ఓగాడ్ ! అదెలా జరిగిందన్నా! మనం చాలా సీక్రెట్ గా చేశాం కదా ఇది! పైగా మనకు యాభైవేలు ఖర్చయ్యాయ్-"
"డోంట్ వర్రీ బ్రదర్ - ఇలాంటి చీటింగ్ ఈ ఫీల్డులో కామన్! ఇంక ఆ విషయం మర్చిపో! అంతకంటే పెద్ద స్కూప్ ఒకటి టేకప్ చేద్దాం-"
ఫోన్ పెట్టేశాడు భవానీ-
ఎదురుగ్గా హనుమంతు నిలబడి ఉన్నాడు.
"సార్! ఆ స్వామీజీ స్క్రోండ్రల్ మన చానెల్ కి తప్ప ఇంకెవరికీ తెలీదు అన్నారు కదా! సంపూర్ణ చానెల్ టెలికాస్ట్ చేస్తోంది అప్పుడే -"
"వదిలేసెయ్ హనుమంతూ! సంపూర్ణ చానెల్ చూపించిన విజువల్సే మనం కూడా చూపిద్దాం!"
"ఒకే సార్-"
ఆ సాయింత్రమే జైరాజ్ కి పరిచయమున్న ఒక పోలీస్ అధికారిని నిజాం క్లబ్ లో కలుసుకున్నాడు భవానీ!
"మా బృందావనం చానెల్ ని ఇగో - ఈ అబ్బాయే నడుపుతున్నాడన్నట్లు ! పేరు రాకేష్! రాకేష్ మా చానెల్ ని నంబర్ వన్ జేయాలని జబర్ధస్ట్ కోషిష్ చేస్తుండు. మా వాడికి మీ పోలీస్ డిపార్ట్ మెంట్ హెల్ప్ గూడా ఉందనుకో! ఈజీగా టార్గెట్ చేర్తాడు - ఏమంటున్నా?" పోలీస్ అధికారి నవ్వాడు.
"ఏం మదద్ కావాలె?" భవానీ వేపు చూస్తూ అడిగాడతను.
"మీకు రిపోర్ట్ అయ్యే సెన్సేషనల్ క్రైమ్ కేస్ లన్నీ ముందు మా చానెల్ కే ఇన్ ఫర్మేషన్ ఇవ్వాలి సార్. మేము ఆ క్రై'మ్ కి సంబంధించిన వీడియో , ఇంటర్ వ్యూ లు అన్నీ తీసుకున్న తర్వాతే -- ఆ విషయాలు మిగతా చానెల్ కివ్వాలి-"
"నీ యవ్వ ప్రతి చానేలో డూ గిట్లనే అడుగుతుంటే మేమేం జెయ్యాలే!"
జైరాజ్ లాగి అతని వీపు మీద కొట్టాడు.
"ఏరా బిడ్డా! మిగతా చానెలోళ్ళూ నేనూ ఒక్కటే నేరా? నువ్ మహబూబ్ కాలేజ్ లో చదివేప్పుడు జేసిన దందాలన్నీ నా చానెల్లో స్పెషల్ ప్రోగ్రాం వేయాల్నా ఏంది?"
"అరె నీయవ్వ! గిట్ల బ్లాక్ మెయిల్ జేస్తున్నావెందిరా!"
భవానీ మళ్ళీ మాట్లాడాడు.
'చూడండి సార్! మీరిలా మాకు ఆబ్లిగేషన్ చేసినందుకు మేము ఆ క్రైమ్ ఏరియాకు సంబంధించిన పోలీస్ స్టేషన్ కి కేస్ కి యాభై వేల రూపాయలు గిప్ట్ ఇస్తాం!"
పోలీసాఫర్ ఉలిక్కిపడ్డాడు.
"యాభైవేలా? అంటే లంచమా?"
"గిప్ట్ అంటుంటే నువ్ లంచమంటావేం రా?" చిరాకు పడ్డాడు జైరాజ్.
"అయితే ఒకే - నీ పేరేమున్నావ్? రాకేష్ కదూ?"
"అవున్సార్-"
"నువ్ యాభైవేలు గిప్ట్ ఇస్తానంటే మా స్టాఫ్ గూడా ఖుషీతోటి నీకు కోపరేట్ జేస్తరు! ఇయాలే నేను అన్ని స్టేషన్స్ కీ అనఫీషియల్ గా చెప్తా! కానీ ఈ మేటర్ మన ముగ్గురి మధ్య ఉండాలి! ఏమంటున్నా?"
"కాలేజ్ డేస్ లో నువ్ జేసిన దండాలు గురించి నేనేవల్తోలయినా చెప్పినాన్రా?" జైరాజ్ అనేసరికి ముగ్గురూ నవ్వుకున్నారు.
జైరాజ్, భవానీ చానెల్ కి తిరిగి వస్తుంటే జైరాజ్ అడిగాడు.
"మరి పోలీసులు కివ్వానికి అన్ని పైసలు ఎడకేల్లోస్తాయ్ రా భయ్! మన చానెల్ లాస్ లో నడుస్తున్నది గదా!"
