Previous Page Next Page 
వెన్నెల వేట పేజి 28


    "మనిద్దరం కలిసి ఎలాగోలా ఆ డైరీలు, ఉత్తరాలు, ఫోటోలు కాజేయటానికి ఓ మంచి ఉపాయం ఆలోచించి చెప్పాలి. అది మనిద్దరం దిగ్విజయంగా అమలుపరుస్తాం. ఆ తరువాత వాటిని నేను మా ఫ్రెండ్ కందజేస్తే అతను నాకు యాభైవెలిస్తే, నేను గుర్రంకొని...బైదిబై! అతను నీకూ పాతిక వేలిస్తాడు."
    "థాంక్స్! అక్కర్లేదు. ముందే చెప్పానుకదా! నేనొచ్చిన కారణం వేరు."
    "ఓ.కే. గురూజీ! మళ్ళీ కలుస్తాను" అన్నాడు వర్ధనరావు.
    "వెల్ కమ్ డియర్! వెల్ కమ్!"
    అతను వెళ్ళిపోయాడు. భవానీశంకర్ ఆలోచనలో పడ్డాడు. ప్రస్తుత పరిస్థితి కొంతవరకూ చిరాకు కలిగించేదిగా కనిపించిందిగానీ, ఇలాంటి చిన్న చిన్న విషయాలు తను పట్టించుకోదల్చుకోలేదు. తనక్కావలసింది కన్యక. ఈ ఆత్మకథ పూర్తయ్యేలోగా ఆమెను తనదానిగా చేసుకోవాలి. ఆమెతో ప్రేమింపబడి, తనే ఆమె జీవిత సర్వస్వం అనుకునేలా చేయాలి. బాల్కనీలో నుంచి చల్లని గాలి ఆహ్లాదంగా వీస్తోంది. దూరంగా వినబడే పక్షుల కలకలారావాలు తప్పుతే మరేమీ శబ్దం వినిపించటంలేదు.
    ఇలాంటి సమయంలో కన్యకతోపాటు ఆ చెట్లనీడలో పచ్చికలో పడుకుని సరదాగా కబుర్లు చెప్తూంటే ఎంత బాగుంటుంది?
    ఫోన్ దగ్గరకు నడిచి బ్లూ బటన్ నొక్కాడు.
    "హలో మనోచిత్రా!" అంది మనోచిత్ర గొంతు. గతుక్కుమన్నాడు భవానీశంకర్. తన గొంతు విన్నదంటే ఇంక ఫోన్ వదలదు. ఠక్కున డిస్కనెక్ట్ చేశాడు.
    ఈసారి ఆకుపచ్చ బటన్ నొక్కాడు.
    "శమంతకమణి హియర్!" అందామె. మళ్ళీ డిస్కనెక్ట్ చేశాడు భవానీశంకర్.
    తెల్లరంగు బటన్ నొక్కాడతను.
    "హలో!" అంది కన్యక.
    "హలో కన్యకాజీ! నేను భవానీశంకర్ ని"
    "మీరా?"
    "నేనే మైడియర్ ఫ్రెండ్! ఇంత అందమయిన, ఆహ్లాదకరమైన వాతావరణంలో మీరేం చేస్తున్నారో తెలుసుకుందామని..."
    "ఇప్పుడే నిద్రపడుతోంది."
    "నేషనల్ క్రైమ్ మైడియర్ గాళ్! ఈ సమయంలో దూరంగా కనబడుతోన్న ఆ అందమయిన చెట్లమధ్య మీరు కూర్చుని, ఎదురుగా వున్న అందమయిన యువకుడితో కబుర్లు చెపుతూ..."
    "ఎవరతను?"
    "ఇంకెవరున్నారు కన్యకగారూ? ది మోస్టు ఎట్రాక్టివ్ ఫెలో ఆన్ ది ఎర్త్ అని మా బాచ్ వాళ్ళందరూ ఎప్పుడూ అంటూండేవాళ్ళు. మీకలా అనిపించలేదా?"
    "లేదు."
    "బహుశా మరో నాలుగయిదు రోజుల్లో తప్పక అనిపిస్తుంది మైడియర్! ఒకోళ్ళకు గ్రహింపుశక్తి కొంచెం తక్కువగా వుంటుంది. ఏం ఫరవాలేదు. కాలీఫాన్ 200 పొటెన్సీ ఆరేళ్ళపాటు వాడండి! చక్కని గుణం కనిపిస్తుంది"
    "నాకేమీ అవసరంలేదు."
    "ఆల్ రైట్! వదిలేయండి. మరింక వెళదామా మనం?"
    "సారీ! మీరు ఉదయం డిక్టేట్ చేసినంతవరకు ఫెయిర్ చేయాలి"
    "డోంట్ వర్రీ ఎబౌబ్ దట్ వర్క్ డియర్! అదంతా నాకొదిలేయండి! గంటసేపట్లో నేనే ఫెయిర్ చేసి పారేస్తాను"
    "సారీ! నాపని నేను చేసుకోవటమే నాకిష్టం"
    "ఓ కే. డియర్ ఫ్రెండ్! అలాగయితే మీ గదికే వస్తాను. ఇక్కడే మాట్లాడుకుందాం"
    ఆమె కంగారుపడింది.
    "వద్దులెండి! సాయంత్రం వెళదాం!"
