Previous Page Next Page 
వెన్నెల వేట పేజి 29


    "కన్యకా హియర్"
    "ఇంకోసారి చెప్పండి డియర్! ఎన్నిసార్లు విన్నా తనివితీరడం లేదు మీ పేరు"
    "దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకండి! నేను స్క్రిప్ట్ ఫెయిర్ చేస్తున్నాను"
    "ఆ స్క్రిప్టులో చిన్న ఆల్టరేషన్ చేయాలి ఫ్రెండ్! నన్ను మీ రూమ్ కి రమ్మంటారా? మీరే నాగదికొస్తారా?"
    కన్యకకేం మాట్లాడాలో తెలీలేదు.
    "సరే! మీరేరండి!" అంది కొద్దిక్షణాలాగి.
    భవానీశంకర్ ఆనందంగా ఆమెగది చేరుకున్నాడు. టేబుల్ ముందు కూర్చుని స్క్రిప్టు రాస్తోందామె.
    "చెప్పండి! ఏమిటి ఆల్టరేషన్"
    "నిజం చెప్పాలంటే అంత పెద్ద మార్పేమీకాదు! చాలా చిన్నది. అంచేత ఆ విషయం తర్వాత మాట్లాడదాం! బైదిబై మీగురించి వివరాలు చెప్పండి డియర్! మీరే కాలేజీలో చదివారు! మీ అంతరంగిక సభ్యులెవరు?"
    "అయామ్ సారీ! ముందు ఆఫీస్ వర్క్. లీజర్ దొరికినప్పుడే అవి__"
    "ఐసీ ఇప్పుడు మీగురించి మాట్లాడడం మీకిష్టంలేదు"
    "అవును!"
    "పోనీ నాగురించి వినటంలో అభ్యంతరం ఏమయినా ఉంటుందా"
    "ముందు అఫీషియల్ వర్క్"
    "మీరు చాలా "డ్యూటీ కాంషస్" అనుకుంటాను"
    "మీరెలాగయినా అనుకోండి"
    "ఆల్ రైట్! మీరింత నిక్కచ్చిగా ఉంటే అలాగే కానీండి! ఎక్కడయినా ఒక్క పేజీలో 'అతడి' అని నేను చెప్పివుంటే దానిని మార్చి "అతని" అని రాయండి. దాంతో అఫీషియల్ వర్క్ అయిపోతుంది. ఆ తరువాత మనం లీజర్ గా అన్ని విషయాలూ మాట్లాడుకోవచ్చు"
    ఆమె నవ్వేసింది.
    "నా గురించి చెప్పేందుకేమీలేదు. అమ్మా, నాన్నా, నేనూ అంతే! డిగ్రీ చదివాను. ఉద్యోగం కోసం వెతుకుతూ ఈ పార్ట్ టైం జాబ్ కొచ్చాను."
    "మీ అంత అందమయిన అమ్మాయి ఉద్యోగం కోసం తిరగటం నాకిష్టంలేదు. మీరు అందమయిన డ్రస్ తో టయోటా కారులో తిరుగుతూ విమానాల్లో టూర్లు చేస్తూ అందమయిన భవనంలో ఎ.సి. రూమ్స్ లో వుంటూ ఉద్యానవనాల్లో విహరిస్తూ లిరిల్ సబ్బు ఎడ్వర్టయిజ్ మెంట్ సినిమాలోని అమ్మాయిలా జలపాతాల దగ్గర స్నానాలు చేస్తూ."
    "ఇంక చాల్లెండి! పగటికలలు మంచివికావు"
    "వ్వాట్? ఇవి పగటికలలా? నో నెవర్ డియర్! వాటిని నిజం చేసే బాధ్యతనాది!"
    "అంటే?"
    "అంటే అదే ఫ్రెండ్! మీకలాంటి జీవితం లభించేందుకు నేను సహాయం చేస్తాను"
    "ఎలా?"
    "ఎలాగేముంది? మిమ్మల్ని నా సెక్రటరీగా వేసుకుంటాను. ఒక్కొక్క "స్క్రిప్టు" లక్షరూపాయల చొప్పున అరవై "సినిమా స్క్రిప్టులు"రాసినందుకు వచ్చిన అరవై లక్షలు ఫిఫ్టీ ఫిఫ్టీ మీకు ముప్పయ్ లక్షలు. మనిద్దరి పేరునా జాయింట్ గా మిగతా ముప్పయ్ లక్షలు"
    "మీరు అరవై సినిమాలకు రాశారా?"
    "ఇంకాలేదు డియర్! మీరు నా సెక్రటరీగా వుండటానికి ఒప్పుకుంటే వారంరోజుల్లో రాసి అమ్మేస్తాను. నాకేం సందేహం లేదందులో"
    కన్యకకు నవ్వాగలేదు.
    "యూ ఆర్ మాడ్"
    "అఫ్ కోర్స్ అందుకు కేవలం మీ అందమే కారణం!"
    "నన్నింక వర్కు చేసుకోనిస్తే?"
    "వర్కా? ఏం వర్క్?"
    "స్క్రిప్టు ఫెయిర్ చేయటం!"
    "ఓ! అదా! దాన్ని గురించి మర్చిపోండి! నేనే చేసేస్తాను మీ అందమయిన చేతులు కందిపోవటం నాకిష్టంలేదు"
    "దయచేసి మీరిక వెళితే?"
    "వెళ్ళటమా? ఎక్కడికి?"
    "మీ గదికి"
    "ఐసీ! డ్యూటీ ఫస్ట్ అనే పాలసీ అన్నమాట మీది!"
    "అవును!"
    "అయితే నేనిక వెళ్ళక తప్పదంటారు!"
    "ఎగ్జాక్ట్ లీ"
    "తిరిగి ఇంకోగంటలో ఉద్యానవనంలో కలుసుకుని పచ్చికమీద కూర్చుని కబుర్లు చెప్పుకునేందుకు మనం ఇంతకుముందు చేసుకున్న అగ్రిమెంట్ మర్చిపోలేదు కదూ?"
    "మర్చిపోలేదు"
    "ఇంకో గంటలో తప్పక వస్తారు!"
    "అవును!"
    "పోనీ అరగంటలోనే కలుసుకుంటే?"
    "అయామ్ సారీ"
    "పోనీ నలభై నిమిషాలు"
    కన్యక చిరుకోపంతో చూసిందతని వంక.
    "ఆల్ రైట్ గంటయ్యాకే కలుసుకుందాం? అంతవరకు ఎలాగోలా గడుపుతాను" బయటకు నడిచాడతను.


