Previous Page Next Page 
ఆఖరి పోరాటం పేజి 2


    రావడంతోనే స్వామి కాళ్ళమీద పడ్డాడు. "పది నిమిషాల క్రితమే మా డిపార్ట్ మెంట్ లో నాకో విషయం తెలిసింది స్వామీ! పరుగెత్తుకు వచ్చాను....."

    "ప్రజల ఉసురు రాముడికే తప్పలేదు. నీలాపనింద కృష్ణుడినే వదిలిపెట్టలేదు. నేనెంత నాయనా. ఎంక్వయిరీ రానీ. మంచిదేగా!"

    చీఫ్ అదిరిపడి "మీకంతా తెలిసిందా స్వామీ?" అన్నాడు.

    "నీ క్రింది అధికారి డిప్యూటీ కమీషనర్ మాట్లాడిన ప్రతీ మాటా నాకు తెలిసింది నాయనా."

    చీఫ్ చేతులెత్తి నమస్కరిస్తూ, "మీరు కాలజ్ఞానులు మహాప్రభో! పది నిముషాల క్రితం జరిగిన రహస్య సమావేశం గురించి కూడా మీకు తెలిసిందంటే మీరు యుగపురుషులు! మీ మీద చర్య తీసుకోబోతున్నారంటే ఇక మాకూ, మా డిపార్ట్ మెంట్ కీ పుట్టగతులుండవు" అంటూ ఏడ్చాడు.

    ఇంత మూర్ఖులూ, దైవభక్తితో జ్ఞానేంద్రియాలు మూసుకుపోయిన వారు, మతం పట్ల అవసరమైన దానికంటే ఎక్కువ నమ్మకం వున్నవారు సి.బి.ఐ. లాటి, దేశపు అత్యంత ప్రధాన డిపార్ట్ మెంట్ లో ఉంటారా అంటే- వుంటారు!!

    "నాయనా! నా మీద అత్యంత భక్తితో నువ్వొచ్చి ఆ ఫైలు సంగతి చెప్పబూనావు. నీ భక్తికి మెచ్చి నీకో తాయెత్తు ఇస్తున్నాను. ఇంతకు ముందు ఇచ్చిన దానికన్నా ఇది మరింత ప్రభావం కలది."

    "కృతజ్ఞుడిని స్వామీ....."

    స్వామి చీఫ్ భుజపు దండకు కట్టబడి వున్న తాయెత్తు తీసి, స్వయంగా మరో తాయెత్తు కట్టాడు.

    "ఆ రెడ్ ఫైలు సంగతి నేను చూసుకుంటాను స్వామీ."

    "అఖ్కర్లేదు నాయనా! దైవకృపవల్ల ఎప్పటి విషయాలు అప్పుడు దివ్యదృష్టితోనే గ్రహించగలను-"

    తల్లడిల్లే భక్తితో చీఫ్ మరోమారు ప్రణామం చేసి వెళ్ళిపోయాడు. స్వామి అటువేపు చూస్తూ చేతిలోని పాత తాయెత్తుని వేళ్ళతో విప్పాడు. బ్యాటరీ అయిపోయిన మైక్రోఫోన్ క్రింద పడింది.

    - ఇంతలో ఒక వ్యక్తి అక్కడి కొచ్చాడు. అతడి పేరు రామ్ లాల్. ఆ సాయంత్రం వ్యవహారం నడపాల్సింది అతడే.

    "ఈ రోజు మనం చేయబోయే పని సి.బి.ఐ.కి తెల్సిందట. కోడ్- కాలర్ లిఫ్టింగ్... ఆడిటోరియం అంతా వాళ్ళు వుంటారేమో, ప్రోగ్రాం రేపటికి మార్చనా-?"

    "వద్దు నాయనా, యద్భావం తద్భవతి. వాళ్ళందరూ వుండటమే మంచిది."

    తిరిగి పూజలో మునిగిపోయాడు స్వామి. రామ్ లాల్ అక్కడి నుండి బయల్దేరి ధియేటర్ దగ్గరకు వచ్చాడు. అక్కడికింకా ప్రేక్షకులు చేరుకోలేదు. సాయంత్రం ఐదు కావొస్తూంది.