    "థాంక్యూ డియర్! విష్ యూ గుడ్ స్లీప్"
    "థాంక్యూ"
    ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు భవానీశంకర్. కన్యకతో పరిచయం అలా నిమిష నిమిషాభివృద్ధి చెందటం అతనికెంతో ఆనందం కలిగిస్తోంది .
    "హలో మే ఐ కమిన్?" గడపలో నిలబడి అడిగింది మనోచిత్ర.
    "వెల్ కం మిస్ వెల్ కం..."
    ఆమె లోపలికొచ్చి కూర్చుంది.
    "మిమ్మల్ని నేను డిస్టర్బ్ చేయటంలేదుకదూ?"
    "నాటెటాల్ మైడియర్ ఫ్రెండ్"
    "మీతో కొంచెం మాట్లాడాలని..."
    "స్పీకాన్ స్పీకాన్_డోంట్ హెజిటేట్"
    "సంగతేమిటంటే నాకూ నవలలు రాయాలని చాలా ఇదిగా ఉంది" సిగ్గుపడుతూ అందామె.
    "ఇంక ఆలస్యం చేయకండి మనోచిత్రాజీ! అంత 'ఇదిగా' ఉన్నప్పుడు ఆ 'ఇది'ని అణచివేయగూడదు! ఒక రీము తెల్లకాగితాలు పదహారు పెన్నులు ముందేసుకుని ప్రారంభించటమే డియర్!"
    "అవన్నీ ఎప్పుడో కొన్నాను. కానీ ఎలా రాయాలో తెలీటంలేదు. మీరేమయినా గైడెన్స్ ఇస్తే నేనూ ఓ రచయిత్రి నవ్వాలని"
    "బెటర్ లేట్ దెన్ నెవర్ డియర్! ఇప్పటికే చాలా ఆలస్యం చేశావ్! అయినా పర్లేదు అసలు నన్నడిగితే ప్రతి యువకుడూ, ప్రతి యువతీ రెండేళ్ళపాటు రచనలు చేయాలని ప్రభుత్వం ఓ నిబంధన పెట్టాలి! అప్పుడుగానీ మన సాహిత్యం మూడు పూలూ ఆరు కాయలుగా అభివృద్ధి చెందదు"
    "ఒండర్ ఫుల్ అయిడియా"
    "ఇలాంటివి ఇంకా లక్షా తొంభయ్ ఉన్నాయి మన మెదడులో"
    "మీరు నిజంగా జీనియస్"
    అంతకంటే గత్యంతరం లేకపోయింది డియర్!"
    "మరి రచనలు చేయడానికి నాకు కొన్ని 'క్లూస్' ఇస్తే"
    "క్లూసా? బహువచనం వాడకూడదు డియర్ 'క్లూ' అనాలి! ఎవరయినాసరే రచనలు చేయాలంటే ఒకే ఒక్క 'క్లూ' ఉంది మనదేశంలో!"
    "ఏమిటది?" ఉత్సాహంగా అడిగిందామె.
    "ఇంగ్లీష్ నవలలు చదవటం! చదివిన ప్రతి నవలనూ తెలుగులో రాసేయటం"
    ఆమె ఉలిక్కిపడింది.
    "కాపీ కొట్టాలా?"
    "టట్ టట్ అలాంటి 'చీప్' పదాలు వాడకూడదు డియర్? దాన్ని కాపీ అనరు. 'ఇన్ స్పిరేషన్' అంటారు"
    "కానీ ఇన్ స్పిరేషన్  వేరు కానీ వేరు"
    "మన దేశానికి సంబంధించినంతవరకూ ఆ రెండూ ఒకటే డియర్. రెంటినీ కలిపే ఇన్ స్పిరేషన్ అంటారు. 'కాపీ' అనేపదం అసలు లేదు. ఉన్నా ఎవరూ ఉపయోగించకూడదు"
    "అంటే మీరు ఇన్ స్పిరేషన్ తోనే నవలలు రాస్తారా"
    "సంపూర్తిగా!"
    "కానీ అలా రాస్తే ఆ ఇంగ్లీష్ నవలలు చదివిన వారికి తెలిసిపోతుంది కదా?"
    "రచయితలు వాళ్ళ గురించి పట్టించుకోకూడదు మైడియర్ ఫ్రెండ్! రాసుకుంటూ వెళ్ళిపోవటమే"
    "ఐసీ"
    "ఇంకా దేనికోసం వేచియున్నావ్ డియర్! కమాన్ హరీఅప్! ఇంగ్లీషు నవలలు త్వరగా సంపాదించు! అనువాద కార్యక్రమం ప్రారంభించు జయంనీదే"
    ఆమె ఆనందంగా లేచి నిలబడింది "థాంక్యూ వెరీమచ్! కొంచెం రాసి మీకు చూపిస్తాను. ఏమయినా మార్పులు చేయాల్సి ఉంటే చెప్తారు కదూ!"
    "ఓ!__"
    ఆమె వెళ్ళబోయి మళ్ళీ వెనక్కు తిరిగింది.
    "మీరు చెప్పిందంతా నిజమేకదూ? జోక్ చేస్తున్నారేమోనని అనుమానంగా ఉంది"
    "నవలలు రాయబోయేవారితో జోక్ చేయటమా? అపరాధం డియర్, కళ్ళుపోతాయ్"
    ఆమె ఉత్సాహంగా వెళ్ళిపోయింది.
    భవానీశంకర్ మళ్ళీ ఫోన్ తీసుకుని తెల్ల బటన్ నొక్కాడు.

 Previous Page Next Page