"ఊహు! లేదండీ!"
"ఆవిడొస్తే మీరు అస్సలు కనబడడం మానేస్తారనుకొంటాను."
"దారిలోనే మీ రూము కదా_కనబడకుండా ఎక్కడికి పోతాము?"
"కనబడకుండా_అంటే_నా వుద్దేశం యెప్పుడయినా కాసేపు మాట్లాడుకోవడానికి కూడా మీకు తీరిక ఉండదేమో అని."
అతని సంశయం సావిత్రికి అర్ధమైపోయింది.
"అప్పుడప్పుడు మీరే మాఇంటికొస్తూంటే సరి. సాయంత్రాలెలాగో మేము కబుర్లు చెప్పుకుంటూనే కూర్చుంటాం కదా! శాంత కూడా నాలాగానే వసపిట్టేలెండి. అవతలివాళ్ళకు విసుగుపుట్టేవరకూ మాట్లాడుతుంటాం ఇద్దరం."
అతని ముఖం వికసించింది.
"మీరామాత్రం పర్మిషనిస్తే చాలులెండి! నాకు జీవితం మీద విసుగు పుట్టినప్పుడల్లా మీ దగ్గరకొచ్చి కాసేపు మాట్లాడుతూ కూర్చుంటాను. నిజం చెప్పాలంటే మీతో మాట్లాడుతూంటే ఎంతో రిలీఫ్ గా ఉంటుంది నాకు..."
తన కళ్ళల్లోకి చూస్తూ అని ఆగిపోయాడతను. బహుశా అతని మాటలు ఎలాంటి ప్రభావం కలిగించాయో చూడడానికి కాబోలు.
సావిత్రి మనసు ఆనందంతో ఊగిపోయింది. తన మాటలు అతనికి మనశ్శాంతి కలిగిస్తాయా? ఎందుకని సాధారణంగా ఎంతో ఆత్మీయులయితేనే అలాంటి భావం కలుగుతుంది. మరి? తనను...ఓ ఆత్మీయురాలిగా భావిస్తున్నాడా అతను. అదే నిజమయితే__అతని మనసులో తనకి తను అనుకొంటున్న స్థానం ఉందా? నిజానికి శాంతి వచ్చేస్తే అతనితో ఒంటరిగా, ఇంత ఫ్రీగా మాట్లాడే అవకాశం వుంటుందా? అది ఎంత ప్రాణస్నేహితురాలయినా తామిద్దరి గురించీ తను చేసుకునే ఊహాగానాలు శాంతికి తెలియజేయగలదా? శాంతి వచ్చేలోగానే తను అతనితో చనువు పెంచుకోవాలి. అతని గురించి పూర్తిగా తెలుసుకోవాలి! తన గురించి అతనికి తెలియాలి. ఒకరకంగా ఒకరికి ఎలాంటి అభిప్రాయాలున్నాయో గుర్తించాలి. అవును! ఇదంతా త్వరగా జరగాలి. ఈ ఒంటరితనం మరెంతోకాలం తాను భరించలేదు. కేవలం శాంతి సహచర్యం మూలానే తను ఒంటరితనాన్ని చాలావరకూ మర్చిపోగలుగుతోంది. బలవంతంగా తన ఆలోచనల్ని మళ్ళించగలుగుతోంది.
ఊహు...ఇంక ఈ జీవితం తను భరించలేదు. తనకు మార్పు కావాలి! అది__త్వరగా__
"ఏమిటి ఏదో ఆలోచిస్తున్నట్లున్నారు?" నవ్వుతూ అడిగాడతను. ఒక్కసారిగా ఆలోచనల్లోంచి తేరుకుంది సావిత్రి.
ఎదురుగ్గా ప్లేట్లలో పూరీలు ఉన్నాయ్. సర్వర్ వచ్చి వాటిని టేబుల్ మీదుంచటం కూడా గమనించలేదు.
"అయామ్ సారీ..." చిరునవ్వుతో అనేసింది.
"సారీ చెప్పాల్సిన తప్పేమీ చేయలేదులెండి..." తమాషాగా చూస్తూ అన్నాడతను.
ఇద్దరూ తినడం పూర్తిచేసి కాఫీ తాగారు.
బిల్లు దగ్గర గొడవచ్చిపడింది. అతనే తీసేసుకున్నాడు.
"ఊహు! బిల్లు నేనివ్వాలి" అంది సావిత్రి నిష్టూరంగా.
"ఎందుకని?"
"నేను ఉద్యోగిని...మీరు నిరుద్యోగి కనుక..."
"మీ వాదనలో పాయింటుంది కాని అందం లేదు_"
"అంటే ?"
"బిల్లెప్పుడూ మొగాడిస్తేనే అందంగా ఉంటుంది." నవ్వుతూ అన్నాడతను.
"కొత్తగా వింటున్నానిది..."
"అలాగయితే నేను అదృష్టవంతుడినే__"
"ఎందుకు ?"
"మీకో కొత్త విషయం తెలియజేసే అదృష్టం ఎంతమందికి లభిస్తుంది?"
ఇద్దరికీ నవ్వాగలేదు.
బిల్లు అతనే చెల్లించాడు.
ఇద్దరూ రోడ్డుమీద కొచ్చారు.
"ఇంటికి ఆటోలో వెళ్దామా?" అడిగాడతను.
"ఉహూ! రోజూ నడిచే వెళతాను నేను..."
"సరే...పదండలాగయితే..."
సుల్తాన్ బజార్ దేదీప్యమానంగా వెలిగిపోతుంది. కిటకిటలాడిపోతున్న జనం! నెమ్మదిగా ఓ ప్రక్కన నడువసాగారిద్దరూ. అతనితో అలా నడుస్తూంటే మనసు అదోలా అనిపిస్తోంది. ఏదో కొత్త వింత భావన. అలా ముందెప్పుడూ లేని థ్రిల్! ఎదురొచ్చే స్త్రీలు తామిద్దరినీ పరీక్షగా ఓ క్షణంపాటు చూసి వెళ్ళటం ఓ రకమయిన భయం, గర్వం కూడా కలిగిస్తోంది. అప్పుడు శ్రీరామ్ తో పరిచయమయినప్పుడు ఇదే ఫీలింగ్ ఇదే అలజడి_ యిదే థ్రిల్! కానీ అదంతా__కలలా చెరిగిపోయింది.
ఇద్దరూ మౌనంగా నడువసాగారు.
మెయిన్ రోడ్డు మీద నుంచి తమ సందులోకి దిగారు. పాడుపడిన ఇంట్లో గొడవ గొడవగా ఉంది. పిల్లలు గగ్గోలుగా ఏడుస్తున్నారు. వాళ్ళమ్మ కాబోలు లోపల కేకలేస్తోంది. "అలా ఏడిస్తే అన్నం వస్తుందా? కాసేపాక మీ నాన్న బియ్యం తెస్తారు..."
"రోజూ ఇదే గొడవ..." అంది సావిత్రి నవ్వుతూ.
"ఇలాంటి కుటుంబాలని చూస్తే చాలా జాలిగా ఉంటుంది" అన్నాడతను.
"మిగతావాళ్ళ సంగతేమోగానీ, ఈ కుటుంబం అంటే మాత్రం నాకు జాలిలేదు."
"ఏం, ఎందుకని?"