Previous Page Next Page 
లవ్ ఎట్ సెకండ్ సైట్ పేజి 29

 

    ఇవన్నీ మన దేశంలో చాలా కామన్ మిస్టర్ రాకేష్! ఎంత పెద్ద హాస్పిటలయినా వార్డ్ బాయ్ లు, నర్స్ లు, అటెండర్లు - డాక్టర్స్ తో పాటు ఆపరేషన్స్ చేస్తూనే ఉంటారు. ఒకోసారి ఎమర్జెన్సీస్ లో డాక్టర్స్ అసలు లేకుండా - వాళ్ళే మొత్తం ఆపరేషన్లు చేసేస్తారు-"
    భవానీ వప్పుకున్నాడు.
    "నాకు తెలుసు ! డిల్లీ ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లోనే వార్డ్ బాయ్ లు ఆపరేషన్స్ చేశారు. అన్ని పేపర్లలో టీవీ చానెల్స్ లో ఆ న్యూస్ - వీడియో క్లిప్పింగ్స్ తో సహా వచ్చింది -"
    "యా! యూ ఆర్ రైట్! కనుక ఇది మనదేశంలో చాలా నార్మల్ ప్రాక్టీస్! ఇదే విదేశాల్లో అయితే అందరినీ ఉరితీస్తారు. మనకా భయం లేదు - అయ్ లవ్ ఇండియా!"
    "ఓకే - ఆ న్యూస్ టెలికాస్ట్ చేయకుండా ఆపితే మాకేమిటి లాభం?"
    "కాష్! ఎంత కావాలో అడగండి !"
    "సారీ! కాష్ వద్దు! దాని బదులు మీరు మా చానెల్లో కొన్ని ప్రోగ్రామ్స్ ని స్పాన్సర్ చేయండి! అయిదేళ్ళ పాటు ఆ ప్రోగ్రామ్స్ నిని స్పాన్సర్ చేయడానికి వప్పుకుంటున్నట్లు కాంట్రాక్ట్ సైన్ చేయండి -"
    "గుడ్! మీ పద్దతి నాకు నచ్చింది. అందరూ డబ్బుకి ఆశపడతారు. మీరు చానెల్ ని నిలబెట్టటానికి ప్రయత్నిస్తున్నారు -- ఇటీజ్ ఓకె- కాంట్రాక్ట్ హాస్పిటల్ కి పంపండి. సంతకం చేసి పంపిస్తాను-"
    "థాంక్యూ-"
    అతను వెళ్ళిపోయాడు.
    జైరాజ్ తల తిరిగిపోయింది.
    "రాకేష్ ! నాకో డౌట్-"
    "ఏంటంకుల్ అది?"
    "మనం నిజాల్ని పబ్లిక్ కి తెలీకుండా దాయటం - అన్యాయం, అక్రమం కాదూ?"
    "అవునంకుల్! కానీ మన నికృష్టమైన డెమోక్రసీ లో మీడియా కూడా తనవంతు దుర్మార్గం తనూ చేస్తోంది. బ్లాక్ మెయిలింగ్, మీడియా అమ్ముకోవటం - ఇవన్నీ ఈ రాట్  రేస్ లో ఒక భాగం! ఈ సిస్టం మార్చటం ఎవడివల్లా కాదు. మీలాంటి కాంషస్ ఉన్నవాళ్ళు ప్రయత్నించినా ఆ అవినీతి ప్రవాహంలో పడి కొట్టుకుపోవాల్సిందే! ప్రస్తుతం నా ధ్యేయం ఒక్కటే! నా చానెల్ నెంబర్ వన్ అవాలి! మిగతావేమీ నాకు సంబంధం లేదు -"
    జైరాజ్ ఆలోచనల్లో పడిపోయాడు.


