ఆలోచిస్తూండగానే కారు మళ్ళీ ఇంటికేసి వస్తూ కనిపించింది. కారులో నుంచి సామాన్లు తీసుకొచ్చి మేడమీడకు చేరుస్తున్నారు.
"అన్నీ అయిపోయాయి సీతా! మంచాలు రిక్షామీద వేశాను. మరికాసేపట్లో వచ్చేస్తాయవి కూడా!" ఉత్సాహంగా అన్నాడు మాధవరావు.
ఆ సాయంత్రానిగ్గాని ఇల్లు పూర్తిగా సర్దటం పూర్తికాలేదు.
"ఈ ఫర్నిచర్ బొత్తిగా చాలదండీ! ఎవరయినా వస్తే కూర్చోడానికి ఆ సోఫా, ఒక కుర్చీ తప్పితే ఇంకేమీలేవు. కుర్చీల సెట్టు ఒకటి కొనాలి, మనకు అత్యవసరంగా కావలసిన వస్తువులన్నీ ఓ లిస్ట్ చెబుతాను రాసుకోండి. వెళ్ళి తీసుకొద్దురుగాని."
మాధవరావు కాగితం పెన్నూ తెచ్చుకొన్నాడు.
"ఊ చెప్పు..."
"కుర్చీల సెట్టు_ప్లాస్టిక్ వైర్ వి_ మొత్తము ఎనిమిది తలుపులకి, పన్నెండు కిటికీలకు కర్టెన్లు_ ఖరీదయినవే తీసుకోండి. నాకు రాసుకోడానికి ఓ టేబులూ, దానితోపాటు ఓ కుర్చీ_ రెండు టేబుల్ లైట్లూ_ మన బెడ్ రూమ్ లోకి ఒక ఎయిర్ కూలరూ_ ప్రస్తుతానికి చాల్లెండి! ఇంకేమయినా అవసరమయితే తరువాత చూసుకుందాం."
ఆమె ఇచ్చిన డబ్బు తీసుకొని మాధవరావు వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన కొద్దిసేపటికే వర్ధనరావు వచ్చాడు.
"ఎలా వుంది ఇల్లు?" అడిగాడతను సోఫాలో కూర్చుంటూ.
"చాలా బాగుంది" సంతోషంగా అందామె.
"ఎవరెక్కడ వుండాలో అక్కడ వుంటేనే బావుంటుంది. మీలాంటివాళ్ళు ఉండాల్సిన ఇల్లు కాదు ఆ పాత ఇల్లు" నవ్వుతూ అన్నాడతను.
సీత నవ్వేసింది. తనకూ తెలుసు ఆ విషయం. కానీ పరిస్థితుల మూలాన అక్కడే వుండిపోక తప్పలేదు.
"ఇప్పుడు చూడండి! మీరు రావడం వల్ల ఇంతటి అందమయిన ఇంటిక్కూడా మరో కొత్త కళ వచ్చేసింది. నన్నడిగితే ఇంటికి అందం ఇచ్చేది ఇంటిలో వుండే ఇల్లాలు. ఏమంటారు?"
సీత మాట్లాడేలోగా మళ్ళీ అతనే అన్నాడు "ఏరీ మీ హజ్బెండ్ వున్నారా?"
"ఊహు! ఇంతకుముందే షాపింగు కెళ్ళారు. ఒకటి రెండు గంటల్లో వచ్చేస్తారులెండి."
"ఆల్ రైట్. మరి నాకు కాఫీ ఇచ్చే ఆలోచనేమయినా ఉందా మీకు?"
"ఇప్పుడే తీసుకొస్తాను" కిచెన్ వైపు నడుస్తూ అందామె.
"మరేం అనుకోకండి. మీరు కాఫీ అద్భుతంగా చేయగలరని నాకు నిన్ననే తెలిసింది. అంచేత రోజూ ఓసారయినా మీ చేతి కాఫీ తాగాలని నా కోరిక."
"తప్పకుండా రండి! సంతోషంగా ఇస్తాను" ఆనందంగా అందామె. తన వంటకానికి మొదటి ప్రశంస ఇది. మాధవరావు ఎప్పుడూ పొగడలేదిలా! అయినా తెలీందేముందనీ, భార్య ఏమి చేసినా భర్తకు నచ్చదు. అంతే! అది రూలు.
కాఫీ తీసుకొచ్చి అతనికిచ్చిందామె.
"చూశారా! నేను చెప్పిన విషయం అప్పుడే మర్చిపోయారు."
"ఏమిటది?"
"మంచినీళ్ళు తాగినా నాకు కంపెనీ ఉండాలని చెప్పాను. గుర్తులేదా?"
"ఓ, సారీ!" లోపలకు పరుగెత్తి తనూ ఓ కప్పులో కాఫీ తెచ్చుకుందామె.
"ఇప్పుడు చెప్పండి. మన వర్కు ఎప్పుడు ప్రరంభిద్దాము? ముందు మీకు నేను కొన్ని మా సినిమాల పాత స్క్రిప్టులు చూపించి ఆయా డైలాగులు ఎలా రాయించిందీ వివరిస్తాను."
"మీ ఇష్టం. మీరెప్పుడు చెబితే అప్పుడే, నా వంట పనంతా పదిగంటలకల్లా అయిపోతుంది. ఆ తరువాత ఎప్పుడయినా సరే!"
వర్ధనరావు ఆలోచించాడు కొద్ది క్షణాలు.
"సరే. రోజు మధ్యాహ్నం రెండు గంటలు కూర్చుందాం."
"అలాగే"