"మరి మీకో?"
"నేను ఇప్పుడు తాగనులెండి కాసేపయ్యాక"
"అదేం కుదరదు కంపెనీ లేందే నేను మంచినీళ్ళు కూడా తాగను. నా సంగతి మీకిండా తేలీదేమో త్వరగా తెచ్చుకొని అలా కూర్చోండి మీరు కూడా."
ఇక లాభం లేదని తనూ కొంచెం కాఫీ ఓ కప్పులో తెచ్చుకొని కూర్చుందామె.
"ఇంకేం నవలలు రాస్తున్నారిప్పుడు" అడిగాడతను.
"ప్రస్తుతం ఒకటి రాస్తున్నానండీ ఇంక పదిరోజుల్లో పూర్తయిపోతుందది."
"పేరేమిటి?"
"ఇంకా అలోచించలేదు"
"థీమ్ ఏమిటి?"
"ఒక లక్షాధికారి ఉంటాడు. అతనికి ఓ కూతురూ, కొడుకూ! కూతురు తన క్లాస్ మేట్ ఒకతన్ని ప్రేమించి వివాహం చేసుకోవాలనుకొంటుంది. కానీ అతను మాత్రం కేవలం ఆమె ఆస్తిమీద వ్యామోహంతో ఆమెను ప్రేమిస్తున్నట్లు నటిస్తుంటాడు. ఈ విషయం తెలిసిన ఆ అమ్మాయి మావయ్య, అతను వాళ్ళింట్లో వాళ్ళ దయాధర్మాల మీద ఆధారపడి ఉండే అనాధలెండి. ఈ విషయమై ఆ అమ్మాయిని హెచ్చరిస్తాడు. ఆ కుర్రాడికి వేరే ప్రియురాళ్ళు ఉన్నారనీ కనుక అతనితో తిరగవద్దనీ హెచ్చరిస్తాడు. ఆ అమ్మాయి అతనిమాట వినదు. నీ స్థానంలో నువ్వుండు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దని వార్నింగిస్తుంది. అతను కేవలం ఆ అమ్మాయిని రక్షించడం కోసం ఆమెను రేప్ చేస్తాడు. ఆ అమ్మాయికి అతనిమీద కోపం పగ. అక్కడినుంచి కథ మారుతుంది. చివరకు ఆ అమ్మాయీ మామయ్యా ఒకటవుతారు. విలన్ ని పోలీసులు పట్టుకొంటారు..."
"ఒండర్ ఫుల్! చాలా బావుంది! ఇలాంటి కథలే కావాలీరోజుల్లో!..." ఆనందంగా అన్నాడతను.
సీత నవ్వి ఊరుకుంది.
"మరి నేను వెళ్తాను"
వెళ్ళిపోయాడతను.
మళ్ళీ ఆ కాంపౌండ్ లో వాళ్ళందరూ ఆమె చుట్టూ మూగారు.
"మళ్ళీ ఏమిటండీ_వచ్చారాయన? షూటింగ్ మొదలయిందా?"
"అబ్బే! ఇంకా లేదు. ఇంకా టైము పడుతుంది"
"మమ్మల్ని షూటింగ్ చూడ్డానికి తీసుకెళతారా మీరు?"
"ఓ! మీ ఇష్టమొచ్చినంతసేపు చూడొచ్చు"
"హీరో హీరోయిన్ ఎవరూ?"
"ఇంకా తెలీదు"
సీత ఇంట్లోకొచ్చేసింది. అందరూ సినిమా షూటింగుల గురించి చెప్పుకోవడంలో నిమగ్నమయి పోయారు.
"రేపు మనం ఇల్లు మారిపోతున్నాం!" మాధవరావు ఇంటికి రాగానే చెప్పేసింది సీత.
"ఎక్కడికి?" అమితమైన ఆశ్చర్యంతో అడిగాడతను.
జరిగిందంతా చెప్పిందామె.
"ఇదేదో బాగానే ఉంది. పైగా అద్దె కూడా లేదంటున్నావ్! మరి నువ్వు డైలాగులు రాయడం పూర్తయ్యాక మళ్ళీ బయటకు గెంటేస్తారా ఏమిటి?" నవ్వుతూ అడిగాడతను.
"ఛ! ఆయన అలాంటి వాడు కాదులెండి. రేపు మీరే చూస్తారుగా!"
"సరేలే! తరువాత సంగతి తర్వాత చూసుకోవచ్చు. నీకు ఈ ఇంట్లో అడుగుపెట్టినప్పటినుంచీ కోరికగా ఉంది ఈ ఇల్లు వదిలేయాలని. ఇన్నేళ్ళకు నెరవేరిందా కోరిక. అంచేత ఈ అవకాశం వదులుకోవడం మంచిదికాదు"
మర్నాడు ఉదయం పదిన్నరకల్లా ఇంటిముందు కారు హారన్ మోగింది.
