Previous Page Next Page 
నీరు పల్లమెరుగు పేజి 29


    ఏం మధ్యతరగతి జీవితాలు? ఆ పని కుర్రాడు నయంకదూ తనకంటే? దర్జాగా తన బీదరికాన్ని ఒప్పుకొని వచ్చిన దాంట్లో క్లుప్తంగా గడుపుకుని పైగా మిగుల్చుకుంటున్నాడు. వాడిని వందరూపాయిల నోటు పేరు చెప్పి ముష్టి అడుక్కుంది తను! అడుగడుగునా ఆత్మవంచనతోనూ మిధ్యాదంభాలతోనూ తప్ప బ్రతకడానికి వీల్లేకుండా పోతుంది. తన దగ్గర డబ్బు లేదనటానికి వీల్లేదు. నైలాన్ చీరతో తప్ప బయటికి కదలటానికి వీల్లేదు. కడుపుకి తిండి ఉన్నా లేకపోయినా, పైపై హంగులన్నీ ఉండి తీరవలసిందే!
    ఆటోవాడు వెళ్ళిపోయాక "అయ్యగారు ఏ ఆసుపత్రికి వెళ్ళారు?" అని అడిగింది.
    "ఈ ఊరు కాదమ్మా! పక్కనే ఒక పల్లెటూరుకి కొంచెము దూరములో కొత్తగా కట్టారు శారదాదేవి ఆస్పత్రి. అక్కడికి వెళ్ళారు."
    అది విని చాలా ఆశ్చర్యపోయింది తులసి. శారదాదేవి ఆస్పత్రి గురించి తులసి వింది. అది ప్రత్యేకించి రకరకాల అంటురోగుల కొరకు ఏర్పడిన ఆస్పత్రి. డాక్టర్లు ఇదమిద్దమని డయాగ్నైజ్ చెయ్యలేకపోయిన చిత్ర విచిత్రమైన రోగులను అక్కడ చేర్చుకుని పరిశోధనలు చేస్తారు. ఆ ఆస్పత్రి చిన్నపిల్లల కోసం ఏర్పాటుచేసినది. ప్రత్యేకించి అనాథల కోసం ఏర్పాటు చేశారంటారు. అనేక కారణాల వల్ల అనాధలుగా వదిలివేయబడ్డ రోగిష్టి శిశువుల కోసం శారదాదేవి అనే కోటీశ్వరురాలు ఆ ప్రాంతమంతా ఆస్పత్రికి దానంచేసి, ఆస్పత్రి భవనం కూడా కట్టించింది. అందుచేత దానికి ఆవిడ పేరే పెట్టారు. ఇప్పటికీ ఆవిడ ఆస్పత్రికి సాధ్యమయినంత సహాయం చేస్తుందట. ప్రభుత్వం వారి సహకారం కూడా ఉంది.
    అక్కడికి సూర్యం ఎందుకు వెళ్ళినట్లు? అతడు అనాధ సేవకే వెళ్ళి ఉంటాడా? ఈరోజు తనూ అతనిముందు చెయ్యిజాపి, అనాధగానే సహాయం అడగబోతోంది! ఇది నిజమైన ఆత్మహత్య! ఆత్మకు హత్య!
    అక్కడికి ఎలా వెళ్ళాలో ఆ కుర్రాడిని అడిగి తెలుసుకుంది. ఆ ప్రాంతానికి గంటకొక బస్ ఉంది. అంతగా రష్ లేకపోవటం వలన బస్ లో కూచుని ప్రయాణం చెయ్యగలిగింది. మూడు గంటల ప్రయాణం. బస్ దిగి వాళ్ళనీ, వీళ్ళనీ అడిగి ఆస్పత్రి చేరుకుంది. అది అంటురోగుల ఆస్పత్రి అని గుర్తురాగానే అడుగు ముందుకు పడలేదు. తన బలహీనతను చీదరించుకుని లోపలికి వెళ్ళింది. అయిదు సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల వయసులో పిల్లలు రకరకాల వికృతాకారాలతో, అంగవైకల్యాలతో కనిపించేసరికి చీదరతో శరీరం జలదరించింది. అక్కణ్ణించి పారిపోవాలనిపించింది. ఆఫీస్ లో సూర్యం గురించి కనుక్కుంది. తులసి వివరాలన్నీ చెప్పిన తరువాత "ఓ! ఆ వి.డి. కేసు, కుసుమ. గార్డియనా?" అంది, అక్కడి క్లర్క్. తులసి మాట్లాడలేకపోయింది. వి.డి. కేసు అంటే అర్థంచేసుకోగలిగే పరిజ్ఞానం తులసికి ఉంది.
    "కుసుమని స్పెషల్ కాటేజ్ నెం. 7లో ఉంచారు. అక్కడికి వెళ్ళండి" అని దూరం నుంచి ఆ కాటేజ్ చూపించింది.
    ఒక గది, దాని కానుకొని ఒక బాత్ రూం. ఇలా వరసగా ఉన్నాయి స్పెషల్ కాటేజ్ లు. అందులో ఉండేవారు అనాథలు కాదు. ఆర్ధిక స్థోమత ఉన్నవాళ్ళే. వాళ్ళు కాటేజ్ కి అద్దె కట్టాలి. డాక్టర్ ఫీజులు చెల్లించాలి. తమ మందులు తామే కొనుక్కోవాలి.
