లత అంతవరకూ మేలుకుని ఉండటానికి కారణం అర్ధమయి పోయింది రామచంద్రకు. గాలి తీసిన బెలూన్ ల అతని ఉత్సాహమంతా అణిగిపోయింది . " ఏం సినిమా?"
"భయంకర నారి."
"జానపదం కదూ? ఇందాకా పోస్టర్లు చూశాను. ఆ పోజులన్నీ ఎంతో చండాలంగా వున్నాయి. ఎందుకా సినిమా చూడటం? ఏముంది అందులో?"
ఏదో ఒకటి. ఈ ఊళ్ళో అంతకన్నా మంచి కాలక్షేపమేముందీ?"
"లతా! నేను బీదవాడ్ని కాకపోయినా, మరీ గొప్ప వాడ్ని కాను. ఈ నెలలో నువప్పుడే నాలుగు సినిమాల కెళ్ళావు. ఒక్కొక్కసారీ అయిదు రూపాయలన్నా ఖర్చు చేస్తావు . ఎక్కడ తేగలను? నా కేమన్నా నెలజీతమా? ఇలా దూబారా చేసుకుంటే ముందు ఎలా గడుస్తుంది? నువు రాకముందు సంవత్సరానికి రెండు వేలైనా బెంకులో వెయ్యగలిగే వాడిని.
ఈ సంవత్సరం రెండు వందలైనా మిగులుతుందో లేదో ?"
"అంత కూటికీ గుడ్డకీ కాని ఈ వ్యవసాయం దేనికి? ఈ పొలం అమ్మేసి హాయిగా బస్తీలో ఉద్యోగం చేసుకోకూడదూ?" ఎంత అణుచుకున్నా ఆపరాని కోపం వచ్చింది రామచంద్రకు.
"నా వ్యవసాయం కూటికీ గుడ్డకీ వస్తుంది. నీ విలాసాలకే రాదు . బస్తీ వుద్యోగం మొదలు పెడితే కూడు, గుడ్డా కూడా కరువవుతుంది. "ముఖం ముటముట లాడించుకుంది లత.
"యింతకూ ఏమిటంటారు?"
"ఏమీ అనను . నా దగ్గర డబ్బు లేధంటున్నాను."
"ఒక్క సినిమా చూసేందుకు కూడా గతి లేదా ?"
"నీ యిష్టం ఎలా అయినా అనుకో! నేను చెప్పవలసినది చెప్పేశా"
"ఛీ! ఛీ ! వెధవ బ్రతుకు! ఒక్క సుఖం లేదు." తింటోంన్న కంచములో చెయ్యి కడుక్కుని లేచిపోయింది! వెళుతున్న లతను ఒక్క క్షణం చూసి బరువుగా నిట్టూర్చి తనే వడ్డించుకుని భోజనం ముగించాడు రామచంద్ర.
మరునాడు పొద్దున్న కాఫీ అందిస్తూ మళ్ళీ అడిగింది లత.
"సినిమాకి వెళ్ళొద్దు!"
"నా దగ్గిర డబ్బులు లేవని చెప్పాను."
"మీరు తలుచుకుంటే ఎలా అయినా ఇవగలరు."
"కాని, అలా తలచుకోవటం నా కిష్టం లేదు" వెళ్ళిపోయాడు రామచంద్ర.
ఉదికిపోయింది లత. సినిమాకు వెళ్ళలేకపోయానే అనే బాధ కంటే డబ్బులు లేవు కనుక రాలేకపోయానని నాగమణికి చెప్పుకోవాలన్న బాదే ఎక్కువయిపోయింది లతలో.
చటుక్కున వారిజ గుర్తుకొచ్చింది. వారిజ ఏ స్కూల్లో పని చేస్తోందో రవి చెప్పాడు ఆదరాబాదరా వంట ముగించి కెరియర్ సర్ది రామచంద్రం కు పంపేసి వారిజ దగ్గిరికి బయలుదేరింది లత.
చిన్నపిల్లలకు పాఠాలు చెపుతోన్న వారిజ లతను చూసి మొదట ఆశ్చర్యపోయింది. స్టాఫ్ రూమ్ లో కూర్చోబెట్టి " ఒక్క పావుగంట అగు, ఈ క్లాస్ అయిపోగానే నాకు తీరుబడే! మాట్లాడుకుందాం" అని దగ్గరకొచ్చి ఆదరంగా చూస్తూ "ఏం లతా, బాగున్నావా!" అంది.