"అదిగో కారొచ్చేసింది" సంబరంగా అంది సీత.
బందర్లో చదువుకొనే రోజుల్లో తన క్లాసులోని సరోజ రోజూ స్కూలుకి కార్లో వస్తుండేది. ఆ పిల్లతోపాటు కార్లో ఎక్కాలని అందరికీ ఉండేది. కాని ఆమె ఎవ్వరినీ ఎక్కనిచ్చేది కాదు. అందరికంటే ఎక్కువ సీత ముచ్చటపడేది కారు ప్రయాణం కోసం. ఆ కోరిక అప్పటినుంచీ అలాగే మనసు అడుగున ఉండిపోయింది. కారులో వెళ్ళేంత యోగం తనకు పట్టదని ఏనాడో నిర్ణయం చేసుకొందామె. కానీ ఇప్పుడు తనకు తెలీకుండానే జరిగిపోతోందది. ముఖ్యమయిన సామానంతా ఉదయమే ప్యాక్ చేసేశాడు మాధవరావు. డ్రైవరు సాయంతో సామాను కారు నిండా సర్దేశాడతను. మరో ట్రిప్ కొడితే మంచాలు తప్ప మిగతా సామానంతా చేరిపోతోంది కొత్త ఇంటికి. మాధవరావు, సీత ముందు సీట్లోనే కూర్చోవల్సి వచ్చింది. ఇరవై నిమిషాల తర్వాత ఓ అందమయిన ఇంటి ముందాగింది కారు. చుట్టూ అన్నీ అద్భుతమైన సౌధాలు. అంతా లక్షాధికారులే అని చెప్తున్నాయా ఇళ్ళు. డ్రైవరు కారు దిగి గేటు తెరిచాడు. పక్కనుంచి మేడ మీదకు మెట్లున్నాయి. క్రింది ప్రోర్షన్ వాళ్ళతో సంబంధం లేకుండా ప్రత్యేకంగా ఓ గేటు_దారి ఉన్నాయి. మేడమీదకు చేరుకుంది సీత. ఆ ఇల్లు చూస్తుంటే ఆమె కళ్ళు చెదిరిపోతున్నాయి. అలాంటి ఇళ్ళు సినిమాల్లోనే చూసింది తను. అంచేత అలాంటి వాటినే మళ్ళీ తను రాసే నవలల్లో కూడా వర్ణించింది. కానీ ప్రత్యక్షంగా చూడటం అదే మొదలు. పెద్ద హాలు, రెండు అందమైన రంగుల పడక గదులు. ప్రతి గదికీ పంకాలూ, డైనింగ్ రూమూ, పడగ్గదికంటే అందంగా ఉన్న వంటిల్లూ_ బాత్ రూమ్ లో గీసరూ, సామానంతా తెచ్చి ఇంట్లోకి చేరుస్తున్నాడు డ్రైవరు. అంతటి ఇంట్లో తమ సామాను వుంచినా ఇంకా బోసిపోయినట్లుగానే కనిపిస్తోంది ఇల్లు.
"సరే_నువ్వు చెకింగ్ చేస్తూండు ఇల్లంతా! నేను వెళ్ళి ఆ మంచాలు రిక్షాల మీద వేసి మిగతా సామాను మళ్ళీ కార్లో తీసుకొచ్చేస్తాను" అంటూ వెళ్ళిపోయాడు మాధవరావు.
అతను కారులో వెళ్ళిపోతుంటే కారువంకే చూస్తూ నిలబడింది సీత. తను ఎప్పటికయినా కారు కొనగలదా? కొంటే ఎంత బావుంటుంది. ఆయన డ్రైవ్ చేస్తూంటే తను ప్రక్కన కూర్చుని_అద్దంలో నుంచి బయటకు చూస్తూ_ ఎన్నెన్ని ఊళ్ళు తిరగవచ్చు! ఎన్నెన్ని ప్రదేశాలు చూడవచ్చు. కానీ అదేమంత మామూలు విషయం కాదు. కనీసం పాతిక వేలయినా లేందే కారు కొనలేదు. ఆ తరువాత నెలకో అయిదువందలయినా దానికి ఖర్చుచేసే స్తోమత వుండాలి. అవన్నీ తనకు లేవు. అయినా ప్రయత్నించాల్సిందే. ఏనాటికయినా కొనాల్సిందే_అందులో తిరగాల్సిందే.