ఒక సుముహూర్తం కోసం నిరీక్షిస్తున్నట్టుగా అందరూ నిశ్శబ్దం వహించారు.
అయిదు నిమిషాలు గడిచిపోయాయి.
బాగా అలంకరింపబడిన భ్రమరను తల్లి రెక్కపట్టి తీసుకువచ్చి చిరుచాప మీద కూర్చోబెట్టింది.
ఆ హాల్లో ఒక తటిల్లత చెమక్ మని మెరిసినట్టుగా, ఒక పున్నమి చందమామ ప్రవేశించినట్టుగా అనిపించింది పెళ్ళి చూపులకి వచ్చిన వాళ్ళకి.
పెళ్లికొడుకు రాఘవేంద్ర ముఖంలో గొప్ప సంతృప్తి నిండిపోయింది పెళ్ళికూతుర్ని చూడగానే.
"వదిన ఎంతవరకు చదివిందో అడుగమ్మా!" రాఘవేంద్ర చెల్లెలు అప్పుడే వరుస కలిపేస్తూ తల్లితో అంది.
"మా సుధ వదినేం చదువుకొందో అడగమంటూంది" తల్లి అంది.
భ్రమర మాట్లాడడానికి సిగ్గుపడుతూవుంటే శారదమ్మ జవాబిచ్చింది. "ఈ ఊల్ళో వున్నంతవరకు చదివించాం. ఎస్. ఎస్.సి. పాసయింది. ఒంటరిగా ఆడపిల్లను పై ఊళ్ళకు పంపడం బాగుండదని అక్కడితో ఆపాం. ఇక ఇంట్లోనే సంగీతం, నృత్యం నేర్చుకొంది. సంగీతానికి నేను గురువునైతే, నృత్యం తండ్రి వద్ద నేర్చుకొంది. నృత్య సంగీతాలకు ఈ ఇల్లు తరతరాలుగా ప్రసిద్ది."
కాబోయే వియ్యంకుడు పశుపతి మెచ్చుకోలుగా "అయితే లక్ష్మీసరస్వతులు కలసికట్టుగా మీ ఇంట్లో నివాసమున్నారన్నమాట!" అన్నాడు.
"పదిన్ని ఒక పాట పాడమనవే!" మళ్ళీ తల్లితో చెప్పింది సుధ.
"నా రికమండేషన్ ఎందుకట? మీ వదిన్ని నువ్వే అడగొచ్చుగా?" అంది తల్లి.
"నాకు భయం బాబూ!"
"పాడమ్మా ఒక పాట, మీ మామగారికి సంగీతమంటే వల్లమాలిన ఆపేక్ష" అంది ఈశ్వరమ్మ
"సంగీతా! వీణ తెచ్చిపెట్టమ్మా అక్కకి" చిన్నకూతురికి పురమాయించింది శారదమ్మ.
వీణ తెచ్చి అక్క ముందుంచింది సంగీత.
"నువ్వూ కూర్చోవే! ఇద్దరం పాడదాం. ఒక్కదాన్ని పాడాలంటే భయంగావుంది" గుసగుసగా అంది భ్రమర.
"వాళ్ళు వినాలనుకొంటున్నది పెళ్ళికూతురిపాట! నువ్వే పాడు" గడుసుగా అంది సంగీత.
ఇక తప్పదన్నట్టుగా, గుండె దిటవు పరుచుకొని, కళ్ళుమూసి వీణాపాణిని స్మరించి వీణ తీగలను మీటించి భ్రమర.
"పక్కలా నిలబడి - గొలిచే ముచ్చట బాగా తెల్పగరాదా" ఖరహర ప్రియరాగంలో త్యాగరాయకీర్తన పాడింది.
రస తరంగాలలో తేలిపోయారు శ్రోతలు.
తను గొప్ప సంగీత ప్రియణ్ణన్నట్టు తల ఊగించి ఊగించి, తన్మయత వ్యక్తపరచి అలసిపోయాడు పశుపతి. పాట ముగిశాక, ఏమాత్రం మనసు దాచుకోలేకపోతున్నట్లుగా, "నాకు కోడలిగా రాబోయే అమ్మాయి ఎలా వుండాలనుకొన్నానో సరిగ్గా అలాగే వుందండీ మీ అమ్మాయి. నాకు బాగా నచ్చింది ఏరా రఘూ అమ్మాయి నచ్చినట్టేనా?" అనడిగాడు.