లత నిస్పృహగా నిట్టూర్చి "ఏం బాగోలే " అంది.
వారిజ లోలోపల కలుక్కుమంది. అయినా చెల్లెలు రకారాక తన దగ్గరకు ఇన్నాళ్ళకు వచ్చింది. అడుగు పెట్టీ పెట్టకుండా మందలింపులు ప్రారంభించడం భావ్యం కాదు . అయినా కాస్త మృదువుగానే అంది.
"సంసారమన్నాక కష్ట సుఖాలు లక్ష ఉంటాయి. ఎలాగో సర్దుకుపోవాలి గాని ఇలా బెంబేలు పడిపోతే ఎలా?"
"ఏం సర్దుకు పోవటమోలె! రవన్నయ్య చెప్పాడు నువ్విక్కడుంటున్నావని , అప్పట్నుంచి వద్దామనే అనుకుంటున్నాను పడలేదు."
"ఫరవాలేదులే! ఆమాత్రం అభిమానం నా మీద ఉంటె చాలు. అయినా నువ్విక్కడికి రావడం కూడా అంత మంచిది కాదు. అణుచుకుంటూ అంది.
"మీరంతా ఏం చెప్పారు? నేను చచ్చిపోయానని కదూ? ఇప్పుడూ నీకు అక్కగా నాలాటి దొకటి బతికుందని తెలిస్తే కలతలూ రావూ?" ఆశ్చర్యంగా అంది లత.
"అవునేవ్! అందులో ఆయనకి కాస్త నాజూకుగా అలంకరించుకుంటేనే ఒళ్ళు మంట. సినిమా స్టార్ లంటే మరీ మంట. సినిమా చూస్తానంటే నే సిగ్గూ లజ్జా వదిలేసినా ఆ తైతక్కలెం చూస్తావని విసుక్కుంటారు. ఇంక నువ్వు సినిమా స్టారువని తెలిస్తే అసహ్యంతో నన్ను వదిలేసినా వదిలేస్తారు."
లత నోటి నుండి వచ్చిన ఒక్కొక్క అక్షరమూ వారిజ హృదయాన్ని ముక్కలు ముక్కలుగా చీల్చింది. అవన్నీ నిజాలే! కాని లతకు తను ఎవరితో మాట్లాడుతుందో ఆ ఇంగితం లేదేం?
"ఇంకా తరచుగా రాను కాని ఇవాళ ఒక చిన్నపని మీద వచ్చాను." ఉసూరు మంది వారిజ ఎండమావులలో నీరశించినట్లు లత హృదయంలో ప్ర్రేమను ఆశిస్తుందేమిటి తను!
"ఏమి పని"
"నాకొక్క పది రూపాయలు కావాలి" డబ్బు! డబ్బు కోసం వచ్చింది లత. తనను చూడగానే తన వారందరికీ డబ్బు తప్ప మరో విషయం గుర్తురాదు.
గుండెలు పగిలే నిట్టుర్పు నణుచుకుంటూ బాగ్ లోంచి తీసి పదిరూపాయలు ఇచ్చింది. తన దగ్గర ఇంక దమ్మిడి లేదు. నెలంతా ఎలా గడుపుకోవాలో? కుతూహలం అణచుకోలేక అడిగింది.
"నీ కెందుకు డబ్బు! అయన ఇయ్యరూ?"
"అయ్యో ఆయనిస్తే ఇంకలేనిదేముంది? రాత్రి నించి ప్రాదేయపడుతున్నాను నాగమణితో కలిసి సినిమా కెళ్తను, డబ్బు లియ్య,మని . ససేమిరా వీలు కాదన్నారు పే... ద్ద.... అయన ఇవకపోతే గతి లేదనుకున్నారు. నువ్వు లేవూ? వస్తానక్కయ్యా!" సంతోషముతో వికశించిన ముఖంతో లత వెళ్ళిపోయింది.
ఒక్క క్షణం దిగ్బ్రాంతి చెంది, అంతలో తేరుకుని లతకు "ఎందు' కని అడగకుండా డబ్బిచ్చింనందుకు పశ్చాత్తాప పడటం కంటే ఏం చెయ్యలేక పోయింది వారిజ.
