరికి ఎరేంజ్ మెంట్స్ చేశారా డాడీ?"
    "ఓ-యస్! నువ్వు చెప్పినట్లుగానే ప్రోగ్రామ్ అంతా అరేంజ్ చేశాడు శ్రీరామ్."
    శ్రీరామ్ చప్పున వారిదగ్గరకొచ్చాడు.
    "గుడ్ మార్నింగ్ మేడమ్! మేడ మీద ఆరు గదులు మీరు చెప్పినవిధంగా కొత్త ఫర్నిచర్ తో ఫిల్ చేశాను. వారికోసం నలుగురు సర్వెంట్ మెయిడ్స్ ని రిక్రూట్ చేశాను. రోజూ టూరు ప్రోగ్రామ్ ప్రకారం ఎక్కడెక్కడి కెళ్ళాలో అక్కడ ఎకామడేషన్, ట్రాన్స్ పోర్ట్, లంచ్, డిన్నర్, టైప్ డ్ పేపర్ మనం ఇంటికి వెళ్ళగానే మీకిస్తాను."
    "దటీజ్ ఫైన్!"
    అందరూ బయటకు నడిచారు.
    బయట ఎయిర్ కండిషన్డ్ టయోటా కార్లు నాలుగు వరుసగా నిలబడి ఉన్నాయి. తెల్లని యూనిఫారం, పికప్ తో ఉన్న డ్రైవర్లు డోర్ దగ్గర సిద్ధంగా నిలబడివున్నారు. దీప కార్లన్నీ ఓసారి చూసింది. నాలుగూ నాలుగు రంగుల్లో వున్నాయ్. మొదటి రెండు కార్లూ తనదొకటి డాడీ దొకటి. మిగతావి టూరిస్ట్ వాళ్ళవి.
    నలుగురు డ్రయివర్లూ డోర్స్ తీసి పట్టుకున్నారు.
    ఇద్దరిద్దరు ఒకో కార్లో కూర్చోగానే కార్లు బయల్దేరాయ్.
    ఇరవై నిమిషాల్లో కార్లన్నీ బంజారాహిల్స్ లోని ఓ అందమయిన భవనం ఆవరణలో ఆగినాయ్.
    "వ్వాట్! బ్యూటిఫుల్ బిల్డింగ్" అన్నాడు ఆమె ఫ్రెండ్స్ కారు దిగుతూనే.
    లోపల్నుంచి అయిదుగురు సర్వెంట్ మెయిడ్స్ పరుగుతో ఎదురువచ్చారు.
    డిక్కీలో వున్న సామాన్లు తీసుకొని భవనంలోకి నడిచారు.
    శ్రీరంజని చిరునవ్వుతో దీపను రిసీవ్ చేసుకుంది.
    "హాయ్! వెల్ కమ్!" అంది ఆప్యాయంగా.
    "హౌ ఆర్ యూ!" అంది దీప ఆమెకు సమీపంగా వస్తూ.
    "ఫైన్. థాంక్యూ! పదండి. జర్నీతో స్ట్రయిన్ అయ్యుంటారు. త్వరగా రడీ అయితే అందరం ఓబరాయ్ లో లంచ్ కి జాయినవుదాం.
    దీప అభినందన పూర్వకంగా తండ్రివేపు చూసింది.
    తనకు ఓబరాయ్ హోటల్ బేస్ మెంట్ లో లంచ్ చేయటం ఇష్టమన్న సంగతి తండ్రికి తెలుసు.
    అందుకే సాధారణంగా అక్కడే లంచ్, డిన్నర్ లకు వెళ్ళటం జరుగుతూంటుంది.
    తన గదిలోకి వెళ్ళబోతూ పక్క గది ముందు నిలబడ్డ కొత్త సర్వెంట్ మెయిడ్ ని చూసింది దీప. ఆమె వినయంగా చేతులు కట్టుకు నిలబడి వుంది. దీప స్నేహితురాలు సుమిత్ర ఆ గది ముందుకొచ్చినా గది తలుపు తెరవకుండా చూస్తూ నిలబడటం దీపకు అమితమయిన ఆగ్రహం కలిగించింది.
    సుమిత్ర తనే తలుపు తెరుచుకుని గదిలోకి వెళ్ళబోతూంటే దీప చప్పున ఆమె దగ్గరకు నడిచింది.
    "సుమిత్రా! వెయిటే మినిట్ ప్లీజ్!"
    సుమిత్ర తలుపు హాండిల్ ను వదిలేసి దీపవేపు ప్రశ్నార్థకంగా చూసింది.
    "ఏమిటి?"
    దీప ఆమెకు సమాధానం చెప్పలేదు. తిన్నగా సర్వెంట్ మెయిడ్ దగ్గరకు నడిచింది.