కించిత్తు కూడా సంకోచించకుండా తల జోరుగా ఊగించేశాడు రాఘవేంద్ర.
"ఇక పంచాంగం తీయండి బావగారూ, లగ్నాలు ఎప్పుడెప్పుడున్నాయో, వధూవరుల గ్రహబలాన్ని బట్టి ఏ లగ్నమైతే భేషుగ్గా ఉంటుందో చూద్దాం" మహోత్సహంగా అన్నాడు పశుపతి.
భార్య ఆయనకి దగ్గరగా జరిగి, తొడగోరి గుసగుసగా అంది."ఇచ్చిపుచ్చుకోడాలు ఏం మాట్లాడకుండానే అప్పుడే లగ్నాలవరకూ వచ్చేశారేమిటి?"
ఆయన మాత్రం పెద్దగా ఫెళ్ళున నవ్వి అన్నాడు. "పిచ్చిదానా! కోడలు బంగారమే బంగారం. నాకు వేరే ఆశలేం మిగల్చలేదా పిల్ల! అయినా నాకేం తక్కువని, పల్లెలో ఇరవై ఎకరాల వరీ, వందెకరాల మెట్ట, అయిదెకరాల మామిడితోట వున్నాయి. సంపాదించే కొడుకున్నాడు. నాకేం తక్కువని కోడలు తన పుట్టింటినుండి కట్నకానుకలు పుట్టుకురావాలని ఆశపడతాను? నేనే కోడలికి పెడతానే ముప్పై తులాలకి తక్కువకాకుండా బంగారం. నా కోడలికి బెనారస్ చీరలు తప్ప మామూలు చీరలు కొనను" ఆయన గుండెలు ఉప్పొంగగా, తన హృదయ వైశాల్యాన్ని చాటుకొన్నాడు. "పంచాంగం తెండి బావగారూ! నేనేదైనా అనుకొన్నానంటే ఆ పని నిమిషాల మీద అయిపోవాలి"
పెళ్ళాం ముఖం మాడ్చేసుకుంది.
రాఘవేంద్ర కొంచెం సిగ్గుగా "అమ్మాయి అభిప్రాయం కూడా కనుక్కోండి నాన్నగారూ. నాకామె నచ్చింది. తనకీ నేను నచ్చానో లేదో" అన్నాడు. అమ్మాయి అభిప్రాయానికి విలువ ఇచ్చినట్టు కనిపించడం నాగరికత కదా!
"చెప్పమ్మా, భ్రమరాంబికా. మా రాఘవ నీకు నచ్చాడా?" అడిగింది ఈశ్వరమ్మ.
భ్రమర దించుకొన్న తల ఎత్తకుండానే కంటి చివర నుంచి చూసింది.
తను రోజూ గుడికివెళ్ళి దర్శించుకొనే మారుతి ఈ వరుడిరూపంలో సాక్షాత్కరించినట్టనిపించింది. చిన్నగా మిణుకు మిణుకు మంటున్న కళ్ళు, ఎత్తుగా వున్న మూతి మీదికి వంగినట్టుగా వున్న గరుత్మంతుడి ముక్కు జుట్టు మాత్రం ఉంగరాలు తిరిగి నల్లగా వుంది. కాని, ఏం లాభం? కోతి తలకి ఉంగరాల విగ్గు తగిలిస్తే దానికి ఎంత అందం వస్తుందో ఈ మనిషికి ఆ జుట్టు అంతే అందంగా వుంది. శరీరఛాయ ఎరుపు, గుళ్లో ఆంజనేయస్వామికి సింధూరం పూసినట్టుగా, మరీ పొట్టి పొడవుకాకుండా, లావూ సన్నం కాకుండా ఫర్వాలేదన్నట్టుగా వున్నాడు. కాని ఆ ముఖమే......
వరుడి రూప సౌందర్యాలు చూశాక భ్రమర ముఖం పాలిపోయింది.
"చెప్పమ్మా మా రాఘవ నచ్చాడా లేదా?" మళ్ళీ అడిగిందామె.
వీణ ప్రక్కకి జరిపి చివ్వున లేచి లోపలికి వెళ్ళిపోయింది భ్రమర.
"అమ్మాయి అలా వెళ్ళిపోయిందేమిటి?"