                                           ***
    మరో నాలుగు రోజుల తర్వాత వచ్చిన వ్యూయర్ షిప్ రేటింగ్ చార్ట్ చూసి రోజా నిశ్చేష్టురాలయింది.
    ఇంచుమించుగా నెంబర్ టూ పొజిషన్ కొచ్చింది బృందావనం  చానెల్! అదెలా సాధ్యమయిందో ఆమెకే మాత్రం అర్ధం కావటం లేదు.
    ఆ చార్ట్ తీసుకుని తండ్రి గదిలోకి వచ్చింది.
    "డాడీ! మీరు చెప్పింది నిజమే! నేనేంటో అనుకున్నా గానీ ఈ రాకేష్ జీనియస్!"
    జైరాజ్ నవ్వాడు.
    "మన చానెల్ నెంబర్ వన్ కాకపోయినా గానీ నేనిప్పుడు హాపీ బిడ్డా! ఎందుకో ఎరుకనా? ఇయ్యాల్రేపు ఎవళ్ళు మాట్లాడినా గానీ బృందావనం చానెల్ గురించే మాట్లాడుతున్రు-"
    "నాకెందుకో అనిపిస్తోంది డాడీ! ఈ రాకేష్ ఖచ్చితంగా టార్గెట్ రీచ్ అవుతాడు !"
    "ఇలాంటి క్రూషియల్ టైం లో - నువ్వూ కూడా చానెల్ కెళ్ళి రాకేష్ కి హెల్ప్ జేస్తే మంచి గుంటది బిడ్డా-"
    రోజా ముఖంలో అనందం కనిపించింది.
    "నిజంగా మీరలా ఫీలవుతున్నారా డాడీ?"
    "అవును-"
    "నాకూ అదే ఆలోచన వచ్చింది . కానీ రాకేష్ ఏమయినా ఫీలవుతాడేమోనని ----"
    "నువ్ రాకేష్ ని సరిగ్గా అర్ధం జేసుకోలె బిడ్డా! హీ ఈజే జేమ్ ! నువ్ హెల్ప్ జేస్తానంటే హాపీగా ఫీలవుతాడు -"
    రోజాకి ఆ రాత్రి నిద్రపట్టలేదు -


                           ***

    భవానీ శంకర్ కి కూడా ఆరాత్రి నిద్రపట్టలేదు. ఆఫీస్ సోఫాలో పడుకుని ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాడు.
    టైమ్ ఇంటిగంటయింది. పన్నెండున్నర కల్లా ఫోన్ చేయాలి. విజయ్ - అరగంట ఎందుకు లేటయినట్లు ?
    అప్పుడు మోగింది ఫోన్-
    "హలో - రాకేష్ దిస్ సైడ్-"
    "అన్నా! నేనే - విజయ్ ని-"
    "ఆ! చెప్పు బ్రదర్ - ఆ ఇన్ ఫర్మేషన్ కరెక్టేనా?"
    "కరెక్టే అన్నా! చాలా మందితో కన్ ఫర్మేషన్ తీసుకునేసరికి లేటయింది"
    "అంటే మన మాజీ ముఖ్యమంత్రి కొడుకు శివ- అతని భార్య శ్రీస్మిత విడిపోవటం ఖయమేనా?"
    'అంతేకాదు - శ్రీస్మిత తన భర్త మీదా అత్తమామల మీదా కూడా తనను వాళ్ళు హత్య చేయడానికి పధకం పన్నారనీ, ఒకటి రెండు మర్డర్స్ ఎటేంప్ట్స్ నుంచి తను తప్పించుకుందనీ పోలీస్ కి కంప్లయింట్ ఇచ్చిందని తెలుస్తోంది -- కానీ శ్రీస్మిత ఒక సుప్రసిద్ధ సినిమా తార గనుకా - శివ ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు కావడంతో -- పోలీస్ లు ఈ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు . కనుక మనం ఇవాళే బ్రేకింగ్ న్యూస్ కింద ఇచ్చేస్తే మిగతా చానెల్ వాళ్ళందరూ షాకవుతారు. వాళ్ళకు ఈ ఇన్ ఫర్మేషన్ దొరకాలంటే కనీసం ఇంకో రోజు పడుతుంది -"
    "మరి శ్రీస్మితతో ఇంటర్ వ్యూ దొరికే అవకాశం ఉండా?"
    "శ్ర్తీస్మిత ప్రస్తుతం వాళ్ళ తల్లిదండ్రులు దగ్గరుంది - వాళ్ళేమో ఆ ఇంటి చుట్టుపక్కల క్కూడా ఎవ్వరినీ రానీయటం లేదు. ఎల్లుండి ప్రెస్ మీట్ పెట్టి శివ మీదా మాజీ ముఖ్యమంత్రి సమరసింహ మీదా ఆరోపణలు పబ్లిగ్గా చేయబోతుందని - తెలిసింది -"
    "బ్రహ్మాండమైన కూప్ విజయ్. సంపూర్ణ చానెల్ కి కూడా దొరకని స్టోరీ మనకు దొరకటం నిజంగా చాలా గ్రేట్! మన తెలుగు ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తిగా ఈ న్యూస్ గమనిస్తారు -- ఎందుకంటె అలాంటి సెలబ్రిటీ కపుల్ - ప్రేమించి పెళ్ళిచేసుకున్న నెలరోజులకే విడాకులు తీసుకోవటం అందరికీ కుతూహలం కలిగించే మేటర్-"
    "అవును-"
    "మరి ఈ విషయంలో శివ సైడ్ నుంచి ఏమయినా ఇన్ ఫర్మేషన్ దొరికిందా?"
    "ఇంకో రెండు రోజుల వరకూ శివ కూడా ఈ విషయం ఎవరికీ చెప్పే ప్రసక్తి లేదని కామన్ ఫ్రెండ్ ద్వారా తెలిసింది -"

 Previous Page Next Page