బెడ్ మీద విలవిల్లాడుతూ శ్రీమతి ఆఖరిశ్వాస వదలడం ప్రత్యక్షంగా చూసిన జగపతి ఆ షాక్ నుంచి వెంటనే తేరుకోలేకపోయాడు.
సరిగ్గా అదేసమయంలో మ్రోగింది ఫోన్.
"హలో...." అన్నాడతను అంత టెన్షన్ లోనూ....
అటునుంచి శ్రీప్రియ
ఆ సమయంలో ఆమె తప్ప మరెవ్వరూ ఫోన్ చేయరని అతనికి తెలుసు.
"ఏమైంది?"
"ఐపోయింది శ్రీప్రియా....నువ్వు వెంటనే నా కారులో వచ్చేయి" చెప్పాడతను.
"ఇప్పుడే వస్తున్నాను....మీరేం ఖంగారుపడవద్దు...." అంటూ ఏంచేయాలో చెప్పిందామె.
జగపతి రిసీవర్ పెట్టేశాడు.
ఐదు నిమిషాలు గడిచాయి.
శ్రీప్రియ వస్తున్న జాడలు లేవు....
జగపతిలో ఒకటే టెన్షన్....!
ఎదురుగా అర్ధాంగి శవాన్ని ఉంచుకొని....అదీ స్వహస్తాలతో మర్డర్ చేసి ఎదురుగా కూర్చోవడమంటే మహామహులకే ధైర్యం చాలదు. ఇక పిరికి గుండెగల జగపతి సంగతి చెప్పనవసరం లేదు.
బితుకు బితుకు మంటున్న గుండెతో ఎదురుచూస్తున్నాడతను.
సరిగ్గా అదేసమయంలో....
గెస్ట్ హౌస్ లో శ్రీప్రియ....చక్రవర్తికి ఫోన్ చేస్తున్నది
"హలో చక్రీ...."
"అవును చక్రవర్తినే....ప్రియా మళ్ళీ ఎందుకు ఫోన్ చేశావ్?"
చక్రవర్తి గొంతు విసుగ్గావుంది.
"ప్లీజ్ చక్రీ....నేను ఒక ఆపదలో ఇరుక్కున్నాను....నన్ను రక్షించు"
అవతలవైపు నుంచి రిప్లయ్ రాలేదు.
"మాట్లాడవేం చక్రీ...."
"నాతో ఆటలాడుకుంటున్నావా ప్రియా"
"లేదు చక్రీ నిజమే చెబుతున్నాను. చాలా ప్రమాదంలో ఇరుక్కున్నాను. నన్ను రక్షించవూ"
"అసలు ఏమయింది నీకు?"
"అదంతా వివరంగా ఫోన్ లో చెప్పడం కుదరదు. మీరు ఒక్కఅరగంట నాకోసం కేటాయించరూ....ఇక జీవితంలో మిమ్మల్ని ఇంకేమీ అడగను....ఈ ఒక్కసారి నామాట వినరూ ప్లీజ్...." ఆమె అభ్యర్ధనకు చక్రవర్తీలో సంచలనం మొదలయింది.
"కానీ....నేను రావడానికి వీలుపడదు ప్రియా....ఇక్కడ మనుషులు నాపై నిఘావేసి వున్నారు. బయటకు కాలు కదిపితే చాలు నన్ను అడ్డుకుంటారు. ఇలాంటి పరిస్థితులలో నేను నీకు సహాయపడలేనేమో....అంటూ అతను ఇంకా ఏదో చెప్పే ప్రయత్నంలో వున్నాడు.
"చక్రీ....మీరు నాకోసం వచ్చే ఆ అరగంట ఖరీదు నాప్రాణం....మీరు ఇప్పుడు రాకపోవటమంటూ జరిగితే తెల్లవారి పేపర్లో నా మరణవార్త వుంటుంది...."
"అంతమాట అనకు ప్రియా....వస్తాను....సరే నీకోసం తెగించి వస్తాను...."
చక్రవర్తి మాటలలో స్థిరత్వం తొంగిచూస్తోంది.
"విజయవాడ హైవేలో ఎక్కడో ఒకచోట రోడ్ ప్రక్కనే ఆగి వుంటుంది ఒక కారు. ఆ కారు నెంబరు ఏ ఏ జడ్ టూ త్రీ ఫోర్ త్రీ....ఖచ్చితంగా అరగంటలో వుండాలి...." అని ఫోన్ పెట్టేసిందామె.
పది నిమిషాలలో శ్రీప్రియ కారుని తనే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ జగపతి ఇంటికి వెళ్ళింది.
అప్పటికే ఆందోళనతో సగం చచ్చిపోయివున్నాడు జగపతి.
వెంటనే ఇద్దరూ కలిసి వసుమతి శవాన్ని చెరొకవైపు పట్టుకొని కారు డిక్కీలోకి చేర్చారు.
అతని నరనరాలలోనూ ప్రకంపనం....గుండెల్లో వణుకు....తాము ఎవరికయినా పట్టుబడతామేమోనని భయం అతనిది.
అసలు ఏమీ జరగనంత నిబ్బరంగా కూర్చుని వుంది శ్రీప్రియ,
"నీతోపాటు నీకు తెలిసిన వ్యక్తిని ఎవరినో తెస్తానన్నావు....ఏడీ, మనిద్దరివల్ల స్మశానంలో గొయ్యితీసి పూడ్చిపెట్టడం సాధ్యంమవుతుందంటావా? అతను రాకపోతే...." వణుకుతున్న స్వరంతో అడిగాడు జగపతి.
"అతను మనల్ని దారిలో కలుస్తాడు. అక్కడ అతన్ని కలుపుకుని వెళదాం."
"అలాగే" అంటూ కారుని స్టార్టు చేశాడు జగపతి.
శ్రీప్రియ అతని ప్రక్కనే కూర్చున్నది.
జగపతి వణుకుతున్న చేతులతో డ్రయివ్ చేస్తున్నాడు.
శ్రీప్రియ అతని అవస్థ గమనించి తనలో తనే నవ్వుకున్నది.
ఇంకెంతసేపు....
జస్ట్....పావుగంట!
తను అనుకున్నవన్నీ అనుకున్నట్టే జరిగిపోతాయి.
ఆమె మనసులో మెదిలే ఆలోచనలను పసిగట్టలేని జగపతి....ఆమె చెప్పినచోట రోడ్ కు వారగా కారుని ఆపి గ్లాసుల్ని పైకి లేపాడు.
శ్రీప్రియ కారు దిగి నిలుచున్నది.
ఆమె చూపులు రోడ్ మీద స్థిరంగా నిలిచి వున్నాయి.
ఆమె పెదవులపై చెరిగిపోని చిర్నవ్వు చిందులేస్తోంది.
* * *
చక్రవర్తి తనున్నగదిలోనుంచి బయటకు వచ్చాడు.
ఇద్దరు వ్యక్తులు హాలులో అటూ ఇటూ పచార్లు చేస్తున్నారు. వాళ్ళ దృష్టిలో పడకుండా బయటకు వెళ్ళడం అసంభవం.
కానీ తను వెళ్ళాలి!
ఎలా వెళ్ళాలి?