    అతడి మనసులో ప్లాన్ క్లియర్ గానే వుంది. హత్యకి నలుగుర్ని ఉపయోగించదల్చుకున్నాడు అతడు. వాళ్ళకి పేర్లు లేవు. A-1, A-2, A-3, A-4 అంతే.

    నాటకం ట్రూపువాళ్ళు కలకలం మాత్రం గ్రీన్ రూమ్ లోంచి వినపడుతూంది. రామ్ లాల్ తలెత్తి ముఖద్వారం వేపు చూశాడు. పెద్ద తోరణం లాటి గుడ్డ వేలాడుతూ వుంది.     

                                    వికలాంగుల సహాయార్ధం - ఇందిరాగాంధీ
                       మహిళా కళాశాల నిర్వహణలో కళాభారతి నాటకం


                                   "ఆఖరి పోరాటం"

    రామ్ లాల్ కి ఎందుకో నవ్వొచ్చింది.

    ఏ పోరాటమూ లేక అతడి చేతులు దురద పెడుతున్నాయి. ఇప్పుడు సి.బి.ఐ. రంగంలోకి దిగింది. కాస్త దురద తీరవచ్చు. దేశపు నెం. 1 చీకటి ప్రపంచపు లీడర్ క్రింద పనిచేయడంలో ఇష్టం అదే. థ్రిల్స్ వుండవు. పోరాటాలు వుండవు. ఇన్నాళ్ళకి కోరిక తీరబోతూంది.

    అదే సమయానికి లోపల రక్షణ ఏర్పాట్లు చేస్తూన్న డిప్యూటీ కమీషనర్ మనసంతా ఉద్విగ్నత నిండి ఉంది. ఇంత పెద్ద చీకటి ప్రపంచానికి ఎదురుగా, ఒంటరిగా పోరాడింది తను ఒక్కతే- ఈరోజు పదిమందికీ తెలిసింది. ప్రభుత్వంలో పాతిక శాతం "వాళ్ళ" మనుష్యులున్న పరిస్థితుల్లో ఈ విషయం రహస్యంగా వుండదిక. రెండు సంవత్సరాల కష్టం ఈ సాయంత్రం ఫలితమివ్వాలి.

    "వేచిచూడు" అన్నది సి.బి.ఐ. ట్రెయినింగ్ లో చెప్పే మొదటి పాఠం. ప్రస్తుతం చేస్తున్న పని అదే. ఇన్నాళ్ళు వేచిన దానికి ఫలితం ఈ రోజు కనబడాలి.

    డి.సి. దృష్టి ఎదురుగా వున్న బ్యానర్ మీద పడింది. ఇందిరాగాంధీ మహిళా కళాశాల ఆధ్వర్యంలో... ఆఖరి పోరాటం.

    అవును. తనకిదే బహుశా ఆఖరి పోరాటం కావొచ్చు.

    తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి స్వామి మీద పగ తీర్చుకోవడానికి ఇదే అవకాశం కావొచ్చు.


                                 2


    సునాదమాల కాళ్ళు వణికాయి.

    ఆ అమ్మాయికి కాళ్ళు వణకడం కొత్తకాదు. బస్ లో వెళుతున్నప్పుడు ఎవరైనా రౌడీ దూరంనుంచి నవ్వినా సరే - ఆవిడ కాళ్ళు వణుకుతాయి. డబ్బు అందిస్తూ కండక్టరు చెయ్యి తగిలించినా కాళ్ళు వణుకుతాయి. వెంటనే స్నానం చెయ్యాల్సిందే.

    ఈ రోజు మరీ ఎక్కువగా వణకడానికి కారణం- ప్రిన్సిపాల్ ఆమెతో "అమ్మాయ్! నువ్వు మెయిన్ గేట్ దగ్గర నిలబడి మంత్రిగారికి పుష్పగుచ్చం అందించు" అనడమే.

    ప్రిన్సిపాల్ గత వారం రోజులుగా తెగ హడావుడి పడుతూంది. మంత్రిగారి దృష్టిలో ఎలాగయినా పడి పరిచయం పెంచుకుని తన ఊరికి ట్రాన్స్ ఫర్ చేయించుకోవాలని ఆవిడ ఆశ.