    ఆస్పత్రి వాతావరణమంతా చాలా శుభ్రంగా ఉంది. మంచి గాలి, ఏవో అడవి పూల మీదనుంచి తేలివచ్చే విచిత్రమైన సువాసనలు, తానుంటున్న ఇంటిపరిసరాల కంటే కోటి రెట్లు హాయిగా ఉంది. కాటేజ్ నం.7 తలుపులు తీసే వున్నాయి. తలుపు మీది కొట్టకుండానే లోపలకు నడిచింది తులసి. పదేళ్ళ అమ్మాయికి ఏదో బొమ్మల పుస్తకం చూపిస్తూ, అందులో కథ చెప్తున్నాడు సూర్యం. ఆ అమ్మాయిని చూడగానే తులసికి వంట్లో రక్తప్రసారం ఆగిపోయినట్లనిపించింది. తెల్లగా పాలిపోయినట్లున్న వంటిమీద అక్కడక్కడ నల్లని మచ్చలు, లేత ఆకుపచ్చ రంగులో నిలవలేక తేలిపోతున్నట్లుగా ఉన్న కనుపాపలు, రాగి రంగులో పల్చగా ఉన్న జుట్టు__"వి.డి. కేసు. వి.డి.కేసు" క్లర్క్ గొంతు హోరుమంది తులసి మనసులో.
    సూర్యం తులసిని చూసి ఆశ్చర్య సంభ్రమాలతో ఉక్కిరిబిక్కిరయిపోతూ, "తులసీ!" అన్నాడు ఆప్యాయంగా. అంత ఆప్యాయంగా వినిపించే ఆ కంఠానికి సమాధానంగా "డబ్బు అప్పు అడగటానికి వచ్చాను" అనటానికి నోరు రాలేదు తులసికి.
    "మీ ఇంటికి వెళ్ళాను. మీ పనివాడు మీరు ఆస్పత్రిలో ఉన్నారని చెప్పాడు. కంగారుపడి వచ్చాను." అనేసింది.
    సూర్యం కళ్ళు మెరిశాయి. ఆ మెరుపు చూసి తులసి లోలోపల కుచించుకుపోయింది.
    "థాంక్యూ! చూశారుగా! నేను బాగానే ఉన్నాను. మా కుసుమ కోసం సెలవు దొరికినప్పుడల్లా ఇక్కడికి వస్తుంటాను" అని, "కుసుమా! నమస్కారం పెట్టమ్మా!" అని, నమస్కారం చేసి చూపాడు. కుసుమకు మూగ, చెవుడూ కూడా ఉన్నాయని అర్థమయిపోయింది తులసికి. కుసుమ తన ఆకుపచ్చ కళ్ళతో తులసిని అయోమయంగా చూస్తూ నమస్కారం చేసింది.
    "కూర్చో తులసీ!" అంటూ తను కూర్చున్న కుర్చీని తులసికిచ్చి తను లేచివెళ్ళి మంచంమీద కూచున్నాడు సూర్యం. అతడలా మంచం మీద కూచోబోవటం చూసి శరీరం మళ్ళీ జలదరించింది తులసికి. ఆ మంచం కుసుమది, వి.డి. కేసు.
    నిలబడలేక కుర్చీలో కూలబడింది.
    "కాఫీ తాగుతావా?" అభిమానంగా అడిగాడు.
    "వద్దు_వద్దు." కంగారుగా గట్టిగా అంది. విచిత్రంగా చూశాడు సూర్యం. తులసి సిగ్గుపడి, "ఇప్పుడే తాగి వచ్చాను" అంది, అన్న వెంటనే బస్ ప్రయాణం మూడు గంటలని గుర్తుకు వచ్చింది. అర్థం చేసుకుంటున్నట్లుగా నవ్వాడు సూర్యం.
    "పాపం! మీరు మళ్ళీ వెళ్ళటానికి రెండు గంటల వరకూ బస్ లేదనుకుంటాను" అన్నాడు.      "అన్నమ్మా! నాకు ఒక కప్పు కాఫీ చేసి పెట్టు" అని అరిచాడు గట్టిగా.
    ఎక్కణ్ణుంచో ఒక నడివయసు యువతి వచ్చి అక్కడే ఉన్న కిరసనాయిల్ స్టవ్ మీద కాఫీ కలిపి సూర్యానికిచ్చింది. సూర్యం కాఫీ తాగుతుంటే, తులసికి గొంతు మరింత ఎండుకు పోతున్నట్లు అనిపించసాగింది. వచ్చేటప్పుడు ఇంట్లో కూడా ఏం తిని రాలేదు.
    సూర్యం జాలిగా, బియ్యం మార్కెట్ లో కొన్నవి, వాటికి అంటు లేదు, నీళ్ళు పంపులోంచి వస్తున్నవి. నేను స్వయంగా వండుతాను. కొద్దిగా పెరుగు వేసుకుని అన్నం తినండి" అన్నాడు.

 Previous Page Next Page