Previous Page Next Page 
వెన్నెల వేట పేజి 30


    "కూర్చోండి! ఏమిటిపని?" అనడిగాడు వెనకవేపు అల్మారాలో ఉన్న ఓ ఫైలు తీసి చూస్తూ.
    "నా పేరు భండారి! మాజీ ఎమ్మెల్యేని!"
    "త్వరగా చెప్పండి! అట్టే టైమ్ లేదు" అన్నాడు కిరాతకరావు ముళ్ళులేని వాచి చూసుకుంటూ.
    భండారి వెంటనే సబ్జెక్టులోకొచ్చేశాడు.
    "మీరు నాకో సహాయం చేయాలి"
    "సహాయాలు చేసే సంస్థ కాదిది! బిజినెస్ ఉంటే మాకు చెప్పండి! ఇంత అని రేటు మాట్లాడుకున్నాక ఆ పని మా సంస్థే చేస్తుంది క్విక్!"
    "పోనీ బిజినెస్సే అనుకోండి! నాక్కావలసిందేమిటంటే అప్పల్రాజు అనే మాజీమంత్రి గురించి వివరాలు కావాలి. అతను ఈ మధ్య "ఆత్మకథ" అంటూ ఓ పుస్తకం రాస్తున్నట్లు తెలిసింది. అందులో అతనికి పరిచయం ఉన్న రాజకీయ నాయకులందరి గురించి ఉన్నదున్నట్లు రాస్తున్నట్లు తెలిసింది. ఒకవేళ ఆ మాట నిజమే అయినట్లయితే ఆ ఆత్మకథలో నా పేరు వస్తుందా? వస్తే నా గురించి ఏమేం రాస్తున్నాడు? ఈ వివరాలు కావాలి?"
    కిరాతకరావ్ ఓ క్షణం ఆలోచించాడు.
    "అందరు రాజకీయ నాయకుల గురించీ ఉన్నదున్నట్లు రాస్తున్నాడన్నారు కదా! ఇంక భయమేముంది?" అడిగాడతను.
    భండారి ఆశ్చర్యపోయాడు. "అదేమిటి? ఉన్నదున్నట్లు_ ఎవరి గురించి రాసినా వాళ్ళకది ప్రమాదమే కదా! రాజకీయాల్లో ఒక్కమాట కూడా 'నిజం' అనేది రాకూడదు. వచ్చిందో, రాజకీయజీవితం గోవిందా" అన్నాడు వివరిస్తూ.
    కిరాతకరావ్ కి అర్థమయింది.
    "ఐసీ" అన్నాడు తలపంకిస్తూ.
    "ఒకవేళ మీ గురించి ఉన్నదున్నట్లు రాస్తున్నట్లు తెలిస్తే ఏం చేస్తారు?"    
    భండారి వెంటనే చెప్పాడు. "స్క్రిప్ట్ కి సంబంధించినవన్నీ ఫోటోలతో సహా దొంగిలించుకు రావాలి."
    కిరాతకరావ్ ఉలిక్కిపడ్డట్లు నటించాడు.
    "దొంగిలించుకు రావాలా?"
    "అవును?"
    "దొంగతనం మా వృత్తికాదు. ఓన్లీ డిటెక్షన్."
    "పదివేలు కాష్ ఇస్తాను."
    "ఇరవై వేలిచ్చినా చేయను."
    "పోనీ పాతికవేలు"
    "నో ప్లీజ్."
    "భండారి నిరుత్సాహంగా లేచాడు.
    "అయితే మీకు కుదరదంటారు."
    "ఏమాత్రం కుదరదు! నేను ఎక్స్ సర్వీస్ మెన్ ని! దొంగతనాల్లాంటివి మా ప్రొఫెషన్ కి ఏమాత్రం సరిపడదు."
    భండారి వెళ్ళిపోయాడు.
    కిరాతకరావ్ మొఖంలో ఆనందం కనిపించింది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అవకాశం ఇన్నేళ్ళకు లభించింది. అప్పల్రాజు అనే మాజీమంత్రి రాస్తున్న ఆ స్క్రిప్ట్, ఫోటోలు అన్నీ తను కాజేస్తే_భండారి లాంటి రాజకీయ నాయకులు బోలెడుమందిని బ్లాక్ మెయిల్ చేయవచ్చు. ఒక్కొక్కరికీ కనీసం లక్షరూపాయల చొప్పున_పదిమంది దగ్గర పిండినా గాని పదిలక్షలు హార్డు కాష్. ప్లస్. దానిని అప్పుడప్పుడు తిరిగి వాడుకునే అవకాశం.
    వెంటనే తన ప్లాన్ ని అమలులో పెట్టేందుకు బయల్దేరాడతను. మొట్టమొదటిసారిగా_ "ప్రైవేట్ డిటెక్టివ్ ఏజన్సీస్" తన రెండేళ్ళ చరిత్రలో తెరిచిన గంటసేపట్లో మూసి వేయబడింది.