    కాలేజీ బ్యూటీ సునాదమాలని ముఖద్వారం దగ్గర నిలబెట్టడంలో ఆమె ఆశయం అదే! ఎవరయినా సరే- ఆ అమ్మాయిని ఒకసారి చూస్తే కాసింత దూరం వెళ్ళి తిరిగి మళ్ళీ చూడాల్సిందే. అంతటి స్టన్నింగ్ బ్యూటీ ఆమెది. ఆమె బ్రిలియంట్ స్టూడెంట్ కాదు. కానీ ఒద్దికయిన అమ్మాయి. ఆమెలో వున్న ఒకే ఒక దుర్గుణం "భయం" ....! అయితే అంత అందమయిన అమ్మాయికి భయం కూడా ఒక అర్హతగానే జోడయింది.

    దాదాపు నాలుగు గంటలనుంచీ ఆమెకి ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. సాయంత్రం ఎప్పుడవుతుందా అని చూస్తోంది.

    ఆయన వస్తాడు - లోపలికి వెళతాడు. గుమ్మం దగ్గర నిలబడి పుష్పగుచ్చం అందించాలి.

    అంతే తాను చెయ్యవలసింది.

    కానీ, అందిస్తూండగా అది జారిపోతే? ఆయన దాన్ని చూసుకోకుండా లోపలికి వెళ్ళిపోతే...? అన్నీ ప్రశ్నలే.

    తాను క్రింద వేపు పట్టుకుంటే ఆయన మధ్యలో పట్టుకుంటూ తీసుకుంటారా? తానే మధ్యలో పట్టుకుని అందించాలా? ఆయన చేతులు తగిలితే ఎలా? అందించాక నమస్కారం పెట్టాలా? అవసరం లేదా? ఆయన్ని సీటువరకూ తీసుకువెళ్ళాలా... ఆ విషయం ప్రిన్సిపాల్ చూసుకుంటుందా?

    సాయంత్రం వరకూ అన్నీ అనుమానాలే.

    ఆరయింది.

    వేగంగా కొట్టుకుంటూన్న గుండెతో గుమ్మం దగ్గర నిలబడి వుంది సునాదమాల.

    అతిధులు ఒక్కొక్కరే వస్తున్నారు.

    అతిధులతోపాటూ నలుగురు ఆగంతకులు కూడా వచ్చి తమ తమ సీట్లలో కూర్చున్నారు.... A-1, A-2, A-3, A-4.

    ఆరుంపావయింది.

    ఆరూ ఇరవై.


                                                                 *    *    *


    గ్రీన్ రూమ్ లో నికుంజ్ విహారి హడావుడిగా అటూ ఇటూ తిరుగుతున్నాడు. కళాభారతి ట్రూపు అతడిదే. ఆఖరి పోరాటం నాటకానికి అతడే దర్శకుడు. ఆ నాటకంలో అతడిది 'మంత్రి' పాత్ర.

    అదే నాటకంలో అతడి మిత్రుడు ఆటోడ్రైవర్ వేషం వేస్తున్నాడు. అతడి పేరు పద్మాకర్. వారిద్దరూ మంచి స్నేహితులు.

    నికుంజ విహారికి తండ్రి లేడు. తల్లి వర్ధని లక్షాధికారిణి. ఆమె తండ్రి ఆమెను పెద్ద ఆస్థికి వారసురాలిగా మిగిల్చి మరణించాడు. ఆస్థిని నిలబెట్టుకునే లౌక్యం ఆమెకులేదు. నమ్మకస్తుడయిన మానేజరు కూడా వృద్దుడయ్యాడు. కొడుకు చేతికి అందివస్తాడనుకుంది. కానీ అతడేమో నాటకాలంటూ ఇల్లుపట్టకుండా తిరుగుతున్నాడు. ఆమెకు అదొక్కటే బాధ.

