Previous Page Next Page 
మహిమ పేజి 29


    "ముప్ఫైమంది మన ఆఫీసు అమ్మాయిలు మహిమ ఆధ్వర్యంలో వచ్చి నాకు రాఖీ కట్టారు. నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది. ఎంతో రిలీఫ్ గా అనిపించింది".
    "నిజమా! బాగుంది ఆలోచన. మహిమ ఐడియా అన్నమాట. అంటే నీకు ముందరికాళ్ల బంధం! 'ఇకపై పిచ్చివేషాలు వద్దు - మమ్మల్ని అందరినీ చెల్లెళ్లలా చూడు' అని చెప్పకనే చెప్పడం అన్నమాట. అర్థమైందా? 'బి ఎ గుడ్ బాయ్' అని రాఖీతో బంధించారు" జైన్ చలాకీగా అన్నాడు. ఒక్క సెకను వినోద్ మొహం మలినమైంది. కాని తండ్రి మాటని స్ఫోర్టివ్ గా తీసుకుని "కరెక్ట్ డాడీ. నా గురించి, నా లీలలు విని భయపడి అమ్మాయిలంతా కలిసి ప్లాన్ వేశారులా ఉంది. మహిమ డైరెక్షన్ లో..."
    "నే చెప్పలే. ఆ అమ్మాయిలో డైరెక్టర్ పొటెన్సీ ఉందని. మరి నా దగ్గరికి ఎవరూ రాలేదే..." విశాల్ ఆశ్చర్యంగా అన్నాడు.
    "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వి కదా నువ్వు. అమ్మాయిలు లైన్ వేయడానికి అన్ని అర్హతలున్నవాడివి. అన్నయ్య ముద్ర ఎలా వేస్తారు..." వినోద్ హాస్యంగా అన్నాడు.
    "అలా అయితే ఫరవాలేదు. నేనో చేతకాని దద్దమ్మనని, వీడివల్ల ప్రమాదం లేదని భావించి వదిలేశారేమోనని భయపడ్డా..." తనూ హాస్యంగా అన్నాడు విశాల్.
    "వీడో ముసలాడులే అని నన్ను వదిలేసినట్టున్నారు" అవినాష్ కూడా హాస్యంగా అన్నాడు. "అంటే అమ్మాయిల కళ్ళు విశాల్ మీద ఉన్నట్టు ప్రూవ్ అయింది. విశాల్... ఇంక నీదే ఆలస్యం... నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు. నీ పెళ్ళి కూడా చేసేస్తే నా బాధ్యత తీరిపోతుంది" అవినాష్ అన్నాడు.
    "చాలా రోజులయింది ఇంట్లో పెళ్ళిసందడి జరిగి. విశాల్ పెళ్ళి బాగా చెయ్యాలి డాడీ కిందటిసారిలా లాకుండా..." అంటూ ఆగిపోయాడు వినోద్.
    అందరూ నిశ్శబ్దం అయ్యారు. ఒక్కసారిగా నవ్వుల వాతావరణం గంభీరమైంది. వినోద్ వంక సానుభూతిగా చూసి దోషిలా తలదించుకున్నాడు అవినాష్. 'గతిలేని అప్పటి పరిస్థితి ఇప్పుడు లేదు. మంచి అయినింటి అమ్మాయి. చదువు, సంస్కారం, మంచితనం ఉంటే చాలు...' మనసులో అనుకున్నాడు.
    "ఓకే విశాల్! మంచి అమ్మాయిని నేను చూడనా? అమ్మాయిలో ఏం ఉండాలో నాకు బాగా తెలుసు. ఎక్స్ పీరియెన్స్ డ్ హజ్బెండ్ వి కదా..." వినోద్ వాతావరణం తేలికపరుస్తూ అన్నాడు. "ఓకే అన్నయ్యా... డన్" అన్నాడు విశాల్ అన్నగారి భుజం తట్టి.