"డోంట్ వర్రీ అంకుల్! రైట్ ట్రాక్ లో వెళ్ళే వాళ్ళకి లాస్ గానీ - రాంగ్ ట్రాక్ లో వెళ్ళే వాళ్ళకి డబ్బే డబ్బు! మన చానెల్ బాంక్ బాలేన్స్ ఎంతో తెలుసా ఇప్పుడు?"
"ఎంత?"
"తొంభయ్ లక్షలు-"
జైరాజ్ షాకయ్యాడు.
"తొంభయ్ లక్షలూ?"
"అవును -"
"ఎలా వచ్చిందంత డబ్బు?"
"చెప్పాను కదంకుల్! చానెల్ అనేది రెండు వేపులా పదునున్న కత్తి! సమాజానికి మేలూ చేయవచ్చు! బ్లాక్ మెయిల్ చేసి డబ్బూ సంపాదించుకోవచ్చు-"
"మైగాడ్ ! బ్లాక్ మెయిల్ చేస్తున్నావా?" గాబరాగా అడిగాడు జైరాజ్.
"అలా పరేషానవకంకుల్! చాలా టీవీ చానెల్స్, బ్లాక్ మెయిమింగ్ తోనే బ్రతికి బట్ట కడుతున్నాయ్! నీతి నియమాలను గాలి కొదిలి చానెల్ ని రాజకీయ పార్టీల కమ్మి పార్టీలకూ రాజకీయ నాయకులకూ ప్రచారం సాధనాలుగా పని చేస్తున్నాయ్.
గవర్నమెంట్ కూడా న్యూస్ పేపర్స్ - టీవీ చానెల్స్ నోళ్ళు మూయించడానికని వాళ్ళకు ఇళ్ళ స్థలాలిచ్చీ , ఇళ్లిచ్చి , మెడికల్ ఫెసిలిటీస్ ఇచ్చీ - వాళ్ళను కొనుక్కోంటుంది.
ఒకవిధంగా ఇది ఒక బ్లాక్ మెయిలింగ్ గేమ్ ! పోలీసులూ, ఇండస్ట్రియలిస్ట్ లూ రాజకీయ నాయకులూ , గవర్నమెంటూ , మీడియా అందరూ ఆ గేమ్ లో ఆటగాళ్ళే! అయితే ఆ మాచ్ ఫిక్సింగ్ సంగతి ప్రజలకు తెలీదు!"
జైరాజ్ తల తిరిగిపోయింది.
"ఎంత డీప్ గా స్టడీ జేసినావ్ రా భయ్! ఈ జనరల్ నాలెడ్జ్ లేకపోబట్టే రోజా ఫెయిలయిపోయింది -"
ఇద్దరూ చానెల్ చేరుకునేసరికి సన్ షైన్ సూపర్ స్పెషలిటీస్ ఎం.డీ. భవానీ శంకర్ కోసం వెయిట్ చేస్తూ కలిపించాడు.
"గుడ్ ఈవినింగ్! నేను సన్ షైన్ హాస్పిటల్స్ ఎం.డి. మహేష్ ని!" భవానీ అతన్తో కరచాలనం చేశాడు.
"ప్లీజ్ కూర్చోంది! నా పేరు రాకేష్-"
మహేష్ కూర్చుని కొంచెం డౌటుగా జైరాజ్ వేపు చూశాడు.
"అయన మా అంకులే! ఈ చానెల్ ఆయన్ధే - కనుక మీరెలాంటి అనుమానం లేకుండా ఓపెన్ గా మాట్లాడవచ్చు-"
"ఇవాళ మధ్యాహ్నం మా హాస్పిటల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. మా డాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఒక పేషెంట్ చనిపోయింది. పేషెంట్ బంధువులు గొడవకు దిగారు. డాక్టర్ మీద దాడిచేశారు. మా వార్డ్ చాయ్ లు కూడా డాక్టర్ తో పాటు పేషెంట్ కి ఆపరేషన్ చేశారని వాళ్ళ ఆరోపణ!" చెప్పాడు మహేష్ . విజయ్ యాదవ్ అనే మీ చానెల్ జర్నలిస్ట్ జరిగిందంతా ఇంటర్ వ్యూ లు తీసుకున్నాడు. ఆ మేటర్ మీ చానెల్లో నైట్ కి టెలికాస్ట్ అవబోతోంది." చెప్పాడతను.
"అవును! ఇంతకూ ఇప్పుడు మీరు దేనికొచ్చినట్లు?" అడిగాడు భవానీ.
"చూడండి రాకేష్! ఆ వార్త, వీడియో , ఆ ఇంటర్ వ్యూలు టెలికాస్ట్ అవకుండా మీరు మాకు హెల్ప్ చేయాలి! అందుకు మీరేం కండిషన్స్ పెట్టినా మీట్ అవడానికి మేము సిద్దంగా ఉన్నాం."
జైరాజ్ నిశ్చేష్టుడయి వింటున్నాడతని మాటలు.
"కానీ అలా వార్డ్ బాయ్స్ ని కూడా ఆపరేషన్ చేయడానికి వాడటం చాలా దారుణం కదా!" భవానీ అడిగాడు.