    విహారిలో పట్టుదలా కృషీ లేదనికాదు. బియ్యే ప్యాసయ్యాడు. అతడి దృష్టి అంతా నాటక సమాజంమీదనే. అతడు స్థాపించిన కళాభారతి మూడు సంవత్సరాల్లో ఆంధ్రదేశపు ప్రతిష్టాకరమైన నాటక సమాజాల్లో ఒకటిగా మారిందంటే దానికి కారణం డబ్బొక్కటే కాదు. అతడి కృషి కూడా! అది తల్లికి తెలుసు. ఆమె బాధంతా కొడుకు తన ప్రతిభని అనవసరమైన విషయాలమీద ఎక్కువ ఖర్చు పెడుతున్నాడని....! భర్త పోయినప్పటినుంచి ఆమె ఎక్కువగా భక్తినీ, మౌనాన్ని ఆశ్రయించింది. ఆమెలో మంచితనమెంత వుందో - దానికి రెండు రెట్లు అమాయకత్వం కూడా వున్నదనటానికి చిన్న ఉదాహరణ చాలు.

    ....వాళ్ళింట్లో వుండే వంటవాడి పేరు గంగులు. పద్మాకర్ కీ వాడికీ మంచి దోస్తీ. ప్రశస్తమయిన వంట వాళ్ళందరూ బెంగాలీలన్న పద్మాకర్ సలహామీద తన పేరుని 'గంగూలీ'గా మార్చుకున్నాడు. వాడికి ముగ్గురు భార్యలు. డబ్బు అవసరం ఎక్కువ. వారిక్కూడా నాటకాల పిచ్చి కాస్త వుంది. ఇంకో నాలుగు రోజుల్లో పండగనగా వాడి ముగ్గురు భార్యలూ తమకి చీరెకొని పెట్టకపోతే వాడి వెన్నెముక విరగ్గొట్టి 'సుమంగళి' చిత్రంలో సావిత్రిలా అయిపోతామని విడివిడిగా అల్టిమేటం ఇచ్చారు. అంత తక్కువ సమయంలో అంత డబ్బు ఎలా సంపాదించాలో తెలియలేదు వాడికి.

    అంత తలమునకలవుతున్న పరిస్థితుల్లో పద్మాకర్ వాడికో సలహా ఇచ్చాడు. అమ్మగారి దగ్గిరే తన నటనా సామర్ధ్యాన్ని పరీక్షించుకుందామనుకుని, ఒక నాటకాల కంపెనీ దగ్గర మేకప్ వేయించుకుని ఇంటికి వచ్చాడు.

    "అమ్మా! ప్రొద్దున్న వచ్చి మీరు శివాలయం పక్కనున్న పుట్టలో పాలు పోశారు కదా."

    అవునంది వర్ధనమ్మ.

    "మీరు వేడిపాలు పోసినట్టున్నారు. పాము చనిపోయిందమ్మా!" విషాదంగా అన్నాడు.

    వర్ధనమ్మ మొహం వాడిపోయింది. "నిజమా!" అంది.

    "అవునమ్మా! మీరలా పాలుపోసి వెళ్ళగానే అది పుట్టనించి బయటకు వచ్చింది. తోలు కాలి అక్కడికక్కడే మరణించింది. పక్కనే వున్నాన్నేను. ఎవరా అని చూస్తే మీరు-"

    ఆమెకు దుఃఖమొక్కటే తక్కువ "అయ్యో! ఇప్పుడెలా?"

    "అయిదు వందలుపెట్టి అర్చన్ చేయించాలి తల్లీ! తర్వాత ఒక ఇత్తడి పాముని కూడా దానమివ్వాలి."

    ఆమె శివస్తోత్రం పఠిస్తూ లోపల్నించి డబ్బు తీసుకువచ్చి ఇచ్చింది. గంగూలీ అది తీసుకుని వెళ్ళిపోయాడు. కథ సుఖాంతమయ్యేదే కానీ, అప్పుడే పద్మాకర్, విహారి వచ్చి వాడిని రెడ్ హాండెడ్ గా పట్టుకున్నారు.

    "ఏరా? మక్కెలిరక్కొట్టమంటావా? పోలీసుల్ని పిలిపించమంటావా?"

    వాడు చేతులు జోడించి, "రెండింటిలో ఏదయినా చేయండి బాబూ! కానీ డబ్బులు వెనక్కిలాక్కొని మాత్రం ఇంటికి పంపించకండి" అన్నాడు నిజాయితీ ధ్వనిస్తూన్న దుఃఖంతో.

 Previous Page Next Page