Previous Page Next Page 
నీ కలల బందీని పేజి 30


    వాళ్ళు సినిమా విషయాలు మాట్లాడుతుండగానే మాధవరావు ఫర్నిచర్ తో ఇంటికొచ్చేశాడు.
    "ముందిటు రండి! అవతల వర్ధనరావుగారు మీకోసం ఎదురుచూస్తున్నారు." హడావిడిగా అతనిని హాల్లోకి లాక్కెళ్తూ అంది సీత.
    "నమస్తే" అన్నాడు మాధవరావు వర్ధనరావుని చూడగానే.
    "నమస్తే_ రండి కూర్చోండి. మిమ్మల్ని కలుసుకోవడం ఇప్పటికి వీలుపడింది" నవ్వుతూ అన్నాడు వర్ధనరావు.
    వర్ధనరావుకి, తన భర్తకీ తేడా గమనిస్తోంది సీత.
    తన భర్త కంటే కనీసం పదేళ్ళయినా పెద్దవాడయి వుంటాడు వర్ధనరావు. కానీ తన భర్తకంటే చిన్నవాడిలా కనిపిస్తున్నాడు. మాటల్లో అన్నాడతను అతని కొడుకు టెన్త్ చదువుతున్నాడని, అదీగాక అతని ముఖంలో కనిపించే కళాకాంతులు తన భర్త మొఖంలో లేవు. ఎప్పుడూ ఆలోచిస్తుండే కళ్ళు, ఎండలో తిరిగి తిరిగి మాడి ముదురుగా కనిపించే ముఖం. అసలు ఆయనకు శ్రద్ధ లేదు తనమీద. ఏనాడూ స్నో, పౌడర్లు వాడిన పాపాన పోతేనా? ఎన్ని రకాల కాస్మటిక్స్ తెచ్చిపెట్టుకుంది తను. వాటిని కన్నెత్తి కూడా చూడరు. తనకూ, ఆయనకూ వయసులో ఎంతో తేడా వుందని అందరూ అనుకుంటున్నారంటే కారణం అదే. నిజానికి తనకంటే నాలుగేళ్ళే పెద్ద ఆయన.
    మాధవరావు తన ఉద్యోగ వివరాలు చెబుతున్నాడు వర్ధనరావుకి.
    "నేనో విషయం చెప్తున్నాను మిష్టర్ మాధవరావు! మీ మిసెస్ మామూలు రచయిత్రి కాదు. ఎంతో స్టఫ్ గా వున్న రచయిత్రి. ఆవిడలోని టాలెంటునంతా నేను వెలికి తీయదల్చుకొన్నాను. చెప్పాను కదూ నేనూ ఆవిడ అభిమాన పాఠకుల్లో ఒకడినని. అంచేత నాకామె మరింత ఉన్నత స్థితికి చేరుకోవాలని కోరిక. మీరుకూడా ఆమెను ప్రోత్సహించండి" వెళ్ళేముందు అన్నాడు వర్ధనరావు.
    మర్నాడు పాపను చూడ్డానికని ఓ పని పిల్లని ఏర్పాటుచేసింది సీత. పాప నెత్తుకొని కూర్చుంటే తన పనులేమీకావు. అదీగాక వర్ధనరావుతో మాట్లాడుతుంటే మధ్యలో పాప గొడవ చేస్తే కష్టం. అలాగే వంటమనిషిని కూడా వేరే ఏర్పాటు చేసింది.
    అనుకొన్నట్లుగానే ఆరోజు మధ్యాహ్నం వర్ధనరావు ఆమె ఇంటికొచ్చాడు. ఇద్దరూ రెండో గదిలో కూర్చున్నారు. ఆ గది తను రాసుకోడానికని ప్రత్యేకించింది సీత. అందులో ఖరీదయిన మరో సోఫా సెట్టు, డ్రెస్సింగ్ టేబులూ, పొడుగాటి అద్దం_గోడలకు అందమైన పెయింటింగ్సూ_తను ఏనాటినుంచో కలల్లో నిర్మించుకుంటున్న గదికి ప్రతిరూపం అది.
    గదిలో కూర్చున్నారిద్దరూ. అతనికెదురుగా కూర్చుంది సీత.
    "ఇలా రండి! లేకపోతే స్క్రిప్టు కనపడదు" అన్నాడు వర్ధనరావు. అతని పక్కనే సర్దుకు కూర్చుంది సీత.
    అతను స్క్రీన్ ప్లే గురించీ, సీన్ డివిజను గురించీ, సంభాషణల గురించీ వివరించడం మొదలుపెట్టాడు. వింటూ వుంటే అదేమంత కష్టమయినది కాదనిపిస్తోంది సీతకు. ప్రయత్నిస్తే తనూ తేలిగ్గానే రాసేయగలదని.
    మధ్యమధ్యలో ఒకటి రెండుసార్లు అతను తనని తాకటం_ అదోలా చూడటం_ ఇవన్నీ ఆమెకు అభ్యంతరాలుగా తోచలేదు. అతను కావాలని చేసినట్లు కనిపించలేదవి.

                                              11

    వారంరోజులు గడిచిపోయాయి.
    వర్ధనరావుతో చాలా చనువు ఏర్పడిపోయింది సీతకి.
    ఓ రోజున హడావుడిగా వచ్చాడతను.
    "ఇవాళ సాయంత్రం ప్రెస్ వాళ్ళను పిలిపించాను మనాఫీసుకి. మీ నవల సినిమాగా తీయబోయే విషయం ఎనౌన్స్ చేసేద్దాం. మీరుకూడా వస్తే బావుంటుంది."
    "ఎన్ని గంటలకు?"
    "సాయంత్రం ఆరింటికన్నాననుకోండి. "టీ" అదీ ముగిసేసరికి ఏడూ, ఎనిమిదవుతుంది"
    "సరే_మీ ఇష్టం! నేను అయిదున్నరకల్లా "రెడీ" అవుతాను. మీరే వస్తారా నన్ను తీసుకెళ్ళడానికి?"
    "ఓ యస్! అవసరం మాది కదా! మీ పేరు వాడుకుంటే సినిమాకి అదే కొంత పబ్లిసిటీ అవుతుంది" అతను వెళ్ళిపోయాడు.
    సీత త్వరగా వంట ముగించేసి తను తయారయి వర్ధనరావు కారు కోసం చూడసాగింది బాల్కనీలో నుంచుని. సరిగ్గా అప్పుడే మాధవరావు వచ్చేశాడు ఆఫీసు నుంచి.
    "సినీతార లాగా తయారయ్యావేమిటి? సినీ రచయిత్రివే అనుకుంటున్నాను ఇప్పటివరకూ!" నవ్వుతూ అన్నాడతను.
    "టైముకొస్తారా, రారా అనుకుంటున్నాను. త్వరగా రెడీ అవ్వండి. చిన్న ఫంక్షన్ ఏర్పాటుచేశారు వర్ధనరావుగారు వెళ్ళి వచ్చేద్దాం"

 Previous Page Next Page