                                                              *  *  *  *

    ఆ రోజు ఒక బాడీలోషన్ షూట్ ప్రోగ్రాం ఉంది. డైరెక్టర్ ప్రమోద్ కారు కిందటి రాత్రి యాక్సిడెంట్ కి గురైంది. ప్రమోద్ కి పెద్ద దెబ్బలు తగలకపోయినా, కుడిచెయ్యి విరిగి ఆస్పత్రికి వెళ్లిన పరిస్థితి ఎదురయింది. షూటింగ్ సెట్, నటులు అందరూ బుక్ అయ్యారు. కాన్సిల్ చేస్తే షెడ్యూల్ తేదీ మారిపోవడం, నష్టం జరుగుతుంది. ఇంకెవరికన్నా ఈ పని అప్పగించాలి. షూటింగ్ ఆగడానికి వీలులేదు. విశాల్ కి హఠాత్తుగా మహిమ గుర్తుకు వచ్చింది. ఒక ఛాన్స్ ఇచ్చి ప్రయత్నించు అన్న తండ్రి మాటలు గుర్తుకు వచ్చాయి.
    "మహిమా, ఈ ప్రాజెక్ట్ ని డైరెక్ట్ చేసే ఛాన్సు నీకిద్దామనుకుంటున్నాను. కెన్ యు హాండిల్ ఇట్..." పరిస్థితి వివరించి, ప్రొడక్షన్ గురించి చెప్పాడు. అది మహిమ రాసిన సబ్జెక్ట్ గనుక, అప్పటికే ఆమెకు దాని వివరాలు తెలుసు గనుక తను సులువుగా హాండిల్ చెయ్యగలదని అతని నమ్మకం.
    మహిమ 'నేనా?' అంటూ గాభరాపడలేదు. తడబడలేదు. "ఐ విల్ ట్రై మై బెస్ట్ సార్..." ఆత్మవిశ్వాసంతో ఆమె చెప్పిన జవాబుతో అతనికి ఆమెపట్ల భరోసా చిక్కింది. సెట్, యాక్టర్స్ అంతా రెడీగా ఉంది కనుక ఒక్కసారి వెళ్లి చూసుకుని ప్రొసీడ్ అవుతా" అంది మహిమ నిబ్బరంగా. "దెన్ గో ఎహెడ్! ఏదన్నా సాయం కావాలంటే కిశోర్ అనే అసిస్టెంట్ డైరెక్టరుని అడగండి" అన్నాడు.
    మహిమ డైరక్షన్ లో తయారయిన యాడ్ ని ఫైనల్ చేసేముందు... అవినాష్, వినోద్, విశాల్ ముగ్గురూ ఆ యాడ్ సి.డి. చూశారు. అందమైన అమ్మాయి తెల్లటి పల్చటి నైట్ డ్రస్ లో, అలా పక్కమీద నుంచి ఒళ్ళు విరుచుకుంటూ లేచి, చుట్టూ పరుచుకున్న పరిమళం ఎక్కడిదన్నట్టు ఆఘ్రాణిస్తూ, అలా ట్రాన్స్ లో ఉన్నట్టు, గాలిలో తేలిపోతున్నట్టు దేవకన్యలా నడుస్తూ, ఓ పూలతోటలోకి వెళ్లిపోతుంది. అక్కడ జలజల చెట్ల నించి రాలుతున్న పూలన్నీ కుప్పగా పోగయి, ఆ కుప్పలో పూవులన్నీ వరుసగా చక్కటి అందమైన సీసాలోకి జారిపోతాయి. ఆ సువాసన అక్కడిది అన్నట్టు ఆ బాడీ లోషన్ పేరుగల సీసా అమ్మాయి చేతిలోకి వస్తుంది. ఆ అమ్మాయి ఆ సువాసనను ఆఘ్రాణించి, అలా ట్రాన్స్ లోంచి బయటికి వచ్చి ఆనందంగా సీసాను చూస్తుంది. అంటే ఆ బాడీ లోషన్ చక్కటి, సున్నితమైన, సువాసనగల పూలతో చేసిందని, అలాంటి సౌకుమార్యమైన చర్మసౌందర్యాన్ని అందిస్తుందన్న భావంతో తీశారు. అవుట్ డోర్ షూటింగ్ తో పనిలేకుండానే, ఇండోర్ షూటింగ్ లోనే ఆ యాడ్ ని తయారుచేశారు. బెడ్ రూమ్ సీన్ ని, గార్డెన్ సీన్ ని రీ మిక్సింగ్ చేశారు. అనేక కొత్తకొత్త టెక్నిక్ లు జతచేసి, మిక్స్ చేసే మెళుకువలున్న ఈ రోజుల్లో అలాంటి సీన్లు యూనిట్, యాక్టర్లు వెళ్లనక్కర లేకుండానే, కంప్యూటర్ ముందు కూర్చుని తయారుచేస్తారు. మహిమ ఆ సీన్లలో చూపిన టెక్నిక్, హీరోయిన్ భావప్రకటనలు... సీను మొత్తం కనులవిందుగా, అందంగా తయారయిన ఆ యాడ్ చూసి "గ్రేట్" అన్నాడు అందరికంటే ముందు విశాల్. "గుడ్ వర్క్... ఈ అమ్మాయిలో టాలెంట్ ఉంది. తనను తాను మరోసారి ప్రూఫ్ చేసుకుంది" అవినాష్ అన్నాడు.
    "ఐ థింక్... ఈ అమ్మాయిని ప్రొడక్షన్ సైడ్, యాడ్ డైరెక్టర్ గా తీసుకోవచ్చనిపిస్తోంది" వినోద్ అన్నాడు.
    "లెటజ్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్! అసలు తన అభిప్రాయం తెలుసుకోవాలి గదా..." అవినాష్ జైన్ అన్నాడు.

                                       *  *  *  *

 Previous Page Next Page