                             *    *    *    *


    మర్నాడు భోజనాల సీను యధాప్రకారం హడావుడిగా జరుగుతోంది. అప్పల్రాజు అసెంబ్లీలో లేచిన ఓ వివాదం గురించి ఉత్సాహంగా వర్ణిస్తున్నాడు.
    "...అవినీతి ఆరోపణలున్న ఎమ్మెల్యేలిద్దరికి నేను వార్నింగ్ ఇచ్చాను. వెంటనే వాళ్ళు చేసిన అవినీతిని ఒప్పుకుని రాజీనామా చేయాలని! కానీ వాళ్ళను ముఖ్యమంత్రి కూడా సపోర్టు చేసేసరికి నాకు వళ్ళుమండిపోయింది. వెంటనే అవినీతిని చట్టసమ్మతం చేస్తూ ఓ ఆర్డినెన్స్ పాస్ చేస్తేనేగానీ నేనూరుకోనని గొడవచేసి_ అసెంబ్లీ బయట నిరాహారదీక్ష ప్రారంభించాను."
    అందరూ ఘొల్లున నవ్వారు.
    శమంతకమణికి భర్త రాజకీయ విన్యాసాల మీద ఏమాత్రం ఆసక్తిలేదు.
    "మీకెవరికయినా సినీ డైరెక్టర్ కరుణాకర్ తెలుసా?" అడిగిందామె.
    "అబ్బ! గొప్ప డైరక్టర్ ఆంటీ! బ్రహ్మాండమయిన పిక్చర్స్ తీశాడు" అంది మనోచిత్ర.
    "ఒండర్ ఫుల్ ఫెలో! బెజవాడలో నాటకాలు డైరక్ట్ చేస్తూండేవాడు! నాకు బాగా తెలుసు" అన్నాడు భవానీశంకర్.
    "బాగా తెలుసా?"
    ఆశ్చర్యంగా అడిగింది శమంతకమణి.
    "అవును" తన పొరబాటు గ్రహిస్తూ అన్నాడు భవానీశంకర్.
    "ఇవాళ పొద్దున్న మద్రాస్ నుంచి ఫోన్ చేశాడు నాకు."
    అందరూ ఆశ్చర్యపోయారు.
    "నీకా?" అడిగింది మనోచిత్ర.
    "అవును"
    "ఎందుకూ?"
    "మన ఆంధ్రప్రదేశ్ హౌస్ లో వాళ్ళ సినిమా ఏదో షూటింగ్ చేసుకోవాలనుకుంటున్నారట. అనుమతి ఇస్తే రేపే బిల్డింగ్ చూచుకోడానికి వస్తానన్నారు. నేను ఓ షరతు పెట్టాను."
    భవానీశంకర్ గతుక్కుమన్నాడు.
    "ఏమిటది?" అడిగింది శ్యామలారాణి.
    "వచ్చేవారం జరుగుతోన్న మన 'టైగర్స్ క్లబ్' మీటింగ్ కి ముఖ్య అతిథిగా ఉండటానికి ఒప్పుకునేట్లయితే షూటింగ్ చేసుకోవచ్చని చెప్పాను. వెంటనే ఒప్పుకున్నాడు."
    భవానీశంకర్ కేం చేయాలో తోచలేదు. తనకు కరుణాకర్ తో పరిచయం ఉందిగానీ_తనిక్కడ దీప్ చంద్ పేరుతో ఉన్నాడు కదా!
    "అంటే...రేపు అతనొస్తున్నాడా?" అడిగాడతను గాబరా అణచుకుంటూ.
    "అవును ఎలాగూ బాగా తెలుసు అంటున్నారు కదా! నాతోపాటు రిసీవ్ చేసుకోటానికి మీరూ స్టేషన్ కొస్తే బాగుంటుంది."
    భవానీశంకర్ ఇరుకున పడిపోయాడు.
    "రేపు ఆత్మకథలో చాలా ముఖ్యమయిన భాగం తయారుచేస్తున్నాం! అంచేత నేను రావటం కుదరదు మేడమ్. తరువాత కలుసుకుంటాను వాడిని."
    "అవును. రేపు మాణింగ్ చాలా ముఖ్యమయిన ఎపిసోడ్ రాసేస్తున్నాం" అన్నాడు అప్పల్రాజు.
    అక్కడితో ఆ టాపిక్ ముగిసిపోయింది.
    భవానీశంకర్ తన గది చేరుకొని తీవ్రమయిన ఆలోచనలో పడ్డాడు. ఆ కరుణాకర్ ని_ ఏకాంతంగా కలుసుకుని తనిక్కడ దీప్ చంద్ గా నటిస్తున్నట్లూ. కనుక తనను భవానీశంకర్ పేరుతో పిలువకూడదనీ_ హెచ్చరించాడు. అప్పుడుగానీ తన పొజిషన్ క్షేమముగా ఉండదు.
    ఆ ఆలోచన వచ్చాక భవానీశంకర్ మనసు తేలికయిపోయింది. హుషారుగా విజిల్ వేయబోతూంటే గది తలుపులు దభేల్ మని తోసుకుని లోపలకు పరుగుతో వచ్చాడు వర్ధనరావు.
    "గురూ! కొంప మునిగింది."
    "ఎవరిది బ్రదర్?"
    "మనదే గురూ! అట్టే మాట్లాడితే నీది"
    భవానీశంకర్ ఛటుక్కున లేచి నిలబడ్డాడు.
    "ఏమిటి? ఏం జరిగింది"
    "ఆ మారుతీరావుగాడికి నీమీద అనుమానం కలిగింది."
    "అనుమానమా?"
    "అవును. నువ్వు రచయిత దీప్ చంద్ వి కాదని వాడి అనుమానం."
    "ఎందుకొచ్చింది వాడికా అనుమానం?

 Previous Page Next Page