                                               *    *    *    *


    "ప్రైవేట్ డిటెక్టివ్ ఏజన్సీస్" అనే బోర్డు గత రెండేళ్ళుగా అబిడ్స్ రోడ్ లోని ఓ పాతభవనం తాలూకు ఓ గదిముందు వేలాడుతోంది. ఆ సంస్థకు ఏకైక యజమాని అయిన కిరాతకరావ్ పేరుకి తగ్గట్లుగానే కనిపిస్తాడు. అతను అంతకుముందు ఏంచేసేవాడో ఎవరికీ తెలీదు. అసలావిషయం అతనిని అడగాల్సిన అవసరం ఎవరికీ ఉండేది కాదు. ఓసారి అతనిని చూస్తేచాలు అతని గతం స్పష్టంగా కళ్ళముందు కనిపిస్తుంది.
    చూపు సరిగ్గా ఆనని వారెవరయినా అతని గతం గురించి ప్రశ్నిస్తే మాత్రం అతనెప్పుడూ ఒకే సమాధానం చెప్తుండేవాడు.
    "మిలటరీ సర్వీస్"
    మిలటరీ అన్నాక ఇంక వివరాలు ప్రశ్నించే ధైర్యం ఎవరికీ ఉండదు. ఎందుకంటే తెలుసుకున్న నిజానిజాలు రుజువు చేసుకునే అవకాశాలు చాలా తక్కువ కాబట్టి. పైబోర్డు పెట్టిన ఈ రెండేళ్ళలోనూ అతని డిటెక్షన్ కోసం వచ్చిన వాళ్ళ సంఖ్య బహు తక్కువ. అందుక్కారణం భారతదేశంలో ఎవరేం ఘాతుకాలు చేసినా పబ్లిగ్గానే చేసేయడం కావచ్చు.
    ఏదేమయినా తన కస్టమర్ల సంఖ్యను చూసి అతనేమాత్రం నిరుత్సాహ పడలేదు. ఉదయం పదిగంటలనుంచి సాయంత్రం ఆరుగంటల వరకూ తనాఫీస్ లో నిర్లిప్తంగా కూర్చునే ఉంటాడు.
    ఆరోజు అతను ఆఫీస్ తెరచి పావుగంటయినా కాకముందే ఓ కారు వచ్చి ఆగింది. కారులోనుంచి ఖాదీ దుస్తుల్లో ఉన్న ఓ ఆకారం దిగి "ప్రైవేట్ డిటెక్టివ్ ఏజన్సీ" అన్న బోర్డు చూసిందోసారి. తరువాత నెమ్మదిగా మెట్లెక్కసాగింది.
    అదిచూసి కిరాతకరావు బిజీ అయిపోయాడు. టేబుల్ మీద వైర్ కనెక్షన్స్ లేని టెలిఫోన్ ఎత్తి గట్టిగా మాట్లాడసాగాడు.
    "హలో_యస్! ఇది ప్రైవేట్ డిటెక్టివ్ ఏజన్సీస్! యస్! నేనే ప్రొప్రయిటర్ని మాట్లాడుతున్నాను! ఎవరు? డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసా? గుడ్ మాణింగ్! చెప్పండి కోఠీ మర్డర్ కేసులో మీకు నా సహాయం కావాలా? ఓ డెఫినెట్ లీ సర్! మా అసిస్టెంట్స్ ని ఇప్పుడే పంపించి పరిశోధన చేయిస్తాను! నో_నో! థాంక్సెందుకు? మన మధ్య ఉన్న స్నేహాన్ని బట్టి చేస్తున్నానంతే! ఓ.కే. ఉంటాను" ఫోన్ పెట్టేశాడతను.
    ఖద్దరు దుస్తుల్లో ఉన్న ఆకారం చిరునవ్వు నవ్వి "గుడ్ మాణింగ్" అంది. కిరాతకరావు నవ్వలేదు.

 Previous Page Next Page