    "బ్లడీ ఫూల్! ఆమె వస్తూంటే గది తలుపు ఓపెన్ చేసి నిలబడాలని తెలీదా?" కోపంగా అడిగింది.
    "తెలీదు మేడమ్! సారీ! ఇప్పుడు...."
    ఆమె మాట పూర్తికాకుండానే ఆమె చెంపమీద పడింది దెబ్బ.
    "ఇది సర్వెంట్ మెయిడ్స్ కి ట్రైనింగ్ సెంటరనుకున్నావా? గెటౌట్! వెళ్ళు ముందు."
    ఆ యువతి కళ్ళవెంబడి నీళ్ళు తిరిగినయ్.
    "అయామ్ సారీ మేడమ్!"
    "ముందు బయటకు నడుస్తావా లేదా?"
    "ఈ ఒక్కసారికీ క్షమించండి మేడమ్! మా కుటుంబ పరిస్థితి బావుండక ఈ మెయిడ్ జాబ్ కొచ్చాను. ఇదే మొదటి సర్వీస్. ఇకముందు...."
    దీపకిక సహనం నశించిపోయింది.
    ఆమె మెడమీద చేయివేసి విసురుగా తోసింది మెట్లవేపు.
    ఆమె ఆ విసురుకి కిందపడబోయి నిలదొక్కుకుని కన్నీరు తుడుచుకుంటూ మెట్లు దిగి వెళ్ళిపోసాగింది. వెంటనే పక్కనే వున్న ఇంటర్ కమ్ ఫోన్ అందుకుంది దీప. క్షణాల్లో శ్రీరామ్ ఫోన్లోకొచ్చాడు.
    "శ్రీరామ్! అదెవత్తో హోప్ లెస్ మెయిడ్ ని ఎరేంజ్ చేశావ్. నీకేం బ్రెయిన్ లేదా? సర్వెంట్ మెయిడ్ ఎలా వుండాలో తెలీదా? 'రా' హాండ్స్ ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడానికి బుద్ధుండక్కర్లేదూ?" విరుచుకుపడిందామె.
    "అయామ్ సారీ మేడమ్! ఆమె ఎవరో చెప్తే రీప్లేస్ చేస్తాను" వినయంగా అన్నాడతను.
    "మెట్లు దిగివస్తోంది చూడు. కొత్త మెయిడ్ వచ్చేవరకూ వేరేవాళ్ళనెవర్నయినా పంపించు.
ఓ.కే?"    
    "ఓ.కే. మేడమ్!"
    ఆమె ఫోన్ డిస్కనెక్ట్ చేసింది.
    "సారీ సుమిత్రా! ఆ మేనేజర్ గాడో ఇడియట్ నిజంగా! నా మెయిడ్ ని తీసుకో నువ్వు. అయ్ విల్ మానేజ్ విత్ అవర్ డొమిస్టిక్ స్టాఫ్."
    "థాంక్యూ!"
    దీప సర్వెంట్ మెయిడ్ చకచక నడిచి ఆమె గది డోర్ తెరిచి పట్టుకుంది. సుమిత్ర లోపలకు వెళ్ళగానే దీప సంతృప్తిగా తన గదివేపు నడిచింది.


                                           *    *    *    *


    చిరంజీవికి హఠాత్తుగా మెలకువ వచ్చింది.
    బయటనుంచి గట్టిగా ఎవరో అరుస్తూ మాట్లాడుతున్న శబ్దం వినబడుతోంది."
    "ఇంత బడా చోర్ పిల్లల్ని నేనెక్కడా చూళ్ళేదయ్యా! పిల్లల్ని పెంచటం చేతకాకపోతే అనాథ శరణాలయంలో ఇచ్చెయ్యాలి. అంతేగాని ఇలా దేశంమీద వదిలేస్తే ఎలా?" అంటోంది ఓ ఆడగొంతు.
    "వదలకేం చేస్తాడు? తనే ఓ దేశదిమ్మరయ్యే. తను దూర కంతలేదు. మెడకో డోలు కట్టుకున్నాడట ఎవడో. అలా వుంది వీడి తంతు మగగొంతు. ఇంకొన్ని గొంతులు బిగ్గరగా నవ్వుతున్నాయ్.
    చిరంజీవి ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు.

 Previous Page Next Page