-------------
లైబ్రరీలో కూర్చుని పుస్తకం ముందు పెట్టుకున్నాడన్నా మాటే కాని రామచంద్రకు ఒక అక్షరం కూడా తల కేక్కడం లేదు. లతతో జరిగిన వాగివాదమే అతని మనసును చికాకు పెడుతుంది.
కొంతసేపు లత సినిమా కోసం ఎందుకు మొండి పట్టు పట్టాలని చికాకు కలిగింది. తరువాత తనను తనే సమాధాన పరచుకున్నాడు. అందరి ప్రవృత్తులూ ఒకలా ఉండవు. తనలాంటి ఏ కొంతమందికో సినిమా లంటే మోజు లేకపోవచ్చు కాని నూటికి డెబ్బై మంది సినిమాలంటే విరగబడే వాళ్ళే . వాళ్ళల్లో లత కూడా ఒకతి. పాపం లత కోరిక తీరిస్తేనేం?
చదువుతోన్న పుస్తకం మూసేసి లేచాడు రామచంద్ర.
తను సినిమాకి వద్దన్నందుకు లత బాధపడుతూ వుంటుంది. పాపం, సముదాయించి రేపు తనే తీసుకేళతానని బుజ్జగించాలి. ఏదో విధంగా సర్దుకు పోవటానికి ప్రయత్నించాలి. కాని, ఇలా కలతలు పెంచుకుంటే సంసారంలో శాంతి ఏనాటికీ దొరుకుతుంది? పోనీ , లతకు అనుగుణంగానే తను మారటానికి ప్రయత్నిస్తే!
లత ఏవిధంగా బ్రతిమాలి ఆవిడ పట్టుదలను పోగొట్టాలా, ఏ రకమైన అనునయాలు ఆవిడలో ప్రేమను అంకురింప చేయగలవా అని ఆలోచిస్తూ ఇంటికి చేరుకున్న రామచంద్రకు వీధి గడపకు వేసి వున్న పెద్ద తాళం కప్ప వెటకారం చేస్తూ నవింది.
విస్తుపోయాడు రామచంద్ర. ఇంత రాత్రి వేళా ఎక్కడి కెళ్ళి వుంటుంది.?
పక్కింటి వాళ్ళ అమ్మాయి తాళం చెవి తెచ్చి ఇచ్చి అతని మనసులో ప్రశ్నకు సమాధానం చెప్పింది. "అత్తయ్యగారు సినిమా కెళ్ళారు.'
కొంచెం సేపు మూడుడిలా నిలబడి యాంత్రికంగా తలుపులు తీసి బట్టలు మార్చుకుని తలుపు లేసేసి పడుకున్నాడు. వద్దని తను అంత ఖండితంగా చెప్పాక కూడా వెళ్ళింది. ఎంత నిర్లక్ష్యం? ఏం చూసుకుని ఈ అహం? ఎన్నాళ్ళిలా? తన పట్ల ప్రేమా లేదు, గౌరవమూ లేదు, భయమూ లేదు. ఇట్లాంటి భార్యను ఎలా భరించటం ? అసలు వెళ్ళటానికి డబ్బు లెక్కడివి? ఎవరినైనా అప్పడిగిందా? భగవాన్? చివరికి ఈ దశకు కూడా దిగిందా?
సినిమా నుండి వచ్చి ప్రశాంతంగా వున్న భర్తను చూసి "హమ్మయ్య' అనుకోంది లత. అది అగ్నిపర్వతపు పైపై ప్రశాంతత అని తెలీక. కృత్రిమపు నవుతో "అన్నం తినలేదూ?" అంది. సూటిగా లత ముఖంలోకి చూశాడు రామచంద్ర.
"లేదు"
"భలేవారే! నాకోసం కాచుక్కుచున్నారా? ఇంత పోద్దుపోయినా నేనే వచ్చి పెట్టాలి కాబోలు!"
"నాకేం పెట్టక్కర్లేదు . నువు తినేసేయ్యి. నాకాకలి లేదు."
"అదేం? హోటల్లో ఏమైనా తిన్నారా?"
"మరే!' వెటకారంగా అన్నాడు.